Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 2


                                     2
    రవిచంద్ర గది తలుపులు మళ్ళీ చాలాసేపటికి తెరుచుకున్నాయి. చేతి లో బాగుతో చుట్టూ పరకాయించి చూశాడు. ఆ ఇల్లు ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్ర పోతున్నట్లుగా ఉంది. వరండాలో లైటు లేదు.
    త్వరత్వరగా రైలు స్టేషను వైపు నడిచాడు.
    ఏదో ట్రెయిన్ కదలటానికి సిద్దంగా ఉండగా వీలుగా ఉన్న కంపార్టు మెంటు లోకి ఎక్కాడు. ట్రెయిన్ గాభరా చెందినట్లుగా పెద్దగా కేకవేసి కదిలింది.
    కూర్చోబోతూ చుట్టూ చూశాడు . ఇద్దరే ఉన్నారు. సీట్ల వైపు చూశాడు. అది ఫస్టు క్లాసు కంపార్టు మెంటు.
    ట్రెయిను పరుగు లంకించు కుంది. రవిచంద్ర కూర్చుని కిటికీ లోంచి బయటకు చూశాడు. చిక్కటి చీకటి. నిశీధి కి లయ వేస్తున్నట్లుగా రైలు బండి మోత. అతనిలో ఆలోచనల బారు. స్తిమితంగా ఆలోచించలేని మస్తిష్కం. గుండెల్లో ఏమిటో వగరుగా కసి, ప్రపంచంలో అందరి మీద అసహ్యం.
    'నా కన్యాయం జరిగింది. ఘోరమైన అన్యాయం జరిగిపోయింది!' అనుకున్నాడు. గుండెల మీద ఏదో బరువు పెట్టినట్లుగా ఉంది. ఎవరినో తను ఏదో చేయాలి. తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలి.
    ఎలా? ఎలా?
    తనకు నిన్నటి వరకు జీవితం పూల తోటలా, మల్లెల మాలలా అనిపించింది.
    ఇవ్వాళ?
    ఉవ్వెత్తున కోపం అతనిలోకి దూసుకు వచ్చింది. హృదయాన్ని తూట్లు చేసే జ్వాల అతనిలో రగిలింది. మంచితనం మీద నమ్మకం మాసిపోయినది.
    తన భార్య .......తనకు భార్య! తనకు మూగ భార్య! పళ్ళు కొరుక్కున్నాడు.
    అనంతాన్ని మనసులో కుప్పలు కుప్పలుగా నరికి నల్తుగా ఊహించు కున్నాడు. తండ్రి జ్ఞాపకం వచ్చి, జీవితంలో మొదటి సారిగా చీదరించు కున్నాడు.
    భావో ద్వేగంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
    ఎక్కడికి పోతున్నాడు తను?
    ఆలోచన 'తెలియదన్నట్లు' తల ఊపింది.
    'ఎవరి మీద తనకు కోపం?'
    ఆలోచన కక్ష కట్టినట్లు అందరిని వరసగా మస్తిష్క పు తెరమీద చూపించింది.
    తన గమ్యం ఎక్కడికి? తను ఎక్కడికి వెళ్ళాలి? పిచ్చేక్కేటట్లుగా ఆలోచించాడు. ఇదమిత్థంగా ఒక చోటికని నిర్ణయించుకోలేక పోయాడు. ట్రెయిను వేగం హెచ్చింది. ఏదో ముంచుకుని పోయినట్లు పరుగులు తీస్తున్నది. రవిచంద్ర కు ట్రెయిను మీద కూడా కోపంవచ్చింది. ఇది కాస్సేపు ఆగితే బాగు. స్తిమితంగా ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించు కోడానికి వీలుండేది.
    ఆప్రయత్నంగా జ్ఞాపకం వచ్చింది, టిక్కెట్టు తీసుకొని సంగతి. వెనువెంటనే తను ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని సంగతీ జ్ఞాపకం వచ్చింది.
    అలాగే తాను చూడకుండా ఫస్టు క్లాసు కంపార్టు మెంటు లో ఎక్కిన సంగతీ జ్ఞాపకం వచ్చింది.
    కళ్ళు మండుతున్నాయి. ఆలోచనలు నిండు కున్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతను, ఆమె తననే చూస్తున్నారు. చూపులు పక్కకు మరల్చు కున్నాడు. రైలు కిటికీ లోంచి రాత్రి పరిగెత్తు తున్నది. మళ్ళీ ఎందుకో అప్రయత్నంగా ఎదటి సీటు వైపు చూశాడు.
    అతను తదేకంగా ఇటే చూస్తున్నాడు. రవిచంద్ర కొంచెం సంకోచంతో నెమ్మదిగా లేచి కిటికీ లోంచి తల బయటకు పెట్టాడు. చల్లటి గాలి రివ్వున తగిలింది. చల్లటి గాలి తను క్రితం రాత్రి ఊహించుకున్న వెచ్చటి రాత్రిని జ్ఞప్తికి తెచ్చింది. ఆరాత్రి ఈ విధంగా మారినందుకు పేలవంగా నవ్వుకున్నాడు గుండెల్లో సూదులతో పొడిచినట్లు అయింది, మరి. పోయిన సంఘటన జ్ఞాపకంతో. ఒరుకుతున్న నల్లటి చెట్ల ఆకారాలని , ఇంకేదో కనపడని ప్రదేశాలను, నల్లటి రాత్రిని చూసి విసుగెత్తి పోయాడు. చలిగాలి ఎక్కువైనట్లయి కిటికీ రెక్క గభాల్న వేశాడు.
    వాచీ చూసుకున్నాడు. ఒంటిగంట అయింది. నిద్ర రావడం లేదు. ఆలోచనలు వస్తున్నాయి. మరిచిపోదామను కున్నా బాధతో కూడుకున్న ఆ సన్నివేశపు జ్ఞాపకాలు , తన బంగారు స్వప్నాలను విధ్వంస మొనర్చిన ధ్వనులు! గుండెల మీద సలుపు పుడుతున్న అనుభవం తాలుకూ గాయం.
    అతను ఈసారి తనను చూడటం లేదనుకుని అటు చూశాడు. కాని చూస్తూనే ఉన్నాడు. అయన ఈసారి రవిచంద్రను చూసి చిరునవ్వు నవ్వాడు.
    రవిచంద్ర బలవంతాన తెచ్చి పెట్టుకున్న చిరునవ్వు మాదిరి భావాన్ని ప్రదర్శించాడు.
    "నిద్ర పట్టడం లేదా?' పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని విరగ గొడుతూ అన్నాడు. గొంతు మృదుత్వంతో కూడుకున్న గట్టి తనపు ధ్వనిని మోగించింది.
    "లేదు"
    "ట్రెయిను లో రాత్రి జర్నీ తమాషాగా ఉంటుంది. నిద్ర పట్టడు; చదవ బుద్ది పుట్టదు. ఏమి చేయబుద్ది అవదు. గమ్మత్తైఅ అనుభవం ." ఆయన అదే చిరునవ్వుతో, ఎదటి వాణ్ణి ఇట్టే ఆకట్టుకొనే ఆ చిరునవ్వు తోనే నెమ్మదిగా తూచినట్లు మాట్లాడాడు.
    రవిచంద్ర జవాబివ్వలేదు. ఇవ్వడానికి ఏమి తోచలేదు. అతని వైపు మాత్రం చూశాడు. పక్కనే ఆమె నిద్రతో  జోగుతున్నది. అందమైన స్త్రీ నిద్రిస్తున్నప్పుడు , అందులో ఉయ్యాలూపుతున్నట్లుగా ట్రెయిను పరుగులు తీస్తున్నప్పుడు నిద్రిస్తుంటే చాలా తక్కువ సార్లు చూశాడు రవిచంద్ర . అంత మనః క్లేశం లోను ఆమె నిద్రించే విధానం ఆతన్ని ఆకర్షించింది. సౌందర్యం నిద్ర పట్టీ పట్టక కాసేపు కళ్ళు మూసుకొని పొక్కు తీర్చుకున్నట్లుగా ఉంది.
    "మీ పేరు తెలుసుకోవచ్చా?' ఎదటాయన రవిచంద్ర ను అడిగాడు.
    "రవిచంద్ర .' జవాబిచ్చాడు.
    "రవిచంద్ర" అని ఒక క్షణం దాన్ని ఉచ్చరించి "పేరును బట్టి మనుషుల సంగతులు తెలుసుకోవచ్చు అంటారు. మీ పేరు చాలా విరుద్దంగా ఉంది" అన్నాడు. అతనిలో మాట్లాడడం ప్రారంభించిన తరవాత ఇట్టే అల్లుకుపోయే చొరవ. అందుకనే "రవి అంటే సూర్యిడిలా నిప్పులు విరజిమ్మనూ గలరు. చంద్ర అంటే చంద్రుడి లా చల్లని వెలుగులు వేదం జల్లనూ గలరు అని నా ఉవాచ. ఎలా ఉంది మీ పేరు మీద రిసీర్చి?' అంటూ సంభాషణ పొడిగించటానికి ప్రయత్నించాడు.
    రవిచంద్ర తన పేరు మీద అయన చేసిన రిసెర్చి కి కొంచెం ఇబ్బంది లో పడి, నెమ్మదిగా నవ్వి ఊరుకున్నాడు.
    "ఎదటి వారి పేరు తెలుసుకున్న తరవాత పరిచయం చేసుకునే వారి పేరు చెప్పడం మర్యాద లక్షణం. నా పేరు రాజగోపాలం" అంటూ చేయి చాచి రవిచంద్ర చేయి నందుకొని స్నేహపూర్వకంగా నొక్కాడు.
    ట్రెయిను మలుపు తిరుగుతూ కుదిపింది. నిద్ర పోతున్న ఆమె ఉలిక్కి పడి లేచింది. రాజగోపాలం నవ్వి, "ఫర్వాలేదు, పడుకో. కింద పడకుండా నేనున్నానులే"  అన్నాడు. ఆమె అతని వైపు నిద్ర మత్తు తో చూసి మందహాసం చేసింది.
    "మరిచిపోయాను. ఈమె నా భార్య . ప్రియం వద" అన్నాడు రవిచంద్ర వైపు తిరిగి.
    ఆవలించబోయేదల్లా ఆమె నిద్రమత్తును ఆపుకొని రవిచంద్ర ను చూసి "నమస్కారం" అంది. ప్రతి నమస్కారం చేశాడు రవిచంద్ర కొంచెం ఇబ్బందిగా.
    "వీరు రవి చంద్ర....ప్రస్తుతం అంతవరకే తెలిసింది.' భార్యతో అన్నాడు. మళ్ళీ ఆమె నిద్రపోవడానికి ఉద్యుక్తురాలయింది.
    "ట్రెయిను లో నిద్ర పోయేవారిని చూస్తె నాకు అసూయ, నాకు నిద్ర పట్టడు కాబట్టి.' రాజగోపాలం భార్యను చిలిపిగా చూస్తూ అన్నాడు.
    "ట్రెయిను లో నిద్రపోని వారిని చూస్తె నాకు చిరాకు, నాలాంటి నిద్రపోయే వాళ్ళను డిస్ట్రబ్ చేస్తారు గాబట్టి" ఆమె అంత కొంటేగానూ చూస్తూ అతనికి తిరుగు జవాబిచ్చింది.
    రవిచంద్ర కు నవ్వు వచ్చింది. ఫక్కున నవ్వాడు.  రాజగోపాలం కూడా శ్రుతి కలుపుతూ, "మాటలు వచ్చిన భార్యతో వేగడం మహా కష్టం నా ఫిలాసఫీ ప్రకారం. అదృష్టవంతుడైన మగవాడు మూగదాన్ని పెళ్లి చేసుకుంటాడు" అన్నాడు.
    మర్మాఘాటం లా తగిలింది రవిచంద్ర కు. ముఖంలో రంగులు మారాయి. ఆ మాట జ్ఞాపకాల పుట్టను రేపింది. కాంతి విహీనంగా రాజగోపాలాన్ని చూశాడు.
    రాజగోపాలం మాటలకు ప్రియంవద నిద్ర ఎగిరిపోయినట్లయింది. కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా, "అది మీ ఫిలాసఫీ. మా ఆడవాళ్ళ ఫిలాసఫీ ప్రకారం భర్త చెవిటి వాడైతే ఆడది అదృష్ట వంతురాలు" అంది.
    రాజగోపాలం పెద్దగా నవ్వుతూ "అవును, వాడికి వినపడదుగా! ఇష్టం వచ్చినట్లు తిట్టి వాడి మీద కసి అంతా తీర్చుకోవచ్చు గదూ! స్త్రీ జాతి బుద్ది పోనిచ్చావు గాదు!" అని ఆమె వైపు వెక్కిరింతగా చూశాడు.
    ఆమె భర్తను ప్రేమగా, చిలిపిగా చూసింది.
    రవిచంద్ర కెందుకో ఈర్ష్య కలిగింది. ఆయువ దంపతుల మాటలు అగ్ని మీద ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నవని పించిందతనికి. వాళ్ళిద్దరి కలుపుగోలు తనము అతని కేందుకనో జారిపోయిన స్వప్నాన్ని జ్ఞప్తికి తెచ్చింది. అతనేన్నోసార్లు తమ దాంపత్యం గురించి కలలు గన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న సంఘటన లాంటివే ఎన్నో కలలు కన్నాడు. అతను అనుకున్నాడు: 'నా ఊహలన్నీ అందమైన గాజు మేడల్లాంటివి. ఒక్క తాకిడితే పగిలిపోయాయి!'
    "ఏదో ఆలోచిస్తున్నారు?' రాజగోపాలం అడిగాడు.
    "ఏమి లేదు."
    "ఆలోచించేవారిని ఏమిటో ఆలోచిస్తున్నారని అడగడమూ, ఏమీ లేదని వాళ్ళు జవాబివ్వడము పరిపాటి. అయినా మనం అడగకుండా ఉండలేం. వాళ్ళు అలా జవాబివ్వకుండా ఉండలేరు. సంభాషణ చాలా విచిత్ర మైనది." రాజగోపాలం అన్న మాటలను రవిచంద్ర వింటున్నట్లు నటించాడు.
    రవిచంద్ర ఆ కంపార్టు మెంటులోకి రావడం, నిజం మాట్లాడితే వారిద్దరికీ ఒక విధంగా ఇబ్బందే కలిగించిందని చెప్పాలి. కంపార్టు మెంటు లో ఇద్దరే ఉన్నంత కాలము సరస సంభాషణలతోటి ,చలోక్తు లతోటి, రహస్యాల్లాంటి కబుర్లతోటి , కేరింతల తోటి గడిచి పోయింది. రవిచంద్ర రావడంతోటే అతని ముందు అంత స్వేచ్చగా మాట్లాడుకోనూ లేరు. అతను ఏదైనా కులాసాగా మాట్లాడనూ మాట్లాడడు. రాజగోపాలానికి నిద్ర ససేమిరా పట్టనంటున్నది. ఏడో విధంగా పొద్దు పుచ్చాలి. రవిచంద్ర ఎందుకనో అతనిలో ఆలోచనను, ఉత్సుకతను కలిగించాడు. రవిచంద్ర సరిగా మాటాడని ధోరణి , అతని వదనం లోని విషాదము అతనేదో పెద్ద దెబ్బ తిన్నట్టు చెప్పాయి. అదీగాకుండా కొంతమందిని చూడగానే మాట్లాడ బుద్ది పుడుతుంది. స్నేహం పెంచు కోవాలని పిస్తుంది. రవిచంద్ర విషయంలో రాజగోపాలానికి సరిగ్గా అదే అనిపించింది. మనస్సులో లేతగా ఉన్నాడు. ఏమిటో బాధ అప్పుడే?' అని అనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS