Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 2

 

    ఈ పదిహేనేళ్ళ లో అనేకమైన మార్పులు వచ్చాయి. ముప్పై యేడు లో కాంగ్రేసు మంత్రి వర్గాలు ఏర్పడ్డాయి. రెండేండ్లు తిరక్కముందే రాజీనామా లిచ్చాయి. ఆంధ్రకేసరి ప్రకాశం చెన్నపట్నం లో తుపాకికి  గుండె చూపాడు. తెలుగు వాడు గుండె దిటవు చూసి తెల్ల వాడి గుండె ఝల్లు మంది. నలభై రెండులో దేశమంతటా విప్లవ జ్వాల వ్యాపించింది. విశ్వనాధం గారు అరెస్టయ్యారు. రామనాధం గారు కొడుకు జైల్లో ఉండగానే చనిపోయారు. నాలుగు నెలల తరువాత తిరిగి వచ్చిన విశ్వనాధయ్య గారు తండ్రి మరణానికి కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్యను చూసేసరికి విశ్వనధయ్యగారు కడుపు చేరువై పోయింది. తినటానికి తిండి కరువై, మనసుకు శాంతి కరువై, కంటికి నిద్ర కరువై ఆవిడ ఎముకల పోగై పోయింది. నలభై యేడు లో స్వరాజ్యం వచ్చింది. మధాకకు తాళలేక స్వరాజ్యం యిచ్చారని అందరూ అన్నారు. కానీ బ్రిటీషు వారికీ వచ్చిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు అలాంటివి. లేబరు పార్టీ అధికారానికి రాకపోతే మనకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు అనుకున్నారు కొందరు. స్వాతంత్ర్యదినం రొంపిచర్ల లో బ్రహ్మాండమైన సభ జరిగింది. చుట్టుపట్ల పదిమైళ్ళ నుంచి జనం మహదానందంగా వచ్చారు. ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకొని వచ్చారు. మేళ తాళాలతో నాట్యం చేసుకుంటూ వచ్చారు. ఆనాడు రొంపిచర్ల లో గ్రామం ఒక పెళ్ళి పందిరై పోయింది. ఆనాటి సభకు విశ్వనాధయ్య గారు అధ్యక్షులు. అదే వారి జీవితంలో మరువలేని సంఘటన!
    స్వతంత్ర్యం రాగానే విశ్వనాధయ్య గారు స్నేహితులకు పనికి రాని వారయ్యారు. వారి పదవులు, స్వార్ధం -- ఇవే గాని విశ్వనాధయ్య గారు వారి కళ్ళకు అనలేదు. బట్టల మీద దుమ్మును దులిపెసినట్లుగా పాతచోక్కాను విసిరేసినట్లుగా, తెగిపోయిన చెప్పును వదిలేసినట్లుగా వదిలేసి నాయకులు విశ్వనదయ్య గారిని విసర్జించారు.
    ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న విశ్వనాధయ్య గారు రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఏనాడూ జీవితానికి గుడ్డి గవ్వంత విలువ యివ్వని విశ్వనాధయ్య గారు దానికంటే మించింది లేదనుకున్నారు. కానీ జీవితం విలువను వారు గుర్తించేసరికి చాలా ఆలస్య మైపోయింది. అందరూ కొన నిరాకరించిన తుమ్మతోపు చేను మినహా భూమి లేదు. సుందరమ్మ మేడలో ఉన్న తాళి బొట్టు మినహా కొంపలో బంగారం లేదు. తుమ్మ తోపు మిట్టను రాయీ కంపా కొట్టించి సరిచేయించారు. అందులో ఒక పాడుబడ్డ గూడగుంతను బాగు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఊరి పెత్తనాలకు భారత వాక్యం పలికి, శ్రద్దగా సేద్యంలోకి దిగారు విశ్వనాధయ్యగారు.
    విశ్వనాధయ్య వద్ద రాజకీయాలు నేర్చుకున్న వాళ్ళంతా చిన్నా పెద్దా నాయకులై పోయారు. కొందరు అఫీసర్లై పోయారు. తెల్లవాడ్ని చూస్తె అగ్గి రాముడై పోయి, వాణ్ణి నడి రోడ్లో చీల్చేస్తానన్న ఓబులు రెడ్డి తెల్ల గవర్నమెంటు ఉద్యోగై డిప్యూటీ కలెక్టరై పొయ్యాడు. రొంపిచర్ల కు రెండు మూడు సార్లు అతడు వచ్చి పోయినట్లు విన్నాడే గానీ, తాను వెళ్ళి చూడలేదు విశ్వనాధయ్య గారు. కానీ, మరొక్కసారి ఓబులు రెడ్డి విశ్వనాధయ్య గారికోసం జవాన్ను పంపాడు. విధి లేక, ఇష్టం లేక వెళ్ళారు విశ్వనాధం గారు. వారి స్థితిని చూసి చాలా విచారించాడు ఓబులురేడ్డి. విశ్వనాధయ్యగారు ఎంత వద్దన్నా అతని పొలానికి అనుకోని ఉన్న మూడెకరాల బంజరుకు పట్టా యిస్తానని చెప్పి దరఖాస్తులు తీసికొన్నాడు. అంతే, నెల రోజుల్లో విశ్వనాధయ్యగారి పేరుతొ పట్టాలు వచ్చాయి! విశ్వనాధయ్యగారు ఆనందం, ఆశ్చర్యం పట్టలేక పోయారు. సుందరమ్మ ఆనందం సంగతి సరేసరి!
    కానీ వారి ఆనందం చాలా రోజులు నిలవలేదు. పీలేరు లో యిచ్చిన విశ్వనాధయ్య గారి చెల్లెలు రత్నమ్మ భర్త చనిపోయాడు. ఆవిడ పన్నెండేళ్ళ కూతురుతో కూడా విశ్వనాధయ్య గారి ఇల్లు చేరింది. కొడుకు చదువే సమస్యగా ఘనీభవించి విశ్వనాధయ్య గారి తలను తొలుస్తుంటే, చెల్లెలి కూతురు శారద పెళ్ళి రెండో సమస్య అయి కూర్చుంది.
    కానీ జీవితాన్నంతా జీవితంతో పోరాడటం కోసమే వినియోగిస్తున్న విశ్వనాధయ్య గారు అలాంటి సమస్యలతో డీలా పడిపోలేదు. ధైర్యంగా, ధీరోదాత్తంగా ఎదుర్కొన్నారు. అందుకే కొడుకీనాడు బియ్యే చదువుతున్నాడు. శారద పెండ్లికి కూడా భగవంతుడు ఒక దోవ చూపిస్తాడు.
    విశ్వనాధయ్య గారికి రెండే కోరికలు ఉన్నాయి. తన కొడుకు ఉమాపతి బియ్యే పాసయి ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. శారదను ప్రకాశానికి యిచ్చి పెళ్ళి చేయాలి. ప్రకాశం కాస్తో కూస్తో చదువుకున్నవాడు. నిదానస్తుడు. అన్నిటినీ మించి నలుగురి బాగే తన బాగనుకున్న వాడు.
    అందుకే విశ్వనాధయ్య గారికి ప్రకాశమంటే ప్రత్యేకాభిమానం.
    ఒంటరిగా కూర్చుంటే చాలు, విశ్వనాధయ్య గారు తన గత చరిత్రను సింహావలోకనం చెయ్యడం లో మునిగిపోతారు.
    ఈ రోజూ అంతే. సుందరమ్మ వచ్చి చూసింది. విశ్వనాధయ్య గారు పెరట్లో కూర్చుని ఉన్నారు.
    "ఏమిటండీ , అలా పెరట్లోనే కూచున్నారు?"
    విశ్వనాధయ్య గారు జవాబుచేప్పలేదు. సుందరమ్మ వెళ్ళి, భుజం పట్టి కుదుపుతూ మళ్ళీ పలకరించింది.
    "అదే, ఉమాపతి గురించి" అన్నారు విశ్వనాధయ్య గారు.
    "ఏమిటీ?"
    "వాడలాగౌతడని నేను కల్లో గూడా అనుకోలేదు. వాడేదో ఆ పరీక్ష పూర్తీ చేసి ముసలి ముప్పులో మనకంత గంజి పోస్తాడనుకున్నాను. కడకు వాడు అన్ని విధాలా చెడి పొయ్యాడు. వాడికి లేని దుర్గుణాలు లేవు. ఈరోజు మదరాసు నుంచి ఏవతో- విమలట -- అది తక్షణం బయలుదేరి రమ్మని ఉత్తరం వ్రాసింది.'
    "మరో విషయం. మన శారద లేదూ-- అది సజ్జ చేను వద్ద కేడితే వెళ్ళాట్ట-- ఎవరూ లేని సమయం చూసుకొని...."
    "ఛ ఛ! వాడి పెరేత్తకు. ఛండాలపు వెధవ. వాణ్ణి రేపే మద్రాసుకు సాగేస్తాను. వాడు కొంపలో ఉంటె మనం ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలెం. ఈ సంవత్సరం అక్కడే చదువు వెలిగించనీ! వచ్చే యేడు టీచరు ట్రెయినింగు లో చేరుస్తాను. అప్పుడు అన్ని తిక్కలూ కుడుర్తాయి" అన్నారు. సుందరమ్మ ఇంట్లోకి వెళ్ళింది.
    పది నిమిషాలకు ఉమాపతి వచ్చి, "ఏమిటి నాన్నా, పిలిచారట?' అన్నాడు. విశ్వనాధయ్య గారి మనస్సు లో వెయ్యి ఊహలు సందడించాయి. అన్నిటినీ మనస్సులోనే అదిమి పెట్టి అన్నారు.
    "నువ్వేదో మళ్ళీ మద్రాసు వెళ్ళాలన్నావుగా?"  
    "అవును, నాన్నా . పరీక్షలు దగ్గర పడుతున్నాయి. లెక్చరర్లు ప్రత్యేకంగా క్లాసులు పెట్టుకొని పాఠాలు చెబుతామన్నారు , అందువల్ల."
    "ఎప్పుడు వెళ్ళాలనుకున్నావు?"
    "మీరూ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు."
    "నేను వెళ్ళమనే దాకా మీకు తరగతులు ఆగుతాయా?"
    ఉమాపతి గతుక్కుమన్నాడు.
    "సరే, రేపు వెళ్ళు.... డబ్బెమైనా కావాల్సి ఉంటుందా?"
    'అవున్నాన్నా! ఓ వంద రూపాయలు కావాలి."
    'సరే, రేపు యాభై రూపాయ లిస్తాను. నాలుగైదు రోజుల్లో మిగిలింది పంపుతాను. నువ్వు రేపే బయల్దేరు." విశ్వనాధయ్య గారు ఇంట్లోకి బయల్దేరారు. ఉమాపతి కూడా బయలుదేరాడు. శారద ఇంట్లో ఉందొ, పొలం వద్ద ఉందొ తెలీలేదు. ఇల్లంతా వెతికి చూశాడు. శారద కనబడలేదు. పొలం వద్దకు వెళ్ళి ఉంటుందని తాను కూడా బయలుదేరాడు.
    వీధిలోకి వచ్చేసరికి పొలానికి వెడుతున్న ప్రకాశం ఇంకెవరో మరొక వ్యక్తీ కనిపించారు.
    "ఓహో! బహు కాలదర్శనం! బహుకాల దర్శనం!! బాగానే ఉన్నట్టున్నారు!" వ్యంగ్యంగా అన్నాడు ఉమాపతి.
    అందరూ నవ్వుకున్నారు.
    "ఇతని పేరు సారధి, తెలుగులో మంచి పేరున్న రచయిత. ఇతను ఉమాపతి, బియ్యే ఫైనలియర్ చదువుతున్నాడు." ఇద్దరినీ పరస్పరం పరిచయం చేశాడు ప్రకాశం.
    ఇద్దరూ కరచాలనం చేశారు.
    "ఎందాకా ప్రయాణం, ఉమాపతిగారూ? మాతో గూడా రాకూడదు?' అన్నాడు సారధి.
    "తప్పకుండా వస్తాను.
    ముగ్గురూ నడక సాగించారు. ఊరు దాటి చేల గుండా నడుస్తున్నారు. వేరుశనగ త్రవ్వకాలు జరుగుతున్నాయి. పాళ్ళు పాళ్ళుగా నిలబడ్డ కంది చెట్లు గాలికి ఊగుతున్నాయి. దూరాన కనిపిస్తున్న బండ మీద సజ్జ మార్పిళ్లు జరుగుతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS