'అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నువ్వే నన్ను కనిపెట్టి ఉన్నావు నాయనా!' అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది వృద్దురాలు.
* * * *
"ఏం చేద్దామంటావ్ అయితే?' అన్నాడు మాధవరావు గడ్డం కింద చేయి ఆనించుకుని, భార్య ముఖంలోకి పరిశీలనగా చూస్తూ -- డాబా మీద గాలి చల్లగా వుంది.
కొబ్బరి ఆకుల మీద నుంచి బారలు బారలుగా వెన్నెల డాబా మీద పడుతోంది. పిట్ట గోడ కి అనుకుని నిలబడింది ఇందుమతి.
'నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోగలరా?' అనే ప్రశ్న వుంది ఆమె కళ్ళల్లో. రెండు క్షణాలు మౌనంగా వుండిపోయింది.
'చెప్పు ఇందూ? నువ్వు నాకన్నబాగా ఆలోచన చేయగలవు -- మన చెలిమి ఇరవై ఏళ్లది -- నిన్ను అర్ధం చేసుకోలేక పోవడమేమిటి!' అన్నాడు మాధవరావు మళ్ళీ --
'ఇరవై ఏళ్ళుగా ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగంతో ఈ పట్టణం లో సంసారం లాక్కు వస్తున్నామంటే , వుండడానికి ఈ చారెడు ఇల్లైనా వుండబట్టి సరిపోయింది లేకపోతె ఆ జీతంలో నించే అరవై, డెబ్బై రూపాయలు అద్దె కట్టాల్సి వచ్చేది. ఇది కాస్తా అమ్ముకుంటే ఎలాగండీ!' అన్నది ఇందుమతి నిదానంగా మెత్తగా.
'మరి మనం అంత కట్నం ఎక్కడి నుంచి తేగలం ఇందూ?' అన్నాడు మాధవరావు వెంటనే--
'అతను అమ్మమన్నది అతని భాగమే అయినా. ఇల్లు సగ భాగం ఎవరు కొంటారండీ! అమ్మితే సాంతం అమ్మాల్సిందే! అప్పుడు మన చేతికి నిండా పది వేలైనా రావు -- అవ్వి ఎంతకాలం వుంటాయి మనదగ్గర! అందుకని ఇల్లు అమ్మడం చాలా నష్టం-'
'నువ్వు చెప్పేది నిజమే ! కానీ మరి అమ్మకేలా నచ్చ జెప్పడం? సుమిత్ర పెళ్లి ఆగిపోతే అమ్మ భరించలేదు ఇందూ!' అన్నాడు మాధవరావు బేలగా--
'ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది చాలా క్లిష్ట మైనది గానూ, భరించశక్యం కానిది గానూ అనిపిస్తుంది. కానీ కాల క్రమేణా అది మామూలై పోతుంది. ఏ సమస్యకైనా పరిష్కారం కాలమే చూపిస్తుంది. ఆవిడ దుఃఖం, ఆవేదన కూడా కొద్ది కాలం పోయాక ఇంత ఉదృతంగా వుండవు -- ఆవిడే సర్దుకు పోతాడు -- రఘు చెప్పినట్లు సుమిత్ర ని కాలేజీ లో చేర్పించండి.-- ఆ అమ్మాయికి చదువూ వస్తుంది. మరి కొన్నాళ్ళు పెళ్లి ప్రసక్తి ఆగిపోతుంది.' అన్నది ఇందుమతి స్థిరమైన కంఠస్వరంతో.
"ఇది నా స్వార్ధమని సుమిత్ర అనుకోదా?'
"బావుందండీ! ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోకపోతే బ్రతకడం ఎంత కష్టం! రఘు మాత్రం అతని స్వార్ధం అతను చూసుకోలేదా? మనదీ పెద్ద సంసారం -- నాలుగేళ్ల లో మన విశ్వం పెద్ద చదువు లోకి వెళ్తాడు. సావిత్రి పెళ్ళికి ఎదుగుతుంది. ఇప్పుడే ఇల్లు కాస్తా అమ్ముకుంటే అప్పుడెలా తట్టుకుంటాం?' అన్నది ఇందుమతి నవ్వుతూ....ఆవిడ ముఖం చాలా నిర్మలంగా ఉంది.
మగవాళ్ళ ఆలోచనా విధానానికీ, స్త్రీల ఆలోచనా పద్దతికీ చాలా తేడా వుందనుకున్నాడు మాధవరావు -- భార్య చెప్పినదాంట్లో అంతా నిజమే గానీ అబద్దం ఏమీ లేదు. విశ్వాన్ని ఇంజినీరింగ్ చదివించాలనే కోరిక ఇప్పటిది కాదు. దానికి తగ్గట్టు వాడి కెప్పుడూ లెక్కల్లో ఫస్టు మార్కులే. సావిత్రి కీ పన్నెండే ళ్ళు వచ్చాయి. ఇంకా నాలుగయిదేళ్ళ లో డానికీ పెళ్లి చెయ్యడమో, చదివించడమో చెయ్య వలసిందే .
"నువ్వు చెప్పిందే బావుంది ఇందూ!' అన్నాడు మాధవరావు చివరికి.
మెట్ల మీద అడుగుల సవ్వడి విని వులిక్కి పడి చూసింది ఇందుమతి.
ఆ సమయంలో అక్కడికి వచ్చే ధైర్యం చొరవా సుమిత్ర ఒక్కదానికే వున్నాయి.
"ఏమలోచించారు వదినా?' అని అడగనే అడిగేసింది ఆ అమ్మాయి చివరి మెట్టు మీద నిలబడి.
"నీ ఉద్దేశం అడక్కుండానే నిర్ణయిస్తామా?' అన్నది ఇందుమతి గడుసుగా నవ్వుతూ --
--" నాకు చదువుకోవాలనే ఉంది.'
"మరి అమ్మ కేలా చెప్పడం?' అన్నాడు మాధవరావు వెంటనే.
"రఘు అన్నయ్య పెళ్లి వార్త తెలిసి ఈ సంబంధం తప్పిపోయిందని చెబుదాం. ఇలాగే సంబంధాలు తప్పిపోతున్నాయని చేబుతానులే అన్నయ్యా! ఎలాగో అమ్మకి నచ్చ జేబుదాం. అలా చెప్పడం వల్ల వాడి మీద ప్రస్తుతంలో కోపం ఎక్కువ కావచ్చు. కానీ కాలక్రమేణా ఎలాగో సర్ది చెప్పుకుందాం లే అన్నయ్యా! నన్ను రెంటికీ చెడ్డ రేవడిని చేయకండి -' సుమిత్ర కంఠం లో అర్దింపు మాధవరావు గుర్తించాడు.
'ఎలాగో చెయ్యవచ్చును లే . పదండి పోదాం ? ఆవిడ ఒక్కరే ఏం చేస్తున్నారో!' అని క్రిందికి దారి తీసింది ఇందుమతి.
'డబ్బు విషయం వాడికి నువ్వే వ్రాయి సుమిత్రా-- నాకు. వ్రాయాలనిపించడం లేదు-- కాలేజీ లు ఇంకా పది రోజుల్లో తెరుస్తారు. అప్లికేషన్లు పెట్టుకోవాలి కదా!' అన్నాడు మాధవరావు.
'నేనే వ్రాస్తానులే -- ' సుమిత్ర నిట్టూర్చింది . కొందరి జీవితం, మహాకవి చెప్పినట్లు వడ్డించిన విస్తరి. మరి కొందరి జీవితం , అన్నీ వాళ్ళ కివాళ్ళే వెతుక్కుని సంపాదించుకుని వండుకుని, విస్తరి కుట్టుకుని వడ్డించు కోవాల్సిన జీవితం. అది బ్రతుకు తెరువు కోసం పెనుగులాట, జీవన సమరం.
క్రిందకి వచ్చి కాగితం తీసుకుని ఉత్తరం వ్రాయాలని కూర్చుంటే కళ్ళ నిండా నీళ్ళోచ్చాయి. చిన్నన్నయ్య అంటే చాలా యిష్టం. చిన్న వదిన ఎలా వుంటుందో! ఎంతో అందంగా వుండకపోతే నచ్చుతుందా! ఎంత సుగుణ వతో! ఎంత సౌజన్యం కల వనితో! ఆవిడని చూడడం ఎప్పటికో! ఇందు వదినే కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడే మనిషి కనుక చాలా మందికి అదో రకంగా కనిపిస్తుంది గానీ చాలా మంచిది. అమ్మ తరువాత అమ్మ అంతది. చిన్నన్నయ్య కి ఏం వ్రాయాలి/ ఎలా వ్రాయాలి? ఎంతోసేపు ఆలోచించాక ఎలాగో నాలుగు మాటలు వ్రాసింది సుమిత్ర.
'నేను కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నువ్వు అన్న ప్రకారం నాకు డబ్బు పంపవలసింది. అమ్మ ఆరోగ్యం ఏం బాగాలేదు. బి.పి బాగా వుంది. చిన్న వదినే కి నా శుభాకాంక్షలు . ఆవిడని చూడాలని వుంది.'
సుమిత్ర.'
సంబంధం చిన్నన్నయ్య మూలంగా తప్పిపోయిందని అమ్మతో అనాలి కానీ, ఆ మాట అతనికి వ్రాయడానికి అంతరాత్మ వొప్పుకోలేదు. నిజానికి సంబంధం పోయేది కట్నం డబ్బు లేకే గానీ అతని మూలంగా కాదు -- కానీ ఈ అబద్దం ఆడక తప్పదు-- బరువుగా నిట్టూర్చి ఉత్తరం మీద ఎడ్రేసు వ్రాసి మంచం మీద వాలిపోయింది సుమిత్ర. వారం తిరక్క ముందే నాలుగు వందల రూపాయలూ, ఓ ఉత్తరం వచ్చాయి సుమిత్ర కి. రఘుపతి దగ్గర్నుంచి.
"మొదట్లో పుస్తకాలు కొనుక్కోడానికీ, ఫీజు కట్టుకోడానికీ అని. ఈ డబ్బు పంపుతున్నాను . అమ్మకి మంచి డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ యిప్పించండి. ఇక నుంచి నీకోసం అమ్మ కోసం గాను నెలకి ఎనభై రూపాయలు పంపుతాను. రాదని చూడాలని వుందన్నావు. తరుణం వచ్చినప్పుడు తప్పక చూడవచ్చు. ఉత్తరాలు వ్రాస్తూ వుండు' అని వ్రాశాడతను.
"వాడి డబ్బు తీసుకోడం నాకిష్టం లేదు' వాడి డబ్బుతో నువ్వు చదువుకోనక్కర్లేదు' అంటూ మొదట్లో అభ్యంతరాలు చెప్పింది అన్నపూర్ణమ్మ గారు.
"ఆ డబ్బు అప్పడే తిప్పి పంపేశానమ్మా! నేనసలు తీసుకోలేదు -- పెద్దన్నయ్యే ఎక్కడో అప్పు చేసి తెచ్చిచ్చాడు-- వాడే నన్ను చదివిస్తున్నాడు నిజం' అని చెప్పింది సుమిత్ర గట్టిగా...
'ఎప్పుడూ వాడే కంటి వెలుగు -- వాడే నా కొడుకు. వాడి దసలె పెద్ద సంసారం. ఇక నీక్కూడా ఎక్కడ చెప్పిస్తాడే చదువు -- వాడి గుండెల మీద కుంపటై నావు గదుటే!' అని కళ్ళ నీళ్ళ తుడుచు కుందావిడ.
ఎలాగైతేనేం కాలేజీ లో సీటు సంపాదించుకుని క్రొత్త జీవితం ప్రారంభించింది సుమిత్ర చివరికి.....
"చిన్నన్నయ్యా! ఇదంతా నీ దయ -- కానీ పైకి అనడానికి వీల్లేదు -- నీ మీద అమ్మకి మరింత కోపం కలుగజేసి నీకు ద్రోహం చేస్తూ మళ్ళీ నీ సహాయం తోనే పెద్ద దాన్నౌతున్నాను . నన్ను క్షమించన్నయ్యా!' అనుకుంది సుమిత్ర.
