"పిచ్చిదానా, ఇందులో నీవు చేసిన మోసము ఏముంది? లక్ష రూపాయల కట్నము అనగానే, మేము దురాశ పోయాము.... అదంతా దేనికి? నిన్ను తిడితే ఒరిగే లాభము ఏముంది చెప్పు? పొద్దు పోయింది పడుకో." అతను లేచాడు, ఆమె అతని చెయ్యి పట్టుకుంది. అతను వెనుతిరిగి చూచాడు.
"ఏమిటి అరుణా ఏం కావాలి?"
"మీరు ఇక్కడే పడుకో కూడదూ! ఒంటరితనము నన్ను పీల్చి వేస్తుందండీ. ఆత్తయ్యతో చనువుగా కబుర్లు చెప్పలేను. కాస్త మాట్లాడుతూ అన్నీ మరిచిపోతాను." ప్రాధేయ పూర్వకంగా అడిగింది.
'నాపై నీకున్న నమ్మకము అమ్మకు లేదు. మరేం ఫరవాలేదు. రేపు ,మరి కొన్ని పుస్తకాలు పట్టు కొస్తాను పడుకో." తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలాడు. అరుణ యేమో చెప్పబోయింది. సరస్వతమ్మ తాంబూలము నములుతూ , అలాగే ఆకూ వక్కల పళ్ళెము పట్టుకుని వచ్చింది. ఎదుటి మంచం పై చతికిల బడింది.
"నొప్పి ఎలా ఉంది అమ్మాయ్?"
"ఇప్పుడంతగా లేదత్తయ్యా' నెమ్మదిగా జవాబు చెప్పింది. భార్యకు కళ్ళతోనే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్.
'మరో కప్పు పాలు త్రాగుతావా?"
'వద్దు , అవంటేనే అసహ్యం వేస్తోంది."
"అలాగంటే ఎలా? నొప్పి భరించటానికయినా శక్తి ఉండద్దూ? పోనీ బత్తాయి రసం తీసి ఇవ్వనా?"
"ఇప్పుడెం వద్దత్తయ్యా . కడుపు నిండుగా వుంది." అని , అలికిడికి గుమ్మం వైపు చూచింది. రంగారావు వస్తున్నాడు. ఆదరా, బాదరాగా లేచి కూర్చుంది. "పడుకో అమ్మా, నీకెలా ఉందొ అడగాలని వచ్చాను. సరస్వతీ ! అమ్మాయికి దానిమ్మ పళ్ళు వలిచి పెట్టావా?"
"మరిచే పోయాను. ఇప్పుడెం వద్దంటుందండి." అతనేం మాట్లాడక వెళ్ళిపోయాడు. సరస్వతమ్మ పేరంటాలకు వెళ్ళి అలసిపోయి ఉందేమో లైటు అర్పి పడుకుంది. చంద్రుడు మబ్బుల్లోకి తప్పుకున్నాడు. అరుణ తను అనుభవించిన ఆనందపు ఘట్టాలే గుర్తు కోస్తుంటాయి. వాటి ఆయస్సు అంత అల్పమని ఆమెకేం తెలుసు? .....వివాహమైన మరురోజు అమ్మలక్కలు కూర్చుని అరుణ అదృష్టాన్ని, ఆనందరావు అందాన్ని పొగడసాగారు.
"ఉండండర్రా. మా మరదలు అసలే ఆనందం అందం చూసి ఉక్కిరిబిక్కిరి అవుతుంది." పూల జడ సవరిస్తూ మేలమాడింది వాసు భార్య మీన.
'వదినా?' చిరుకోపంగా చూసింది.
"అలాంటి చూపులన్నీ దాచిపెట్టు, మా తమ్ముడి దగ్గర ప్రదర్శించాలి.'
"అక్కయ్యా! వదిన చూడు." ఆటే వస్తున్న మారుటి అక్క వనజతో చెప్పింది.
"వదిన నేరం తరువాత పరిశీలిద్దాం. ఉదయం నుండి దర్శనం లేదని, మా మరిది గారు అలక పాన్పు అలంకరించారు రావే, చెయ్యి పట్టి లాగింది.
"నువ్వోహకటి? ఉండక్కయ్యా."
"అరుణా! ఇలా రామ్మా." వాసు పిలిచాడు. త్వరగా అన్నగారున్న చోటికి వెళ్ళింది.
"ఆనంద్ కు తలనొప్పి గా ఉందటమ్మా. ఈ కాఫీ, మాత్రలు ఇచ్చిరా.' అన్న మాట తీసివేసే ధైర్యం తనకు లేదు నెమ్మదిగా ట్రే పట్టుకుని పైకి వెళ్ళింది. తలపై చేయి వేసుకుని పడుకున్నాడు. అతన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. సిగ్గు తెరలను తొలగించుకుని అతని దగ్గరగా వెళ్ళింది.
"తలనొప్పి కి మాత్రలు తెచ్చాను." నెమ్మదిగా, మృదువుగా చెప్పింది. అతను కళ్ళు విప్పాడు. నెమ్మదిగా ఆ కళ్ళు ఆనందాన్ని వెదజల్లాయి.
"శ్రమ పడి నువ్వే వచ్చావా?' అన్నాడు అతను మాత్రలందుకుని మ్రింగాడు.
"ఏం లేదు. కాస్త భారంగా వుంటే మామగారు కంగారు పడ్డారు. రాత్రి రెండు గంటల వరకు పెకాడాం కదూ." అన్నాడు. ఆమె చేయి అందుకుని తన చెంత చోటు చూపుతూ .కుంకుమ వర్ణము దాల్చిన ముఖం అతను చూడరాదని నెల కభిముఖంగా తిప్పింది.
"నిద్ర వస్తుంది నువ్వలాగే కూర్చో. నీ అందాన్ని ఆస్వాదిస్తూ పడుకుంటాను.' అతను చెప్పే మాటలు వింటూ మధ్య మధ్య అతను చేస్తే చిలిపి చేష్టలకు , చిరుకోపం ప్రదర్శిస్తూ కూర్చుంది. అరగంట కతడు నిదుర బోయాడు. అతని చేతిలో ఉన్న తన చేతిని తీసుకుని దూరం జరిగింది. తల్లీ, తండ్రి డాక్టరు ను వెంట బెట్టుకు వచ్చారు. అతను నిదురబోవటము చూచి తేలికగా నిట్టుర్చారు.
"నిన్ను రప్పించటానికి వేసిన వేషం కాదు కదా అమ్మాయి?' పరిచయస్తుడు, పరిహాస ప్రియుడైన డాక్టరు ప్రశ్న. లేచిన తరువాత ఇమ్మని, మరో రెండు మాత్రలు ఇచ్చిన అతను వెళ్ళిపోయాడు.
జరుగవలసిన కార్యక్రమాల తరువాత అత్తవారింటికి బయలుదేరింది. ఆడంబరంగా సారే ఇచ్చి పంపుతూ, కన్నీరు పెట్టుకుంది తల్లి. అన్నగారు మాత్రం గంబీరంగా ఉండిపోయారు. కోడలు యెక్కడ అరిగిపోతుందో నన్నంత అపూరూపంగా చూసింది సరస్వతమ్మ. దారి పొడవునా ప్రతి పది నిమిషాలకో తడవ కోడలికి చల్లని పానీయాలు తెప్పించాడు రంగారావు. ఒరచూపులతో, చిరునవ్వులతో , పెద్దవారు కనుమరుగవగానే , చిలిపి పనులతో పుట్టింటి ధ్యాస నుండి మరల్చాడు ఆనందరావు. అత్తవారిల్లు చేరినాక. అక్కడి వారితో కలసి పోయి హాయిగానే తిరిగింది. రెండవరోజు వీధిలోకి ముత్తైదువులంతా కొత్త కోడలిని చూడాలని వచ్చారు.
"అమ్మా అరుణా అందరికి పసుపు బొట్టు ఇవ్వమ్మా' అత్తగారి అజ్ఞాను అనుసరించి వెండి పళ్ళెం లో ఉన్న , పసుపు , గంధం కుంకం గిన్నెలు పళ్ళెం లో పట్టుకుని అందరికీ ఇవ్వసాగింది. గోధుమ వర్ణపు జరీ చీరేతో కెంపులు పొదిగిన నగలతో మెరిసిపోతోంది అరుణ.
"లక్షాదికర్ల కూతురు , కాలేజీ చదువులు చదివింది, అంటే యెంత అతిశయమో . అనుకున్నాము సరస్వతక్కా. నీ కోడలు కలుపుగోలు పిల్లమ్మా." ఒకామె అంది.
"అవును మంగమ్మ కోడలు పట్టుమని పది వేలు తెచ్చుకుందో లేదో యెంత అతిశయమని. యెప్పుడూ మేడ దిగదు." మరొకామె మెచ్చుకుంది.
"ఎదోనర్రా, ఈ యింట ఆడపిల్లలు లేక అలమటించి పోయాను. భగవంతుడు దయామయుడు. నా ఇంటికి ఒకేసారి కోడలిని, కూతురిని పంపాడు. సరస్వతమ్మ మురిసిపోతూ అందరికి పండ్లు పంచి పెట్టింది. ఆనందపుటంచుల చివర వరకు పయనించింది. ఆ అందము క్షణికమేనని, భవిష్యత్తు ఇంత భయంకరంగా ఉంటుందని ఆమెకేం తెలుసు? పేరంటాళ్ళు వెళ్ళిపోయారు. అత్తగారికి సామాన్లు సర్దడం లో సాయము చెయ్యసాగింది.
"పైన వాడొక్కడూ ఉన్నడమ్మా. ఏం కావాలో అడిగిరా" అత్తగారి మాటలు విని నెమ్మదిగా మేడ మెట్లు యెక్కసాగింది. ఉన్నట్టుండి కడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. అక్కడే గిలగిల తన్నుకోసాగింది. ఆమె అరుపు విన్న ఆనంద్ గదిలో నుండి పరుగు పరుగున వచ్చి, ఆమెను యెత్తి గదిలోకి తీసుకు పోయాడు.
"ఆరూ! ఏమయింది?" మంచంమీద పడుకోబెట్టి అడిగాడు. ఆమె జవాబిచ్చే స్థితిలో లేదు యెన్నడూ యెరగని బాధ. మెలికలు తిరుగసాగింది. అతను గాభరాగా తల్లిని పిలిచాడు. ఆమె వచ్చి కోడలు కడుపు నొక్కుతూ కూర్చుంది.
"నిశ్చయంగా దృష్టి రా. ఈ వీధిలో అన్ని హంగులున్న దేవరికి? శాస్త్రి గారి కోడలు పిండి బొమ్మలా తెల్లగా ఉంది. మెడలో పూసలు లేవు. నాయుడి గారి కోడలికి యెన్ని ఉన్నా కొయ్య బొమ్మలా వుంది. నా తల్లి లక్ష్మీదేవిలా ఉంది. అందరి కళ్ళు దానిమీదే.' ఆవిడ ఆప్యాయత కు తట్టుకోలేక పోయింది. కాదు నాకీ నొప్పి ఉంది . అమ్మ చాచి పెట్టి ఈ వివాహము చేసిందని" చెప్పబోయింది. గొంతు మూగబోయింది. మాట మధ్యలోనే ఆగిపోయింది. మూగగా కన్నీరు కార్చింది.
"ఊర్కో తల్లీ ఇప్పుడే దృష్టి తీయించి వేస్తాను. ఆవిడ క్రిందికి పోయింది.
ఆనంద్ వచ్చి దగ్గర కూర్చున్నాడు.
"ఇంత అందంగా వున్నావు. దురాశ దేనికి! ఆ అలంకారము చూడు. నాకే కన్ను కుడుతుంది' ముంగురులు సవరించాడు. అంత బాధలోనూ నవ్వు వచ్చింది. అత్తగారి అభిప్రాయము ననుసరించి, దృష్టి తీశారు. మామగారు ఏదో చూర్ణమిచ్చారు. వేడి నీటి సంచితో కాపడము పెట్టాడు ఆనంద్, కాస్త తగ్గినట్టని పించింది.
"యెలా ఉంది ఆరూ?"
"తగ్గిపోయింది . ఇక చాలు' అతని చేతిలోని సంచి అవతల పెట్టింది. అతనామే నుదుట పట్టిన చెమట తుడిచి కబుర్లు చెప్పుకోసాగాడు.
"ఏమండీ నాకిలాగే చచ్చిపోవాలని వుంది.' అన్నది అకస్మాత్తుగా ఆక్షణము లో అలాగే అనిపించింది. తన విషయము పూర్తిగా తెలియక మునుపే అందరి ప్రేమాదరణలలో అలాగే చచ్చిపోవాలని పించింది. అతను మృదువుగా రెండు చెంపలు వాయించాడు.
"మళ్ళీ అను అలాంటి మాట."
"అంటే రెండు దెబ్బలు వేస్తారు. అంతేగా?' నీరసంగా నవ్వింది.
"అప్పుడే భర్తంటే సంసారమంటే అంత విసుగు పుట్టిందా?' అతను అలక నటించాడు.
"లేదు. మీకెలా చెప్పేది. నా హృదయం నిండుగా వున్న కోర్కెలు మీ సమక్షం లో పండించు కోవాలని , అమ్మ కంటే ఆదరంగా చూచే అత్తగారికి ఆసరగా ఉండి, ఆమె చే పొగడ్తలు అందుకోవాలని...'
"చాల్లే కాసేపు కళ్ళు మూసుకుని పడుకో." మందలించాడు. కాలమే తెలియలేదు. కళ్ళు విప్పేసరికి రాత్రి యెనిమిదిగంటలు దాటింది. యెవరో బంధువుల అమ్మాయి తన మంచము దగ్గర కూర్చుంది.
"ఆనంద్ ,మామయ్య భోజనానికి వెళ్ళారు" ఆ అమ్మాయి మాట పూర్తి కాకమునుపే ఆనంద్, వెనుకాల చిన్న వెండి గిన్నె పట్టుకుని అత్తగారు వచ్చారు.
"లేచావా అమ్మా, నేను చెప్పలేదూ. కంటి మహిమే. అన్నము తింటావా?"
"కాస్త ఆగి తింటాను." అన్నది లజ్జితురాలవుతూ.
"క్రింద ఆడవారి భోజనాలు కాలేదు. వెళ్ళనా మరి' బల్ల మీద గిన్నె పెట్టి , మూత వేసింది. అత్తగారి వెంట అంతవరకూ కూర్చున్న అమ్మాయి కూడా వెళ్ళిపోయింది.
"బాత్ రూమ్ కెళ్లాలా?"
"అవును, దుస్తులు కూడా మార్చాలి."
"ఏం ఆడవారు! ప్రాణము కంటే చీరలు యెక్కువ. అది పాడయితే మరొకటి కొందాము."
"కొనరని కాదు. భగవంతుడు దయామయుడు . అన్నీ లోపము చేయలేదు.'
"ఏమిటా పిచ్చి మాటలు."
"పిచ్చి ,మాటలా! మీకలాగే అనిపిస్తుంది. ఈ పట్టు చీరలో మహా ఉక్కగా వుంది" ఆమె బాత్ రూమ్ కెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కునేలోపల అతను పెట్టె తీసి కాటన్ చీర తీశాడు. ఆమె విప్పిన దుస్తులు స్టాండ్ పై వేశాడు.
"వ్సూ! వ్సూ! మీ అమ్మగారు పొరపాటు చేశారు."
"ఏం చేశారు?" గాభరా పడ్డట్టే అడిగింది.
"అంత గాభరా దేనికి? ఈ యువరాణి కి తోడు ఓ దాసిని పంపకూడదు?"
"మహారాజు వంటి మామగారు ఆ కొరత తీరుస్తారు లెండి." నవ్వుతూ దుస్తులు మార్చుకుంది. ఆమె అన్నం తిని అలసటగా దిండు మీద వాలింది.
"ఆరూ! నీవింత అందంగా ఎందుకున్నావ్?' మత్తుగా చూస్తూ , ఆమె చెంతకు చేరాడు. అతని ఒడిలో తల పెట్టి, అతని రెండు చేతులు చెంపలకు రాసుకుంది.
"నేను ఈ గదిలో పడుకుని నిన్ను గూర్చి యెన్ని ఊహించాను? అమ్మాయి గారేమో వస్తూనే ఓ ఒంక పెట్టారు." అన్నాడు.
"పోదురూ! అన్నీ కోతలు అత్తయ్య చెప్పలేదూ?"
