"నువ్వెళ్ళి నేను చెప్పానని చెప్పి, ఆ దత్తుడి దగ్గర సైకిలు పుచ్చుకొని ఇప్పించు" అన్నాడు శేషయ్య బరువుగా.
ఒక్క క్షణం లో , రంగయ్య సైకిలు నగరం వేపు దూసుకు పోయింది....
మళ్లా మిద్దె గదిలో కి వచ్చి వాసు నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు శంకరం -- ఖణ ఖణ కాలుతున్న నిప్పుల మీద పెట్టినట్లనిపించింది. తన మందుల పెట్టె లోంచి 'ఉడుకులాం' తీసి శేషయ్య గారూ ఓ తడి గుడ్డ తెప్పించండి. దాని మీద ఈ ఉడుకులాం జల్లి కుర్రాడి నుదుటి మీద వెయ్యాలి. కొంచెం ఉపస్శాంతి గా ఉంటుంది మందులు వచ్చేదాకా...." అన్నాడు శంకరం.
"ఏమిటి?....ఇంత జ్వరం లో తడిగుడ్డా?"
"అసలు ఐస్ ఉంటె ఐస్ తో కాచాలి....ఈ టెంపరేచర్ ని ఇలా "రన్" కానియ్యకూడదు....
"కాని ఇంత తీవ్ర జ్వరంలో...." ఆపైన శేషయ్య వాక్యాన్ని పూర్తి చెయ్యకుండానే.
"వాదించి నన్ను విసిగించకండి. చెప్పినట్లు చెయ్యండి. అంతే" అన్నాడు శంకరం కర్కశంగా.
శంకరం మాటల్లోని పారుష్యానికి ఒక్క క్షణం విస్తుపోయి , వెంటనే సర్దుకుంటూ "అలాగే డాక్టరు గారూ!" అన్నాడు శేషయ్య.
మళ్లా వాడి, టెంపరేచర్ . ఓ మాటు పరీక్ష చేసి "మందులు వచ్చేదాకా అర ఆరగా నుదుటి మీద ఈ గుడ్డే వేస్తూ ఉండండి" అంటూ లేచాడు శంకరం. వెంకడు వాసు తలాటి దిక్కున నేలమీద కూచుని ఉడుకులాం గుడ్డతో వాసు నుదురు అంతా కాస్తున్నాడు. ఏ చైతన్యమూ లేక కొట్టిన పాములా మంచం మీద పడి వున్న కొడుకుని చూస్తుంటే, శేషయ్య కి గుండె ల్లోంచి దుఃఖం పెల్లుబికి రాసాగింది.
శంకరం రెండు చేతులూ పట్టుకుని "ఎలా ఉంది? మరేం ప్రమాదం లేదు కదా?....అన్నాడు శేషయ్య.
అతని ఆవేదనని చూసి శంకరం ఆర్ద్రం అయిన హృయంతో "పరవాలేదు" అంతా నేను చూసుకుంటానుగా? మీరేం ఆందోళన పడకండి. అసలు మీరు ఎందుకు ఇక్కడ? ఇవతలకి రండి . నుదురు కాస్తూ అతనిక్కడ ఉంటాడు" అంటూ అతి బలవంతం మీద శేషయ్య ని ఆ గదిలోంచి హాల్లోకి, అక్కడ నుంచి అరుగు మీదకి తీసుకు వచ్చాడు శంకరం.
అరుగుల పైనున్న తాటాకు చాపల మీద కూర్చున్న ఊరి జనం అంతా బైటకి వచ్చిన పెద్ద కాపునీ డాక్టరు నీ చూసి ఆదుర్దాగా లేచి నిలబడుతూ "ఎలా ఉంది?' అంటూ ఒక్క కంఠం తో అడిగారు. సమాధానం ఏం చెప్పకుండా బేలగా నిలబడి ఉండిపోయాడు శేషయ్య. అందువల్ల శంకర మె సమాధానం చెప్పాడు "ఫరావాలేదు , అలాగే ఉన్నాడు...."
మర్యాద కోసం నలుగురినీ ముక్తసరిగా పరిచయం చేశాడు శేషయ్య. ఆ కబురూ ఈ కబురూ చెప్పడం లో, చుట్టూ ప్రక్కల పది పదిహేను గ్రామాల్లో చెప్పుకోదగ్గ డాక్టరు ఎవ్వరూ లేరనీ, ఏ జబ్బు వచ్చినా ఇన్ని గ్రామాల ప్రజలూ ఏ నాటు వైద్యుడి దగ్గరో గచ్చాకు పుచ్చాకు వైద్యం చేయించు కుంటారనీ అందులో కాస్త ఆయుర్దాయం గట్టిగా ఉన్నవాళ్ళు బతుకుతున్నారనీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందనీ చెప్పారు నలుగురూ.
"అసలు ఇంగ్లీషు వైద్యులంటూ మీరొకరున్నారనీ, పరీక్షలన్నీ మొన్ననే పేసయి వచ్చి పక్క పల్లెలో ఉంటున్నారనీ మాకు నిన్నటి దాకా తెలిస్తేనా?...." అన్నాడొక రైతు రోంటే నున్న పొగాకు తీసి చుట్టచుడుతూ.
"నిన్ననేనా ఈ ఊరు సంతలో మీ ఊరు శెట్టి కనిపిస్తే ఏదో కబుర్ల సందర్భంలో చెప్పా, ఇలా మా పెద్ద కాపు కొడుక్కి నాలుగైదు రోజుల నుంచి జ్వారం కాస్తోందనీ వీరాచారి మాత్రలెం పని చెయ్య;లేదనీ , అందువల్ల ఏ నగరమో రాజమండ్రి యో తీసుకు వెళ్లాలని పెద్దకాపు ఆదుర్దా పడుతున్నాడనీను . అప్పుడు సెట్టి మీ సంగతి చెప్పాడు" అన్నాడు మునసబు.
"మా మునసబు మాట పుచ్చుకొనే తెల్లార కుండా బండి ఇచ్చి, మా వెంకడి నీ రంగయ్యనీ మీ కోసం పంపా" అన్నాడు శేషయ్య.
"ఏమిటి మీరు సూరయ్య గారి మనవలా? పక్క ఊళ్ళో ఉన్నా మిమ్మల్నేప్పుడూ చూడడం గాని మీ గురించి వినడం గాని తటస్థించనే లేదు" అన్నాడు కరణం.
"ఎదండీ? చిన్నప్పటి నుంచీ చదువుల కని అక్కడా ఇక్కడా ఉంటూ వచ్చాను. మా ఊళ్ళో నే చాలా మందికి తెలియదు నేనెవరో! ఈ మధ్య రెండు నెలల నుంచే నేను కదలకుండా మా ఊళ్ళో ఉన్నది -- అందాక వచ్చి పోతూ ఉండడమే!"
"అదీ, అలా చెప్పండి"
"అదైనా మొన్ననే ఎల్. ఎమ్. పి.పేస్ అయ్యాను కనుకా, ఇంకా ఎక్కడా ప్రాక్టీసు పెట్టలేదు కనుకా. ఊళ్ళో ఉన్నాను."
"ఏవిటి మీరింకా ప్రాక్టీసు పెట్టలేదూ!.... పోనీ మా ఊళ్ళో పెట్టండి " అన్నాడు కరణం ఎడం చేత్తో కుడి ముక్కు రంద్రాన్ని మూసి, కుడి వేళ్ళతో ఎడం రంధ్రం లోకి నస్యాన్ని ఎక్కిస్తూ.
"మీ ఊళ్ళోనా?...." అని చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శంకరం.
"అవును , ఏం?....మీకు కావలసిన అన్ని సదుపాయాలూ చేస్తాం. ఊరా మంచి కట్టయిన ఊరు. మా పెదకాపు ఎంత చెబితే అంత నలుగురికీ. చుట్టూ పది పదిహేను ఊళ్ళకి మీరే డాక్టర్ ఏమో డబ్బా పుష్కలంగా వస్తుంది. సరియైన వైద్యమూ తగినటు వంటి మందులూ లేక దిక్కు లేని చావు చస్తూ ఉన్న ఈ చుట్టూ పక్కల ప్రజల కందరికీ ప్రాణ బిక్ష పెట్టిన పుణ్యమూ దక్కుతుంది....ఏం పెద్ద కాపూ?" అన్నాడు మునసబు.
"నిజమే మరి?...." అన్నాడు శేషయ్య. కొడుకు ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ పరధ్యానంగా.
"మీరు చెప్పిందంతా మంచిదే. కానీ నేను రాజమండ్రి లో ప్రాక్టీసు పెడదాం అనుకుంటున్నా......." అన్నాడు శంకరం.
"ఏం?....అక్కడ వచ్చినంత డబ్బు ఇక్కడ రాదనా?"
"డబ్బు ప్రసక్తి లేనే లేడండి. నాకొ తమ్ముడున్నాడు వాణ్ణి అక్కడ ఎఫ్. ఏ. లో చేర్పించాలి"
"దానికేం !....మీరిక్కడ ఉంటె మాత్రం జేర్పించకూడదేమిటి?..... అక్కడే పూటకూళ్ళ ఇంట్లోనే భోజనం చేసి చదువు కుంటాడు. శలవల కి ఓ బేడ ఇచ్చి రహదారి పడవ ఎక్కి ఇక్కడికి చక్కా వస్తాడు అన్నాడు కరణం పై మీద కండువాతో ముక్కు తుడుచుకుంటూ.
"అయినా ఆయన్ని పట్నం లో చదివించడానికి మీరు కూడా పట్నం లో ఉండాలని ఏం ఉంది?" అన్నాడో రైతు.
"పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో, సంప్రదాయ జీవితం , క్రమశిక్షణా కూడా అంతే ముఖ్యం. పెద్దవాళ్ళు దగ్గర లేకుండా ఒక్కళ్ళూ చదువు కొనే పిల్లలకి అవి అలవడడం కష్టం" అన్నాడు శంకరం.
"అందుకే అయితే బాధ్యత గల ఏ వ్యక్తీ కో కుర్రాడిని అప్పగిస్తే పోలేదు?....మనమే ఉండాలని ఏముంది ?" అన్నాడు మునసబు.
"అలాంటి వాళ్ళు దొరకొద్దు?"
"ఎందుకు దొరకరు?....మాటవరస కి రాజమండ్రి లో రామనాధం గారని పెద్ద లాయరు ఒకాయన ఉన్నారు. ఎంతో తెలివైన వారు. మరెంతో మంచి వారూను. అయన నాకు బాగా తెలిసిన స్నేహితులు, మీ తమ్ముడిని ఆయనికి అప్పగిద్దాం అన్నాడు శేషయ్య.
"అంతే పెద్ద కాపూ!..... అలాంటిదేదో చూసి డాక్టరు గారిని మన ఊళ్ళో ఉంచేసెయ్యి....పనుంది ...సాయంత్రం మళ్లా ఓమారు వస్తాలే!" అంటూ ఒక్కక్కల్లే ఎవళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళ సాగారు.
మునసబు మాత్రం ఉండిపోయి "డాక్టరు గారూ!...మీ శాయశక్తు లా ప్రయత్నించి మా పెదకాపు కొడుకుని బతికించాలి. వాడి మీద ప్రాణాలు పెట్టుకుని, ఇంత చిన్న వయసులో భార్య పోయిన కష్టాన్ని కూడా నిప్పులా కడుపులో దాచుకుని పైకి దైర్యంగా ఉంటున్నాడు.....మీరు చూడలేదు కాని మా పెదకాపు భార్య దేవత అనుకోండి....అటువంటి ఆడది మరి పుట్టబోదు. ఆవిడ పోవడం నిజంగా మా శేషయ్య దురదృష్టం. ఏమీ ఓర్పు,....ఏమి నేర్పు .....ఏమిచాకచక్యం....ఏమి మంచితనం....అని చెబుతూ ఉంటె.
ఆ మాటలు విని , తిరిగి ఒక్కొటోక్కటిగా జ్ఞాపకం వస్తూన్న గత స్మృతుల్నీ వాటి తాలుకూ బరువునీ భారించలేక తట్టున లేచి లోపలికి వెళ్ళిపోయాడు శేషయ్య.
అతని కేసి చూసి జాలిగా నిట్టూర్చి "ఇంతకీ ఆవిడ కేమిటి జబ్బు?,,,,,, ఎందుకు పోయింది?.....అన్నాడు శంకరం.
"అయ్యా!....జబ్బు ఏమిటని చెప్పమంటారు ?...సరి అయిన వైద్యం, సమర్ధుడైన డాక్టర్ లేకపోవడమే జబ్బు........."
ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే మందులు పట్టుకొని, గణగణ మని గంట వాయించుకుంటూ వచ్చి రంగయ్య ఒగుర్చుకుంటూ సైకిలు దిగాడు.......
"అయ్యో!.....పాపం పెదకాపు గారి అబ్బాయి కి సూది మందు ఎక్కించే దాకా వచ్చిందట పరిస్థితి అంటూ చుట్టూ ప్రక్కల వాళ్ళు కళవేళ పడ్డారు.
శంకరం ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా గబగబా మందు సిరంజి లోకి ఎక్కింది. వాసు కి ఇంజక్షన్ ఇచ్చాడు. దాని ఫలితం ఎలా ఉంటుందో పరీక్షిస్తూ పక్కనే కూచుని ఉన్నాడు. ఓమారు కొడుకు కేసి ఓ మారు డాక్టరు కేసి చూస్తూ , భయంకరమైన ఆలోచనలు భయాలు మెదడు ని మండించేస్తుంటే ఆశ నిరాశల మధ్య ఊగుతూ నిస్సహాయంగా నిస్తబుడై అలా చూస్తూ నిలబడి ఉండిపోయాడు శేషయ్య. ఇంజక్షన్ ఇచ్చి గంట కావస్తోంది నాడి చేతులు, కాళ్ళూ గుండెలు పరీక్షిస్తూ తన శాయశక్తు లా కుర్రాడిని బ్రతికించడానికి శంకరం ప్రయత్నిస్తున్నాడు. "జీవితంలో తను మొదట చేపట్టిన పెద్ద కేసు ఇది. దీన్ని నేగ్గించడం మీదే తన భవిషత్తు ఆధారపడి ఉంది" అనే భావం , పట్టుదలా శంకరం ముఖంలో కన్పించసాగాయి.
ఇంకక్షన్ ఇచ్చి గంట అయినా వాసులో మార్పు గాని చైతన్యం గాని ఆవగింజ అయినా కనిపించక పోవటంతో , రెండో ఇంజక్షన్ తీసి ఇంకో జబ్బ కి ఇచ్చాడు. గది నిండా భయం ఆవరించి ఉంది. వెంకడి కళ్ళల్లో, శేషయ్య గుండెల్లో , శంకరం మెదడు లో ఒకటే భయం. ఒకటే ఆందోళన. సన్నని రేఖా మాత్రమైనా ఒకే ఆశా కిరణం.
శంకరం ఇంజక్షన్ ఇచ్చాక పాకెట్ వాచీ తీసి చూడసాగాడు. గది నిండా గంబీర నిశ్శబ్దం నిండి వుంది. వెంకడూ, శేషయ్య కళ్ళప్పగించి శంకరం కేసి చూస్తున్నారు. శంకరం రెప్ప వాల్చకుండా గడియారం లోకి చూస్తున్నాడు . గడుయారం టిక్ టిక్ శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. అలాటి నిశబ్ద వాతా వరణం లో , ఆ శబ్దం వాసు బ్రతుకు మీద తీర్పు చెప్పనున్న న్యాయాదీసుని భయంకరమైన అడుగుల చప్పుడులా ఉంది.
సెకన్లు బరువుగా కదులుతున్నాయి.
నిమిషాలు భయంగా దొర్లుతున్నాయి.
గంట భారంగా క్రమంగా గడుస్తోంది.
కాలు కొద్దిగా కదిపి నీరసంగా మూలిగాడు వాసు.
శేషయ్య కళ్ళలో వెయ్యి దీపాలు వెలిగాయి.
శంకరం నుదుటి మీద చెమట తుడుచుకొని భారంగా శ్వాస వదిలాడు. వెంకడి గుండెల్లో బరువు దిగి పోలేరమ్మ తల్లికి దణ్ణం పెట్టాడు చేతులతో మౌనంగా.
ఆనందంతో పెదిమలు వణికి పోతుండగా, చెంప మీద కన్నీళ్ళు కారుతూ ఉండగా, చటాలున వచ్చి శంకరం రెండు చేతులూ పట్టుకొని ఏదో చెప్పబోయాడు శేషయ్య. బరువెక్కిన హృదయం దాటి, బొంగురు పోయిన కంఠం లోంచి తడబడుతున్న నాలిక మీంచి మాటేం రాలేదు. శేషయ్య లో కట్టలు తెంచుకుంటూ కనిపించిన ఆనందానికి శంకరం హృదయం కూడా కదిలి కళ్ళు చెమ్మగిల్లాయి.
హమ్మయ్య!
తన కృషికి ఫలితం కనబడింది.
శేషయ్య ఇల్లు నిలబడింది.
కొంత సేపయ్యాక స్థిమిత పడి డాక్టరు బాబూ మీ హస్తవాసి మంచిది. మీ చేతిలో అమృతం ఉంది. నా కొడుకుని నాకు ఇచ్చారు. మీ ఋణం ఎలా తీర్చుకో గలను. మీ తమ్ముడి చదువు సంగతి నేను చూసుకుంటాను. మీరీ ఊళ్ళో నే ఉండి పొండి. మీ తమ్ముడి పట్ల ఇందాక చూపించిన ఆ ప్రేమ చూస్తె అన్నదమ్ములు లేని నేను ఎంత అభాగ్యుడి నో అర్ధం అవుతోంది. ఏవైనా సరే మిమ్మల్ని ఈ ఊరు నుంచి వెళ్ళనియ్యాను. భగవంతుడు నాకు వరంగా పంపించిన సోదరులు మీరు, ఇంక ఇప్పటి నుంచి మీరు ఇద్దరు కారు అన్నదమ్ములు. మనం ముగ్గురం -- ఏం?" అంటూ పట్టలేని ఆనందంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్న శేషయ్య నీ అతని అమృత హృదయాన్నీ చూసి గద్గదమైన కంఠం తో బరువుగా . అలాగే అన్నాడు శంకరం. తనలో రేగిన సంతోష తరంగాల లో మునిగి పోయి మునకలు వేస్తూ.
