వర్ణాంతర వివాహాలంటే మా ఇంట్లో గానీ, నాకుగానీ, ఎటువంటి అభ్యంతరాలూ, అయిష్టాలూ లేవు. అన్నయ్య పెళ్ళితో అమ్మా నాన్నా అంత చిత్రంగా మార్పు తెచ్చుకున్నారు. వదినది మా కులంగాదు. అన్నయ్య అభిప్రాయం విన్నప్పుడు నాన్నగారు మండిపడ్డారు. అమ్మ ఉపవాసాలు ప్రారంభించింది. ఇల్లు నిశ్శబ్దంగా స్మశానంలా తయారైంది. అన్నయ్య ఏదీ లెక్క చేశాడు కాదు. కట్టు గుడ్డలతో వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు. ఆస్థిపాస్థులు దక్కవనిగానీ, ఇంట్లోంచి పొమ్మనిగానీ ఏమీ అనలేదుగానీ ఆ పెళ్ళి విషయం తనకి అక్కర్లేదని వూరుకున్నారు నాన్నగారు. కోపాలూ, పట్టుదలలూ మరిచి వదిన్ని తీసుకొచ్చే సరికి ఏడాది దాటింది. తన కోడలు కానట్టు ఎంతో ముభావంగా వుండే అమ్మ రానురాను వదినను చూస్తూ మంచులా కరిగిపోయింది. "అత్తయ్యా!" అనే పిలుపుకే తగ్గిపోయిందేమో ననిపిస్తుంది నాకు. ఇప్పుడు నాన్నగారికి వదినంటే ప్రాణం. ప్రాణమంటే గౌరవమే కదా ఎవరి కైనా?
వేరే నాకు వర్ణాంతర వివాహాలంటే ఉద్దేశ్యాలు ఏముంటాయి? అన్నయ్యవుపన్యాసాలు వినీవినీ ఆవిషయంలో కొన్ని అభిప్రాయాల్నిస్థిరం చేసుకున్నదాన్ని - సృష్ట్యాదిలో ఎటువంటి వర్ణాలూ, జాతులూ, వుండివుండవంటాడు అన్నయ్య. రానురాను నిత్యావసరాల కోసం ప్రజలంతా తలా ఒక వృత్తీ స్వీకరించి వంశ పారంపర్యా వాటిలోనే నిమగ్నమై వాటినే జీవనాధారాలుగా చేసుకున్నారంటాడు. క్రమంగా వృత్తుల్నిబట్టి ఆయా కుటుంబాలకి వర్ణాలు - కులాలు నిర్ణయింప బడ్డాయంటాడు. బట్టలుదికే వాడు చాకలిగా - కుండలు చేసేవాడు కుమ్మరిగా - రాజ్యం చేసేవాడు రాజుగా - వ్యాపారం చేసేవాడు వైశ్యుడుగా అలా అలా వృత్తుల వెనకే వర్ణాలు పుట్టుకొచ్చాయంటాడు.
ఆరోజుల్లో పెద్ద లేర్పరచిన వర్ణ వివాహాలకి ఎంతైనా అర్ధం అవసరం వున్నాయి. "ఇది తప్పు - అది ఒప్పు" అని కొండ గుర్తు లేర్పడిన ప్రతీ ఆచారాన్నీ నిశితంగా పరిశీలిస్తే అందులో కొండంత అర్ధం కన్పించి తీరుతుంది. కుల వృత్తులే నిత్యాధారంగా - నిరాటంకంగా సాగుతూన్న రోజుల్లో వర్ణ వివాహాలే అత్యవసర మయాయి. రాచకన్య వైశ్య కుటుంబంలో గానీ, చాకలిపిల్ల కుమ్మరి సంసారంలో గానీ ఎందుకూ కొరగాకుండా పోతారు. సంసారావసరాల్లో భర్తకి సాయపడటం గానీ భవిష్యత్తులో కుల వృత్తుల కనుగుణ్యంగా బిడ్డల్ని పెంచుకోవటంగానీ అన్యకుల స్థురాలైన ఆ కోడలు చెయ్యలేక పోతుంది. ప్రతీ ఇంటా కులవృత్తులే సాగే రోజుల్లో అన్ని విధాలా ఇంటా బయటా భార్యాభర్తల సహ జీవనానికీ, సహకారానికీ, వర్ణవివాహాలే అత్యవసర మయ్యాయి.
కాని ఈనాడు సమాజంలో మార్పు వచ్చింది. పెద్దలు జీవనాధారంగా పాటిస్తూ వచ్చిన కుల వృత్తుల్ని ఈనాడే ఇల్లు తు. చ. తప్పకుండా పాటిస్తున్నది? రాచయువకుడు రాజ్యాలేలుతున్నాడా? కుమ్మరి మనిషి కుండలే చేసి బ్రతుకుతున్నాడా? ఎన్ని కుటుంబాలు అనాదిగా వస్తున్న కుల వృత్తుల్నే అంటిపెట్టుకున్నాయి? - కుల వృత్తులే లేని ఈ రోజుల్లో వర్ణ వివాహాల అవసరం ఏమిటి? ఈనాడు రాచకన్య వైశ్య కుటుంబంలో రాణించలేకపోతుందా? సంసార జీవనంలో బిడ్డల పెంపకంలో ప్రజలంతా పాటించే ఏకసూత్రం పాటించలేక పోతుందా? ఇంకా కులవృత్తులు మాసిపోని కుటుంబాలకి ఎప్పటి ఆచారం వర్ల వివాహం వుండనే వుందికదా?
ఈనాడు వర్ణాంతర వివాహాలతో తప్పు లేదం టాడు అన్నయ్య. అన్నయ్య కబుర్లు గాలికి పోనివ్వకుండా నాచెవుల్లో వేసుకొంటూ వుంటాను. "ఇన్ని ఆలోచన్లు వుంచుకోబట్టే అంత మొండిగా ధైర్యంగా అమ్మా నాన్నని కాదని వదిన్ని తెచ్చుకున్నాడు" అనుకుంటాను.
మా వదిన రోజా అన్నివిధాలా రోజా వంటిదే. రోజా అంత అందమైందీ - రోజా అంత గుణం కలదీనూ. వదిన సహవాసం ఎంతో సంతోషాన్నిస్తుంది. శాంత - రేణూ తర్వాత వదిన వాళ్ళవంటి స్నేహితురాలే. ప్రస్థుతం వదిన పురిటికి పుట్టింటికెళ్ళింది.
"కూతుర్ని కనకమ్మా! ధరలు మండిపోతున్నాయి" అంటే.
"ఆ మనలో మనకి బేరాలేమిటి లెద్దూ?" అంటుంది. ఈ సెలవుల్లో వదిన లేకపోవటం చాల కష్టంగా వుంది సుమండీ!
* * *
బహు భార్యాత్వం అంటే నువ్వసహ్యించుకుంటావా? అన్న మీ ప్రశ్నకి ఏ ఆడదైనా ఒకే సమాధానం చెప్తుందనుకుంటాను. నా అభిప్రాయం ఇదంటూ వేరే ఎత్తి చెప్పటం ఎందుకు గానీ కొన్ని సంఘటనలు చెప్తే మీరే తెలుసుకో గలుగుతారు కదా?
శాంత తెలుసుకదూ మీకు? ప్రియమైన రేణుకన్నా ప్రియమైంది శాంత నాకు. దాని మాటలు వినటం తప్ప తోసిపారెయ్యనంత గురి. అదంటే అంత గౌరవం అభిమానం కలగటానికి కారణాలు లేకపోలేదనుకోండి.
స్కూలు ఫైనల్ పూర్తయ్యాక్ శాంత చదువు చాలించుకుంది. వాళ్ళింట్లో పెద్దవాళ్ళు అయిష్ట పడుతున్నారంది. "అమ్మకీ నాన్నకీ ఇష్టం లేనప్పుడేం పట్టుపట్టును కృష్ణవేణీ? మన మంచిచెడ్డలు వాళ్ళకి తెలియకపోవు కదా? వాళ్ళకయిష్టంగా నాకేదీ చెయ్యాలనిపించదు" అంది.
ఎన్ని చెప్పినా ఎంత బ్రతిమాలినా అదే ధోరణి. అంతవరకూ కలిసి చదువుకుంటూన్న ముగ్గురిలో ఆపైన శాంత లేకపోవటం తీరని లోటు మాకు.
"కాలేజీలో చదవాలని లేదా శాంతా? పట్టుచలగా అడిగితే మీవాళ్ళు ఒద్దంటారా చెప్పు? చక్కగా మనం ముగ్గురం బి. ఏ. లు గానో ఎం. ఏ.లు గానో ..." అంటూ రేణు భవిష్య త్తులో ఆశ కలిగించాలనుకునేది.
"నాకెందు కిష్టంలేదు రేణూ? అమ్మావాళ్ళ కిష్టంలేనప్పుడేం చెయ్యను చెప్పు? నాకోసం వాళ్ళ ఇష్టాలు మార్చుకోమంటానా? మీ ఇద్దర్నీ వదలటం నాకు బాధ కాదా చెప్పు? ఐనా వూళ్ళోనే కదా? తరుచూ కలుసుకొంటూ వుండొచ్చుననే ధైర్యంతో వున్నాను. సంతోషంగా మీరు చదువు కోండి రేణూ! మీ ఇద్దరూ అభివృద్ధిలోకి వస్తే నా కదే చాలు."
నాకు చిరాకేసింది. శాంత మరీ అమ్మమ్మలా మాట్లాడుతుందనుకున్నాను. ఇక ఆ విషయం చాలించుకున్నాము. కాని తర్వాత తర్వాత ఆలోచిస్తే శాంత ఎంత సహనవంతురాలు! అనిపిస్తుంది. ఆస్థితిలో నేనుగాని వుంటే శాంతలా అమ్మా నాన్నా అంటూ నోరు మూసుకోలేను. సాగినాసాగకపోయినా సాధ్యమైనంత వరకూ ప్రయత్నాలు చేస్తాను. నావంటిదే శాంతైతే దాని మీదంత గౌరవం దేనికీ?
తర్వాత రెండో సంవత్సరంలో శాంతకి పెళ్ళయింది. ఆ పెళ్ళి నాకూ రేణుకూ సుతరామూ ఇష్టంలేదు. పెళ్ళికి ముందు రేణూ నేనూ ఎన్నో విధాల నచ్చచెప్పాం. అతను వయసువాడే - అందగాడే-ఆస్థిపరుడే. శాంతా వాళ్ళకి దూరపు బంధువు. అన్నివిధాలా శాంతకి తగినవాడే. ఎంతైనా రెండో పెళ్ళేమిటి చెప్పండి? మొదటి భార్య పోయిన కబురు వింటూనే మూర్చ పోయాడట. ఏడాది కావస్తున్నా అతనా మూర్చలాంటి అవస్థలోనే వుండిపోయాడు. ఉద్యోగం సద్యోగం వదిలే శాడు. ఇల్లూ వాకిలీ మరిచి కొన్ని నెలలపాటు బికారిలా వూళ్ళట్టుకు తిరిగాడు. ఒక గతీ క్రమం లేకుండా ఆవిడధ్యాసలో మనోవేదనలోనే రోజులు గడుపుతున్నాడు - ఏడాది కావస్తున్నా మార్పు లేదు. కోడలిలానే కొడుకు కూడా దూరమై పోతాడేమో అనేంత బాధతో కుమిలి పోతూన్న ఆ తల్లి ఒక్కగా నొక్క కొడుకునీ దక్కించుకోవాలని ఆతృతపడటం సహజమే. బంధువర్గంలో గుణ వంతురాలిగా పేరుమోసిన శాంత ఒక్కతే ఆవిడకి వెలుగులా కన్పించింది -ఆవిడే స్వయంగా వచ్చి శాంతా వాళ్ళ అమ్మగారితోనూ నాన్నగారితోనూ మాట్లాడింది. ఏవిషయమూ దాపరికం చెయ్యకుండా సంగతులన్నీ చెప్పింది. తన కోరిక మన్నిస్తే జన్మజన్మాలకీ ఋణపడివుంటానని కన్నీళ్లు పెట్టుకొంది- "నాకొడుకేం పిచ్చివాడూ వెర్రి వాడూ కాదు. ఇష్టపడి చేసుకున్న అమ్మాయి గనక ఇంతలో మర్చిపోలేక పోతున్నాడు. మా ఆస్తిపాస్తులూ -కుటుంబవ్యవహారాలూ మీకు తెలీనివి కాదు మీబిడ్డని నా బిడ్డలా చూసు కుంటాను. అమ్మాయిని చూసినప్పట్నుంచి మావాడిని తప్పక మార్చుకోగలదనే ధైర్యంగా వుంది. వాడికీ స్థితిలో తోడునీడలా వుండే ఆడ సహచర్యం కావాలి గానీ నావంటివాళ్ళతో పనిలేదు కదా? మీబిడ్డకి అన్యాయం చెయ్యమని నే నంటానా? కన్న ప్రేమ నాకు తెలీదమ్మా? శాంత నా ఇంటికి వస్తే వాడు తప్పక మారుతాడు." అంటూ ఆవిడ ఎన్నోవిధాల ప్రాధేయపడింది. ఆ పెళ్ళికొడుకు సంగతి ఏడాదిగా బంధువులందరూ ఎరిగినదే నయ్యే! శాంతావాళ్ళ పెద్దవాళ్ళు ఎటూ తోచక ఏమీ నిర్ణయించుకో లేక సతమతమై చివరికి శాంతకే ఆవిషయం అప్పగించి వూరు కున్నారు. అదేమీ చిన్నపిల్ల కాదుగదా? ఆ కష్టసుఖాలు అనుభవించాల్సిన దానికీ తెలియాలికదా? ఒక్క అతని అయిష్టం తప్పితే ఏవిధంగానూ తిరస్కరించాల్సిన సంబంధం కాదు. ఇదీ వాళ్ళ వుద్దేశ్యం.
