కళ్యాణి అలా గాభరా పడ్డానికి కొంత కారణం లేకపోలేదు. సదరు మేనత్త కూతురు సత్యభామను కాంతారావు కిద్దామని మొదట్లో పెద్దవాళ్ళు అనుకున్నారట గాని మధ్యలో యేవో పేచీలు రావటం వల్ల ఆ పెళ్ళి జరిగిలేదట. ఇప్పటికి సత్యభామ కింకా పెళ్ళి కాలేదు. పైగా ఎమ్మే కూడా చదువుతోందట. చూస్తూ చూస్తూ మొగుణ్ణి అలాటి చోటుకు ఒంటరిగా పంపటం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న సంగతిని తరతరాలుగా అడజాతి రక్తంలో జీర్ణించుకు పోయిన అసూయ, అనుమానం కళ్యాణి కి ప్రభోదించినయ్. 'కొన్ని గంటల పాటు కనీసం మానసికంగా నైనా అయన నాకు దూరమైతే నేను సహించలేను' అనుకుంటుంది కళ్యాణి.
అందుకే భర్త వైజాగ్ వెళ్తడెమో నన్న భావం ఆమెను భయ కంపితురాలిని చేసింది.
'ఛ! ఆవిడ దగ్గరకు ఎవరు వెళ్తారిప్పుడు? వాళ్ళకి మాకు పడదు కదా. పైగా సత్యభామ నిజంగా సత్యభామే! దానికి తల పొగరు యింతా అంతా కాదు. నాకంటే ఐదేళ్ళు చిన్నదైనా దాని కసలు నేనంటే గౌరవమే లేదు. నేను బియ్యే తప్పినప్పుడు అది నన్నెంతగా ఎగతాళి చేసిందో తెలుసా? అందుకే అదంటే వళ్ళు మంట నాకు. ఈ జన్మలో వాళ్ళ గడప నేను తొక్కను గాక తొక్కను" అన్నాడు కాంతారావు.
కళ్యాణి గుండె మీద నుండి పెద్ద బరువు తొలగి పోయినట్లయింది.
ఈసారి ముఖానికి మరింత నవ్వు పులుముకుని "మరి ఎ_క్కడికో చెప్పండి!" అనడిగింది ముద్దుగా.
"మనం ప్రేమయాత్ర కి , ఐమీన్ హనీమూన్ కి బయాల్దేరుదాం ఈసారి' అన్నాడు.
'హనీమూన్ కా? గట్టిగా అనకండి ఎవరైనా వింటే నవ్వి పోతారు' చిరుకోపం ప్రదర్శించబోయి చటుక్కున నవ్వేసింది కళ్యాణి. 'ఇద్దరు పిల్లల్ని కన్నాక యిప్పుడు మనకేం హనీ మూనండి! హయ్యో రామ!' అంది బుగ్గన చేయ్యేసుకుంటూ.
"నీ మొహం. అదంతేలే ఊరుకో. మనది స్పెషల్ కేస్. అందరూ పెళ్ళైన వెంటనే హనీమూన్ పొతే మనకా అవకాశం లేనందున పిల్లలతో పోదాం. అందులో తప్పేముంది? పిల్లలు పుట్టేక చాలామంది తిరుపతి వెళ్ళి 'తీర్ధయాత్ర' చేసోచ్చేమని చెప్పుకుంటారు. మనం ఆ తీర్ధయాత్రా తో పాటు మరికొన్ని మంచి ప్రదేశాలు కూడా చూసి ప్రేమ యాత్ర చేసోచ్చేమని చెప్పుకోవచ్చు. ఎలాగుంది ఐడియా? బ్రహ్మాండంగా లేదూ?" అంటూ కాలేజీ లోని అలవాటు ప్రకారం. ప్రశ్నవేసి దానికి సమాధానం కూడా తనే చెచెప్పుకున్నాడు. యింగ్లీషు లెక్చరర్ కాంతారావు.
'ప్రేమయాత్ర' అన్న పదం వినగానే ' కళ్యాణీ శరీరం జలదరించి పోయింది.
ప్రేమ! ప్రేమ! అదేదో పూర్వజన్మ లో విన్న పదంలా అనిపిస్తోంది- పెళ్లై మూడేళ్ళు కాపరం చేసిన కళ్యాణికి.
సంసారం దుఃఖ సాగరం కాకపోయినా కనీసం వట్టి సాగరం మాత్రం అవును అని యీ మూడేళ్ళ సంసారిక జీవితానుభవం చెప్పింది కళ్యాణి కి. నిజంగానే సంసారాన్ని సముద్రం తో పోల్చవచ్చు. ఉత్సుంగ తరంగాలతో =ఉదృత వేగంతో పయనించే ఆ ప్రవాహంలో ఆ వేగం అనుభవం ఉంటాయే తప్ప ఆలోచించటానికి కాని, కనీసం తనకున్న దాన్ని చూసుకుని అనదించడానికి కాని అవకాశం ఉండదు--- ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి.
అందుకే 'ప్రేమ' అన్న పదం వినగానే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు నిర్ఘాంత పోయి నిల్చుంది కళ్యాణి. భారతీయ చలన చిత్రాల్లో గనుక హీరో కి కాని, హీరోయిన్ కి గాని మెదడుకు వో దెబ్బ తగిలి పూర్వ స్మృతి కోల్పోయి మళ్ళీ దెబ్బ తగలగానే స్మృతి వచ్చినట్లు , వైవాహిక జీవితంలోకి అడుగు పెడ్తూనే అదోరకం అయోమయం లో పడిపోయిన కళ్యాణి ' భర్త నోటి నుండి 'ప్రేమ' అన్నపదం వెలువడగానే గత స్మృతులన్నీ ఫిల్ము రీలులా తన కళ్ళ ముందు కదలసాగినాయ్.
ఔను -- ప్రేమ ! అ పదానికి అర్ధం తనకి తెలిసినంతగా యీ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదేమో! ఆ అపూర్వానుభూతిని తనంత గొప్పగా, పరిపూర్ణంగా ఏ వ్యక్తీ అనుభవం లోకి తెచ్చుకోలేదేమో! మనసున్న యువతీయువకులందరూ మనస్పూర్తిగా కోరుకునే ప్రేమ వివాహమే తమది. తను బియ్యే ఫైనలియర్ లో ఉండగా ఆ సంవత్సరమే యూనివర్సిటీ చదువు ముగించుకుని ఇంగ్లీష్ లెక్చర ర్ గా ఆ కాలేజీ లో అడుగు పెడ్తూనే తన మనసును కూడా ఆక్రమించుకున్నాడు. కాంతారావు. తెలియని క్లాసు పాఠాలు చెప్పించుకుందామని కళ్యాణి అతని దగ్గరకు వెళ్తే ప్రేమ పాఠాలు చెప్పటం మొదలెట్టాడతను. క్లాసు పాఠాలకన్న ఎక్కువగా ఆ పాఠాలే జీవితంలో ఉపయోగించేవి అని గ్రహించిన కళ్యాణి వాటిని శ్రద్దగా విని, తుచ తప్పకుండా తిరిగి అతనికి అప్పజేప్పసాగింది. తత్పలితంగా ఆరునెలలు తిరక్కుండానే వాళ్ళిద్దరూ దంపతులు కావటం, కళ్యాణి బియే పరీక్షల్లో తప్పి, చదువుకు స్వస్తి చెప్పటమూ జరిగినయ్.
కాని ఏం లాభం? పెళ్ళయి నెల తిరగ్గానే ఆమెకు తను తల్లి కాబోతున్నట్లు తెలిసింది. కలకలలాడుతూ తిరగవలసిన సమయంలో కళ్యాణి వేవిళ్ళ తో బాధపడ వలసి వచ్చింది. ప్రతిరోజూ సినిమాలకు, షికార్లకు తిరగ వలసిన నవ దంపతులకు లేడీ డాక్టర్ చుట్టూ తిరగవలసి వచ్చింది. విలాస వస్తువులతో అలంకరించ వలసిన గృహం మందు సీసాలతో నిండిపోయింది. సన్న జాజులతో , సెంట్ల వాసనలతో ఘుమఘుమ లదవలసిన యిల్లు ఘాటైన మందుల వాసనలతో వెగటు పుట్టించ సాగింది.
ఎప్పుడైనా మనసు పడి కాంతారావు మల్లెపూలు తెస్తే ఆ వాసన చూస్తూనే వాంతి చేసుకునేది కళ్యాణి. ఆ సమయంలో ఎలాటి వాసనా భరించలేదుట ఆమె.
పెళ్ళయి రెండు నెలలు నిండకుండానే తమ యింట్లో వచ్చిన యీ దారుణమైన మార్పును చూసి గుండె బేజారెత్తి పోయింది కాంతారావు కి. దానికి తగ్గట్టు కళ్యాణి భర్తను కనీసం దగ్గరకు కూడా జేరనిచ్చేది కాదు. ఆ సమయంలో ఆమెకు మల్లెల వాసనే కాదు, మగ వాసన కూడా గిట్టదట!
ఈ వైపరిత్యానికి తట్టుకోవటం చాలా కష్టమేఅయింది కాంతారావు కి. దాంపత్య జీవనం అసిధారా వ్రతమంటే యేమిటో అనుకునేవాడు. తనెంత పెళ్ళి కాక ముందు నవ దంపతులనగానే సినిమా ల్లోలా డ్యూయెట్లు పాడుకుంటూ టీ, సిమ్లా మొదలైన అందమైన ప్రదేశాల్లో ఉద్యానవనాల్లో , చందమామ చూసుకుంటూ కాలం గడుపు తుంటాం అనుకునేవాడు.' అంతే కాని పెళ్ళి యొక్క పరిణామాలు యింత దారుణంగా ఉంటాయని అతను కలలో కూడా ఊహించుకోలేదు. అందునా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే యువతీ యువకులకు కూడా ఈ పాట్లు తప్పవని తెలిసే సరికి మరింత కృంగి పోయాడు కాంతారావు.
ఇవి చాలవన్నట్లు కళ్యాణి కడుపుతో ఉన్న దగ్గర నుండి భర్త మీద చీటికి మాటికీ చిరాకు పట్టం మొదలెట్టింది. అదేమిటని అడిగితె.;ఆ సమయంలో ఎందుకో తనకు పిచ్చి కోపం వస్తుంది ఇంకా చెప్పాలంటే ఎలాగోలా మీతో తగువు పెట్టుకుని ఆ చిరాకు తీర్చుకోవాలనిపిస్తుంది..... ఎందుకిలా అవుతోందో నాకే తెలియటం లేదు. నా శారీరక స్తితి తో పాటు మానసిక స్థితి కూడా అలా మారిపోయింది. అలా చెప్తే మీకర్ధం కాదు. అనుభవించే వాళ్ళకే అర్ధమవుతుంది నా స్థితి" అనేది.
ఈ విషయాన్ని గురించి వోసారి కళ్యాణి కి తెలియకుండా తన డాక్టర్ ఫ్రెండు నడిగితే అతను నవ్వి శరీరం లో కాల్షియం తక్కువైతే మనిషికి పిరికితనం, చిరాకు మొదలైన లక్షణాలు బయల్దేరాతాయ్. సాధారణంగా గర్భిణీ స్త్రీలలో చాలామందికి ఈ కాల్షియం తక్కువవటం వల్ల చిరాకు చిన్న విషయాలకు కూడా ఉద్రేక పడటం జరుగుతుంది ' అని చెప్పేడు.
ఇదంతా విన్నాక కాంతారావు పెళ్ళి చేసుకుని పిల్లల తండ్రి అయిన మగవాడికి జనరల్ నాలెడ్జి బ్రహ్మాండంగా పెరిగి పోతుందనటం లో సందేహం లేదనిపించింది. విజ్ఞానం పెరగటం లో , మనిషికి జీవితం మీద విరక్తి పుట్టడం కూడా సహజమే! అందువల్ల వైవాహిక కీవితంలో తానూ సాధించలేకపోతున్న సుఖాల తాలుకూ బాధాకరమైన స్మృతులను మర్చిపోయే నిమిత్తం వైరాగ్య ధోరణి సంతరించుకో దల్చుకున్నాడు కాంతారావు.
"ఆ తొమ్మిది నెలలు నరకం వదిలేక బురద లో నుండి పుట్టు కొచ్చిన కమలం పువ్వులా, చీకటిని చీల్చుకుంటూ వచ్చిన వెలుగు కిరణం లా పుట్టెడు బాబిగాడు. వాడు పుట్టిన మరో రెండు నెలల వరకు పురిటి వాసనలు. బాలెంత మందులు మొదలైన వాటిని భరించడం భాధాకరమనిపించినా, కొంతలో కొంత తమ కుటుంబం లోకి కొత్తగా ప్రవేశించినా ఆ బంగారపు తునకను చూసి తమ బాధను కొంతవరకు మర్చి పోగలిగేడు ఆ దంపతులు.
క్రమంగా ఆ యింట్లో మళ్ళీ చైతన్యం రాసాగింది. వసంతం వచ్చినట్టే అనిపించింది. మల్లెలు పకపక మని నవ్వసాగినాయ్. గులాబీ లు విరగబూసినాయ్ నక్షత్రాలు జలజల మని రాలినాయ్. సముద్రాలు పొంగినాయ్. చందమామ జోరు ఫక్కున నవ్వింది. నెమళ్ళు నాట్యం చేసినాయ్. లేళ్ళు గంతులు వేసినాయ్. పక్షులు కిలకిల మంటూ నవ్వినాయ్. సమస్త విశ్వం ఆనందా దోలికలలో ఊగిపోయింది.
అంతే.... ఆ మూడు నెలల మధుర స్వప్నం యిట్టే కరిగి పోయింది. వీనుల విందుగా వినవస్తున్న సంగీతం ఉన్నట్టుండి ఆగిపోయింది. సమస్త ప్రకృతి స్తంభించిపోయింది.
బాబిగాడికి ఐదు నెలలు నిండుతుండగానే కళ్యాణి మళ్ళీ నెల తప్పింది. - విషయం తెలియగానే కల్యాణి కాంతారావు చేష్టలుడిగి కూర్చున్నారు. అంతకు ముందు తామనుభావించిన ఆ మూడు నెలల మధురానుభావమూ పచ్చి అబద్దంగా అంతకు క్రితం ఒక ఏడాది పాటు తాము చవి చూసిన నరకమే నిత్య సత్యంగా తోచింది. ఆక్షణం లో వాళ్ళిద్దరికీ ఇక చేసేది లేక జీవిత సంగ్రామాన్ని వీరోచితంగా ఎదుర్కొనటం తప్ప గత్యంతరం లేదని గుండె రాయి చేసుకున్నారు వాళ్ళిద్దరూ.
