Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 2


    
    "నీకు తెలియదు, రాధా! రాత్రి అమ్మ పడుతూన్న బాధ చూస్తూంటే నాకు పిచ్చెక్కిపోతుందేమో ననిపించింది."
    "కాలేజీకి లీవ్ లెటరు పంపావా?" అనూరాధ అడిగింది మాట మార్చాలని చూస్తూ.
    "లేదు. రేపు పంపాలి."
    "రేపు వస్తావా?"
    "ఏమో? అమ్మకు ఎలా ఉంటుందో మరి! అమ్మ అయితే ఇవాళే వెళ్ళమంది. నాకే ఏమిటో వెళ్ళాలనిపించలేదు."
    "దిగులుపడకు, లలితా అదే తగ్గిపోతుంది. లెటర్ నాకివ్వు. నేను పంపుతాను" అంది అనూరాధ.
    వ్రాసిన ఉత్తరం రాధచేతికి ఇస్తూ "ఈ టైములో ఎలా వచ్చావు?" అని అడిగింది లలిత.
    "ఇవాళ మధ్యాహ్నం ఖాళీ. ఉన్న ఒక్క క్లాసు ఎగ్గొట్టి ఇలా వచ్చాను" అంది అనూరాధ.
    "అదృష్టవంతురాలివి. కాలక్షేపానికి చదివే చదువు ఓ సంవత్సరం తప్పితే మాత్రం ఏమిలే" అంది లలిత పేలవంగా నవ్వుతూ.    
    "ఒకటేమిటి! రెండు సంవత్సరాలు తప్పిన పరవాలేదుగాని, బొత్తిగా చదవలేక తప్పుతున్నామనుకుంటారని భయం. ఒక్కొక్క సంవత్సరం తప్పుతున్న కొద్ది నాకే లాభం" అంది అనూరాధ నవ్వుతూ.
    "ఏం? ఇంకో సంవత్సరం పెళ్ళి వాయిదా వెయ్యచ్చనా?"
    "ఆ! పొరపాటున బి. ఎల్. లో చేరా నీలా ఆనర్సులో చేరితే ఓ పదేళ్ళ పాటు చదువుతూనే ఉండచ్చు ఏదో ఓ పేరుతో" అంది అనూరాధ నవ్వుతూ.
    "నువ్వేమో అలా అనుకుంతున్నావు. నేనేమో ఎప్పుడు పూర్తి అవుతుందా అని అనుకుంటున్నాను."
    "ప్రస్తుతం అవసరాలకొద్ది అలా అనుకున్నా, ఒకసారి కాలేజీ వదిలా మంటే మళ్ళీ ఆ స్టూడెంట్ లైఫ్ ఉండదనుకో. అదే నా దిగులు. ఇంక వెడతా, లలితా ఏదైనా అవసరమయితే కబురు చెయ్యి" అంటూ బయలుదేరింది అనూరాధ. గుమ్మందాకా వచ్చింది లలిత. మెట్లు దిగుతూ ఉంటే ఎదురుగా వస్తూన్న శ్రీనివాసును చూచి ఆశ్చర్యంగా ఆగింది అనూరాధ.
    అతను ఏవో రెండు పాకెట్స్ లలిత చేతికి అందిస్తూ, "డాక్టర్ నిన్నటి మందే ఉపయోగించమన్నాడు. అదికాక ఇవి ప్రతి నాలుగు గంటలకు ఇవ్వండి" అన్నాడు.    
    "చాలా థాంక్స్! మీ సహాయం ఎప్పుడూ మరిచిపోము" అంది లలిత.
    "దానిదేముందండి" అని, "మీరేమిటి ఇక్కడ ఉన్నారు?" అని అడిగాడు అనూరాధవైపు తిరిగి.
    "ఏం లేదు. లలితను కలవడానికి వచ్చాను."
    "వస్తానండీ!" అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్.
    లలిత ఆశ్చర్యంగా చూస్తూ, "అతను నీకు తెలుసా?" అంది.
    "ఊరికే ముఖపరిచయం. లైబ్రరీలో పనిచేస్తాడు. అక్కడ చూచాను. నీకెలా తెలుసు?"
    "ఈమధ్య మా ఇంటి పక్కగదిలోకి వచ్చాడుట-అమ్మ చెప్పింది. రాత్రి అమ్మకు బాగా నొప్పి ఎక్కువైంది. డాక్టర్ కోసం ఎవర్ని అడుగుదామా అనుకుంటూ బయట నుంచున్నాను. అతను అప్పుడే ఎక్కడినుండో వస్తున్నాడు. పాపం, రాత్రి చాలా హెల్ప్ చేశాడు" అంది.
    "అయితే అతని స్వంత ఊరు ఇది కాదన్నమాట?" అంది అనూరాధ సాలోచనగా.
    "ఏమో! అతని సంగతులు నాకేమీ తెలియవు. ఇక్కడికి వచ్చి దాదాపు నెలరోజులైందిట. అతన్ని నేనెప్పుడు చూడనైనా లేదు. నిన్న రాత్రి ఖంగారుగా లోపలకు, బయటకు తిరుగుతూ ఉంటే అతనంతట అతను వచ్చి పలకరించి అడిగాడు. అమ్మను పరీక్షించి చూచి వెంటనే డాక్టర్నుపిలవడం మంచిదని ఎవర్నో పిలుచుకువచ్చాడు. అమ్మను హడావిడిగా పరీక్ష చేస్తూ ఉంటే ఎవరైనా మెడికల్ స్టూడెంటేమో ననుకున్నాను. లైబ్రరీలో పనిచేస్తున్నాడా!" అంది లలిత.
    "సరే ఎవరైతే ఏం గాని, ఇంక నే వెడుతున్నా. ఇప్పటికే ఆలస్యమయింది." ఇంటికి బయలుదేరింది అనూరాధ.
    కిటికీలోంచి ఊరికే బయటకు చూస్తూన్న శ్రీనివాస్ కు అనూరాధ వెళ్ళడం కనిపించింది. ఎందుకో ఆమెనుండి దృష్టి మరల్చుకోలేక అలా చూస్తూ నుంచుండిపోయాడు. ఏమైనా రోజులు బాగా మారిపోతున్నాయి. చేతిలో పుస్తకాల్ని ఊపుకుంటూ చురుగ్గా పోతూన్న అనూరాధను చూస్తూ ఉంటే కాలేజీరోజులు జ్ఞప్తికి వచ్చాయి. కాలేజీ రోజులు అందరికీ ఆనందపు అనుభవాలే! గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని అందరూ అనుకుంటారు. అందుకు సాహసించలేనిది అతనొక్కడేనేమో!

                                    3

    "మీరు బలే త్వరగా చదువుతారులా ఉందే! నెలకి రెండు సార్లైనా వస్తున్నారు" అన్నాడు శ్రీనివాస్ అనూరాధ పుస్తకాలు నోట్ చేసుకుంటూ.
    "నాకు పుస్తకం మొదలుపెడితే పూర్తయ్యేవరకు తోచదు. మా అమ్మ చివాట్లు భరించలేక రాత్రిళ్ళు మూస్తూ ఉంటాను" అంది అనూరాధ నవ్వుతూ.
    "మరీ అంత త్వరగా చదవకండి. మా లైబ్రరీలో పుస్తకాలన్ని పూర్తయ్యేటట్లున్నాయి."
    "ఆ భయం లేదులెండి. నూతన రచయితల రచనలు పంపులో నీళ్ళలా వచ్చేస్తున్నాయి."
    "వైజాగ్ లో పంపునీళ్ళలానా!"
    "ఏమిటండీ! పోనీ, వైజాగ్ లా కాకపోతే మీ ఊరి పంపునీళ్ళలా....ఇంతకీ ఊరేదో తెలియదుగాని."
    "వైజాగ్ ని వెక్కిరించటం లేదు లెండి. ఈ ఊరినేం మించలేదు గుంటూరు. ఇక్కడ కనీసం బావుల్లో అయినా ఉంటాయి నీళ్ళు. అక్కడ అవీ కరువే!" అని పుస్తకాలు అందిస్తూ, "అన్నట్లు మీ స్నేహితురాలి అమ్మగారు ఎలా ఉన్నారు?" అన్నాడు.
    "ఇంటిపక్కన ఉంటూ నన్నడుగుతున్నారా! నేనే మిమ్మల్ని అడగాలి."
    "ఆమెను మళ్ళీ కలవలేదండి! ఆ రోజంటే ఏదో అవసరంకొద్ది ..."
    "ప్రస్తుతం కులాసాగానే ఉందిట. కాని మళ్ళీ ఎప్పుడైనా రావచ్చుట."    
    "ముందునుంచి జాగ్రత్త పడవచ్చు లెండి."
    "వస్తా. గుడ్ బై!"
    "గుడ్ బై!" ఇంత చక్కని సాహిత్యాన్ని స్వంతం చేసుకుంటున్న ఆమె సంస్కార మెంత చక్కనిదో అనుకున్నాడు శ్రీనివాస్.
    "ఇంత ఆలస్యమయిందేమే, అమ్మాయి?" అంది గదిలోకి అడుగుపెడుతూన్న అనూరాధను చూస్తూ శ్రీలక్ష్మి.
    "లైబ్రరీకి వెళ్ళివచ్చానమ్మా."    
    "ఎప్పుడూ ఆ లైబ్రరీ చుట్టూ తిరగకపోతే ఆ పుస్తకాలేవో నువ్వే కొనుక్కోకూడదూ?"
    "సరేలే! ఇప్పటికే నా వస్తువులతో ఇల్లంతా నిండిపోతున్నదంటున్నావ్. ఇంక పుస్తకాలుకూడా కొంటూంటే నీ చేతిలో చివాట్లకు కొదవ ఉండదు" అంది నవ్వుతూ.
    "అది సరేగాని, ఎంతసేపూ ఈ పుస్తకాలు చదవడమేనా, లేక క్లాసు పుస్తకాలు చదువుతున్నావా?"
    "క్లాసు పుస్తకాల్లో ఏముందమ్మా! చదవకపోయినా పాసయిపోతాం."
    "పాపం, చదివితేనే తప్పుతావు కాబోలు. చూడబోతే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నట్లుంది నీ వ్యవహారం."
    "ఏమిటీ, వ్యవహారమంటున్నావు?" అడుగుపెట్టారు రాజశేఖరం గారు.
    "చూడు, నాన్నా. అమ్మ నేను ఎంతసేపు ఈ పుస్తకాలుతప్ప కాలేజీని చదవడం లేదంటూంది. పైగా కావాలని తప్పాలని చూస్తూన్నానుట" అంది నవ్వుతూ.
    ఆయనకూడా నవ్వేస్తూ, "నువ్వు పరీక్ష తప్పితే పెళ్ళి ఇంకో సంవత్సరం వాయిదా వేస్తామని మీ అమ్మ గోల. ఇదిగో! మన అమ్మాయి తప్పితే క్లాసులో ఎవరూ పాసవరనుకో. అయినా క్లాస్ బుక్స్ చదివితే తెలిసేది 'లా'యే. ఈ బుక్స్ చదువుతే వచ్చేది లోకజ్ఞానం."
    "ఆ! మీ అమ్మాయిని మీరే పొగుడుకోవాలి!"
    "ప్రస్తుతం మనమే పొగుడుకోవాలి. అందరూ పొగిడె రోజులు వస్తాయి, ఉద్యోగం మొదలుపెట్టి వృద్ధిలోకి వచ్చాక."
    "ఆ! ఈ చదివింది చాల్లెద్దురూ. ఇంకా ఉద్యోగంకూడానూ. మంచి సంబంధం చూడండి. పరీక్షలవ్వగానే పెళ్ళి చేద్దాం."
    "మరే! అదేం పదేళ్ళ పిల్లనుకున్నావా, మనం ఎట్లా అంటే అలా వినేందుకు?" అన్నారు నవ్వుతూ. అదే సందనుకుని మెల్లిగా జారుకుంది రాధ.
    "మీ రిచ్సిన అలుసు కాదూ? అయిన ఒక్క అమ్మాయి కదా! చక్కగా పెళ్ళి చేద్దామన్న సరదా లేదేం ఖర్మ!"
    "నిమిషానికో మాట మారుస్తావేం? నువ్వేనా అబ్బాయి 'లా' చదవాలి, మీ నాన్నంత పెద్ద లాయరు అవ్వాలని అంటూ ఉండేదానివి. వాడు ఇష్టపడలే! పోనీ, దీన్ని చేద్దాం."
    "సరే! వాడంటే మగపిల్లవాడు. ఆడపిల్ల, ఆడపిల్లే!"
    "ఆ మాట అమ్మాయిదగ్గిర అను. అరగంట వాదిస్తుంది. అయినా ఈ ముసలమ్మకబుర్లు కట్టిపెట్టి కాస్త కాఫీ తెచ్చిపెట్టు" అన్నారు కుర్చీలో జారగిలబడి పేపరుమడత ఊడదీస్తూ.
    రాత్రి పదిగంటలదాకా టేబిల్ ముందు కూర్చున్న అనూరాధకు ఆ తరవాత ఏ ఒక్క విషయం బుర్రలోకి దూరమన్నాయి. విసుగ్గా పుస్తకం మూసి మంచంమీదికి వచ్చి పడుకుంది పైకప్పువైపు చూస్తూ.
    కిటికీలోంచి వెన్నెల గదిలోకి పడుతూంది. నిటారుగా నిలబడ్డ కొబ్బరి చెట్లు కొంచెం కొంచెం గాలికి ఊగుతూంటే, వెన్నెలతో దోబూచులాడుతున్నట్లు నీడ గదిలోకి పడుతూంది. పై కప్పుమీద పడుతూన్న కొబ్బరాకుల నీడ విప్పిన అరచేయిలా ఉంది. అలా తదేకంగా చూస్తూ కొన్ని నిమిషాలు పడుకుని లేచి కూర్చుంది. ఆరోజు లైబ్రరీనుండి తెచ్చుకున్న పుస్తకం ఒకటి తెచ్చుకుని మంచంమీద వాలింది. చకచకా తిరుగుతున్న పేజీలు  ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలగజేశాయి. ఎంత చక్కటి స్థానాన్ని ఆక్రమించిందో 'ది రైన్'! అనుకుంది, అప్పుడే పూర్తిచేసిన కథను అక్కడక్కడ తిరగేస్తూ.    
    అప్రయత్నంగా ఆలోచనలు శ్రీనివాస్ మీదకు మళ్ళాయి! 'అసలు గుంటూరన్నమాట. లైబ్రరీలో పనిచేసేందుకు అక్కడినుండి ఇక్కడకు రావాలా? మనిషితో మట్లాడుతూంటే పెద్ద చదువులు చదివినవాడిలా, మంచి సంపన్నుడులా కనుపిస్తాడు. నిజంగానే బాగా చదువుకున్నవాడైతే, ఇంత దూరం వచ్చి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తాడు?'
    ఎప్పుడు ఆవరించిందో నిద్ర తెలియకుండానే పట్టేసింది. కళ్ళు తెరిచి చూచేసరికి వెన్నెలలో విహరించే కొబ్బరినీడలు లేవు. తెల్లగా కళ్ళు చిట్లించి చూడవలసివచ్చేటట్లు ఎండ పడుతూంది గదిలోకి. రాత్రి చదువుతూ పడుకున్న పుస్తకం జారి పడింది. క్రిందకు వెళ్ళేసరికి అప్పుడే రాజశేఖరం గారు ఆఫీసుకు వెళ్ళిపోయారు. అనూరాధ అన్నయ్య కృష్ణ మోహన్ హాస్పిటల్ కు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. లయతప్పని దినచర్య; దైనందిన కార్యక్రమం.
    
                                   4

    సంధ్యాకాంతి సరాగాలను వెదజల్లుతూంది. అప్పటిదాకా మలమల మాడ్చిన భాస్కరుడు పశ్చిమానికి వాలిపోయాడు. చల్లని గాలులలో పచ్చని చెట్లు సేదతీర్చుకుంటున్నాయి. స్కూళ్ళనుండి, ఆఫీసులనుండి బయటపడ్డ మనుష్యులతో రోడ్లు హడావిడిగా ఉన్నాయి. ఎత్తుపల్లాల రోడ్లమీద లాగలేక లాగుతున్నారు రిక్షాలు.
    కాలేజీనుండి బస్సులో కలిసి వచ్చారు లలిత, అనూరాధ. లలితను మర్నాడు మధ్యాహ్నం తమ ఇంటికి రమ్మని చెప్పి బయలుదేరింది. అనూరాధ. సందు మలుపుదాకా నడిచేసరికి అవతలపక్క శ్రీనివాస్ కనిపించాడు. అనూరాధను చూడగానే రోడ్డు క్రాస్ చేసి, చిరునవ్వుతో పలకరిస్తూ ఇవతలివైపు వచ్చాడు.
    "ఎక్కడినుండి? మీ స్నేహితురాలి ఇంటినుండా?"
    "లేదు. ఇప్పుడే కాలేజీనుండి మీరు?"
    "నేనా? మధ్యాహ్నం ఏమీ పనిలేదు. అలా షికారుకు."
    కొద్దిక్షణాలు ఇద్దరిమధ్య మౌనంగా గడిచింది. నిశ్శబ్దంగా ఒకరిపక్క ఒకరు నడవసాగారు. విడిపోవలసిన సందుమలుపు రాగానే అంతవరకు ఆమెను అడగటమా, మానటమా అని సందేహమానసుడై ఉన్న శ్రీనివాస్, "మీరు రాకూడదూ కొంచెంసేపు, అటువైపు?" అన్నాడు మెల్లిగా, త్వరత్వరగా.
    ఒకసారి ముఖమెత్తి చూచింది.
    "పని లేకపోతేనే!" నాన్చేశాడు.
    "ప్రకృతి సౌందర్యారాధనకు నన్నుకూడా ఆహ్వానిస్తున్నారా?"
    "ప్రకృతి సౌందర్యం పబ్లిక్ ప్రాపర్టీ. దాని ఆస్వాదనకు మీకు నా ఆహ్వానం ఎందుకు? అదీకాక వెడుతున్నది సౌందర్యారాధనకు కాదు, ఆరోగ్యసాధనకు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటేఒంటికి మంచిది" అన్నాడు చిరునవ్వుతో.
    "డాక్టర్ ప్రిస్ క్రిప్షన్ లాగా ఉన్నాయి మీ మాటలు. మీరుకూడా మెడిసిన్ చదవలేదు కదా కొంపతీసి?" అంది నవ్వుతూ.
    ఉలిక్కిపడ్డట్టు చూచాడు.
    ఒకసారి చేతివాచివంక చూచుకుంటూ, సందేహ మానస అయి నిలబడిందొక క్షణం. వెంటనే నిర్ణయించుకున్నట్లు, "సరే, పదండి. నేను ఎక్కువసేపు ఉండటానికి వీలులేదు. అమ్మతో చెప్పలేదు. ఆలస్యమయితే ఖంగారుపడుతుంది" అంది.
    "అలాగే. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెనక్కి వచ్చేద్దాం" అంటూ దారితీశాడు.
    ఇసుకలో కూరుకుపోతూన్న పాదాలతో మెల్లిగా, బరువుగా నడుస్తూ జనసమ్మర్ధంలేని చోటుకు వెళ్ళారు. బీచ్ అంతా  పడుచుపిల్లలతో కళకళలాడుతోంది. కావలసినంతమంది విద్యార్ధులు. విహారాలకేం కొరత!
    నలుపు, నీలిరంగుల మిళితమయిన సముద్రపు నీరు గునగునా నడిచి వచ్చేస్తూంది. పైన కప్పిన శాలువలా, తెల్లగా జారిపోతూ, అందంగా ఆడుతూ వస్తూంది తేనెరంగు నురగ.
    ఇసుకమీద రెండు కాళ్ళు ముడుచుకుని, మోకాళ్ళను తెల్లని చేతితో చుట్టి కూర్చుంది. తెల్లని మణికట్టుకు నల్లని బాండ్ తో వాచి, వేలికి ఒకే ఒక ఎర్రరాయి ఉంగరం పోటీగా మెరుస్తున్నాయి. కుడిచేతి చూపుడువేలుతో ఇసుకలో సున్నాలు చుట్టుతూ కూర్చుంది. సముద్రపుగాలికి జుట్టు అల్లలాడు తూంది. ఒత్తైన జుట్టు మొదలులో పొద్దున పెట్టుకున్న రెండు ఎర్రగులాబులు వడిలి అధోవదనలై ఉన్నాయి.
    ఎగురుతున్న ముంగురులను చూస్తూ ఏవిధంగా సంభాషణ ప్రారంభించాలా అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాస్ కొద్దిసేపు. "ఈమధ్య లైబ్రరీకి వచ్చి చాలా రోజులైనట్లుందే!" అన్నాడు ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS