'నువ్వ్ట్ల ట్ల అడుగుతోంటే భారతం లోని ఒక అమ్మాయి కనిపిస్తోంది...'
'నువ్వు మాత్రం వాళ్ళన్నగారివి కావద్దు, బాబూ!'
చిన్నకోడె 'ఖాణే' ల్లని రంకె వేసింది. సరస్వతి భయపడి పక్కకు పరుగెత్తింది.
'అయితే అన్నా, చెల్లెలూ-- ఇద్దరూ నువ్వే నన్నమాట!' అని నవ్వుతూ కోడెల్నదిలించాడు.
'కుణుకుణు ' మనే మువ్వల మ్రోతతో గునుకు పరుగు తీసినాయి కోడేలు. చెరువు కట్ట వెనకాల నిలబడి చూస్తుంది. గుళ్ళోని అంకాలమ్మ ఏడుకొ లిచ్చింది. ప్రకృతి మంచు ముత్యాల నగ లోక్కక్కటీ తీసి వేస్తుంది. పచ్చని పైర్ల'మీద పరుగెత్తి ఆడుకుంటున్న గాలి సంతోషం పట్టలేక కనిపించిన వార్నల్లా కౌగలించుకుని ఊపేస్తుంది. జొన్న చేను కావల సేద్యగా డేవడో రాగ మందుకున్నాడు. బాట పక్కన తుమ్మ చెట్టు కొమ్మల్లో కనిపించని బెళుగువ్వగాడు పాట అందుకున్నాడు. అక్కడక్కడా దారి తప్పి మొలిచిన జొన్న కర్రలు నోగల్లో దించుకున్న వాసవి కాళ్ళకు చల్లని కత్తి పదునుగా తాకి జల్లు మనిపిస్తున్నాయి. వాసవి ఆలోచన మళ్ళీ తిరగటం ప్రారంభమయింది. గోదాదేవి! ఆ పేరు వింటుంటే రాఘవరెడ్డి , రాయలూ కనిపోస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా మనోనేత్రం వాళ్ళిద్దరినీ వేరువేరుగాచూడలేక పోతుంది. రాయల వారి కిరీటం రాఘవరెడ్డి తల పైన పెడితే, రాఘవరెడ్డి పంచె, వదులు జుబ్బా రాయలవార్ని ధరింప జేస్తే ....అది అభేధ్యాలంకారంగా స్పురిస్తుంది. ఇప్పుడు ఈ రాబోయే గోదాదేవిని, ఆమె ఉన్న తీరును పరికిస్తే గానీ వాళ్ళిద్దర్నీ విడదీయడం సాధ్యం కాదేమో ననిపించి నవ్వొచ్చింది వాసవి కి.
ఇన్నేళ్ళ కిక్కడికి రావడం లో గోదాదేవి తన ఆస్తి తను చూసుకోవటం అనే ఉద్దేశ్యానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చిందో , లేక తన జీవితంలో విధి రచించిన గత విషాద కావ్య నిర్మాణ స్థలాన్ని సందర్శించడమో? ఉహూ ...అప్పటికి గోదాదేవి చాలా చిన్నది. పసి వయస్సు గనక జ్ఞాపకం ఉండదేమో ననుకోవటం కొంతవరకూ ఆధారరహితమైన విశ్వాసమే! ఎందుకంటె తనకూ ఇంతవరకూ ఆ విషయాలన్నీ మారపున బడినట్లే ఉండేవి. అప్పుడప్పుడు తండ్రి జ్ఞప్తికి తెచ్చినప్పుడు ఒక్క క్షణం రాఘవరెడ్డి అస్పష్టంగా మెదిలి అంతర్ధానమయ్యేవాడు. గోదాదేవి ఎన్నో తెరల వెనకాల నక్కిన చిన్న బొమ్మలా చూపు కందకుండానే కరిగిపోయేది. ఆశ్చర్య మేమంటే , క్రితం రాత్రి పన్నెండేళ్ళ వాళ్ళ మీద కప్పిన తెరలన్నీ తొలగి పోయినట్లు, వాళ్లు తన కళ్ళకు స్పష్టంగా కనిపించడం. తన కిన్ని విషయాలు జ్ఞప్తి కున్నాయనీ , అవన్నీ తన మనసులో బ్రతికే ఉన్నాయనీ ఇంతవరకూ తెలియదు. ఒక్కో విషయం నెలరోజుల క్రిందటి సంగతి. ఈవేళ జ్ఞప్తికి ఉండదు. ఆలోచిస్తే 'స్మృతి ' అనేది ముఖ్యంగా వయో బేధాల్ని బట్టి కాక అది మనస్సు మీద ముద్రించగల బలాన్ని బట్టి దాని కాయుప్రమాణమేమో? ఇంతకూ కారణం -- రాత్రంతా తీవ్రంగా ఇంతకూ ముందెన్నడూ ఆలోచించక పోవడం వల్లనేమో; లేక గతమనే చీకటి కోణం వేపు 'గోదాదేవి రా' అనే మీట నొక్కగా వచ్చిన వెలుగు వల్లనా? రెండూ కావచ్చు.
కొంచెం కొంచెం గా చలి మబ్బులు విచ్చిపోయి ప్రొద్దు బయటికొస్తుంది. నులివెచ్చని కిరణాలు ప్రకృతి మంచు తడిని తుడిచేస్తున్నాయి. రబ్బరు చక్రాల బండి మెత్తగా ముందుకు దొర్లుతుంది.
'ఒడిదుడుకు లేని పధము వెంబడి రధమ్ము
నడుచుచున్నది సుకవి చందమ్ము మాడ్కి.'
కరుణ శ్రీ మధురావిష్కరణము ముందు కెళ్ళే బండికీ, వెనక్కేల్లె వాసవి మనస్సుకూ రెంటికి అన్వయిస్తుంది. అడుగో రాఘవరెడ్డి! దేవాలయానికి కభిముఖంగా ఉన్న ఆ ఇంటి అరుగు మీద తానె ఒక దేవాలయం లా దర్శనమిచ్చేవాడు. అప్పుడు ఆ పిల్లలకు బడి కంటూ వేరే ఇల్లు లేదు. దేవాలయమే బడి. శంకర్రావు మేష్టారు ఈత చాప పరుచుకుని పిల్లలతో పాటు క్రిందనే కూర్చునే వాడు. బడికి వెళుతూ, ప్రతిరోజూ ఆ ఇంటి దగ్గరరాగి గోదాదేవి తో కలిసి వెళ్ళేవాడు. రాఘవరెడ్డి జంటగా ఇద్దర్నీ చేటుకు కట్టుకుని నిలుచోమనేవాడు. 'ఎవ్వనిచే జనించు....' పద్యం పలికించేవాడు. ఇది ప్రతి రోజూ జరిగేది. కళ్ళు మూసుకుని, నెమ్మదిగా, గంబీరంగా అయన చదువుతుంటే అద్భుతంగా కనిపించేది. ఒక్కోసారి పద్యం పూర్తయి కళ్ళు పై పంచతో తుడుచుకునేవాడు. 'ఏడుస్తున్నాడేమి, పాపం!' అనిపించేది. అయన ఆ పద్యాన్ని ఆత్మను శోధించి ,హృదయాన్ని మోగించే వాద్యంగా ఉపయోగిస్తున్నాడని అప్పుడు తెలియదు. ఇద్దరన్నదమ్ములు ఆస్తి పంపకాల్లో భేధాలు పడి కొట్టుకోవడానికి కర్ర ;లేట్టుకొనే వాళ్లు. పరుగెత్తి వస్తూన్న రాఘవరెడ్డి ని చూసి, ఎత్తిన కర్రలు దించి, 'కూచో' మని మంచమేసి, చెరో వేపున చేతులు కట్టుకుని నిలుచునేవాళ్ళు! తరవాత ఆ అన్నాదమ్ము లిద్దరూ రాఘవరెడ్డి వెంట వెళ్లి , భువనేశ్వరి అందించిన చిక్కని మజ్జిగ చెరో గ్లాసు పుచ్చుకుని, 'సరే! నువ్వు చెప్పినట్టే కానీ' అంటూ తువ్వాళ్ళు దులుపుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడి ఈ రాయలసీమ రైతు జీవితం ప్రత్యేకమైంది. అతని బ్రతుకును నడిపేది ఆకాశ దేవత. అతడు అరక కట్టింది మొదలు ఆకాశదేవత కేసి చూస్తూ ఉంటాడు. ఒకోసారి వర్షం రాక సకాలం లో విత్తనం పడదు. అప్పుడు చూడాలి ఇక్కడి మనిషిని. మనషి, పశువు , పక్షి ఒక్కటై ఒంటి ప్రాణంగా ఊర్ధ్వ దిశగా దృష్టి నిలిపే ఆ ఘోర తపస్సు , అప్పుడు ఆకాశం లో ఆ మూలనంత మబ్బు , ఈ మూల నంత మబ్బు ఒక్కటిగా కలిసి చిక్కని జీమూతమైతే, ఆ నీలి పందిరి క్రింద తళతళమని తటిల్లత లల్లుకుంటే , అప్పుడు వినాలి ఈ గుండెల్లో అమృత వర్షిణీ రాగాలాపన! అప్పుడు పీల్చాలి ఈ భూమాత విశ్వాసంలో ధాన్యలక్ష్మీ పరిమళాలు.
అప్పుడు ఆ జీవస్మరణ సంధ్యా కాలంలో , వెలవెల బోయే ముఖాల కేసి ఆర్ద్రంగా చూస్తూ అనేవాడు రాఘవరెడ్డి.
'వస్తుంది, నాయనా, వర్ష మోస్తుంది. భగవంతుడు మన దిక్కు చూడకుండా ఉండలేడు. అయితే మనమూ మన కర్తవ్యం నెరవేరుద్దాము. రాత్రికి పురాణ కాలక్షేపం చేద్దాము. ఒకరు పోయి అనంతయ్య కి సంగతి చెప్పి రండి.
వెంటనే అంతా బళ్ళు కట్టి పెన్నానది నించీ మెత్తని ఇసుక తెప్పించి ఆ వీధంతా జల్లెవాళ్ళు. ఇళ్ళకి తాళాలు వేసి పిల్లా పెద్దా, అడా మగా అంతా కలిసి వరసగా కూర్చునేవారు. పెట్రో మాక్సు లైటు పక్కగా ఆ పక్క అరుగు మీద రాఘవరెడ్డి , తన తండ్రి కూర్చునేవారు. వాళ్ళు తరచూ 'విరాటపర్వం ' చదివే వాళ్ళు. రాఘవరెడ్డి పద్యం చదివితే, తన తండ్రి తాత్పర్యం తెలియజేప్పేవాడు. అప్పుడే రాఘవరెడ్డి ద్వారా పరిచయమైనా తిక్కన ప్రభావం ఇప్పటికీ తనకు అద్భుతంగానే ఉంటుంది. ఒకసారి బాగా జ్ఞాపకం -- కరణం గారి ఇంటికి పట్నం లో చదువు కుంటున్నాయనోచ్చానొకనాడు. సహజంగా రాఘవరెడ్డి కున్న అభిలాష కొద్దీ ఆయన్ను చదవటాని కాహ్వానించాడు. అయన రాకపోగా-- వర్షం రాకపోతే పురాణాలు చదివి వస్తుందను కోవటం పిచ్చీ అని, దేవుడే ఉంటె మీరంతా దొంగలనీ, అపత్కాలపు భక్తులని తెలుసుకో'గలడని హేళన చేశాడు. రాఘవరెడ్డి నిమిషం మాట్లాడకుండా చూసి తరవాత నెమ్మదిగా ఇలా అన్నాడు:
'బాబూ! నువ్వు పెద్ద చదువులు చదువుతూన్న వాడివి. ఇంగ్లీషు లో దేవుడి పుట్టువును గురించి మనిషి వ్రాశాడని నేనూ విన్నాను. అంతటి విజ్ఞానాన్ని మాలాంటి అమాయకుల మీద ప్రయోగించడం అన్యాయం కాక మరేమిటి?' ఆ కంఠం లో కొంచెంగా కోపపు జీర ధ్వనించింది. 'అపత్కాలపు భక్తులన్న మాటకు నా సమాధానం విను. పసిపాప ఒకచోట కూర్చొని ఆడుకుంటోంది. పాప నవ్వులు, కేరింతలు తల్లి పక్కనే కూర్చుని పరికించి చూస్తూ ఆనందిస్తుంది. పాపకు ఆకలేసి, లేక క్రిందపడి దెబ్బ తగిలించుకుని 'అమ్మా!' అని కేకేస్తుంది. అప్పుడు తల్లి వెంటనే వెళ్లి గుండెలకు హత్తుకుంటుంది. అంతేకానీ, "ఇంతసేపూ నన్ను మరచి ఆడుకుంటున్నావు కదా!" అనే నిందారోపణ ఏ తల్లీ చేయదు!'
