Previous Page Next Page 
శరన్మేఘం పేజి 2


    "ఉహుఁ ! రోజు నువ్వు వచ్చి ఇచ్చేదానివి కదా?"
    "అవునండీ ఇవాళ పెందరాళే రావడం పడలేదు. అంది సునంద మందుగ్లాసు శివరాం కి అందిస్తూ, మందు గొంతుకలో పోసుకుని వెగటువల్ల ముఖం అదోలా పెడ్తూ "ఏం?....ఎందుకని? అన్నాడు శివరాం. అతని గుండెలు రాస్తూ ఆఫీసు మేనేజరుగారి అమ్మాయి లేదూ శాంత వాళ్ళింట్లో పార్టీకి రమ్మని తెగ గొడవ పెట్టింది ఆఫీసుకి వచ్చి పెళ్ళికి కూడా వెళ్ళలేదు. మరీ అంత బలవంతం పెడుతూంటే వచ్చేత్శే బాగుండదని. పార్టీకి వెళ్ళాను అంది సంజాయిషీ చెప్పుకుంటున్న దానిలా సునంద.
    "ఇంతసేపూ పార్టీయేనా?"
    "అంతా జేరేటప్పటికి ఆలస్యం అయింది. పైగా శాంత భర్తని తీరా చూస్తే నాకు అతను చిన్నప్పుడు తెలిసినవాడే! జగపతి అని ఇంత ఉండేవాడు ఫోర్తు ఫారం చదువుతూ నేను ఎస్.ఎస్.ఎల్. సి చదివే రోజుల్లో మా ఇంటి ప్రక్కనే ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు బొంబాయిలో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాట్ట. చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ. "ఎన్నాళ్ళకి చూశాను మిమ్మల్ని?" అంటూ ఓ పట్టాన్ని వదల్లేదు. కబుర్లతో ఆలస్యం అయిపోయింది."
    సునంద మాటలు వింటూన్న శివరాంకి, మనస్సులో తీవ్రమైన అసంతృప్తి రేగింది. తన గుండెల్ని రాస్తూన్న సునంద చేతుల్ని నెమ్మదిగా తప్పించి. "నాకు తల నొప్పిగా ఉంది. కాస్సేపు మాట్లాడకు" అని అటు తిరిగి పడుకోబోయాడు. సునంద కంగారుగా అతని నుదుటి మీద చెయ్యివేసింది. ఆమె చేయిని తోసేస్తూ "కాస్సేపు నన్ను స్థిమితంగా పడుకానీ ముట్టుకోకు" అన్నాడు విసుగ్గా. ఆ మాటతో దెబ్బతిన్న దానిలా అప్రతిభురాలై ఉండి పోయింది. సునంద." రోజు రోజుకీ ఈయనకి కోపం ఎక్కువైపోతోంది. నిముష నిముషానికీ కారణం లేకుండా చిన్న పిల్లాడిలా మూతి బిగించడం పేచీ పెట్టడం, నీరసంవల్లనేమో! జబ్బు తగ్గు తూంటే ఒక్క కోపం కూడా పెరుగుతూ ఉంటుందని ఆ మధ్య నర్స్ చెప్పింది అయితే కావచ్చు అయినా ఈ విసుగూ , కోసం, రోజు రోజుకి ఇలా పెరిగిపోతూంటే ఎలా యీయన్ని సమర్ధించడం? తనకి కూడా ఆ పూర్వపు ఓర్పూ ఓపికా తగ్గిపోతాయి. ఏదో గుట్టున పట్టుకుని లేని ఓర్పు తెచ్చుకుంటూ రోజులు దొర్లిస్తోంది. అవతల పొద్దుటి నుంచి సాయంత్రందాకా ఆఫీసులో చాకిరి చేసి ఇంటికొస్తే, ఒక దానికొకటి లేక వారానికి నాలుగు రోజులు పస్తులు పడుకుంటూ అవస్థలు పడడం. ఎంత డబ్బూ మందులికీ ఓవల్టీన్ డబ్బాలకీ సరిపోక ఒక్కొక్కప్పుడు నిస్సహాయస్థితి ఏర్పడి ఏం చెయ్యాలో తోచక ఏడుపు వస్తోంది. అటు ఆఫీసు అనీ. ఇటు డబ్బు ఇబ్బందీ. ఓ పక్కని ఈయనకి ఎలా ఉంటుందో అనే దిగులూ, ఏవీ చెయ్యలేని తన అసహాయస్థితీ అయిన వాళ్ళందరూ అలా తయారయ్యార నే కోపం. పౌరుషం. వీటి అన్నిటి మధ్యనా పడి తను నలిగిపోతూంటే. ఈయన అర్ధంలేని కోపాలూ ఈ విసుగులూ ఏవిటి?" ఇలా బాధగా ఆలోచిస్తూన్న సునంద కాట్ చివర తగిలించిన టెంపరేచర్ బోర్డుని అప్రయత్నంగా చూసి హమ్మో" అనుకుంది. ఆ అట్ట చేతిలోకి తీసుకుని అటు వేపు వెళ్ళి "ఏవిటండీ?.....టెంపరేచర్ ఒక డిగ్రీ పెరిగిందా?" అంటూ ఆదుర్దాగా అడిగింది. శివరాం చర్రున లేచి చటాలున ఆమె చేతిలోని ఛార్ట్ తీసుకుని విసురుగా అవతల పారేసి. ఆమె కళ్ళల్లోకి చురచురా చూశాడు.
    సునంద కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. అని శివరాం కి కనిపించకుండా ఉండటం కోసం తలదించేసుకుంది. కాని కనుకొలకులు దాటి రెండు చుక్కలు ఆమె పాదాలమీద పడ్డాయి. అదిచూసి శివరాం కళవళపడ్డాడు పాపం చిన్నబుచ్చుకునిఎలా నిలబడిపోయిందో! ఏవైనా తను తొందర పడ్డాడు. ఇందాకా విసుక్కున్నాడు. ఇప్పుడు చేతిలో ఛార్ట్ తీసుకుని విసిరేశాడు. మరి బాధ పడమంటే పడదూ అయిన వాళ్ళందర్నీ తన కోసం వదులుకుని, క్షయ వ్యాధి వచ్చిన తనని దక్కించుకోవడం కోసం ఆఖరికి ఉద్యోగంలో కూడా చేరి శ్రమపడుతూన్న ఈ అమాయకురాలిని పట్ల కృతజ్ఞతతో ఉండడం అట్టే పోయి, ఇలాగా తను ప్రవర్తించడం? ఛీ...తను ఎంత మూర్ఖుడు?" శివరాం సిగ్గుపడి మొహం అటు తిప్పేసుకొని మౌనంగా ఉండి పోయాడు. నిశ్శబ్దంగా ఏడుస్తూ నిలబడిపోయిన సునంద కాస్సేపయాక బరువుగా శ్వాస వదిలి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుని. నేలమీద పడ్డ ఛార్ట్ ని ఒంగుని తీయబోయింది. ఇంతలో శివరాం డగ్గుత్తితో "సునందా" అని పిలిచాడు. అతని కంఠంలో ధ్వనించిన వేదనకి ఆమె కంగారు పడి. అతని ముఖంలోకి చూసింది.
    "ఛ!.... అదేవిటి! మీరు కళ్ళమ్మట వీళ్ళు పెట్టుకోవడం ఏమిటి?" అంటూ తన పైటతో అతని కళ్ళు ఒత్తింది సునంద. ఆమె చెయ్యి పట్టుకుని పశ్చాత్తాపంతో "నిన్ను చాలా బాధ పెడుతున్నాను సునందా?" అన్నాడు శివరాం. "బాధా లేదు ఏం లేదు. ఉండండి ఓవల్టీ సు ఇస్తాను" అంటూ ఫ్లాస్కు మూతలో ఓవల్టీస్ పోసి అందించింది సునంద. తాగకుండా చేత్తో పట్టుకుని. సునందా నామాట వింటావా?" అన్నాడు శివరాం.
    ఏవిటది అన్నట్టు అతనికేసి చూసింది.
    "పట్టుదలా పౌరుషం వదిలేసి, మీ నాన్న గారికి ఉత్తరం రాయి. ఆయన వెంటనే వచ్చి మనల్ని ఆదుకుంటారు. వాళ్ళ సహాయం అక్కర్లేదంటూ పట్టుదలకి పోయి ఎందుకీ ఉద్యోగం చేసి బాధపడడం?" అన్నాడు శివరాం.
    సునంద సమాధానం చెప్పలేదు. ఆమెకి వెంటనే జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆయనకి టి.బి. వచ్చిందని తను ఎంతో ఆవేదనతో బాధపడుతుంటే నాన్న ఆదరించడం అట్టేపోయి అంతమాత అంటాడా? తెలియక చేశాడా ఈ పెళ్ళి? దౌర్భాగ్యపు సంబంధమా ఇది? పెళ్ళికి ముందే ఆయనకి టి.బి. టింజ్ ఉండి ఉంటుందా? అటువంటి రోగికి పెళ్ళి చేసి నా గొంతుక కోశాడా?.... ఇలా నోటికి వచ్చినట్లు అనెయ్యడమేనా? కొంచెం ముందూ వెనకా ఆలోచించ నక్కర్లేదూ? ఆయన్నంటే ఒకటీ నాన్నంటే ఒకటీనా?..... తను డబ్బు సాయం చెయ్యవలసి వస్తుందనేగా ఇదంతా? తన డబ్బు ఎవరిక్కావాలి? ముష్టి ఎత్త్తి సంసాదించి అయినా భర్త జబ్బు నయం చేసుకుంటాను కాని. తన మాటలు పడి ఆ డబ్బుకి చేయి చాపుతానా?.....అటువంటి తండ్రి నా ఇప్పుడు సమీపించడం?" కోపంగా ఎర్రగా జేవురిస్తూన్న సుంద ముఖం చూసి "పోనీ మా తమ్మ్జ్డుడు గోపాలానికేనా కవరు రాయమన్నాను రాశావా?" అన్నాడు శివరాం. సునంద జవాబు చెప్పలేదు. "నువ్వు రాయవు నీకు మొహమాటం. నా దగ్గర చదువుకున్న కుర్రవాడు. వాడిదగ్గర మొహమాటం ఏమిటి? పరుపు కింద కవరు ఇలా తే. నేను రాస్తా." అన్నాడు శివరాం ఓవల్టీస్ కప్పు సునందకి అందిస్తూ.

                                        2

    చంటాడికి వంటి నిండా పౌడరు రాసి, ఊలు టోపీ చెవుల మీదుగా కట్టి బట్టలూ స్వెట్టరూ వేసి, పరుపుమీద రబ్బరు గుడ్డవేసి పడుకో బెట్టి తను నిలువుటద్దం ఎదురుగుండా నిలబడి అలంకరించుకో సాగింది రత్నం. మధ్య మధ్య కుర్రాడు ఏడిచినప్పుడల్లా వెనక్కి తిరిగి చిటికవేస్తూ, నాలికతో చప్పుడు చేస్తూ ఊరుకోబెడుతోంది.
    ఎంతో ముచ్చటపడి పోయిన నెలలో పక్కింటి వదినగారి దగ్గర అప్పుచేసి కొన్నచీర. కట్టుకోడానికి ఇవాళ అవకాశం వచ్చింది. పురిటికి వెళ్ళివచ్చిన దగ్గర్నుంచీ సరదాగా ఆయనతో కలిసి బయటికి వెళ్ళడానికి కుదరేలేదు. కొన్నాళ్ళు మరీ పచ్చివళ్ళూ. చంటివాడూ అంటూ సరిపోయింది. కొన్నాళ్ళు ఆయన ఆఫీసూ ఆడిటింగ్ అంటూ సరిపోయింది. రాకరాక ఇన్నాళ్ళకి సమయం వచ్చింది. అందుకే పెట్లో ఎంతో పదిలంగా దాచిన చీర తీసింది రత్నం, జరీ అంచు కనిపించేలాగ కుచ్చిళ్ళూ పితా ఎన్నిమాట్లు సర్దుకున్నా ఇంకా సర్దుబాటు కావడం లేదు. ఈ పక్కకీ ఆ పక్కకీ తిరిగి ఏ పక్క నుంచి అందంగా ఉంటారో అని నిలువుటద్దంలో చూసుకోసాగింది తెగ హైరాన పడుతూ.
    నిజంగా తను అంత హైరాన పడక్కర్లేదు. ఎలాఉన్నా అందంగానే ఉంటుంది రత్నం. మెత్తగా పట్టుకుచ్చులాంటి జుట్టూ, పాల మీగడ లాంటి బుగ్గలూ, బుగ్గని ముద్దుపెట్టుకుంటూ నల్లని పుట్టుమచ్చా, సన్నని మెడా, సన్నని నడుమూ నాజూకైన శరీరం, అందకు తగిన అందమైన పాదాలు. పదిహేడేళ్ళు నిండినా కొత్తఃగా ఓణీలు వేసుకోవడం నేర్చుకుంటూన్న పదమూడేళ్ళ పిల్లలా లేతగా ముద్దుగా ఉంటుంది అందుకే గోపాలం అంటూ ఉంటాడు బుగ్గమీద చిటికేస్తూ "నువ్వు ఏచీరకట్టుకున్నా అందంగానే ఉంటావు" అని.
    "బిగ్ బెన్" అయిదు తర్వాత అయిదుంపావు చూపించి అయిదున్నరకి జారుకుంటోంది. అయినా రత్నం అలంకరణ పూర్తి కాలేదు. ఇది కాదు అదికాదు అంటూ ఎన్ని మార్చినా. ఆ చీర మీదకి తగిన బ్లౌజు అమరలేదు. చివరికి సరే అని సరిపెట్టుకుని ఓ పల్చని బ్లౌజు ఎన్నుకుంది ఆ లైటు కలర్ చీరమీదకి మెళ్ళోఉన్న ఒంటిపేట డైమన్ గొలుసు సర్దుకుంటూ, దీనికితోడు దేవుడికి రవ్వల దుద్దులుంటే ఎంత బాగా మేచ్  అవును అనుకుంది రత్నం. కాని ఇంతలోనే నిట్టూర్చి "ఆయన రవ్వల దుద్దులు చేయిస్తారా? మనసైన చీర కొనుక్కోడానికే ఒప్పుకోరు. ఈ చీర కొన్నందుకు ఎంత రాద్ధాంతం అయింది? ఆ మధ్య ఈ నిలువుటద్దం కొన్నందుకు ఎప్పుడూ డబ్బు లేదోలేదో అనడం తప్పిస్తే ఒక్క సరదా అయినా లేదు ఏవిటో? .... ఇంకీ జన్మకి ఇంతే!" అంటూ బిగ్ బెన్ కేసి చూసింది. వెంటనే "అమ్మో" అని గబగబా బొట్టూ, కాటికా పెట్టేసుకుని ఒకటి రెండు నిముషాల్లో రెడీ అయి పోయింది రత్నం.
    గోపాలం ఇంకా రాలేదు, అయిదింటికల్లా ఆఫీసరు పెర్మిషన్ తీసుకుని వస్తానన్న పెద్ద మనిషి. తను పుట్టింటినుంచి చంటాడిని ఎత్తుకుని వచ్చాక ఇన్నాళ్ళకి కదా సరదాగా సినిమాకి బయలుదేరింది! ఏవిటో తనకేగాని ఆయన కొక్క సరదా లేదు. పెళ్ళయిన ఈ ఏన్నర్ధం నుంచీ చూస్తోంది. అయనకయి ఆయన ఎప్పుడైనా, "ఇవాళ ఫలానా పిక్చర్ కి వెళదాం రెడీ అవు అనికాని ఇది నీకు బాగుంటుందని కొని తెచ్చాను అనికాని" అంటాడేమో అని. ఉహుఁ అనకపోవడం అలా వుంచి, తనేధైనా ముచ్చట పడి కొంటే "ఎందుకివి రత్నం మనం ఏమైనా జమీందారులమా? ఎంత నిరాడంబరంగా ఉంటే అంత సుఖం, పొదుపు లేకపోతే బ్రతుకులో కుదూపులు తప్పవు" అంటూ హితబోధ ఒకటి. తన ఉత్సాహం కాస్తా నీళ్ళు కారిపోయేలాగ.
    బిగ్ బెన్ పావుతక్కువ ఆరు చూపిస్తోంది. గోపాలం వచ్చేశాడేమీ కన్పించడం లేదు. నిముష నిముషానికి వీధిగేటు దగ్గరికివెళ్ళి చూసి వస్తోంది రత్నం. విసుగూ కోపం ఎక్కువై అస్థిమితంగా ఇటూ అటూ తిరగసాగింది.
    కోపంలో కొంత ఏడుస్తూన్న చంటాడి మీద చూపించింది. తక్కింది గోపాలం వచ్చాక ప్రయోగించడానికి దాచింది. బిగ్ బెన్ చేస్తూన్న చప్పుడికి బెదిరి, సెకన్లు పరిగెడుతున్నాయి. నడిచిపోతూన్న పెద్దముల్లు కేసి నిస్సహాయంగా చూస్తున్న రత్నానికి, ఉడుకుమోతుతనంవల్ల కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. నీళ్ళతో నిండిన కళ్ళు గోపాలం రాకని వెంటనే గమనించలేక పోయాయి.
    గోపాలం వచ్చి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. సినిమాకి టైమవుతోందనే ధ్యాసేమీ అతనిలో ఉన్నట్లు లేదు. బట్టలు మార్చుకోకుండా ఆమట్టునే ఉండిపోయాడు ఇంటి కప్పుకేసి శూన్యంగా చూస్తూ హడావిడిగా వచ్చి "బయలుదేరు రత్నం ఆలస్యం అయిపోయింది. "అంటూ తొందరపెడతాడేమో అని అలిగి తన కోపాన్ని చూపిద్దాం అనుకుంది రత్నం. కాని అలా కాకుండా పరధ్యాన్నంగా ఆలోచిస్తూ ఉండిపోయిన గోపాలాన్ని చూసేసరికి కోపం మాట మరచిపోయి ఆశ్చర్యంతో చూడసాగింది. గోపాలం అసలు అటు చూడడమే లేదు. ఎదురు గుండా రత్నం ఉంది అన్నధ్యాసేలేదు అతనికి అలా వింతగా కాస్సేపు గోపాలాన్ని చూసి "ఏవిటండీ అలా కూర్చోండిపోయారు? టైము అవుతోంది మరి. మనం సినీమాకి వెళ్ళొద్దూ!" అంటూ పలకరించింది రత్నం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS