తాతా..! నీపిచ్చిగాని, నీవు చెబితే విననివారు నే చెబితే వింటారా! ఒకవేళ వాళ్ళు నాముందు నామాట తీసివేయలేక పోవచ్చు. కానీ వేరే విధంగా సాధించే అవకాశాలు కుటుంబంలో ఎన్నో ఉంటాయి. ఈ పరిస్థితిలో వారు కోరుకుంటున్న వేరు కుండలే సబబను కుంటాను. వారిమాట కాదన్నా వన్న కోపం ఒక ప్రక్క, పైగా ఈ విషయాన్ని మూడవ వ్యక్తివైన నాకు చెప్పావన్న ఉక్రోషం వేరొక ప్రక్క ఎక్కువై యిప్పుడు నీకు ఉన్న మనశ్శాంతిని కూడా దూరం చేస్తారేమో? అదే నా అనుమానం. మీకు సహాయం చేయలేక పోగా మీకు కుటుంబంలో క్రొత్త సమస్యలను సృష్టించిన వాడివవుతావేమోనని భయంగా వుంది. అయినా నీ ఇష్టం...! నీవు చెప్పమంటే తప్పకుండా చెబుతాను. మీయిల్లు సుఖ శాంతులతో విలసిల్లడం నాకు ఆనంద దాయకమైన విషయమే...! తనవైపు పిచ్చి చూపులు చూస్తూన్న రంగయ్య తాతను జాలిగా చూస్తూ అన్నాడు రామం.
అవును బాబూ....! ఈ విషయం నాకు తట్టనే లేదు. అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా? ఎవరు చెప్పినా వినరు. వారి మూర్కపు పట్టుదల మధ్య ఊరు పొమ్మంటున్నా, కాడు రమ్మంటున్నా, మేమిద్దరం నలిగి పోతున్నాం. అన్నింటికీ అపర్వేశ్వరుడే దిక్కు. నాతంటాలేవో నేనుపడతాను. నిన్ను మాత్రం యిందులో యిరికించను.
సరే....! మంచిది తాతా......!
నాదొక చిన్న సందేహం... అడగమంటావా.? రామం కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు రంగయ్య తాత.
అడుగుతాతా.. నావద్ద నీకెటువంటి సందేహమూ అక్కరలేదు. నీకు సుందరం ఎటువంటి వాడో..... నేనూ అటువంటివాన్నే.....! అన్నాడు రామం.
అందుకే నీవిషయంలో బాధ పడుతున్నాను నాయనా......! మొదటినుండీ మీ కుటుంబానికి మాకుటుంబానికి స్నేహం ఎక్కువ. పైగా నీవు నాకు మాసుందరం లాంటి వాడివి. కాని...నీకు జరుగుతూన్న అన్యాయానికి నేను ఎంతో బాధ పడుతూ ఉన్నాను.
అదేమిటి తాతా? నాకు అన్యాయం జరుగుతూ ఉందా.....! నాకు తెలియకుండానే....? ఆశ్చర్య పోతూ అన్నాడు రామం.
అవును బాబూ.....! లక్ష్మయ్యన్న ఎంత ధర్మ ప్రభువని పేరు సంపాదించుకున్నా నీకుమాత్రం అన్యాయమే చేశాడు. తనకన్న కూతుర్ని పై చదువులకు పంపించి, పరాయి అయ్య కొడుకువని నిన్ను వెట్టి చాకిరికి ఉంచుకున్నాడు యింటివద్ద. ఈ విషయమే ఊళ్ళో నలుగురూ నానారకాలుగా అనుకుంటున్నారు. నిన్ను చూసినప్పుడల్లా నీపై జాలి కలుగుతూ ఉంటుంది. బాధపడుతూ అన్నాడు తాత.
రంగయ్య తాత మాటలకు ఆవేశం తెచ్చుకున్నాడు రామం. ఆ మాటలే వేరే ఎవరైనా అని ఉన్నట్లైతే చాచి లెంపకాయ కొట్టేవాడు. వయోభేదం, మంచీ, చెడూ అన్నీ ఆలోచించి తమాయించి ఊరు కున్నాడు. ఆలోచనలో పడ్డాడు. అవును......నలుగురూ అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. అటువంటి పరిస్థితి తమ కుటుంబంలో ఏర్పడింది. ఒక్క రంగయ్య తాతేకాదు. వేరే కొందరు అనుకుంటూ ఉండగా కూడా విన్నాను. ఆవేశం పెరిగినా అణగద్రొక్కుకొని, కుక్కకాటుకి చెప్పుదెబ్బలా వారికి మెత్తని మాటలతో చురక అంటించాను. కాని యిలా ఎంతకాలం మా కుటుంబం గురించి ఆలోచిస్తుంటారో నా కర్ధం కావడంలేదు. ఉత్తగొడ్డుకు అరుపులు మెండనేవిధంగా మా సమస్య పూర్తిగా తెలుసుకొని మాట్లాడడం లేదు. పోనీ తెలిసిన తర్వాతైనా మెరుగుపరుస్తారా అంటే అదీ లేదు. ఊరికే యిష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తులంటే నాకు తగని కోపం. ఇప్పుడు ఈ విషయం తలనెరిసిన వారివరకూ వచ్చిందంటే........ఒకసమస్యే. ఏదో ఒకరోజు మామయ్యను ఈ విషయంలో ఎవరైనా నిలదీసి అడగవచ్చు. ఏ సమాధానమూ చెప్పలేక బాధతో విలవిలలాడిపోవచ్చు ఆయన. అయిన దీనిని యింతవరకూ రానివ్వటం నాదే తప్పు. ఈ రోజు వివరంగా అన్ని విషయాలూ రంగయ్య తాతకు చెప్పివేస్తాను. ఏదైనా ఒక విషయం త్వరగా ప్రచారంలోకి రావాలంటే రంగయ్య తాతపేరు చెప్పుకున్న తర్వాతే మరొకరి పేరు చెప్పుకోవాలి. ఈ రోజుతో ఒక బెడద తీరిపోతుంది.
ఏం బాబూ ఆలోచిస్తున్నావ్.......! నా మాటలు తీసిపారవేయవలసినవికావు. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది. నీ కెంత అన్యాయం జరిగిందో......? జరుగుతూ ఉందో......? తన మాటలు రామంలో సంచలనాన్ని కలగించాయని లోపల్లోపల సంతోషపడుతూ అన్నాడు తాత.
లేదు తాతా! నా కెటువంటి అన్యాయమూ జరుగలేదు. ఇక ముందు జరుగదు. ఊరిలో ఏదో అలగా జనం మామయ్యను అపార్దం చేసుకున్నా రంటే నేను లెక్క చేయలేదు. కాని అనుభవంతో వెంట్రుకలు నెరిసినలాంటి పెద్దవాళ్ళు కూడా యిలా ఆలోచిస్తున్నారంటే నాకు బాధగా ఉంది. అంతే కాకుండా మామయ్యతో చనువున్న నీలాంటివాళ్ళు ఈ విషయాన్ని ముఖాముఖిగా అతనితో చర్చించడం జరిగితే మామయ్య ఎంతో కుమిలిపోవచ్చు.......
మాటలు పూర్తి కానివ్వకుండానే అడ్డుకున్న రంగయ్యతాత అందులో తప్పేముంది? ఉన్న విషయమే! చేసిన దానికి ఈ రోజు యిక్కడ లేకపోతే రేపు దేవుని ఎదుట సమాధానం చెప్పుకోక తప్పుతుందా.....? ఎంతో దీమాగా అన్నాడు రంగయ్యతాత.
తాతా! మధ్యలో నీవు అడ్డుకోకపోతే వివరంగా అన్ని విషయాలూ చెబుతాను. నేను పై చదువులు మానడానికి మామయ్య ప్రమేయమే లేదు. పైగా ఎంతో ప్రోత్సాహం చూపించాడు నా చదువుపట్ల, నా తల్లిదండ్రులు కలరా మహా మారితో చనిపోవడం అందరికీ తెలుసు. నేనప్పుడు పసివాణ్ణి. నేను పెద్ధవాన్నయ్యేంతవరకు నన్ను, నా ఆస్తిని పూవులలో పెట్టి కాపాడాడు. రోజుకు పదిసార్లైనా బాగా చదివించి పెద్ద డాక్టర్ని చేస్తానని అంటూ ఉండేవాడు. తన చెల్లెలి కుటుంబానికి ఏకాంకురమైన నన్ను ఒక డాక్టరుగా చూసి ఎంతో సంతోషించాలని పొంగిపోయేప్పుడు నేను కూడా మామయ్య ఆశలకూ, ఆశయాలకూ అనుగుణంగా శ్రద్దగా చదువుకుంటూ ఆయనను సంతోషపెడుతూండేవాణ్ణి. నాకు పై చదువులు చదువుకోవాలనే కాంక్ష రోజు రోజుకూ ప్రబలమై పోయింది. డాక్టరువై పల్లె ప్రజలకు రాత్రింబవళ్ళు సేవ జేయాలనే కోరిక ఉండేది. కాని విధి బలీయమైంది. ఆ విధి ముందు మానవ శక్తి సామర్ధ్యాలు ఎంతకూ పనికిరావు. ఒకరోజు మామయ్యకు జబ్బు ఎక్కువైంది. మన ఊరి డాక్టరు పై నాకు నమ్మకం సన్నగిల్లి హైదరాబాదు నుండి పెద్ద డాక్టరును తీసుకువచ్చి చూపించిన సంగతి మీకందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన విషయాలే ఎవ్వరికీ తెలియవు. గుండె జబ్బు అని ఎటువంటి బరువు పనులు చేయకూడదనీ, మానసికంగా కూడా ఎటువంటి అఘాయిత్యాలు ఏర్పడకూడదనీ, నొక్కి చెప్పాడు. సమస్య అప్పుడు, ప్రారంభమైంది. మాయింట్లో నేను పైచదువులకు వెళ్ళ వలసిన గడువు రెండు మూడు రోజులే వుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మామయ్య అనారోగ్యం కుటుంబానికి గొడ్డలి పెట్టుగా తయారైంది. కానీ ఏమాత్రము నన్ను ఆటంకపరచలేదు. పైగా త్వరగా వెళ్ళిపోవలసిందిగా హెచ్చరించడం ప్రారంభించాడు ఆయన నేను ఆలోచించాను త్వరపడి నా స్వార్ధం ఆలోచించి వెళ్ళిపోతే ఈ కుటుంబమేమవుతుంది...? ఎలాగూ తల్లి దండ్రుల ప్రేమను పంచుకో లేక పోయాను. అత్తయ్య మామయ్యలు నాకు ఏ లోటూ రాకుండా పెంచారు. వారి పోషణలో నాకు తల్లిదండ్రులు లేరన్న విషయమే తోచలేదు. నాకు బుద్ధి తెలిసిన ఒక రోజు మామయ్య ఎలా కుటుంబం సంగతంతా పూస గ్రుచ్చినట్లు చెప్పాడు. విషయమంతా అప్పుడు నాకు తెలిసింది. ఆయన పట్ల నాహృదయం కృతజ్ఞతాభావంతో నిండి పోయింది. మామయ్యను గురించి డాక్టరు చేసిన హెచ్చరిక నాకు పదే పదే గుర్తుకు రావడం ప్రారంభించింది. బరువు, బాధ్యతలు పాలేళ్ళపై పెట్టి, అంత పెద్ద వ్యవసాయాన్ని వదలి వెళ్ళడం నా కిష్టంలేక పోయింది. నేను పై చదువులకు వెళ్ళడంతో వ్యవసాయం బాధ్యతలు పూర్తిగా మామయ్య మీద పడతాయి. నేను నా చదువు సాగిస్తూ కూడా పొలము పనులు కొన్ని కొన్ని చూసు కుంటూ వుండడం వల్ల కాస్తా వెసులు బాటుగా వుంటూ ఉండేది ఆయనకు. మరి యిప్పుడో.....? అసలే ప్రమాద కరమైన జబ్బు ఏమాత్రము అలసట పనికిరాదని డాక్టరు చెప్పాడు. ఆ విషయాల నన్నింటినీ బాగా ఆలోచించి నేను పైచదువులు మానుకోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అంతకు అవసరమనుకుంటే నేనే ఒక ఆస్పత్రిని యిక్కడ ఏర్పాటు చేయించాలని ఊహించాను. మామయ్య ఒక్క పట్టాన నా నిర్ణయాన్ని ఆమోదించలేదు. చనిపోయి స్వర్గాన ఉన్న చెల్లెల్ని ఆత్మకు శాంతి ఉండదనీ, ఆమె శపిస్తుందని, ఎంతగానో బాధ పడ్డాడు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం బ్రతికున్న వారిని హింస పెట్టడం నాకు ఇష్టంలేదని, నా నిర్ణయం మార్చుకో తలచలేదని నొక్కి చెప్పి ఒప్పించాను. అయనగారిని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇక శాంత పై చదువు-నే నెలాగూ అవకాశంలేక ఆగిపోయాను. అన్ని విధాల అవకాశం, ఉత్సాహం ఉన్న శాంతను ఆపడం నా కిష్టంలేకపోయింది. మామయ్య కాదంటున్నా పోరాడి శాంతను పై చదువులకు నేనే పంపించాను. ఇందులో మామయ్య నాకు చేసిన అన్యాయమేముందంటావు.....? అంతా నా యిష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు చెప్పు.....ఏం చెప్పదలచుకున్నానో......? దీర్ఘంగా నిట్టూరుస్తూ రామం.
