Previous Page Next Page 
అర్పణ పేజి 3


    ఇంతలో ఒక గంబీర స్వరం గదిలోకి వినిపించింది. అది ఆ ఇంటి యజమాని రామనాధ స్వామి గారిది. "లోపల ఏమిటా గోల?' అన్నారు. వారు నాటకం ముగిసి అరగంట కావస్తుంటే. అయన అలా అడిగేటంత వరకూ అతి ముఖ్య మైన మనిషి ఒకరు సమీపంలోనే ఉన్నారన్న సంగతి ఆ ఇంట్లో వారు సామాన్యంగా మరిచి పోతూనే ఉంటారు.
    రామనాధం గారి గురించి చెప్పుకోవాలంటే పెద్ద లకోటాలు దించవచ్చు. విసుగనిపిస్తే మూడు ,ముక్కలతో ముక్తసరిగా అనుకున్నా సరిపోతుంది.
    రాఘవపూర్ లో ప్రతి మానవమాత్రుడి కి ఆయనెవరో తెలుసు. వ్యాపహరికం లో ఆయనను లక్షదికారి అంటూ, చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ గౌరవిస్తారు. కొందరు గౌరవం నటిస్తారు. వీటన్నింటినీ మించి, మహానుబావులని లోకం చేత పలుమార్లు అనిపించుకునే పురుషోత్తములు కొందరు ఆయనను చుట్టి కొంగ జపం చేస్తుంటారు. గుట్లు ఏమైనా దొరక్క పోతాయా అని. ముఖ్యంగా వ్యాపార జిజ్ఞాస అధికంగా ప్రబలుతున్నది కాబట్టి , రామనాధం గారి వంటి అనుభవజ్ఞులు ఎన్ని అంతస్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కి దిగారో, దిగి ఎక్కారో తెలుసుకోవాలనుకుంటుంది లోకం.
    కాకపోతే వయసు మళ్ళుతూ, కావలసినంత  కలిగి ఉండి, ఒక లోకం పోకడ ఎలా ఉన్నా దాని ప్రమేయం తన కనవసరమన్న ధోరణి లో ప్రప్రంచం వైపు క్రీ గంట చూసే అయన దగ్గరకు అనునిత్యం ఆడంబరం తో గొప్పగొప్ప నిపుణులు, కార్యనిర్వాహకులు కోరి వస్తున్నారంటే కారణం ఏమని చెప్పుకోవాలి? అయితే అయన దగ్గరకు వచ్చేవారిలో వ్యాపార సంస్థ లవారు అధికం.
    అదీకాక ఎవరైనా నవలా రచయిత గాని , నాటక రచయిత గాని దారి తప్పి రామనాధం గారి దగ్గరకు వచ్చాడా అంటే అవసరానికి సరిపోయే వస్తువు సంగ్రహించుకు పోతాడు. అంటే సాహిత్య సృష్టి కి కావలసిన పరికరాలు అన్నమాట. మరేమీ లేదు. అయన మనస్తత్వం ఎవరికీ సరిగ్గా అంతు పట్టదు. ఒకరికి మంచి కార్య శూరుడు లా కనిపిస్తే , మరొకరికి విజ్ఞాన ఖనిలా అనిపిస్తాడు. కొందరు మహా వేదాంతి అని చెప్పుకుంటారు ఆయన్ను. మరి కొందరు ఆపద్భాంధవు గా భావిస్తారు. ఒక్కొక్కరు ఆయనను కాఠినుడని నిందించడం కూడా కద్దు.
    ఇక అర్ధం కాకపోవడం అన్న దానిలోనే ఉన్నది గమ్మత్తు. వ్యాపార సల్లాపాలు చెయ్యడానికి వచ్చిన పురుష పుంగవులకు మహావేదాంతి లా కనిపిస్తారు. తప్పీ చెడీ ఎవరైనా వచ్చి వేదాంతోపన్యాసం ఇస్తుంటే ----తన గత జీవిత ప్రగతి, ఇప్పటి ఔన్నత్యం చెప్పుకు పోతారు, వాగ్ధాటి తో. కర్మం చాలక ఎవరైనా శాస్త్రజ్ఞుడు కాని, ఇంజనీరు కాని సమిపిస్తే రోగిని చూచినట్లు శల్య పరీక్ష చేయటం ఒక గుణం. అయన కావాలని ప్రవర్తించక పోయినా, ఈ భావ భేదాన్ని భరించలేని వాళ్ళు రామనాధం గారిని కటిక హృదయుడుగా అనుకుని, కొంత ప్రచారం కూడా సాగించి ఊరు కుంటారు. అయన మంచితనాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారంటూ ఏ కొద్ది మందో ఉంటారు.
    అభిజ్జతకు అర్ధం తెలిసినప్పటినుంచి పర రాష్ట్రం లోనే ఉండిపోయిన రామనాధం గారు ఒకానొకప్పుడు ఆంధ్ర దేశానికి తరలి పోదామనుకున్నారు. కాని ఇక్కడున్న పరపతి, పలుకుబడి అమితం. ఆ ఆలోచన అయన పాదాలకు బంధాలు వేసింది. రామనాధం గారి తాతగారు గొప్ప వేదాంతి అని పేరు. వారి వేదాంత గ్రంధాలు కొన్ని ఆ ఇంట్లో ఎక్కడో కునుకు తూనే ఉన్నాయి. ప్రపితామహులు విఖ్యాతులైన వైద్య శిఖా మణులట. ఇక తండ్రి గారు శాస్త్ర జ్ఞానం విద్యార్ధుల కు బోధిస్తూ , బోధిస్తూ , తన జ్ఞానాన్ని శూన్యం చేసుకున్నారు. అందుచేతనే అయన స్వర్గస్తులయ్యే వేళకు, ఆస్తి అనేది చిల్లి గవ్వ కూడా మిగల్లేదు.
    చివరకు వారందరూ సంపాదించి మిగిలించిన అభిఖ్యనే ఆధారం చేసుకుని చీకటి దారుల వెంటా, వెన్నెల రేఖల వేంటా పయనించి పయనించి , సౌక్యమనే ద్వారాన్ని చేరుకున్నారు రామనాధం గారు. జీవితాకాశం లో సంధ్య వాలక ముందే గమ్యం చేరుకోన బట్టి, సంపాదించిన సౌక్యాద్వారం లో సంధ్యా దీపం వెలిగించి కొంత రూపు దిద్దు కోగలిగారు. తర్వాత అయన పేరు మారు మోగటం లో వింత లేదు.
    కార్యనిర్వహణ లో , నేర్పరితనం లో తాత ముత్తాతలను అధిగమించినా, వారి తత్వాలు మాత్రం కొంత కొంతగా రామనాధం గారిలో మిళితమై తొంగి చూస్తాయి. అదీకాక పుట్టుకతో తెచ్చుకున్న మాట పట్టింపు గుణం ఉన్నది. గంబీర మైన ఆకృతితో ఉండే ఆయనను చూసి కొందరు అసూయ పడితే, కొందరు అభిమానిస్తారు. రూపంలో రాజు కూడా తండ్రి లా అందంగా తీర్చి దిద్దినట్టుంటాడు. కాని తండ్రి లోని ఈ సర్వగుణ సమ్మేళనాన్ని చూచి హడలు కుంటాడు. రామనాధం గారు ఒక్కమాట గట్టిగా అంటే చాలు, పెరట్లో నుంచి పరిగేడతాడు. తనను గురించి చెడ్డ మాట ఏదైనా తల్లి గాని, పార్వతి గాని ఆయనకు చెప్పకూడదు. చెప్పారో, ఆయిందన్న మాటే! ఆడవాళ్ళ మీద పౌరుషం చూపించడం లో ఘటికుడే రాజు.

                                  2    
    అందమైనది అనిపించే భవనం ముందు గదిలో చక్కని ఫర్నిచర్ మధ్య ఒక సోఫాలో పక్కకు చేరగిలి , చెక్కిట చెయ్యి చేర్చి దీర్ఘంగా యోచిస్తున్నది ఒక అమ్మాయి. పలచని నీలు దుస్తుల్లో నీలాంబరం లా ఒదిగి ఉన్న ఆ అమ్మాయి పార్వతే.
    కట్టిన నైలాన్ చీర చెరుగు సగం సోఫా పై నుండి మోకాళ్ళ మీదుగా నేలను తాకుతున్నది. ముత్యాలు పొదిగిన కుడిచేతి గాజు, ఎడమ చేతికి అమర్చుకున్న టైనీ వాచ్ తో పోటీ పడుతూ ఉంది. స్క్వేర్ కటింగ్ బ్లౌజు లో మెరుస్తున్న కొత్త రకం నెక్లెస్ పార్వతి గొప్ప ఇంటి అమ్మాయి అని రుజువు పరుస్తుంది.
    సెలవు లిచ్చిన తర్వాత పది రోజుల క్రితమే పార్వతి స్వగ్రామానికి వచ్చింది,. వచ్చిందన్న మాటే గాని, ఆ పల్లెటూళ్ళో ఏమీ తోచక అవస్థ పడుతూ అస్తమానం విసుక్కుంటూ గడిపింది.
    పొద్దుటే లేచి సింగారించు కుని తోటలన్నీ తిరిగి తిరిగి ఇంటికి చేరుకుంది. అలిసిపోయిన పార్వతి సోఫాలో కూర్చోగానే స్వల్పంగా జరిగిన తన జీవితానుభావాలను తలచుకోవాలనిపించింది. తర్వాత చిన్నప్పటి సంగతులనేకం గిరగిర తిరిగాయి పార్వతి మనసులో.
    ఇంతవరకూ పార్వతి మేనత్త ఊళ్ళోనే పెరిగి చదువు సాగించింది. మరొక సంవత్సరం చదివి బి.ఏ. పూర్తీ చేయాలని దృడంగా నిశ్చయించు కుంది కూడా. పార్వతి సహాధ్యాయిని సరోజ కు డాక్టర్ కావాలని ఉత్సాహం. సహజం గానే సరోజ తలిదండ్రులు పిల్లల అభిరుచులను గ్రహించి అనుకూలంగా నడుకునే ఆదర్శవాదులు కాబట్టి, అభ్యంతరం చెప్పలేదు. వెంటనే సరోజ కొత్తగా ఆ ఊళ్ళో తయారవుతున్న మెడికల్ కాలేజీ లో చేరి స్వాభిలాషను సాధించుకో గలిగింది, ఒక విధంగా.
    పార్వతికి ఇలాటి భావాలేమీ లేవు. అందరూ చదువుతున్నారు; తనూ చదువుతున్నది. ఎవరైనా కర్మం చాలక చదవద్దూ-- అన్నారంటే పళ్ళు రాలాయన్న మాటే -- అంతమటుకు ఎవరూ అలా అనలేదు కాబట్టి సరిపోయింది కాని! ముఖ్యంగా పార్వతికి మూల కూర్చోవట మంటే గిట్టదు. ఏదో పని చేస్తుండాలి. అంతే. చిన్నప్పటి నుండి పట్టణ వాతావరణం లో పెరిగి పెద్దయిన పార్వతిలో ఆ భావం మరింత బలపడింది. తను అడదో, మగవాడో అన్న విషయం ఆ పిల్ల ఎప్పుడూ పట్టించుకోలేదు. మేనత్త ఆ విషయం తెలియజేయడానికి ప్రయత్నించనూ లేదు.
    పొతే , రాజు సంగతి మరొక విధం, అతను చిన్న క్లాసులు చదువుతున్నప్పుడే ఒకటికి రెండుసార్లు డబుల్ ప్రమోషన్ లతో పార్వతి , సరోజ ల అంతస్తు దాటి వెళ్ళిపోయాడు. రెండు సంవత్సరాల క్రితమే బి.ఎ. చదువు పూర్తీ చేసి, యాభై మైళ్ళ దూరంలో ఉన్న యూనివర్శి టీకి వెళ్ళాడు. ఆ ఊళ్ళో బంధువు లెవరూ లేక, హాస్టల్లో ఉండవలసి వచ్చింది. అతనికి ఎకనామిక్స్ అభిమాన పాత్రమైన సబ్జెక్టయినా , పాటించడమనేది సున్నే. బోలెడు ఖర్చు పెట్టుకొని నెలకు పదిసార్లు ఇంటికి వచ్చి తల్లిని కావిలించుకుంటాడు. అలా వచ్చిన రాజును చూస్తె పార్వతికి నవ్వు. అలా నడుస్తున్నాయి ఆ ముగ్గురి జీవితాలు, మరి కొందరు సహజీవుల మధ్య. కొన్నాళ్ళ కు ఈ సెలయేరు వంటి జీవన ప్రవాహమే ఉత్తుంగ తరంగ వాహినిగా ప్రవహిస్తుందేమో!
    సోఫాలో వెనక్కు వాలి గతాన్ని పర్యాలోకిస్తున్న పార్వతి ఒక్కసారి నిట్టూర్చింది. తన చిన్ననాటి స్నేహ మృత కలశం లో విష బిందువు పడుతుందేమో అని అనుక్షణం భయపడేటట్టు చేసిన బావ ప్రవర్తనే అర్ధం కాలేదు తనకు. అంతర్యమేమిటో అసలు అవగతమే కాలేదు. ఒక్కచోట పెరగటం వల్లనే మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గిట్టదు-- అంటుంది సరోజ. కాని ఆ మాటను నమ్మలేక పోయింది. తను కొందరిని తెలుసుకుంది. వాళ్ళు ఒక్క దగ్గరే చిన్ననాటి నుండి పెరిగినా , ఎంత ప్రేమాభి మనాలతో పెనవేసుకుని ఉన్నారు! డానికి అంతటికి వ్యతిరేకంగా ఉంది తమ ధోరణి.
    మొదట్లో బావ అంటే తనకు అసహ్యం వేసేది -- అతని చేష్టలకు ఆ మాటలకు ఇల్లాంటి పిల్లలను కూడా తలిదండ్రులు అందరి కంటే భిన్నంగా ప్రత్యేకమైన ప్రేమతో ఎందుకు పెంచుతారో! అనుకునేది. అస్తమానం అతను తనను పట్టి తిట్టి కొట్టినా సమానంగా తనూ పగ తీర్చుకునేది. రానురానూ అత్తయ్య అతని పై ఈగ వాలనివ్వ కుండా చూడటం, అతడి మీదే ఆశలన్నీ నిలుపు కున్నానన్నట్లు మాట్లాడటమూ గమనించాక తను బావనేమీ అనలేక పోయేది. అప్పటి నుండి అతని అభిమానం కోసం పాకులాడింది కూడా. అయినా తన ప్రయత్నం సాఫల్యాన్ని పొందక పోవడం సరిగదా, మరెన్నో తన్నులూ, తిట్లూ నిరభ్యంతరంగా లభించాయి. అక్కడితో అతనంటే తనకు ఒకరకమైన నిర్లక్ష్యం ఏర్పడి పోయింది. చిరాకు పడుతున్నట్లు అతని మాటలేవీ వినిపించుకోకుండా ఊరుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది. తన భావం అర్ధం చేసుకున్నట్లున్నాడు. సూటీ పోటీగా ఏవో అనేవాడు. అవన్నీ అప్పుడు అతని మీద అస్పష్టంగా ద్వేషాన్ని కలిగించాయి. బావ కేది ఇష్టం ఉండదో అదే చెయ్యాలని పించేది ఎప్పుడూ.
    ఒకసారి ఏం చేసిందంటే ----
    అప్పుడు పదమూడేళ్ళు ఉంటాయేమో తనకు. బావకు ఆడవాళ్ళు మగవేషం లో తయారైతే చెప్పలేనంత అసహ్యం . ఆ సంగతి తనకు తెలుసు. పని కట్టుకుని అత్తయ్య చేత ఒక పాంటు షర్టు మంచివి తీయించి కుట్టించుకుంది. అవి వేసుకున్నప్పుడు చూడాలి -- అత్తయ్య నవ్వూ, బావ ఉడికిపోవడమూను. ఇక పట్టలేక నేరుగా వచ్చి అడిగేశాడు ----" ఆ బట్టలు తీస్తావా, లేకపోతె తన్ననా.' అంటూ. తనైతే మొండికి శతమొండి. ఆరోజంతా ఎన్ని దరిద్రపు తిట్లు తిట్టాడో ఆ బ్రహ్మకే తెలుసు!
    తర్వాత బావ ప్రవర్తన అలాగే ఉండేది కానీ, అందరూ కాలేజీ చదువులకు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు కోరకుండానే తమలో వచ్చాయి.
    ఇప్పుడు హాస్టలు నుండి వస్తే తనతో లడాయి అంతగా పెట్టుకోదు. ఏమైనా వాగ్యుద్దాలు వస్తే, అత్తయ్య సమక్షం లోనే , ఒంటరిగా ఉంటె ఏమన్నా అనటం కూడా తక్కువ.
    ఆ తీరు తనను ఆకర్షించింది. అతనేమన్నా నవ్వి ఊరుకోవాలని పిస్తుంది. అదేదో చాలా తేలిక అయినట్లు. అయినా, బావ కెందుకో తనంటే విముకత్వం? అది తలుచుకోగానే హృదయం జ్వాలిస్తుంది ఆకారణంగా.
    తన పట్లనే ఆ విముఖత్వం అని తెలియడానికి కూడా కారణం లేకపోలేదు. మొన్న కాలేజీ కి క్రిస్టమస్ సెలవులు ఇచ్చినప్పుడు జరిగిన సంగతి -----
    బావ వస్తున్నాడంటే ఎందుకో ఆనందమనిపించింది. ప్రత్యేకంగా అలంకరించుకోవాలని కోరిక పుట్టింది. ఈరోజు లాగే తయారయింది. అదేమో ఆరోజు వస్తూనే తగువు పెట్టుకుని మనసు విరిచాడు. ఇంతకూ ఆ తగువుకు కారణం తన అలంకరణ లో నైలాన్ చీర ఒక భాగం కావడమే. తనకు నచ్చదు కనక తన ఎదురుగా అట్లాంటివి దరించ కూడదని ఏదో ప్రపంచాన్నంతటినీ శాసిస్తూన్నట్లు చెప్పాడు. అది తీసేయ్యమని ఒకటే ఏడిపించాడు. పర్యవసానంగా తన మనసు మళ్ళీ ఎదురు తిరిగింది. తన ప్రాణాలు పోయినా అతని ఇష్ట ప్రకారం ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అవును మరి! అతనికి అంత అయిష్టమైన వస్తువు తనకు ఎంతో ఇష్టం . అతనేదో అన్నాడని మానుకుంటుందా తను పిచ్చిదానిలాగా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS