కొందరు అబ్బాయిలు గడ్డి లోపడి పొర్లుతూ అల్లరి చేస్తున్నారు. మరి కొందరు ఆడుకుంటూ ఉంటె, కొంతమంది ఆడపిల్లలు సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు గుంపుగా కూర్చుని.
వీటన్నిటినీ మించి ఒక బృందం మామిడి చెట్టు కింద చోటు చేసుకుంది. వారందరి లో రాజు విరాజ మానంగా వెలుగుతూ హుషారిస్తూన్నాడు. మధ్య ఉన్న అబ్బాయిలు చెట్టు మీదకు రాళ్ళు విసిరి పిందెలు రాల్చుకుని కొరుకుతున్నారు. ఊళ్ళో సంగతులన్నీ ఒకటి తర్వాత ఒకటి ఏకరువు పెడుతూ.
రాజు గబుక్కున లేచి "కింద పడినవి తింటున్నార్రా? చూడండి . నేను చెట్టుకున్నవె తెంపుకో గలను" అంటూ ఒక్క ఉదుటున చెట్టు యెక్కనారంభించాడు. ఇద్దరు ముగ్గురు కొంటె పిల్లలు అతన్ని అనుసరించారు , వెంటనే.
"మన రాజు ఒక్కొక్క కొమ్మా ఎలా ఎక్కి పోతున్నాడో, చూశావా? ముందు ముందు అలానే క్లాసులన్నీ దాటి , గొప్ప డిగ్రీ సంపాదిస్తాడు"అన్న గోపాలం మాటలకు రామం తాళం వేశాడు నవ్వుతూ.
వాళ్ళ మాటలు ఆలకించిన రాజు తల ఎగరేసి మామిడి పిందెలు వాళ్ళ మీదకు విసురుతూ "ఎప్పుడో ఎందుకోయ్! ముందు ఈ లాస్ట్ పీరియడ్ మాస్టారు పెట్టబోయే క్లాసు పరీక్ష నెగ్గితే చాలు నాకు" అన్నాడు. దానితో చెట్టు కింద ఆటగా గెంతుతున్న పిల్లల్లో కలకలం బయలుదేరింది.
"ఆ మాట మరిచేవామామరోయ్! అయితే చదువుకోవాలి కొంచెం" అంటూ క్లాసు లోకి పరుగు తీశాడు ఒక అబ్బాయి.
"నా పెన్నులో సిరా అయిపోయిందని ఆఖరి క్షణం లో కోస్తాను. మీరెవరూ దానం చెయ్యకండి రా, పుణ్యం వుంటుంది. ఆ మాస్టారి దగ్గర. ఎప్పుడూ పెన్ను ఉండదు, నయం!" మరొక డన్నాడు పెంకిగా.
"మేం వెళ్ళిపోతున్నాం రా! ఏమీ చదవలేదు. ఈ మాస్టారు మాటమాటకీ మధ్య ఒక పరీక్ష పెట్టి మా కొంప కూలుస్తున్నాడు." ఇద్దరు మట్టి కొట్టుకున్న అబ్బాయిలు పరుగు తీశారు. ప్రహరీ గోడ రాహస్యంగా గెంతడానికి. మర్నాడు తగిలే చివాట్ల కు వాళ్ళు సిద్దమే.
"అంతగా రాకపోతే ఏదో గీకి పారేస్తాలే!" అంటూ ధైర్యం చెప్పుకున్నాడు ఒక మహానుభావుడు, చెట్టు కింద తీరిగ్గా కూర్చుని.
ఇంతలో తోటమాలి కర్ర పట్టుకుని రావటం చూశారు పిల్లలు. గందర గోళంగా కేకలు పెడుతూ తలా ఒక వైపూ పారిపోయారు. మాలి వస్తూనే గుడ్లేర్ర చేసి చూశాడు రాజు వంక. అంతే! కింది కొమ్మ పై నుండి వరండా మీదకు ఒక్క దూకు దూకాడు రాజు. నరుడు కాని నరుడు లా.
"కిందపడితే బావుండును. దెబ్బలే కాకుండా, అత్తయ్య చేత తిట్లు కూడా నాలుగు తగులును!" దూరం నుండి అంతా చూస్తున్న పార్వతి అన్నది.
"ఏం? మీ బావ కేదన్నా అయితే నీకే నష్టం కదా?' సరోజ నవ్వింది.
"అలా అన్నావంటే తంతాను నిన్ను. వాడేమైతే నాకేమిటి, మధ్యన?" పార్వతి మొగం చిట్లిస్తూ అంది.
"ఏమో మరి! మీ అత్తయ్య నీమీదే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది నాకు. అయినా మీ బావని 'వాడు' 'వీడు' అని సంబోధించేటప్పుడు కొంచెం కంఠస్వరం తగ్గించు తల్లీ! అతనికి గాని వినిపించిందంటే దిక్కు లేకుండా అయిపోతావు. అనక నన్ను తోడూ పడలేదని నిందిస్తే లాభం లేదు" అంది సరోజ.
"చాల్లెన్తూ! మరి చెప్పకు. నువ్వయితే అలా మనిషి మనిషికీ జడుస్తావేమో! నేనలా లొంగే ఘటాన్ని కాను. మొన్న మొన్న ఈ బావ మహాశయుడే పెంకి వెధవ లందరి తో కలిసి గెంతుతూ కొళాయి గట్టుదగ్గర కాలు జారి పడ్డాడు. ఇక చూసుకో! మా అత్తయ్య తిట్ల వర్షం దగ్గర ఏ వడగళ్ళ వాన పనికొస్తుంది! సాధారణంగా బావను పల్లెత్తు మాట అనని అత్తయ్య ఆరోజెందుకో గట్టిగా కోప్పడ్డాది. అదీ ప్రేమ చేతనే అనుకో! అయినా ఆ అదను ఊరికే పోనివ్వలేదు నేను. ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పి, మరీ నాలుగు తిట్టించాను. బలే గమ్మత్తుగా భరించాడులే. తేలు కుట్టిన దొంగ అంటారు , అలా.
"అయినా నేను నమ్మలేను" అంది సరోజా దేవి అందమైన పెదాలను మరింత అందంగా ముడిచి.
"ఏవిటి?' ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.
"నీమీద పగ తీర్చు కోకుండా ఉన్నాడంటే నమ్మను."
పార్వతి ముఖం పైన సూర్య కిరణం పడి ఎర్రగా కనిపించింది.
"చెప్పవేం?" అంది సరోజ చప్పున నవ్వుతూ. పార్వతి కి కూడా నవ్వు వచ్చింది.
"ఆ మర్నాడు నేను నిద్ర పోతున్నాను. అత్తయ్య లేవమంది కాబోలు . వచ్చి నా చెవి గట్టిగా నులిమి, చేతి మీద కొట్టి పారిపోయాడు. అబ్బ! ఇంకా నొప్పి పెడుతుంది "---పార్వతి అంది. నవ్వులో కోపాన్ని మిళితం చేసి, సరోజ విరగబడి నవ్వింది.
అంతలో గంట వినిపించింది ఇద్దరికీ. పార్వతి చెంగున లేచి చెయ్యి పట్టుకు పైకి లాగింది సరోజను. క్లాసు లోకి పరుగెత్తారు జంటగా.
వాళ్ళిద్దరూ మరువలేనటువంటి రోజు.
* * * *
"నాకు అన్నం వడ్డించు, అత్తయ్యా! ఆకలితో కడుపు రామరామ అంటూంది." పార్వతి పీట వాల్చుకుని కూర్చుంది.
జానకమ్మ నవ్వుకుంది. పార్వతి మాటలకు ఆవిడ కెప్పుడూ నవ్వు వస్తుంది.
"ఏమిటే రామ రామ అంటున్నదీ , కడుపు? పోనీలే. నువ్వు అనకపోతే అదైనా అంటూ వుంది. పుణ్యం తెచ్చుకోవడానికి" అన్నదావిడ వంటిల్లు సర్దుతూ.
"నీగమ్మత్తు నాకు తెలుసులే, అత్తయ్యా! ఇలా నన్ను మాటల్లో పెట్టేసి ఈలోగా మీకుమారుడు గారు రాగానే అతనికే ముందు వడ్డించేయ్యాలని చూస్తున్నావు కదూ?"
"నీ అనుమానాలు బంగారం కానూ! వాడు కూడా వస్తే నీ సొమ్మేం పోయిందే? చెప్పు."
"ఆహా! వీల్లేదు. నేను క్లాసు లో ఫస్టు వచ్చాను కాబట్టి, నాకే ముందు అన్నం పెట్టి తీరాలి. ఊ! తొందరగా."
జానకమ్మ వడ్డిస్తూ "పారూ! వాడు గానీ సున్నా చుట్టాడా , ఏమిటే?" అని అడిగింది రహస్యం అడుగుతున్నట్లు. కొడుకు తెలివి తేటల మీద అపరిమితమైన విశ్వాసం ఆవిడకు.
"అది కాదత్తయ్యా !" గట్టిగా అన్నది పార్వతి. "మాస్టారు నిన్న కొన్ని ప్రశ్నలు వేశారు క్లాసులో. బావని 'దృవప్రాంతం లో చాలా, వేడా?" అనడిగితే....."
"నోరు తగ్గించు కొంచెం. మగవాడిలా అరుస్తుంది, సిగ్గులేక!" అవతలి గదిలో మేడమేట్లు దిగుతూ అరిచాడు రాజు. పార్వతికి గొంతు నెవరో నొక్కినట్లయింది. అప్పటికి తెలిసింది తనెంత గట్టిగా చెబుతున్నదో. మరి మాట్లాడకుండా తలవంచి అన్నం తినటం లో నిమగ్నురాలయింది.
"బాగానే ఉంది" అని నవ్వుకుంది జానకమ్మ.
"అన్నం పెట్టమ్మా!" అంటూ రుసరుసగా వచ్చాడు రాజు.
"ఇదిగో , సిద్దంగా ఉంది, నువ్వు రాకపోతే ఎవరిది తప్పు?" అన్నది జానకమ్మ ఆదరా బాదరా వడ్డిస్తూ. వరసగా ఒక్కొక్క ముద్ద ఎక్కిస్తున్న పార్వతికి వట్టి పుణ్యానికి నవ్వు వచ్చింది. రాజులో కోపం రేగింది. తనను పరిహాసం చెయ్యటానికే అలా నవ్వుతున్నదను కున్నాడు.
క్రీగంట చూస్తూ "పాడు నవ్వొకటి వచ్చు ప్రతి దానికీ" అన్నాడు.
తలవంచుకుని తింటూ "నవ్వడం తప్పయితే నవ్వకు. ఆ పోజులోనే ఉండు, ఇష్టమైనంత సేపు" అన్నది పార్వతి. ఇంకా అర్ధం లేకుండా వస్తున్న నవ్వును బుగ్గల్లోనే దాచటానికి వ్యర్ధ ప్రయత్నం చేసి చివరకు ఆ నవ్వుకోక కారణం సృష్టించాలనే ప్రయత్నం లో ఏదో గొణిగింది. అసలే రాజుకుంటున్న రాజు ఇక పట్టలేకపోయాడు.
"ఏమిటా సణుగుడు? అనేదేదో తిన్నగా అను."
"నేనేదో అనుకుంటే నీకేమయింది?" అన్నది పార్వతి కళ్ళు చిట్లించి. "క్లాసులో సున్నాలైనా మహారాజులా ఇక్కడ అధికారం చేలాయిస్తాడు." అన్నది మళ్ళీ స్వరం తగ్గించి.
"జన్మానికి శివరాత్రి లా ఒక్కసారి ఫస్టు వచ్చింది కదా! ఏం గర్వం రా , భగవంతుడా!" అన్నాడు రాజు దేవుణ్ణి మధ్యవర్తి గా చేసి.
"అవును , నాకు గర్వమే. జన్మకే కాదు, పది జన్మల కొక్కసారి శివరాత్రి చేసినా నాకు గర్వంగా ఉంటుంది." పార్వతి జోరుగా అని పెదవి కొరుక్కుంది.
"ప్రతిసారీ ఫస్టున వచ్చే మాకెంత గర్వం ఉండాలో అలా అయితే?" నవ్వాడు హేళనగా.
"నీకిప్పుడు కళ్ళు నెత్తికి వచ్చాయి. ఇంక ఫస్టు రావటం ఒకటి!" పార్వతి కళ్ళు జేవురించాయి.
రాజు ఉద్రిక్తుడయ్యాడు. "నోర్ముయ్యి! నువ్వొక్కదానివే అయినట్టు కోతలు కోస్తున్నావు. సరోజ కూడా ఫస్టే."
"నువ్వు సరోజ కావుగా?"
"ముందు నోరు మూయ్య మంటున్నాను."
"నోరు ముయ్యమనటానికి నివ్వేవడివో? నాకు దిక్కు లేడను కుంటున్నావా?"
రాజు కంచం ముందు నుంచి చెంగున దూకాడు పార్వతి మీదికి, కట్టలు తెంచుకున్న కోపంతో. అవతలకు వెళ్ళిన జానకమ్మ అప్పుడే గదిలోకి వస్తూ దృశ్యం చూసి నిర్ఘాంత పోయి, చప్పున రాజును అదిమి పట్టి అన్నం ముందు కూర్చో బెట్టింది. పార్వతి నిర్లక్ష్యంగా ఒక్క చూపు చూసింది రాజు వైపు.
"ఉండమ్మా! దీని పెంకితనం అణుస్తాను. మనింట్లో ఉండి కూడా , దీనికింత పోగరెందుకో?" అన్నాడు విసురుగా అన్నం కలుపుతూ.
జానకమ్మ వారించి "ఏమిట్రా ఆ మాటలు? అదేం గతి లేక మనింట్లో ఉందను కున్నావా? నీలాంటి వాళ్ళని నలుగురిని కొనగల ధనవంతురాలు. కదు తల్లీ?" అన్నది పార్వతిని సంభోదిస్తూ.
"ఎంత డబ్బుంటే ఏమిటి? తక్కువ బుద్ది పుట్టుకతో వస్తుంది" అన్నాడు రాజు.
పార్వతి కి సహజమైన కోపం ముంచుకొని వచ్చింది. కాని జానకమ్మ ఎదురుగా అతన్నేమీ అనకూడదనే విచక్షణ అప్పుడప్పుడే వస్తున్నది కాబట్టి ఓర్చుకుంది. అయినా లోలోపల మద్యం దిన సూర్యుడు మండుతున్నాడు. తన పసివాడి మనసులో ఇల్లాంటి భావాలేమిటా? అని విస్తుపోయింది జానకమ్మ.
"ఏ పాపం ఎరగని పిల్లని పట్టుకు అల్లాంటి మాట లంటావేమిట్రా , రాజూ? ఈ మారన్నావంటే ముందు నీ పళ్ళు రాలతాయి!"
"ఏమీ ఎరగదు , పాపం! నీకొక్క డానికే అలా కనిపిస్తుందేమో? స్కూలు కురా. తెలుస్తుంది! ప్రతి స్తూదేంటూ దీని మాటలే చెప్పుకుంటాడు."
'దాని మాటెందుకు , మధ్య?' జానకమ్మ తెల్లబోతూ అడిగింది.
"ఎందుకేమిటి? ఆ మగవాడి వేషం చూసి . బూడిద పూసినట్లు పౌడర్లూ, షోకులూ , అందరూ నవ్వుతుంటే నాకు సిగ్గేస్తుంది." చెప్పుకు పోతున్నాడు, పార్వతి కళ్ళల్లో వేడికి లోపలి శీతల జలపాతాలు ఉష్ణ జలపాతాలుగా మారిపోతున్నాయి. ఇక అణిచి పెట్టిన ఆవేశాన్ని వెలి గ్రక్కకుండా ఉండలేక పోయింది.
"ఏం? నా ఇష్టం! నేనెలా తయారైతే మీకేం? మీ తాతలు దిగివచ్చి చెప్పినా నేను నా ఇష్ట ప్రకారం శృంగారించు కుంటాను" అంది తీవ్రంగా అరుస్తూ.
"ఇంకేం? ఆ రెండు జడలూ కూడా కత్తిరించేసుకుని మరి కొంచెం షోగ్గా నడువు!" వెకిలిగా నవ్వాడు రాజు.
"నీలాంటి కోతులు వెక్కిరిస్తాయని నా కిష్టమైన వాటిని విడిచి పెడతానను కుంటున్నావేమో? ఎప్పటికి అలా జరగదు" అన్నది. అక్కడి నుండి లేచి తొందరగా గదిలోకి పోయింది తర్వాత. రాజు కూడా అన్నం తినకుండా చాలా పారేసి చెయ్యి కడుక్కున్నాడు.
"ఏమిటో ఈ పిల్లలు?" అని కలికాలం మహిమ ను తలుచుకుని కొంతసేపు ఊరికే కూర్చుండి పోయింది జానకమ్మ. తర్వాత పని గుర్తుకు వచ్చి గబగబా ఇల్లు కడిగింది. గదంతా శుభ్రం చేసుకున్నది. 'పని మనుషులు కూడా సెలవు కాగితాలు పంపిస్తుంటే ఏం చెయ్యడం?' అనుకుంటూ పరధ్యానంగా ఉన్న ఆవిడకు మేడ మీది గదిలో పెద్ద గోల వినిపించే సరికి, గ్రామ సింహాలకు గది అప్పగించి ఒళ్ళు తెలియకుండా పరుగెత్తింది.
జానకమ్మ వెళ్లేసరికి ఒక దృశ్యం అప్పుడే ముగిసిపోయింది. మరొక దృశ్యం లో రాజు తనను దూసుకుంటూ మెట్ల మీద నుంచి పరుగెత్తడం కనిపించింది. రెండు చెంపల పైనా చేతులు కప్పుకుని ఏడుస్తున్న పార్వతి జానకమ్మ ను చూసి మెట్ల మీద కూలబడి పోయింది.
"ఏం చేశాడే పారూ?' అన్న జానకమ్మ కు సమాధానం దొరకలేదు. కాగా పార్వతి మోకాళ్ళ లో తల దూర్చి మరింత వెక్కి వెక్కి ఏడ్చింది.
"వాణ్ణి రానియ్యి. ఇవాళ అన్నం పెడతానేమో చూడు, దొంగ వెధవకు? నా తల్లివి కదూ! ఊరుకో , అమ్మా!" అని జానకమ్మ అనగానే పార్వతికి కొంత ఉపశమనం కలిగింది. తర్వాత బావ తననేలా జడను ఒడిసి పట్టి చెంపల పైన కొట్టాడో ఆ వైనమంతా తీరిగ్గా చెప్పింది, అతనికి జరగబోయే శాస్తి ని కసి తీరేలా ఊహించు కుంటూ.
