ధర్మారావు వదనం ఆనంద విచార భావసమ్మిశ్రీతమై గంబీరంగా కన్పించింది.
నగరం లోని ఇతర పెద్దల ఆశీర్వచనోపన్యసాలూ బాలబాలికల వీడ్కోలు సందేశాలూ అయిన తర్వాత సభ ముగిసే ముందు ధర్మారావు మెల్లగా ఉపన్యసించాడు: "పూజ్య నిర్వాహకులు శ్రీ నారాయణ స్వామి గారు సెలవిచ్చినట్లు నా మనస్సు రెండు విధాలుగా ఆనంద విషాదాలతో నిండి పోయి ఉన్నది. అయితే, తల్లీ, తండ్రి అంటే ఏమిటో తెలియని అనాధులకు-- మాకు-- ఆశ్రయం కల్పించి, తామే తలి దండ్రు లై పోషిస్తూ నిరంతరం ఈఅశ్రమాభివ్రుద్ది కొరకే కృషి సల్పుతున్న నిర్వాహకులు శ్రీ నారాయణ స్వామి గారికీ, అనేక రూపాలలో సాయం చేస్తున్న ఉదార హృదయు లైన దాతలకూ సంతృప్తి కరంగా ప్రవర్తించాననే గర్వం నాకు ఎక్కువగా కలుగుతున్నది. ఇలా మాట్లాడడం లో అపరాధం ఉంటె పెద్దలు క్షమించాలి. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నాకు ఈ సంస్థే తల్లీ, తండ్రిని. ఎక్కడ పుట్టామో, ఎవరి బిడ్డలమో తెలియని మామ్మల్ని ఇలా పెంచి ప్రయోజకులుగా చేస్తున్న ఈ సంస్థకు యావజ్జీవితం నాకు వచ్చే ఆదాయంలో నాలుగవంతు సంతోష పూర్వకంగా ఇవ్వగలనని తెలియ పరుచుతూ , పెద్దల ఆశీర్వాదాలు, పిన్నల అభిమానాలు ఇలా ఎల్లప్పుడు నా చుట్టూ పరిభ్రమించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
సభ భారంగానే అయినా, సంతోష ప్రదంగా ముగిసింది.
2
సాయంకాలం ఆశ్రమం ఆవరణ లో ఒకచోట విశ్రాంతి గా కూర్చున్న ధర్మారావు "నారాయణ స్వామి గారు పిలుస్తున్నా' రను కబురు విని వెంటనే లేచి అయన గది వైపు నడిచాడు.
ఆ గదిలో అడుగు పెట్టు తుండగానే ఒక చిత్రమైన దృశ్యం కంట పడింది అతడికి.
నారాయణ స్వామి ఆలోచనామగ్నుడై , కనుబొమలు ముడి వైచి కుర్చీలో ఆసీనుడై ఉన్నాడు. ఆశ్రమం లోని ఆయా, దయామయి కంట తడి పెడుతూ, అపరిమిత వ్యధా పూరితా వదనం తో అతడికి ఆనతి దూరంలోనే నిలబడి ఏదో ప్రాధేయ పడుతున్నది. ఆ దృశ్యం చూచిన ధర్మారావు క్షణ కాలం ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆ దాది కూడా అతడితో పాటే ప్రప్రధమం నుండి -- ఆశ్రమం ప్రారంభమైన దగ్గర నుండీ -- అక్కడే పనిచేస్తున్నది. రాను రాను ఆశ్రమం శాఖోపశాఖలు గా విస్తరిల్లి, గుమస్తాలూ, నౌఖర్లూ అధికమయ్యారు కాని, ఆరంభం లో ఆమె ఒక్కతే ఆశ్రమానికి ఏకైక సేవిక. ఆమె పై నారాయణ స్వామికి అమిత గౌరవం. అయన ఒక్కరికే అన్నమాటేమిటి , అందరకూ అంతే. దయా నైర్మల్యా లోలికే ఆమె వదనమూ, మాటలూ అందరినీ చేయెత్తి నమస్కరింప జేస్తాయి.
దయామయి పుట్టు పూర్వోత్తరా లేమిటో ఎవరికీ తెలియవు. నిత్యం ఏదో దిగాలుగా ఉన్నట్లు ఉంటుంది. ఆశ్రమం లో అందరినీ కన్నతల్లి లాగా చూచి, పిల్లలందరి చేతా 'అమ్మా " అని పిలిపించు కుంటుంది. ఆమె ఒక ఆయా అని ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోవాలె కాని అందరూ 'అమ్మా" అనే సంబోధిస్తారు. అమ్మలాగా ఆదరించే ఆమెను. ఎవరైనా పెంకె వాళ్ళు అడ్డు దిడ్డు ప్రశ్నలు ఆరాగా అడిగి ఆమె విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించినా, ఆమె దీనంగా, చిత్రంగా, చతురంగా జవాబులు చెబుతుందే కాని, అసలు విషయాలు మాత్రం తెలిసే అవకాశ మివ్వదు.
"నువ్వెవరు?"
"నేనే!"
"అది సరే....ఎక్కడి నుండి వచ్చావు?"
"మీ అందరి లాగే!"
"అబ్బ! అది కాదు. నీకెవరూ లేరూ?"
"మీరందరూ లేరూ, నాకు?"
"నీ సొంత వారు?"
దయామయి విషాదంగా నవ్వి అనేది ; "ఎవరూ లేనివాళ్ళే ఈ అనాధశ్రమం నీడన బతకాలి!"
"నిన్నేమని పిలవాలి?"
"అమ్మా-- అని!"
"అయితే -- నీకు పేరు లేదూ?"
"లేదు."
"నిజంగా? పేరు లేని మనుష్యు లుంటారా?"
"పేరూ, ఊరు , గొప్ప , బీదా, పాపం, పుణ్యం , హైన్యం, ఔన్నత్యం -- అన్నీ మనం కల్పించు కొనేవే. అవేమీ లేకుండానే మనను దేవుడు ఈ లోకం లోకి పంపిస్తాడు. అలాగే తీసుకు పోతాడు!'
"నువ్వెప్పుడూ దిగులుగా ఉంటావెందుకు?"
"ఈ ప్రపంచం లో అధర్మం, అన్యాయం చూచి!"
"నీకు నవ్వడం వచ్చా? ఎప్పుడు నవ్వుతావు?"
"ఈ లోకంలో ధర్మం కనిపించితే!"
"నీకు జీతమెంత?"
"లేదు, వద్దు. అనాదు లందరి లాగే నాకూ ఇక్కడ కాస్త తిండీ, ఆశ్రయమూ దొరికితే అంతే చాలు."
అవే సమాధానాలు ఆమె ఆరంభం లోనూ, ఆ తర్వాత, ఇప్పుడూ కూడా చెప్పింది. చెబుతున్నది. అంతకు మించి అసలేమీ చెప్పడు; మాట్లాడదు. ఆదిలో ఆమె ధోరణి చూచి నారాయణ స్వామి క్రింద పనిచేసే గుమాస్తాలు కొంచెం ఖంగారు పడిన మాటా, అనుమానించిన విషయమూ యదార్ధం.
"అనాధను గనుక, ఇక్కడ ఆశ్రయం కోరి వచ్చాను. ఈమాత్రం దానికి ఇంత ఆలోచనెందుకు చెప్పండి, బాబూ? ఎప్పుడూ మీకు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే అప్పుడే నాకు ఉద్వాసన చెప్పండి" అనేది.
అందరికీ అయిష్టమైనా, నారాయణ స్వామి మాత్రం ఆమెను చూడగానే ఎటువంటి అభ్యంతారం చెప్పకుండా ఆశ్రమం లో ఆయాగా నియమించాడు. పదిరోజులు తిరిగేసరికే, "ఈమె ఎన్నటికీ వెళ్ళిపోతాననకుండా శాశ్వతంగా ఇక్కడే ఉంటె బాగుండును. ఇటువంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటె చాలు-- ధర్మ శ్రమాలు, సత్రావు లూ సార్ధక మవుతాయి ' అనుకున్నారు ఆరంభంలో అభ్యంతరం చెప్పిన వారే. కారణం -- దయామయి వేకువ జామున నాలుగు గంటలకు లేచిన దగ్గిర నుంచీ ఆశ్రమం శుభ్రం చేయడం, ఆశ్రమ వాసులకు ఆహారం తయారు చేయడం, దుస్తులు ఉతకడం మొదలైన పనులలో లీనమై పోయేది. ఆమె ఎన్నడూ, ఎప్పుడూ తీరికగా, విశ్రాంతి గా కూర్చోవడం ఎవరూ చూడలేదు. ఆశ్రమ వాసులందరూ నిద్రించే వరకూ ఆమె ఏదో ఒక పనిలో మునిగే ఉంటుంది. తిరిగి ఉదయం అందరూ లేచేసరికే నిత్యాకృత్యాలలో నిమగ్న మయి ఉంటుంది. అమ్మా, అయ్యా, ఆదరణా లేని అమాయక అనాదులందరికీ ఆమె అమ్మా, అన్నీను. ఆశ్రమం లో బాల బాలికలందరూ ఆమెను "అమ్మా" అని పిలుస్తారు. అందరినీ ఆమె కరుణ తో, దయగా చూడడం వల్ల నారాయణ స్వామి ఆమెను "కరుణా" అనీ, "కరుణా మయీ' అనీ పిలుస్తాడు. తదితర పెద్దలంతా 'దయా మయీ " అని సంబోధిస్తారు. అంతే కాని, ఆమె నిజ నామమేమిటో ఎవరికీ తెలియదు.
అంతటి విశిష్టత కలిగిన "అమ్మ' కంట తడి పెట్టడం ధర్మారావు ను కదిలించి వేయగా "ఏమిటమ్మా , అది? ఏం జరిగింది?" అని అడుగుతూ ఆత్రంగా దగ్గరకు వెళ్ళాడు. "ఏం జరిగింది బాబుగారూ?" అని కలవర పాటుతో నారాయణ స్వామి దెస చూచి ప్రశ్నించాడు. అతడు దీర్ఘ విశ్వాసం వదులుతూ , ఒక్క సారి ధర్మారావు నూ, మరొక్క సారి దయా మయినీ చూచి ముఖం భారంగా వాల్చుకున్నాడు.
"ఏమీ లేదు, నాయనా. నిన్ను చిన్నప్పటి నుంచీ -- ఇంతవాడు గా నేను పెంచాను. తెల్ల వారి నీవు వెళ్లి పోతావంటే నా గుండెలు బద్దలై పోతున్నాయి." ధర్మారావు చెంపలు నిమురుతూ బావురు మన్నది దయామయి.
ధర్మారావు మనస్సు ద్రవించి పోయింది ; కనులు ఆర్ద్రమైనాయి.
"తరచూ వస్తూంటానులే, అమ్మా" అన్నాడు ఆమె కన్నీరు ఒత్తుతూ . ఆమె కన్నీరదికమయిందే కాని, ఎక్కడా కట్టుపడ లేదు.
"దయామయి కూడా నీతో వస్తానంటున్నది , ధర్మారావు!" నెమ్మదిగా విషయం చెబుతూ, నిశితంగా అతడి ముఖ భావాలను చదవ సాగాడు నారాయణ స్వామి.
"నాతోనా అండి!" ఆశ్చర్యం ప్రకటించాడు ధర్మారావు.
"అవును....అవును బాబూ. నీతోనే! తీసుకు పోతావా? నిన్ను విడిచి నేను ఉండలేను." ఆశగా అతడి కండ్ల లోకి చూచింది దయామయి.
క్షణ కాలం నిరుత్తరుడయ్యాడు ధర్మారావు. అనేక ఆలోచనలు ఆవరించాయి. ఆమె తనను అది నుండి ఎలా పెంచిందో , ఎంత ప్రేమాను రాగాలు వర్షించిందో ఒక్కసారి కనుల ముందు గిరగిరా తిరిగింది. 'అమ్మ ఎవరో తెలియని తనకూ, ఇంకా చాలా మందికి ఆమె పదమూడేళ్ళ నుండీ అమ్మ! అమృత వర్షిణి! అటువంటి ఆమె నోరు తెరచి, చేసిన ఈ అత్యల్పమైన అభ్యర్ధన ను ఎల్లా కాదనేది?' అనుకున్నాడు.
అసంఖ్యాకమైన ఆలోచనలూ, స్మృతులూ మదిలో చిక్కులు పడుతుండగా, "మరి...మరి నీవు లేకపోతె ఈ ఆశ్రమం ఏమైపోతుందమ్మా?' అనగలిగాడు మంద స్థాయిలో.
"నేనా?" విషాదంగా నవ్వింది దయామయి.
"బాబుగారు చల్లగా ఉండగా ఆశ్రమాని కేం? నాలాటి అనాధ లేకుంటే ఈ ఆశ్రమాని కేమిటి, లోటు? నేనిక్కడ అందరి లాగా ఆశ్రయం పొందుతున్న దాన్ని మాత్రమె! అంటూనే భోరుమన్నది దయామయి.
నారాయణ స్వామి నిర్లిప్తంగా కూర్చున్నాడు, యేవో కాగితాలు చూచుకుంటూ.
నివ్వెర పోయిన ధర్మారావుకు మనసులో ఒకటే సంశయం -- "ఏమిటిది ? నిష్పక్షపాతంగా ఆశ్రమం లోని వందలాది పిల్లలనూ సమంగా ప్రేమగా చూచే -- ఈ లోకపు రాగద్వేషాలకు అతీత అయినట్టు కనిపించే ఈమెకు నా పై ఈ ప్రత్యెకభిమాన మేమిటి? ఎప్పుడుద్భవించింది?' అని.
దయామయి అన్నది : "నీకు నేనేమీ ఆటంకంగా ఉండను, బాబూ! ఇక్కడ లాగే అక్కడా ఓ దాసి లా పడి ఉంటాను. కాదనకు. నిన్ను వదిలి నేనుండ లేను."
కదిలిపోయిన ధర్మారావు హృదయ దైన్యం మేఘమై కన్నీరు వర్షించింది. "తీసుకు వెళ్తా నమ్మా, తప్పక తీసుకు వెళ్తాను. నువ్వు నాకు అడ్డు కాదు. అటువంటి మాతలేప్పుడు అనకు. నువ్వు నాకు అమ్మగానే తెలుసు. అమ్మగానే ఎప్పుడూ భావించ గలను" అన్నాడు.
నిశ్శబ్దంగా అక్కడి నుండి నిష్క్రమించాడు నారాయణ స్వామి.
