Previous Page Next Page 
పధ విహీన పేజి 2


    "ప్రాణం పోయినా విరాజ్ ను నేను క్షమించలేను" అని చివాలున లేచిపోయింది ఆమె. ఎందుకో ఆ సంభాషణ జ్ఞాపకం వచ్చింది. భర్త గుండెల మీద వాలిపోయి చాలాసేపు అలాగే వుండి పోయిందామె.
    విజయ కు ఇంగ్లీషు రాదు. గాని తెలుగు బాగా చదివి అర్ధం చేసుకుంటుంది. భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఆమెకు కాలక్షేపం చాలావరకూ పుస్తకాలే అని చెప్పవచ్చును.జీవనం యధాలాపంగా గడిపి వేస్తూ భవిష్యత్తును గురించి ఏమాత్రమూ చింతించని విరాజ్ కు విజయ సానుభూతి ఇవ్వలేక పోయింది. ఎన్ని కష్టాలయితే మాత్రం భర్తను వదిలి వేడుతుందా ఆడది....ఛీ ఛీ....ఈ శరత్ బాబు అన్నీ ఇలాటివే వ్రాస్తాడు అని విసుక్కుంది ఆమె.
    ఆంధ్రదేశపు నడి గడ్డలో సుఖంగా సంసారం చేసుకుంటూ కలలు కంటూ ఉండేది ఆమె. ఆ కలల్లో చాలా భాగం మాతృత్వాన్ని గురించే ఉండేవి. రెండో భాగం కలను గురించి చెపితే విజయ ఇవి కూడా ఊహిస్తుందా అని పట్టలేని ఆశ్చర్యం వేస్తుంది. ఆ కలల్లో రాజకుమారుడూ, గోప్పవాడూ అయిన పురుషునితో తను లోకాన్ని చుట్టి వస్తుంది. శత విధాలా ఆ గొప్పవాడు తన భర్తే అయి ఉంటాడు. ధర్మ పదానికి అవతలి వైపు అంటూ ఒకటి ఉందనే చిన్న విషయం కూడా ఆమెకు తెలియదు. అలా కలలో కూడా ఆమె ఊహించలేదు. జయప్రద రావే ఆమె రాజకుమారుడు.
    ఇరవై ఏళ్ళు నిండి పోవస్తున్న ఈ సమయంలో కూడా ఆమె అంతరాంతరాల్లోంచి బాల్యం ఇంకా వీడిపోలేదు. వ్రీడావతి అయిన ఈ స్త్రీలో నుంచి విలస వాంఛ ఇంకా అణగిపొనూ లేదు. కాని, భర్తను తప్ప మరొక విషయం తలచని మహా ఇల్లాలు విజయలక్ష్మీ . ఆ సంగతి అందరి కంటే ఎక్కువగా గ్రహించిన యువతి ఎదురింటి తమిళ స్త్రీ ధనం. తెలుగు దేశంలో చాలా రోజుల నుంచీ ఉండటం వలన ఆమె తమిళ స్త్ర్రీ అని ఎవరూ అనుకోరు. ఆమె తండ్రి, భర్త కూడా రైల్వే ఉద్యోగస్తులే అవటం వలన ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. తెలుగులో కొంచెం కూడా యాస అనేది లేకుండా మాట్లాడే ధనమ్మాళ్ ను చూస్తె తమిళ కవయిత్రి అండాళ్ జ్ఞాపకం వస్తుంది విజయ కు.
    అండాళ్ పాశురాలు ధనుర్మాసపు తెల్లవారుజాము చలిలో ధనం చేత పాడించుకుని మరీ మరీ వినేది విజయ.
    పాట పాడి ఇంటికి వెడుతూ విజయను వేళాకోళం చేయకుండా మాత్రం కదిలేది కాదు ధనం.
    "చూస్తె రంగనాధ స్వామిని ప్రేమిస్తున్నాట్టున్నావు నీవు."
    చప్పున ఆమె నోరు మూసి "ఛీ ఛీ. నోటి కేంతోస్తే అంత అంటావు నువ్వు. మా ఆయన కన్నా మీ రంగధాముడు ఏవిధంగా నూ ఎక్కువ గాడు." ఇంతవరకూ వేళకోళం గానే అని-- అంతలోనే గంబీరం అయిపోయి----
    "ఆయన్ను తప్ప భగవంతుడి ని కూడా ప్రేమించ లేను నేను" అని కొంగుతో కళ్ళు ఒత్తుకునేది విజయ.
    జయప్రద రావు సంపన్న గృహానికి చెందినవాడు. ఆ కుటుంబ వైభవం తాతల వాడే తగ్గు ముఖం పట్టినా జయప్రదరావు జన్మించే నాటికి ఇంకా కొంతభాగం మిగిలే ఉంది. తండ్రి పోయే నాటికి నూజివీడు లో ఇక పాత మేడా, రెండెకరాల మామిడి తోటా మాత్రమె మిగిలి ఉన్నాయి. ఇతను చేస్తున్న ఉద్యోగం మంచిదే అవటం వలన సుఖంగానే కాలం గడిచి పోతున్నది.
    ఈ పరిస్థితిలో అతని దాయాది ఒకడు నూరెకరాల మామిడి తోట కొని ఇతని అజమాయిషీ కింద వదలి మద్రాసు లో ఉంటున్నాడు. జయప్రద రావు కు ఆ తోట అజమాయిషీ లో శ్రమ తప్ప మరేం మిగలక పోయినా సోదర విహీనుడవటం వలన అదాయాది లో తన తోబుట్టువును చూడటం వలన, ఆ తోట కవుళ్ళూ, కాయ దింపించటం అమ్మకం వగైరాలూ చూసి డబ్బు మద్రాసుకు పంపుతూ ఉంటాడు. ఈ విధంగా పది సంవత్సరాల నుంచి జరుగుతున్నది.
    విజయ కు మాత్రం భర్త యీ అరవ చాకిరీ చెయ్యటం ఏమాత్రం ఇష్టం లేదు. అందులో జయప్రద రావు నిజాయితీ ఎలాటి దంటే ఆ తోటలో నల్ల మామిడి చెట్టని ఉంది. దాని కాయలు మహా పులుపు. ఆవకాయకు బాగుంటాయి. ఒక ఏభయి కాయలు తీసుకుంటా మంటుంది విజయ. అతను ఇంత మటుకు ఒక్క కాయ కూడా ఇంటికి తీసుకు రాలేదు. విజయ మళ్ళీ జ్ఞాపకం చేస్తే ---
    "పోనిద్దూ, విజయా "వినాదైన్వేన జీవనం'-- భగవంతుడు నాకు ప్రసాదించాడు. నాచేత అలాటి పనులు చేయించకు' అన్నాడు. ఆమె నిట్టూర్చి ఇహ మెదలకుండా ఊరుకుంది.
    పతివ్రత అనే విషయంలో గర్వపడటం విజయకు అలవాటయిన వాటిలో ఒకటి. జయప్రద రావు అలా కాదు. మనిషి తప్పులు చేస్తాడు. ఆ తప్పుల్ని క్షమించడం నేర్చుకోవాలి అనేది అతని సిద్దాంతం.
    భార్య తాలుకూ పతివ్రతా గర్వానికి లోపల లోపలే నిట్టూర్చి ఊరుకుంటాడు. అతను ఎప్పుడైనా ఒకసారి  ఇలా అంటాడు:
    "నీకు తెలియదు, విజయా, పాతివ్రత్యం అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దానికంత ప్రాధాన్యం ఇచ్చినందు వల్ల మిగిలేది ఆత్మవంచన తప్ప మరేం లేదు" అని.
    విజయ అతని వంక అయిదారు క్షణాలు చూసి "ఏ పరిస్థితులలో అయినా తను ప్రతివ్రత్యాన్ని కాపాడు కోవటం ఈ దేశపు ఆడవాళ్ళకు అలవాటు" అని సమాధానం ఇచ్చేది.
    కాలం ఇలా గడిచిపోతే బాగానే ఉండేది. కాని, గడువ లేదు. ఒక్కసారిగా తల్లకిందులయింది. ఇంత కాలమూ చాకిరీ చేయించు కున్న ఆ దాయాది తనకు సరిగా పైకం పంపలేదని ఆరోపించి జయప్రద రావు ఇల్లూ, మామిడి తోటా తన వాటితో కలుపుకొని తన దారిన తను పోయినాడు. ఒక్క నేల రోజుల్లో తిరిగిపోయిన దశ నీడలా వెన్నంటింది వారిని.
    చెరువు గట్టున పది రూపాయలకు రెండు గదులూ, ఒక వసారా ఉన్న పెంకిటింట్లో కాపురం పెట్టారు. అప్పుడు కూడా విజయ పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉండటం చూచి ఆశ్చర్య పోయినాడు జయప్రదరావు. ఆమె అరచేతులు రెండూ తన చెంప కానించు కుని--
    "అంట్లు కూడా తోమిస్తున్నాను కదూ నీచేత ?' అన్నాడు. అతని కళ్ళలో తిరిగిన నీరు విజయ చూడనే చూసింది. కొంగుతో ఆ నీళ్ళు తుడిచి --
    "ఆడదానికి అంట్లు తోమటం, వంట చేయటం అనేవి తాబేలు ఈత లాంటివి. అందులో శ్రమేం లేదు. మీరు బాధపడానికి" అని సమాధానం ఇచ్చింది.
    ఆ ఇంట్లో ఉన్న మరో రెండు గదుల భాగంలో ఒక కవి ఉంటున్నాడు. అతని పేరు జగన్నాధం. అతను ఎంతిని బ్రతుకుతూ ఉంటాడో చాలా రోజులు విజయ కు అర్ధం కాలేదు. ఆ తరవాత ఒకనాడు--
    "అక్కగారూ, నాలుగు రోజుల నుంచీ జ్వరం. ఇవాళే కాస్త జారింది. కొంచెం చారూ అన్నం పెడతారా?" అని అతనే వచ్చి అడిగేసరికి విజయ ప్రాణం నీరై పోయింది.
    ఆ రోజు నుంచీ జగన్నాధం అదృష్టం పెరిగి పోయింది. అవకాయలూ, కూరలు ఆకులో పెట్టి ఇస్తూ ఉండేది విజయ. ఏవిధమైన


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS