Previous Page Next Page 


    'లేదు మోహన్ . నిజమే చెప్పాను. అత్తయ్య పోయాక ఆయనగారే నాకు తన గార్డియన్ అవుతాడు. నే పెళ్ళి చేసుకునే దాకా నా బాధ్యత అయన వహిస్తాడుట. ఇవన్నీ అత్తయ్యే ఒకరోజు చెప్పింది.'
    "మైగాడ్! ఏం మనిషి. అయితే నువ్వు ఆస్తికి వరసురాలివి కాదన్న మాటేగా?' అతని కంఠస్వరం లో ఎక్కడో అసంతృప్తి ధ్వనించిందా అనిపించింది లలిత.
    "అత్తయ్య కున్నవి మనకెందుకు? నీకు నేనూ, నాకు నువ్వూ ఉంటె చాలదా? ఏం మోహన్?' అతని సమాధానం  పైననే తన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నంత ఆత్రంగా అడిగింది లలిత.
    "అవుననుకో....' ఓ క్షణం ఆగాడు మోహన్. అతని ముఖం కొంచెం కళ తప్పినట్టు తోచింది లలితకి.
    "ఏమిటి? మధ్యలోనే ఆగిపోయావెం. చెప్పు మోహన్. నాకు సమాధానం చెప్పు. నీకోసం నేనెంత తెగించానో చూశావు కదా? నువ్వు తెలియని క్రితం నేను ఎలా ఉండేదాన్నో కూడా మరిచిపోయాను. ఈరోజు నీతోటిదే ప్రపంచం అనుకుంటున్నాను. నీకేదైనా నిలకడైన రాబడి ఏర్పడితే- ఇద్దరం హాయిగా బ్రతుకుదాం ఏమంటావు?'
    "అనడాని కేముందోయ్ . నేనుమటుకు అంతకు మించి కోరేదేముంది చెప్పు....సినిమాకి పొదామన్నావుగా . బయలుదేరుదామా?" మాట మార్చేశాడు మోహన్.
    మోహన్ లో వచ్చిన మార్పు గ్రహించలేనంత తెలివితక్కువది కాదు లలిత అతని ధోరణి కి వింత పడ్డా నిజం గ్రహించి సిగ్గు పడింది.
    "ఆస్థి లేకుండా నేను అక్కర లేదన్న మాట నీకు! అత్తయ్య అనే మాటలు నిజమే అని ఇప్పుడు తోస్తుంది. నీకు ముందుగా తెలియడమే మంచిదయింది కదూ మోహన్?' అంటూ చేతి సంచీ అందుకుని లేచి నిలబడింది లలిత.
    'చక్కని సాయంత్రం తీవ్రమైన విషయాలను గురించి అలోచించి ఎందుకు పాడు చేస్తావు లలితా. హాయిగా సినిమాకి పోదాం. నీకు తలనొప్పి రాకుండా ఉంటె అటు నుంచి ఆటే బీచికి వెడదాం. తరువాత ఇంటికి ఏం? ' వంగి లలిత ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "పోనీ సినిమా మానేద్దామా?' సంశయంగా అంది లలిత.
     'టిక్కెట్లు కోనేశానుగా మానేయడం ఎందుకు రా పోదాం."
    బిల్లు చెల్లించి బయటికి నడిచారు ఇద్దరూ.
    ఇద్దరి కిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు పడ్డారు.
    "మోహన్ రేపు కలుసుకుందామా? బీచి ప్రోగ్రాము వద్దని సినిమా నుంచి టాక్సీ లో ఇంటికి వస్తుంటే అడిగింది లలిత    "చూద్దాం. రేపు నాకు తెరిపి ఉంటుందో ఉండదో. వీలు చూసుకుని ఉత్తరం రాసి పంపిస్తాను . సరేనా?' టాక్సీ దిగి తలుపు తెరుస్తూ అన్నాడు మోహన్.
    "అలాగే' అంటూ నిస్త్రాణగా లోపలికి నడిచింది లలిత.
    "అమ్మయ్య' అని టాక్సీ తలుపు ధాటిగా వేసి ముందుకు సాగాడు మోహన్.
    మరునాటి ఉదయమే అత్తయ్య కళ్ళ పడనవసరం లేనందుకు సంతోషించింది లలిత. ఆలోచనలతో తల వేడెక్కి పోయింది. ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. మోహన్ మళ్ళీ కనిపిస్తాడన్న నమ్మకం సన్నగిల్లింది లలితకి.
    ఉదయం లేచి శుభ్రంగా చన్నీళ్ళ తో స్నానం చేసింది. స్నేహితులకి ఉత్తరాలు రాస్తూ కూర్చుంది.
    "ఆఫీసు లేదా అమ్మాయి?' అని అడిగారు అవ్వగారు.
    "ఉందండీ ఒంట్లో బద్దకంగా ఉంది. ఈరోజు వెళ్ళను." అంది లలిత.
    "రాత్రి బాగా పొద్దు పోయినట్టుందే." అంది అవ్వగారు.
    'అవునండి. కబుర్లు చెప్తూ ఉండిపోయాను.' అంటూ కూర్చున్న చోట నుంచి లేచింది లలిత. ఈ అవ్వగారింకా ఏం ప్రశ్నలు ఆరాలు తీస్తుందో అని భయం వేసింది లలితకి.
    "సీతమ్మ వెళ్ళి అప్పుడే నాలుగు రోజులైందా?' అడిగింది అవ్వగారు.
    "లేదండీ నిన్ననేగా వెళ్ళింది? ఈ రోజింకా రైల్లోనే ఉంటుందేమో!" నవ్వుతూ అంది లలిత        "అంతేనా, అప్పుడే చూశావా నువ్వెలా డిలా అయిపోయావో?"
    వేళాకోళం చేశారు అవ్వగారు.'
    "అత్తయ్యతో బాగా అలవాటై పోయింది ఒక్కరోజు లేకపోయేసరికి ఎలాగో ఉంది" అంది లలిత        అత్తయ్య తిరిగి వచ్చేలోగా మోహన్ ఉత్తరం పంపకుండా ఉంటాడా? అని లోపల ఊహించుకుంటుంది లలిత. 'ఈ కాలం పిల్లలలో  కూడా ఇంత అమాయకులు ఉంటారా.' అంటూ బుగ్గలు నొక్కుకుంది అవ్వగారు. ఎంత వద్దనుకున్నా నిన్నటి మోహన్ ప్రవర్తన వింతగా తోచడం మొదలు పెట్టింది లలితకి. తనేమందని అలా మారిపోయాడు? అంత సరదాగా ప్రారంభం అయిన సాయంత్రం అంత భారంగా ఎందుకై పోయింది? దియేటర్ లో కూడా తన ఆలోచనలలో మునిగి మనిషి అక్కడే ఉన్నా మనస్సు ఎక్కడో ఉన్నట్టున్నాడు. మోహన్. 'రేపు వస్తావు కదూ' అని అడగలేదు. సరికదా "మళ్ళీ ఎప్పుడు దర్శనం?' అంటే నే ఫోను చేస్తాను. రెండు మూడు రోజుల పాటు తొందర పనులు ఉన్నాయి.' అని తప్పించుకున్నాడే గాని 'అయ్యో కలుసుకోలేక పోతున్నాం' అన్న భాదేనా వ్యక్తం చెయ్యలేదు......అన్ని కలిపి ఆలోచిస్తే అసలు అర్ధం కావడం మానేసింది లలితకి.
    ఎన్నడూ లేనిది ఈ ఆరునెలల్లో ఎన్ని అబద్దాలు చెప్పింది తను? 'ఏమో రోజూ ఆలస్యం అవుతుంది?' అని యధాలాపాలుగా అత్తయ్య అడిగినా ఉలిక్కిపడింది. ఏవేవో కుంటి సాకులు చెప్పింది. కంపెనీ లో ఎక్కువ పని అప్పజెప్పారంది. ఒక అమ్మాయి జాబ్బు పడింది ఆ పిల్ల పని కూడా నేనే చేస్తున్నాను అంది. ఓ రోజు అత్తయ్య అవ్వగారితో చెప్తుంటే వింది కూడా, మా లలిత ఈ మధ్య బాగుంటోంది అని, పిచ్చి అత్తయ్య. నమ్మించి మోసం చేస్తూ కాలక్షేపం చేస్తుంది -- ఈ లలిత అని గ్రహించలేక పోయింది.
    అత్తయ్య వన్నీ పూర్వకాలపు ఊహలు . ఆడపిల్లకి పెళ్లి అయేదాకానే ఉద్యోగం అయినా చడువైనా అని నమ్మే మనిషి.
    'కష్టాల్లో మనసు పెరిగినంతగా సుఖ సౌఖ్యాలలో పెరగదే" అంటుంది.
    "నాకేం డబ్బుంది ' అన్న ధోరణి లో ఉంటె వాళ్లు ఎప్పటికి బాగుపడరు. డబ్బుంటే చాలా అంటుంది. అందుకే చిన్నతనం లోనే తల్లీ తండ్రి చచ్చిపోయినా లలితని చేరదీసి ప్రాణానికి ప్రాణంగా పెంచింది. చదువు చెప్పించింది. తగిన సంబంధం దొరికే దాకా ఉద్యోగంలో ఉండనీ అనుకుంది. ఆస్థి ఉందన్న నమ్మకం లలితకి ఎప్పుడూ కలగనివ్వలేదు. మామూలు సంసారి లాగా తనూ కాలక్షేపం చేస్తూ ఏదో జాగ్రత్తగా బ్రతకాలి అన్న ఊహను బలంగా లలిత లో నాటింది. ఈ అత్తయ్య కూడా లేకపోతె నాగతేమిటి? అని అప్పుడప్పుడు లలిత ఆలోచించేది. అలాంటప్పుడే తన చదువూ, ఉద్యోగం ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేవి.
    మోహన్ తొలిరోజు తనని ఇంటికి తీసుకు వచ్చిననాడే అత్తయ్యకు నచ్చలేదు. "భేషజం జాస్తి' అని ఒక్క మాటలో కొట్టి పారేసింది. అందుకే అతను మళ్లీ ఇంటి చుట్టూ పక్కలకి వచ్చే అవకాశం కలుగలేదు. అందుకే లలిత అతన్ని ఆఫీసు అయాక, లంచ్ సమయంలోనూ , ఆఫీసు ఎగ్గొట్టి కలుసుకునే పరిస్థితి ఏర్పడింది. 'అత్తయ్య మోహన్ ని లైక్ చేస్తే ఎంత బాగుండును' అని లక్ష సార్లేనా అనుకుని ఉంటుంది లలిత అదే జరిగితే ఈ మానసికమైన బాధ, అత్తయ్యని మోసం చేస్తున్నానే అనే బెంగ లేకుండా పోయేది. కాని అది కుదరని మాట అని ఎన్నోసార్లు తేలిపోయింది. 'బస్సులో ఆరోజు వచ్చి నాయన కనిపించారత్తయ్య ' అని ఎప్పుడేనా చెప్తే -- 'పోదూ పోజులరాయుడు! పనీ గట్రా చేయకుండను కుంటాను.' ఉల్ఫాగా డబ్బు దొరికితే జల్సా గా తిరిగే బాపతు లాగా తోచాడు' అంది. చెలరేగిన ఆశలు కాస్తా చల్లారిపోయాయి లలితకి. ఇక అత్తయ్య మోహన్ ఊసు ఎత్తినా వినిపించుకోదని తేలిపోయింది. అందుకనే మోహన్ కి ఏపాటి దేనా అస్త్జి ఉన్నా, రాబడి ఉన్నా ఎంత బాగుండును. అని పదేపదే అనుకుంది లలిత. అప్పుడేనా అత్తయ్యని ఒప్పించవచ్చునేమో అని కొత్త ఆశ చిగురించింది. కాని అది కాస్తా మొగ్గలోనే తుంచాడు మోహన్. గాలిలో ప్రేమలో హాయిగా బ్రతుకుతాం అని ఎలాగా నమ్మడం? అది సాధ్యమా?....తనకది సాధ్యమే అనిపించింది. ప్రేమించు కున్న వ్యక్తులు కలిపి బ్రతకకల్గితే ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగలరని నమ్మింది. కాని ఆ నమ్మకపు పునాదినే కదిలించి వదిలాడు మోహన్. "ప్రతిక్షణం డబ్బు కోసం, రేపటి భోజనం కోసం బాధపడుతూ బ్రతకడం నా లక్ష్యం కాదు' అన్నాడు. మరి సంపాదించే పనిలో తీవ్రమైన కృషి ఎందుకు చేయడు? అని ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది లలిత. వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేస్తాడు. కూడపెట్టె ఆలోచనే చేయడు. ఒకరోజు అడిగింది కూడా , "పోదూ ఈరోజు నువ్వు దగ్గిరుండి , నా దగ్గిర డబ్బు కూడా ఉన్నప్పుడు హాయిగా ఖర్చు చేసుకుందుకు లేకుండా ఎందు కొచ్చిన బెడద? డబ్బు సంగతి జ్ఞాపకం చేసి మన సాన్నిహిత్యం పాడు చేయకు" అన్నాడు. తనంటే ఎంత ప్రేమ! అనుకుంది. మరి నిన్న ఎందుకు అత్తయ్య ఆస్తికి వారసురాలిని అనుకున్నాడు? ఆ ప్రశ్న వెర్రి తలలు వేసి వెక్కిరించింది లలితని. ఎందుకీ డబ్బు గొడవ మధ్య తలెత్తాలి? ఎందుకీ గొడవ? మేం ఎందుకు హాయిగా పెళ్లి చేసుకుని కలోగంజో తాగుతూ బ్రతకకూడదూ?.....ప్రశ్నల పరంపర తో తల బరువెక్కి పోయింది లలితకి.
    ఉదయం పదకొండు గంటలు దాటింది. ఇంకా స్నానమైనా చేయకుండా ఆలోచనలు ముసురుకోగా అలాగే కూర్చుండి పోయింది. చేతిలో తెరిచిన పుస్తకం తెరిచినట్టే ఉండిపోయింది. ఇంతట్లో అవ్వగారు, అమ్మాయి, అని పిలవడం వినిపించి లేచి నిలబడింది. వడిలో పుస్తకం క్రింద పడిపోయింది. అప్పుడు గుర్తు వచ్చింది తను నవల చదువుదామని కూర్చున్న సంగతి. పిలిచిన అవ్వగారు తిన్నగా గదిలోకే వచ్చాడు. "ఎవడో జానెడు వెధవ ఈ ఉత్తారం యిచ్చి వేళ్ళాడమ్మా. ఉండరా అని కేక వేసినా ఆగలేదు.' అంటూ చేయి జాపి ఉత్తరం చూపెట్టింది. ఆవిడ చేతిలోంచి లాక్కున్నంత త్వరగా తీసుకుంది లలిత ఉత్తరాన్ని. తన ప్రవర్తనకి తనే సిగ్గుపడి "నా స్నేహితురాలు చీటీ పంపిస్తానంది అవ్వగారూ అంతే' అంది.
    "చదూ -- చింపి ' అన్నారు అవ్వగారు.
    ఓ క్షణం తెల్లబోయినా తేరుకుని తేలికగా నవ్వేసింది లలిత    "ఏముంటుంది అవ్వగారూ. ఆఫీసుకి రాలేదేం? వంట్లో బాగులేదా , సాయంత్రం వస్తానులే" అని రాసి ఉంటుంది.' అంది కవరు చింప కుండానే.
    "ఏం చోద్యమే. ఆఫీసు వేళదాటి రెండు గంటలు కూడా రాలేదు. అప్పుడే బెంగ పెట్టుకుందా నీ స్నేహితురాలు!' బుగ్గలు నొక్కుకుని వంగి నేల మీది పుస్తకం పైకి తీసింది లలిత -- కవరా పుస్తకం లో పెట్టి క్షణం సేపు ఆలోచించింది. ఏం రాసి ఉంటాడు? అని ఆమె గుండె దడదడ లాడింది. దానిలో తానూహించని విధంగా ఉండాలని లలిత కోరిక. తన వూహలన్నీ అబద్దం అవాలనీ, మోహన్ తనకోసం పరితపించి పోయి నువ్వు లేకుండా నేను ఉండలేను, అని వ్రాయాలని లలితకోరిక. కాని ఏమో ఉత్తరం లో ఏం రాశాడో అన్న తెలియని భయం ఉత్తరం తెరవనీయలేదు.... చివరికి ఉత్తరం చూచింది లలిత. తీక్షణంగా చదివింది. ఒక్క పేజీలో ముత్యాల లాంటి అక్షరాలతో వ్రాశాడు.... చదివి ఉత్తరాన్ని అతి జాగ్రత్తగా మడిచి పెట్టింది.... అది చాలా ముఖ్యమైనది అన్నట్టు తన భవిష్యత్తు కది ఆటపట్టన్నట్టు...లలిత నెమ్మదిగా లేచి వెళ్ళి తెరిచి చదివింది....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS