Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 2

 

    "ఏం చెయ్యను చెప్పు? ఎలా చూచినా నా మనస్సు కుదుట పడటం లేదురా! మీ పెద్దమ్మగారు ఇంతింత పసిపిల్లల్ని నా కంఠనికి చుట్ట బెట్టింది. ఎలా పెద్దవాళ్ళను చేశానో ఏం పెట్టి పెంచానో భగవంతుడి కెరుక. కాని వీళ్ళు పెరిగారని నాకనిపించడం లేదు. ఉత్తి అమాయకులు. ఇంకా పసిపాపల పట్టుదలలు. వీళ్ళని చూస్తె నాకేవిధమైన నిబ్బరం కలగడం లేదురా అప్పన్నా! బీదరికం, వార్ధక్యం నా వివేకాన్ని నశింప చేస్తున్నాయి. నా రెండు కళ్ళూ అనుకున్న నా పిల్లలే నా మాట విననప్పుడు నాకింక ఈ ప్రపంచంలో మిగిలిందేమిటనిపిస్తోంది!"
    ఈసారి నాన్నగారే ఏడ్చేశారు... నేను వచ్చి దేబ్బలాడినా ఆగలేదు.
    ఆ సాయంకాలం మలినమైన మనస్సుతో పెరట్లో మల్లె పందిరి దగ్గర నిలబడ్డాను. అంతకు ముందే నాన్నగారి టెంపరేచర్  చూశాను. దేనికేదో వెంటనే చెప్తే గాని నాకేం తోచేలా కనబడలేదు. అడుగుల చప్పుడై అటు తిరిగి చూశాను. అప్పన్న. అన్నీ కోలుపోయినట్టుంది వాడి మొహం.
    "అమ్మాయిగోరూ  శానా సెప్పాల్నుంది తవరితో -- ఏం అనుకోరు గదా?' నేనేం మాట్లాడలేదు. చిత్రంగా వాడి వైపు చూశాను. పావుగంట సేపు ఏమిటో గొణుక్కున్నాడు గాని స్పష్టంగా ఒక్క ముక్క నోటంట రాలేదు.
    "నాను తమరి కేటి సెప్పగల్ను నా ఏర్రి గాని ! నాన్నగార్ని మాత్రం రచ్చించు కొండి తల్లీ ఆ పానం శానా కట్టపడి పోతాంది!'
    కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక నిశ్చయానికి వెంటనే వచ్చేస్తే గాని నామనసు కుదుట పడలేదు. ఆ రాత్రి నాన్నగారికి కాస్త నిద్ర పట్టక అన్నయ్య గదిలోకి వెళ్ళెను. వాడేదో చదువు కుంటున్నాడు.
    "ఏంరా, నిన్నోమాటడగనా?' వాడు ఆశ్చర్యంతో ఇటు తిరిగేడు.
    'నాకు ఓ చదువా లేదు. ఓ పెళ్ళా లేదు. ఒకరి మీద ఒకరు పంతాలు వేసుకుని ఇలా వంటదానిగా, ఒంటరిదానిగా ఎన్నాళ్ళు నా బ్రతుకు వృధా చెయ్యదలచుకున్నారు?"
    'ఇది నీకు పుట్టిన బుద్దా, నాన్నగారి ఉపదేశమా?'
    'అంతేనన్నమాట , అయితే ఇక చెప్పనులే' అని ఇవతలికి వచ్చేస్తుంటే 'చెల్లీ ,చెల్లీ' అని నా వెంట బడి బలవంతాన నా మొహం పట్టుకు పైకెత్తాడు.
    "ఓ అమ్మ ఉండనా, అక్క ఉండనా నీతో కాక మరెవరితో చెప్పుకోను?' అన్నట్టున్న నా చూపు లోని భావం వాడే చదవగలడనుకుంటాను నేనూ అప్పుడే వాడి మొహంలో కి చూశాను.
    "చెల్లీ, పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళి పోదామనుకుంతున్నావా? నన్ను విడిచి వెళ్ళడం నీకు సాధ్యమే ననుకుంటున్నావా?' అన్నట్టున్న వాడి చూపులోని భావం నేనే చదవగల ననుకుంటాన్నాను. ఇద్దరం ఒకేసారి తలలు ఒంచుకు కన్నీళ్లు తుడుచుకున్నాము.
    అమ్మ కూడా లేకపోవడం చేత చిన్నప్పట్నుంచి మేమిద్దరం మరింత దగ్గరగా పెరిగాం. నేను అడ, పిల్లలతో, చింత పిక్కలాడుతుంటే తాటి ప్రమాణాన పిక్క ఎగరేసి పట్టుకుంటూ వాడూ మాతో ఆటకి తయారై పోయేవాడు. వాడి ఆ వీధి మొగపిల్లలతో క్రికెట్ ఆడుతుంటే పరికిణీ గోచీ పోసి కట్టి , పెద్ద పెరక్కలా జడ ముడేసి నేనూ హాజరై పోయేదాన్ని. ఇక అట మొదలెట్టిందగ్గర నుంచీ వాడూ నేనూ దెబ్బలాడుకొని క్షణముండదు. ఆటకి కూడా స్త్రీ లింగమూ, పుల్లింగమూ ఉందని చెప్పడానికి మాకెవరూ లేరు. మాకెవరూ లేరని మేమెప్పుడూ విచారించింది లేదు!
    నేను వాడితో ఏం చెబుదామని అక్కడికి వచ్చాడో జ్ఞాపకం చేసుకునే సరికి పదినిముషాలైనా పట్టి ఉంటుంది.
    'నాన్నగారి మనస్సు అంతగా కష్టపెట్టి మనం సాధించేది మాత్రం ఏమిట్రా అన్నా? నువ్వైనా నేనైనా పెళ్ళి చేసుకునే వయసు లేనంత చిన్న పిల్లలం ఏమీ కాదు. ఈ దుఃఖంతో ఈయన ప్రాణం పొతే మనం బ్రతికున్నన్నాళ్ళు ఎడ్వవలసి ఉంటుంది. ఆ ఆదర్శాలు ఎన్నాళ్ళు నిలుస్తాయి? నువ్వే ఆలోచించు.'
    అని ఇవతల కొచ్చేశాను. అంతకన్న ఏం మాట్లాడాలో నాకేం తోచలేదు. 'సంఘంలో నైతిక పరివర్తన కలగాలంటే సంఘాలూ, ప్రణాళికలూ, బిల్లులూ సాధించేది ఏమీ ఉండదు. ధనిక వర్గాల హృదయాలలో అపరివర్తన కలగాలి. క్రింది వర్గాల మీదకి ప్రసరించాలి. క్రింది మెట్ల వాళ్ళు ఎందరు బలియైనా అది ఎవరికీ కనబడదు, వినబడదు." అని ఎక్కడో చదివినట్టు గుర్తు. కట్నాలు ఇవ్వకూడదని పుచ్చుకోకూడదని అన్నయ్యకూ, నాకేకాడు నాన్నగారికీ ఉంది. కాని ఏం లాభం?
    ఆరోజు తెల్లవారు ఝామునే మెలుకువ వచ్చి నిద్రపట్టక లేచిపోయాను. నీరసంగా ఉన్నట్టు లేచి, మొహం కడుక్కుని, కాఫీ కలుపుకు తాగుతున్నాను. అన్నయ్య నాన్న గదిలోకి ఎప్పుడోచ్చాడో తెలీదు. 'సత్యనారాయణ గారి అమ్మాయి విషయంలో మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు' అనేసి వెళ్ళిపోయాడు. నా నోట మాట రాలేదు.
    అయిష్టంగా అవుననడం కన్న ఖచ్చితంగా కాదనడం మేలు. నాన్నగారు మాత్రం అనుకోని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
    'చూశావా అప్పన్నా వీళ్ళు కొంచెం లోతైనా మనుషుల్రా. మీ పెద్దమ్మగారూ అలాగే ఉండేది. నేనే తొందర పాటు మనిషిని. ఒసే మంజూ ఎక్కడున్నావే ... మీ అన్నయ్యా ఏమన్నాడో విన్నావుటే? మళ్ళీ వర్ధ్యాలూ వస్తాయి కాబోలు ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను అప్పన్నా. ఆ చేతికర్రా , కండువా అందుకో- కొంచెం పంచాంగం చూసి రావే మంజూ.
    నేను లోపలికి వెళ్ళి పంచాంగం చూశాను. అసలు అప్పుడే అన్ని విధాల దివ్యంగా ఉంది. కాని అయనప్పుడు వెళ్ళడం నా కిష్టం లేదు!
    'ఇప్పుడెం బాగున్నట్టు లేదు నాన్నా, రేపు చూసుకో వచ్చులే.'
    "నీమొహం లా ఉంది... ఏ తేదికో ఏది చూశావి ఏమిటో , ఏది ఆ పంచాంగం ఇలా అందుకో.'
    అయినా నేను వోటమి అంగీకరించదలుచుకోలేదు.
    'పంచాంగం ఎక్కడా కనబడదు నాన్నా! అయినా నిన్న రాత్రి అంత జ్వరం కాసింది. ఇంకా పత్యమైనా తీసుకోలేదు. ఇవాల్టికి రేపటికి ఏమంత కొంప మునిగింది?' నాన్న ప్రశ్నార్ధకంగా నావైపు చూశారు. ఏమనుకున్నారో ఏమో అప్పటికీ మాత్రం వూరుకున్నారు. ఆ రాత్రి మళ్ళీ అన్నయ్య గదిలోకి వెళ్ళాను.
    'ప్రపంచంలో త్యాగాలూ, దానాలూ చేసేవాళ్ళకి కీర్తి వస్తే రాగాక. అది గ్రహించే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో , ఎంత నికృష్ట పరిస్థితుల్లో వాళ్ళు దానికి తయారు పడతారో కూడా కొంచెం వూహించడం మంచిది."
    "ఎవరి మీద ఈ విసుర్లు?"
    " నువ్వు పోల్చుకోలేని వాళ్ళ మీద మాత్రం కాదు' అన్నయ్య దగ్గరగా వెళ్ళాను. సూటిగా మొహంలో మోహం పెట్టి చూస్తూ అన్నాను.
    "ఎందుకురా అన్నా నన్నిలా బాధ పెడతావ్? నా పెళ్ళి గురించి -- నీ ఆదర్శాలకు విరుద్దంగా నువ్వు కట్నం పుచ్చుకోడానికి సిద్దపడినందుకే నా తల తీసేసినట్లుంది . పిల్ల నయినా చూడకుండా నువ్వోప్పుకున్నావంటే నా మనసెంత కొట్టుకుంటుందో  ఆలోచించావా? నాన్నగారిది మూర్కపు పట్టు అంటావే, మరి నీది?'
    అన్నయ్య నా తల మీద చెయ్యి వేసి ప్రేమతో నిమిరేడు.
    'చెల్లీ, ఒకప్పుడు మనం ఎమనుకున్నాం.... జ్ఞాపకముందా , ఆ నాడు, నువ్వు నాకు జడ వేసిన నాడు....'
    ఓసారి వాడు నిద్ర పోతుండగా క్రాపింగు లోని ముందు పొడుగాటి వెంట్రుకలు తీసి, నెమ్మదిగా వాటికో నల్ల రిబ్బను జతచేసి పాయలు అల్లి జడ వేశాను. 'ఫైనల్ టచప్' ఇద్దామని చిన్న దమ్మిడి చేమంతి పువ్వొకటి , అది కూడా గడ్డిది ఆ జడలో తురమ బోతుండగా వాడికి తెలివి వచ్చేసింది. నేను పారిపోతుంటే నా జడ పట్టుకున్నాడు.
    "ఎంత అల్లరోచ్చిందే నీకూ! ఉండు నీ పని ఇలా కాదు.... నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళూ తాగించే వాణ్ణి ముల్లోకాలూ వెతికేనా సరే తెచ్చి కట్టపెట్టక పొతే చూసుకో."
    'ఓ యబ్బో , నీ పెంకితనం ఎవరేరుగరని! నీ గుడ్లు కదలేసే దాన్నీ గూబ మెలేసే దాన్నీ గుడ్ల గూబ నొకదాన్ని గోళాలన్నీ గాలించైనా సరే గుమ్మంలో కట్టలేక పోతాననా?'
    పైకి విరసంగా ధ్వనించే ఈ సరిసోక్తుల అంతరార్ధం ఒకటే.' మనిద్దరం ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. ఒక ధర్మం నేర్చుకు పెరిగిన వాళ్ళం. మనలో ఒకరికి నచ్చితే రెండో వాళ్ళకి నచ్చినట్టే." అనీ ఆ మర్నాడు నాన్నగారితో పాటు నేనూ సత్యనారాయణగారి అమ్మాయిని చూసి వచ్చాను. రాగానే అన్నయ్యతో అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS