Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 2


    'అక్కడికి మీరంతా ఏవీ ఎరగనట్లు - అవును గాని ఈ మధ్య మన ఊరు కేసి వెల్లోచ్చారటగా, అంతే కులసాయేనా.
    'ఆ, అదే కులాసా. అత్తవారి ఆసరా చూసుకుని అన్ని దొంగ పత్రాలు పుట్టించి లక్ష్మణ దేవర వంటి తమ్ముణ్ణి, ఆస్తంతా ఊళ్లాక్కు తరిమేసినవాడకి ఇక కులాసా ఎక్కన్నుంచి వస్తుందనీ? 'కూచేమ్మ కూడబెడితే మాచేమ్మ మాయం చేసిందీ.' అన్నట్టూ మమ్మల్ని దగా చేసి మూట గట్టిన ఆస్తంతా కొడుకులు కర్పూరం లా హరించబెట్టెశారుట్లే! ఇక కూతుర్లా? ఒక్కొక్కర్తే ఒక్కొక్క కారణం తో పుట్టిల్లు చేరిపోయారు. ఇక మీ బావగారూ, తోడి కోడలు. ఉబ్బసపు రోగంతో, కఠిన పత్యాల్చేస్తూ మంచాన్న పడున్నాడు. ఏదో నాన్న ప్రసాదం తిని పదేళ్ళ వొస్తుంది కదా నని తద్దినం నాటికి వెళ్లా తీరా వెళ్లానే గానీ, నాన్న కాలంలో పండిత సన్మానాల్తోటీ వేద పారాయణల తోటి కల కల్లాడు తుండే ఆ వీధరుగు లిప్పుడు జూదగాళ్ళ తోటీ సిగరెట్టు పేకల్తోటీ నిండి వుండటం చూస్తె ఎందు కెళ్లానా, అనుకుని కడుపులో బాదోచ్చేసిందంటే నమ్ము.'
    'ఏమో వదినా. వాళ్లేన్ని చేసినా మా మంచికే' అన్నట్టుగా ఊర్కున్నానే గానీ కల్లో కూడా వాళ్ళ కీడు మేం ఎన్నడూ కోరలేదు సుమండీ .' అన్నారు చిన్నబుచ్చు కుంటూ పార్వతమ్మ గారు.
    'మీరు కోరాలిటే? పిచ్చిదానా! ఎవరి పాపపుణ్యాలు వార్ని ఎక్కడి కెళ్లినా వదుల్తాయానీ? దీపం అర్పేస్తే చీకట్ని రమ్మనాలా ఏం. అన్నట్టు ఆరి పెద్ద వాడూ మీ దగ్గరే వున్నాట్ట కదూ.
    'ఔవొదినా  మాతో పాటే వాడూ పట్టుబట్టి వచ్చేశాడు. ఇద్దరిదీ మీ నాన్నగారి పేరే అవడం మూలాన్న అతన్ని 'రామం' అని పిలుస్తాం. వీణ్ణి రఘూ, అంటాం.'
    'పోనీ పూలతో పాటు నారకీ పరిమళం అబ్బినట్టు మీతో పాటు ఆ వంశానికి వాడొక్కడన్నా ముందుకు రానీ.'
    'ఏదో ఆ లలితాంబ దయలెండి బ్రోం చేద్దురు గాని....
    'అబ్బే, ఇవాళ అక్కడ కల్యాణం చేయిస్తున్నారు. పాడు తిండి పోనిద్దూ! మిమ్మల్నందర్నీ చూశా. కడుపు నిండి పోయినట్లే వుంది నాకు. మళ్ళీ అట్నుంచి రేపు వస్తాగా!' గా అంటూ లేచిందావిడే. ఈ ఈ సందడి విని సుధ చేత కాఫీ తాంబూలం పంపించింది జానకి.
    'అబ్బబ్బ ఇప్పటి కప్పుడే మూడు మాట్ల యింది ఈ కాఫీ. సరి ఇలా ఇవ్వు' అంటూ పార్వతమ్మ గారి చేతులోని గ్లాసందుకుని తాగారావిడ. ఈలోగా వాకిట్లో కారు హారన్ కొట్టింది. ఖంగారుగా లేవబోయారావిడ.
    'ఉండండి వాళ్ళనీ లోపలికి పిలుస్తా.' అంటూ లేవబోయిన పార్వతమ్మ గార్ని 'నా తల్లివి కదూ అవిడిప్పుడోచ్చి మాటలకి తగులు కుందంటే ఇక కల్యాణం చేసినట్టే ఇవాళ. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం గా? వస్తా.' అంటూ లేచి బయల్దేరి నావిడ మళ్ళీ ఆగి 'అన్నట్టూ ఈకుంటి పిల్లెవరూ అన్నారు మెల్లగా.'
    'మా శ్రీధరు కూతురు' చిన్నబుచ్చు కుంటూ అన్నారు.
    'ఆ? ఆ? అన్నట్టు విన్నానమ్మా ఏదీ మీ మరదలూ.' అంటూ లోపలి కెళ్ళబోయి, మళ్ళీ కారు హారన్ వినిపించగానే 'వాళ్ళు తొందర పడుతున్నట్లున్నారు వస్తా వదినా' అంటూ గబగబా వెళ్ళిపోయారావిడ.
    ఆ కుంటి పిల్లెవరూ?' దాదాపు రెండు ఘంటల సేపు జరిపిన వారి సంభాషణ అంతటికి ' ఆ కుంటి పిల్లెవరూ అని శ్యామలాంబగారడిగిన ఆ చివరి ఒక్క మాటే, పార్వతమ్మ గారి గుండెల్లో అలా వుండిపోయింది. అవును ఆవిడ అలా అడగడం లో తప్పేం వుందని? సుధలోని ఈ అవిటితనాన్ని తొలిసారిగా చూసినప్పుడు తను మాత్రం అనుకోలేదూ? ఆవిడకే తెలియకుండా ఆనాటి సంఘటన్లలోకి పరిగెత్తింది ఆవిడ మనసు.
    అనకాపల్లి లో ఒక ఇంట్లోని వో భాగంలో కాపురముంటున్న రోజులవి. మర్నాటి ఉగాది పండుగ నుద్దేశించి, ఇల్లు కడిగి ముగ్గులు పెడుతుంది పార్వతమ్మ. ఉన్నట్టుండి పెద్ద వాన కురిసి వేలిసిందేమో. ఇంటి వారి పిల్లల్తో కలిసి వీధరుగు మీద ఆడుకుంటున్న రఘు వో కాయితం పడవని నీళ్ళల్లో ఓదల్డాని కని వాకిట్లో కెళ్ళిన వాడల్లా, వో చిన్న పాపని భుజం మీద పడుక్కో పెట్టుకుని తుంపర్లు మీద పడకుండా తన చీరే చెంగు కప్పుతూ ఎవరింటికోసరవో వెతుక్కుంటున్న వో ఇల్లాల్ని వీధి చివర చూడ్డంతోనే దబ్బున అటు పరుగెత్తు కెళ్లి,
    'ఎవరి కోసరమండీ?' అనడిగాడు.
    'ఈ వీధిలో శివశర్మ గారని ఎవరన్నా ఉన్నారా బాబూ' అని అతి నెమ్మదిగా అడిగిందావిడే.
    'వో, వున్నారండీ. రండి తీసుకెళ్తా.' అంటూ బలవంతంగా ఆవిడ చేతులోని గుడ్డ సంచిని తనందుకుని ముందు నడిచేడు రఘు. ఎవరో కొత్త మనిషిని వెంట పెట్టుకుని వస్తూన్న రఘుని చూసి పిల్లలంతా ఎదురొచ్చారు. గుమ్మం దాకా వచ్చిన రఘు 'రండి, ఇదే వారిల్లు.' అంటూ తను ముందుగా లోపలికి పరుగెత్తి, 'అమ్మా మనింటి కెవరో వస్తున్నారు.' అంటూ అరిచాడు.
    ఎక్కడో ఈ మారుమూల తలదాచు క్కాలక్షేపం చేస్తుంటే తమ ఇంటికి వచ్చేవాళ్ళేవరా. అనుకుంటూ చేతులో పనోదలి, మండువా లో కొచ్చిన పార్వతమ్మ గారు తేరీ పారా , ఆ వచ్చిన యువతి వేపు చూడగానే 'అయ్యో జానకి, నువ్వా?' అంటూ ఒక్క పరుగునోచ్చి ఆవిడ్ని కౌగలించుకున్నారు. వారు ఏడ్పులకి బెదిరి, తనూ ఏడుస్తున్న పాపని రఘు తీసుకున్నాడు.
    'ఎప్పుడైతే ఎన్ని ప్రయత్నాల్చేసినా మీ ఆచూకీ ఏమాత్రం తెలియలేదో, అప్పుడే అనుకున్నావమ్మా, ఏదో కొంప మునిగి పాయింటుందని.'
    అంటూ పార్వతమ్మ గారు దుఖిస్తుంటే 'నిజం, ఆ జానకి ఎప్పుడో చచ్చి పోయిందోదినా , సర్వస్వాన్నీ ఆ దేశానికి ధారపోసేసుకు వచ్చిన నిర్భాగ్యురాలీ జానకీ' అంటూ ఆడబిడ్డ గుండెల్లో మొహం దాచుకుని ఏడ్చింది జానకి.
    'ఏం చేస్తాం తల్లీ. మనం ఎంత పెట్టి పుట్టావో అంతా! రా, లోపలికి రా!' అంటూ చెయ్యి పట్టుకుని తమ భాగంలోకి తీసుకెళ్ళిన పార్వతమ్మ గారు వో పీట వేసి జానకిని కూర్చోపెట్టి 'ఉస్స్' అని తనలో ఎగసు కోస్తున్న బాధని నిట్టుర్సు లతో బయటికి నెట్టుతూ, జానకి పక్కనే తనూ కూర్చున్నారు.
    రెండు చేతుల్లోనూ బజారు సామాన్ల సంచుల్ని పట్టుకు లోపలి కొచ్చిన శర్మ గారు ఇంట్లో మరో కొత్త మనిషుండడం పార్వతమ్మ వాళకం , బయట రఘు చేతుల్లో వున్న పాపా! ఇవన్నీ చూసి సంగతి కొంతవరకూ ఊహించుకున్నారు. శర్మ గార్ని చూడ్డం తోనే మళ్ళీ పార్వతమ్మ దుఃఖం పెల్లుబికింది చేతులోని సంచుల్నీ వోరగా చేరబెట్టి శూన్యం లోకి చూస్తూ నిలబడ్డ శర్మ గార్ని చూడగానే అప్పుడే ఏదో జరిగిందన్నంత దుఃఖంతో బారుమందావిడే.
    'ఏవిటిది పార్వతీ? ఆపద సమయంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ పిల్లకు ధైర్యం చెప్పడం పోయి ఇదా నువ్వు చేస్తున్న పనీ?' అంటూ మందలించారు. భర్త చేసిన ఈ సాంకేతికమైన హెచ్చరింపుతో ఆవిడలో చైతన్యం కల్గి దబ్బున కళ్ళూ, ముక్కూ తుడుచుకుంటూ లేచారు. దబ్బున పెరట్లో కెళ్లి కుంపటంటించుకుని ఆవిడే వంటింట్లో కొచ్చేసరికే నిద్రపోతున్న సుధని ఒక వారగా , చాప మీద పడుక్కో బెట్టి, బెంగ పడ్డట్టుగా పక్కని కూర్చున్నారు ఆరేళ్ళ ప్రాయం గల రఘు. కారణం ఫలానా అని తెలియకపోయినా, ఏదో కష్టంతో కూడిన సంగతని మాత్రం గ్రహించుకున్నాడు రఘు.
    'పాప నిద్రపోయిందిగా! ఇంక నువ్వెళ్ళి ఆడుకో బాబూ' అన్నారు పార్వతమ్మ గారు అంత బాధలోనూ కూడా. 'ఈ పిల్ల బాధ్యతంత తనదే' అన్నట్టు దిగులుగా కూర్చునున్న రఘుని చూస్తె ఆవిడకి నవ్వొచ్చింది.  
     'పాపం పాపకి ఆకలమ్మా . వెళ్లేలా చీక్కుంటుందో చూడు' అంటూ సరిగ్గా బట్ట కప్పి వెళ్ళిపోయాడు రఘు.
    'ఇందా , వేడి వేడిగా ఈ కాఫీ తాగు. కాస్త ప్రాణం కోలుకొంటుంది.' అంటూ వాచిపోయిన కళ్ళతో గోడకు చేరగిలబడి కూర్చునున్న జానకి కి, కాఫీ గ్లాసు నందించి 'నాన్న వాకిట్లో వున్నట్టున్నారు పిలు బాబూ' అన్నారు వేణుతో.
    చాలా నిస్త్రాణగా వున్న జానకికి అవేడి కాఫీ తాగేసరికి ప్రాణం తెరుకుందేమో , దగ్గరున్న సంచీ తల కింద పెట్టుకుని అలా ఆ చాప మీదే చుట్ట చుట్టూ కున్నట్టు ముడుచుకు పడుక్కుని నిద్రపోయింది. మెల్లగా లోపలి కొచ్చిన శర్మ గారు జానకి నిద్ర పోయుండడం చూసి, తమకి వున్నదే గదీ, వంటిల్లూ రెండే అవడం వల్ల గది తలుపు వొర వాకిలిగా లాగి, పార్వతమ్మ కి సమీపం లో వో పీట వాల్చు క్కుర్చున్నారు.
    'పార్వతీ?' ఖాళీ గ్లాసు కింద పెడుతూ మెల్లగా పిల్చారు. 'ఎందుకన్నట్టుగా అయన వేపు చూశారావిడ.
    'చూడూ! మనసు స్థిమిత పరుచు కుని నే చెప్పబోయే విషయాల్ని శ్రద్దగా విను.' లాలనగా భార్య వీపు నిమురుతూ అన్నారాయన. కుంపటి మీద అత్తెసరు పడేసి! ఆయనవేపోసారి చూసి . జానకి నిద్ర పోతున్నట్టు తెల్సుకున్నాక 'చెప్పండి.' అన్నారు కళ్ళూ, మొహం తుడుచుకుంటూ , అయన వేపు తిరిగి కూర్చుంటూ.  
    'జానకి తన విషయాలేవన్నా చెప్పిందా?'
    'నేనింకా అడగలేదు.'
    'తెలివైన పని చేశావ్. అసలింతట్లో అలాంటి తెలివి తక్కువ పన్లెవన్నా చేశావంటే ఈ నలుసుకి , ఆ తల్లన్న వస్తువుండే అదృష్టం కూడా లేకుండా చేసిన్దానవవుతావ్. తెలిసిందా?'
    తెల్లబోతూ అయన మొహం లోకి భయంగా చూసిందావిడ.
    'అవును పార్వతీ? ఒంట్లో నెత్తురన్న మాట లేకుండా, పాలిపోయిన్న ఆ పిల్ల వాలకం చూస్తె, అసలిప్పటికే భయంకరమైన దీర్ఘ వ్యాధైనా , అంకురించిందేమో నని కూడా అనిపిస్తుంది నాకు.
    మళ్లీ కన్నీరు పెట్టుకోసాగారావిడ.
    'అబ్బ, నీ బాధ నేనేరగంది కాదు పార్వతీ! అయినా విధి విలాసం ఇలా వున్నప్పుడు విచారించి ఏం లాభం చెప్పు. అదీ గాక విన్నంత మాత్రానికే మనకిలా వుంటే, ఇన్ని యాతన్లూ స్వయంగా అనుభవించిన ఆ పిల్ల ప్రాణం ఎంత బెదిరి పోయిందో, ఆ సంగతీ మనం ఆలోచించోద్దూ, చెప్పూ, అందుకే ధైర్యాన్ని కూడదీసుకుని మున్ముందు జరగాల్సిందాన్ని గురించి ఆలోచించాలి. అనడం. ఏం?' బోధపరిచే ధోరణి లో చెప్పారు....' తడిసిన కనురెప్పల్ని రేపరెపా వోసారి అర్చుకుని సర్దుక్కూర్చున్నారావిడ. ఎలాగో దుఃఖాన్ని దిగమింగు కుంటూ.
    'ఆ అమ్మాయి పరిస్థితి చూస్తె మనం భయపడ్డంతా నిజంగానే జారిగిపోయుంటుందన్న సంగతి తెలుస్తూనే వుంది గదా? ఇక భర్తతో పాటు మిగతా సర్వస్వాన్ని కూడా పోగొట్టు కున్నదన్న సంగతి. ప్రత్యక్షంగా కనుపిస్తూనే వుంది గనక -- ఇక ఆ పిల్లనీ విషయాల్తో కదిపి భాదించడం లో అర్ధమే లేదు. అందుకే, అన్ని విధాలా చితికిపోయిన ఆ తల్లీ పిల్లల్ని అందులోనూ మనల్ని వెతుక్కుంటూ మన యందు పరిపూర్ణ విశ్వాసాన్ని పెట్టుకోచ్చిన వారిద్దర్నీ , కాపాడడం మనకేంతైనా విధాయకం. ఎవంటావ్?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS