"మంజూ ఈ ఉంగరం చూచావా? దీనికి అరుకు వుండదు. దీని అర్ధం ఏమిటో తెలుసా? మన ప్రేమకూడ అతుకులేకుండా ఒకటే అని భావం ఆమె పట్టరాని సంతోషంతో కళ్ళు మూసుకుంది.
కుమార్ వెళ్ళి ఫోన్ చేశాడు. ఇద్దరు స్నేహితులు వస్తున్నట్లు చెప్పారు.
"పద. బజారు కెళ్దాం"
"ఎందుకు?"
"మరి....నీకు.......నగలు చీర....అవి యివీ తీసికోవద్దూ"
మంజుల "అవన్నీ అవసరమా .... మనకు డబ్బు..."
"నా దగ్గర వుంది మంజూ ..... ఇవ్వాళటికి మాత్రం నా ప్రేయసిగా అన్ని మాటలు పారవశ్యంతో వీనాలి. రేపటినించి భార్యగా అదుపాజ్ఞల్లో పెడుదువులే" కొంటెగా జూచి ముక్కుగిల్లాడు.
ఆమెముఖం చిట్లించి చిరుకోపం నటించింది.
దాదాపు రెండు వేల రూపాయలకు అన్నీ కొనుక్కున్నారు.
మరుసటి రోజు పదిగంటలకు స్నేహితుల సమక్షంలో మంజులా కుమార్ ల పెళ్ళయింది.
కుమారీ స్నేహితులు నజీర్ అహమ్మద్ ఖాన్. రామమూర్తి. హైదరాబాద్ నుంచి ఇదివరకే వచ్చి వున్నారు. వీరిద్దరివివాహం అందరికీ ఆశ్చర్యాన్ని. ఆనందాన్ని కల్గించింది.
నిరాశావాదులు కొందరు లేకపోలేదు.
ఆరాత్రి వధూవరులకు పలువురు స్నేహితులు వీడ్కోలు ఇవ్వగా హైదరాబాద్ బయలుదేరారు మంజు ప్రాణస్నేహితురాలు ప్రమీల ఒక కవరు అందిస్తూ అంది "క్రొత్త సంసారానికి కావలసినవి కొనుక్కో మంజూ అల్లుడు గారూ మాపిల్ల నిజంగా మంజులే ఎలా ఏలుకుంటారో"అందరు హాయిగా నవ్వారు. బండి కదిలింది ఇద్దరు చెయ్యి ఊపుతూ నుంచున్నారు. మంజుల కళ్ళలో నీరు సుళ్ళుతిరిగి టప్ న క్రిందపడ్డాయి ఆమెకు అడ్డంగా చెయ్యిపెట్టి నుంచున్న కుమార్ మంజు కన్నీటిని చూచి అనుకున్నాడు. "ఆమె తల్లిదండ్రులు వచ్చి సాగనంపుతున్నలా భ్రమ కల్గింది కాబోలు.
రైలు వేగం హెచ్చింది. మంజుల హృదయం తేలికపడింది. కవరు తెరచింది. వెయ్యి రూపాయలకు చెక్కువుంది. దానిలో ఒక చిన్న కాగితపు ముక్క-" మీ సుఖాన్ని సదా కాంక్షించే మిత్రుల స్వల్పకానుక."
భర్తకు అందింది కళ్ళు ఒత్తుకుంది. "నా అనేవాడు నాకులేరు కాబోలు ననుకుని మొదట్లో చాలా బాధపడ్డాను? కానీ నేను ఒంటరిదాన్ని కాను. నాకు అందరూ వున్నారు. ముఖ్యంగా మీరున్నారు......అది చాలు."
"నాకె-నువ్వు తప్ప ఎవ్వరూ లేరు మంజూ-మరి నన్నెలా ఏలుకుంటానో - "చిన్నగా నవ్వుతూ చెక్కు అందించాడు. ఆమె ముఖం కలకలలాడింది. "అంతా హాస్యమేనా?" అన్నట్లుగా చూచింది.
రైలు అవిరామంగా సాగిపోతూనే ఉంది.
అది చాలా పెద్ద ఆసుపత్రి. బేగంపేట దాటి వెళ్ళాలి. రెండంతస్థుల పెద్ద భవనం. దాన్ని చూడగానే ఆసుపత్రిలా లేదు. పెద్ద మహల్ లాగున ఉంది. అది ఒకప్పుడు నిజంగానే ఒక నవాబుది. దాని ఖర్చులు భరింపలేక కార్పొరేషన్ వారికి అమ్మేశాడు ఆ నవాబు. అందులో ఆసుపత్రివి పెట్టింది కార్పొరేషన్. "నెహ్రూ హాస్పిటల్" అని నామకరణం చేశారు.
విశాలమైన కాంపౌండు వెనుక భాగంలో క్షయ రోగులకు ప్రత్యేకమైన వార్డుంది. దానికి కొంత దూరంలో అంటువ్యాధులకు సంబంధించిన రోగులకోసం అధునాతన పద్ధతిలో కట్టించిన చిన్న ఆసుపత్రి వుంది.
రెండవ అంతస్థుపైన విశాలమైన గదిలో లేబరేటరీ ఉన్నది.
ఎక్స్ రే చికిత్స సరంజామా - బ్లడ్ బాంక్ - రేడియం ట్రీట్ మెంట్ యిచ్చే పరికరాలతో ఆ ఆసుపత్రి అన్ని హంగులు కల్గి అత్యంత సఖ్యాతి గాంచింది. ఎక్కడ స్వస్థత పొందని రోగులు అక్కడికి వచ్చి స్వాస్థం పొంది వెళ్తారు.
ఇందుకు కారణం - అనుభవజ్ఞులు. ప్రతిభావంతులైన డాక్టర్లు వుండటం వల్లనే. హౌస్ సర్జన్ చేశాక కుమార్ నెహ్రూ హాస్పిటల్ లో పనిలో జేరాడు. అత్యంత ప్రఖ్యాతి గాంచిన సర్జన్ మాదప్పక్రింద తను పనిజేయడం తన అదృష్టమే అనుకున్నాడు.
అప్పుడు నెలకు మూడువందల యాభైరూపాయల జీతం. రోగులను చూచి. ఆపరేషన్స్ చేసి అలసిన డాక్టర్లకు హాయిగా జల్సాగా సిటీకి వెళ్దామని వుండేదికాదు. సాయంత్రం ఆరునించి డ్యూటీలు లేకపోతే వారివారి క్వార్టర్స్ ల్లోనే విశ్రాంతి తీసికొనేవారు. కుమార్ సాధ్యమైనంతవరకు డబ్బు ఖర్చు చేసేవాడు కాడు. రెండు సంవత్సరాలు మంజులను చదివించే బాధ్యత తనపై వేసుకున్నాడు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. చివరికి మంజుల తల్లిదండ్రులకు, ఇద్దరన్నయ్యలకు, చెల్లికికూడా తెలియదు.
శస్త్రచికిత్సలో డిగ్రీపొంది యం.యస్. చేయాలని అతని అభిలాష. అతని కోర్కెను ప్రోత్సాహపర్చి అన్నీ నేర్పుతుండేవాడు మాదప్ప అతను కొంకణ దేశంవాడు. ఎవరైతేనేం వ్యక్తిలోని ప్రత్యేక శక్తులను గ్రహించి ప్రోత్సహపర్చటం అందరికే అయ్యే పనిగాదు. కుమార్ నమ్రత. ఠీవి, అతనిలో మూర్తీభవించిన కరుణ, ప్రేమ మాదప్పను ఆకర్షించినై. ఇంతచిన్న వయసులో యింత మేధావిని తను చూడలేదు. కుమార్ తప్పక మంచి సర్జన్ అవుతాడు. ఆపరేషన్ సమయంలో అతని చురుకుదనం -ఎంతటి అపాయ స్థితిలో ఉన్నా శాంతంగా ఉండటం చూస్తుంటే ఆయనకు కుమార్ పట్ల ప్రత్యేకాభిమానం ఏర్పడింది.
మంజుల హౌస్ సర్జన్ చేశాక తను యం. యస్ చేయాలి. ఈ విషయంలో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా మాదప్పకుమార్ ని ఆసుపత్రి తరఫున చదివించేలా ఏర్పాటు చేస్తానని కూడా చెప్పాడు. అతని సహృదయతకు కుమార్ ఎంతో కృతజ్ఞత కనపర్చాడు.
మంజుల పరీక్షలు అయిపోతాయనగా ఆ రాత్రి కుమార్. మాదప్పా యింటికి వెళ్ళాడు. ఎప్పుడు రాని కుమార్ ని చూచి ఆయన అమితా ఆశ్చర్యం పొందాడు.
"సరే - రేపు రాత్రికి మెడ్రాస్ వెళ్తున్నాను, రెండు రోజుల్లో వచ్చేస్తాను.
"ఏమీ అనుకోకపోతే -ఎందుకెళ్తున్నారు. డాక్టర్?" ఆయన పెద్ద సోఫాలో ముందుకు వంగి ఉత్సుకతతో అడిగాడు.
కుమార్ ముఖంలో దరహాసం మెరిసింది.
"పెళ్ళి చేసుకోటానికి"
"అరె- కంగ్రా ట్యులేషన్స్... ఐతే చెప్పారు కారేం-చాలా సంతోషం....చాలా సంతోషం.....అమ్మాయిని గూర్చిన వివరాలు?"
"ఆమెకూడా డాక్టరే. రేపు పరీక్షలు ఆఖరౌతాయి..."
"రెండు రోజులు సరిపోతాయా డాక్టర్" ఆయన ఆశ్చర్యంతో అడిగారు.
"సరిపోతాయి సరే." కుమార్ ముఖం దించేశాడు. ఇతనికి అంతా చెప్పటమూ - మానటమూ అన్న సందిగ్దంలో పడిపోయాడు ..... అతని ఆంతర్యంలోని కలతను గ్రహించి మాదప్ప జాలితో అన్నాడు. "అలా అయిపోతారేం డాక్టర్? మీ మనసులో ఏదో కుములుతోంది .... నేనేదైనా సాయం చెయ్యగలనేమో..."
ఆయనవైపు సూటిగా చూశాడు. తన తండ్రి బ్రతికి వుంటే యింతవయస్సే ఉండేదీమో...ఆ చూపుల్లోని నైర్మల్యాన్ని చూచి వెంటనే అంతా చెప్పాలనుకున్నాడు. ఏ నాటి అనుబంధమో - అతన్ని చూడగానే తనకేదో భక్తి భావం కల్గుతుంది.
"సరే....మీకు ఏ పనీ లేకపోతేనా విషయాలు కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను....ఏకాంతంగా..." సాలోచనగా అటు ఇటు చూశాడు.
మాదప్ప" ఓ .... దానికేం ..... పదండి" అంటూ తన ప్రైవేటు అఫీసులోకి నడిచాడు. ఇద్దరూకూర్చున్నాక ప్రారంభించాడు.
"మంజులలో స్నేహం అయినప్పుడు నేను ఫోర్త్ యియర్ లో వుండేవాడిని. అంతకు క్రితమే ఒకరి కొకరం - ముఖ పరిచయం మాత్రం వుండేది. వాళ్ళది కాకినాడ దగ్గిర పల్లె టూరు. ఎంతో అమాయకంగా వుండేది. పట్నవాసపు మెరుగు లమేకు తెలియవు. కనీసం కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో-అందులోనూ మెడికల్ కాలేజీలల్లో స్త్రీ పురషుల స్నేహం-సంభాషణలు ఎలా వుండాలో కూడా ఆమెకు తెలియదు. మగవాళ్ళను కన్నెత్తి చూచేది కాదు. మగవాళ్ళలో కలిసి ఎక్స్ పెరిమెంట్స్ చేయవలసి వచ్చి నప్పుడు చాలా బాధపడి పోయేది. మా ప్రొఫెసర్ ఒకాయనది కాకినాడ, వారు ఇదంతా గమనింది మంజుకు పాఠాలు నేర్పారు. ఆంధ్రులకు కొంతమందికి చెప్పారు. అప్పుడప్పుడు పరామర్శిస్తూ వుండేవాడిని. ఒకటి రెండుసార్లు మిగతా తెలుగమ్మాయిలతో పాటు బీచ్ కి తీసుకోని వెళ్ళాను. ఆ రోజుల్లో నా తలంపులలో ఎప్పుడు మంజులే ఉండేది. భగవంతుడు పొరపాటున ఈలోకంలో జన్మింపజేశాడేమో- అని ఇప్పటికీ నాకు అనుమానంగానే వుంటుంది. ఒకరోజు ఆమె సెకండ్ ఇయర్ లో వుండగా చెయ్యి విరిగింది. అది కుడిచెయ్యి, వెంటనే నాకు కబురు తెలిసింది. ఆమె దగ్గరకు వెళ్ళాను, నన్ను చూచిన వెంటనే ఎక్కడ లేని జలాన్ని పుంజుకుని ఎంతో ఓర్చుకుంది గానీ - ఆ బాధ భరించలేక న చేతిలోనే స్మృతి కోల్పోయింది. తర్వాత చేతిని స్లింగ్ లో వేసుకుని నెలన్నర రోజులు తిరిగింది. అన్నిటిలో వెనుక బడింది. నా దగ్గరున్న నోట్సులు అన్నీ ఇచ్చాను. తెలియనివి చెప్పేవాడిని. ఎనాటమీ నాకు బాగా వచ్చేది. ఒక శరీరావయం తీసి కోసి బోధపర్చే వాడిని. అంతే ఆ రెండు నెలల్లో తెలిసి కొన్నాము - మే మిద్దరం ఒకరికోసం ఒకరు సృష్టింప బడ్డా మని, ఆమెను గురించి నాకేమీ తెలియదు-నా గురించి ఆమె కేమీ తెలియదు- వ్యక్తిగత విషయాలు చెప్పుకోకపోయినా మే మిద్దరం ఒకరి కొకరం ఆకర్షింప బడ్డాము.
నేను ఎక్కువగా ఆలోచించ లేదు. మంజుల తోడి జీవితమే జీవితం అనుకున్నాను. ఒకరోజు ఒంటరిగా కలుసుకుని నా ప్రేమను తెల్పాను. నాకు తెలుసు. ఆమె నన్ను ప్రేమిస్తోందని. మంజుల ఎంతో ఆనందించింది. ఈ విషయం చాలా రహస్యంగా వుంచాలని కూడ నిర్దారణ చేసికొన్నాము.
నేను అక్కడే హౌస్ సర్జన్ చేశాను. స్నేహితులు పురుషులై వుండటం మెడికల్ కాలేజీలలో సాధారణమైన విషయం కాదా? మమ్మల్ని ఒక్కరుకూడా అనుమానించలేదు. ఒకరిద్దరు సన్నిహిత స్నేహితులు తప్ప. వారి కత్యాశ్చర్యం వేసింది. ముఖ్యంగా వారికో అనుమానం వుండేది. ఏ సంధర్భంలో కూడా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరని. నాకుకూడా నిజమే ననిపించింది. నేను క్రైస్తవుడను. హిందువును కాలేసు ఆమె నా మతాన్ని స్వీకరించలేదు. శూద్రులుగా వున్న మా నాన్నగారు ప్రథమంలో మతంపుచ్చుకున్నారట. నా తల్లిమాత్రం పుచ్చుకోలేదు. అదే చింతతో మరణించిందని మా పెదనాన్నగారు చెబుతుంటారు. ఇలా విభిన్న మతాలు కులాలు మాకు పెద్ద అడ్డు బండలుగా నిలుస్తాయని అనుకున్నారు. నేనుకూడా ఆ విధంగానే భావించాను. కానీ ఆ వేసవి సెలవులలో మంజుల ఇంటికి వెళ్ళి నా విషయం చెప్పడం-వారు కోపోద్దీపితులు కావడం-జరిగింది ఆ రాత్రికి రాత్రి నా దగ్గరకు వచ్చేసింది. అప్పటి నుంచి ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాను......పరీక్షలైపోగానే ఆమెను తెచ్చి నా దగ్గర పెట్టుకోవాలి. పెళ్ళాడితేనే కదా అదిసాధ్యం అందుకని వెళ్తున్నాను..."
మాదప్ప దీక్షగా విని మెల్లగా నిట్టూర్చాడు. అతని వాలకం చూచి కుమార్ "సర్....ఏమిటి చెప్పటానికి సంకోచించకండి-"
"ఒక్కటి ఆలోచించారా డాక్టర్.....ప్రేమించి పెళ్ళిచేసుకోవడం-తప్పు అనను....కానీ నీకు ఎవ్వరు లేరు.....నీవు ఏ త్యాగం చేయనవసరం లేదు.....ఆమె ఎంతో త్యాగం చేయాలి. పెంచి పెద్ద జేసిన తల్లి దండ్రులను వదలి - దిక్కులేని దానిలా మీ దగ్గరకు రావలి. ప్రధమంలో కనబడని అనేకములైన సమస్యలు తాండవం జేస్తాయి. స్త్రీకి పుట్టింటిపై మమకారం జాస్తి. ఈ పెళ్ళి వలన వాళ్ళవాళ్ళు ఎంతగానో బాధ పడ్తారు....నువ్వు ఆలోచించుకో-ఆమెకు అన్ని బోధపర్చు..."
కుమార్ తల పంకించాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి "ఈ రెండు సంవత్సరాలు ఆమె వాళ్ళయింటి కెళ్ళలేదు. ఉత్తరాలు రాసినా వాళ్ళు జవాబియ్యలేదు....సరే....ఒక చిన్న రహస్యం చెబుతాను....వినిన తర్వాత మర్చిపోవటానికి ప్రయత్నించండి మంజులను ఈ రెండు సంవత్సరాలు కూడా నేనే చదివించాను...ఆమెను ఏ సందర్భంలో కూడా త్యజించలేను... ఐనా ప్రయత్నిస్తాను. స్వార్ధ పరుడనై నా సుఖాన్ని సంతోషాన్ని గూర్చి ఆలోచిస్తున్నానేగానీ ఆమె చేయబోయే త్యాగాన్ని గూర్చి ఆలోచించలేక పోతున్నాను".
