"ఏమిటి నువ్వనేది?"
"ఇక్కడ కథలు వింటే - ఇంకో మూడు నెలల్లో నువ్వే వింటావు ఇలాంటి పన్లుచెయ్యవు.
"థాంక్స్" కోపంగా అంది. వసుంధర లేబొరేటరీకి వెళ్ళిపోయింది. ఆమె మాటలు చాలాసేపు ఆలోచించింది శశిరేఖ.
నేను కథలకి భయపడను - అనుకుంది చివరకి.
* * *
ఆ ఆదివారం అతనే వొచ్చాడు.
ముందర ఏం మాట్లాడాలో శశిరేఖకి తెలియలేదు- కాలేజీ గురించీ, ప్రొఫెసర్లని గురించీ అవీ ఇవీ చెప్పుకున్నారు.
ఏ మాటలూ దొరక్క అడిగింది శశిరేఖ...."మీరు ఎకనామిక్స్ ఎందుకు తీసుకున్నారు? లిటరేచర్ కి రాకపోయారా?" అని.
"అదే పొరపాటని ఇప్పుడు తెలిసింది.
అనుకోకుండానే అనేశాడు గోపాలం. వెంటనే తెలివి తెచ్చుకుని, "అంటే..." అని సర్దుకోబోయాడు.
"తెలుసును లెండి. మీరు చవకబారు మాట్లాడరని తెలుసును. ఐనా, నా గురించి నాకూ అంత స్వోత్కర్షలేదు" అన్నది శశిరేఖ.
"ఇప్పుడు నేనేం అన్నా, నాకేకీడు" అనుకుని, గోపాలం చిరునవ్వుతో, "నిజం చెప్పాలంటే నాకు లిటరేచర్ లో సీటు దొరక లేదు. ఆ తరవాత ఎకనామిక్స్ వాళ్ళకి ఉద్యోగాలు సుళువుగా దొరుకుతాయని ఒక సీనియర్ చెప్పడంలో, అట్టి ప్రయత్నం లేకుండా సీటు దొరక డాన్న చేరిపోయాను..."
"బహుశా చాలామంది ఇక్కడికి రావడం ఉద్యోగాల కోసమే ననుకుంటాను" అంది శశిరేఖ కొంచెం ఆగి.
"నిజం ఒప్పుకుంటే అంతే.... డిగ్రీ తీసుకున్నాక ఏ కొద్దిమందో రీసెర్చికి అడుగుతారను కోండి.... కాని. వెనువెంటనే యూనివర్శిటీ ఒదిలిపెట్టివెళ్ళి ఉద్యోగాల కోసం చూసుకునే వాళ్ళే ఎక్కువ.... కనీసం, నా ఉద్దేశం అది" అన్నాడు గోపాలం.
శశిరేఖ మొదట ఏమీ అనలేదు. ఆమె విషయం వేరు..... తల్లీ తనూ తినేందుకు కావలసి నది ఉంది. తానెందుకు చదువుతుందో స్పష్టంగా నిర్ధారణ చేసుకోలేదుగాని. అదొక అవసరంగా...
"నా చదువెందుకో నాకే తెలీదు. ఊరికే కూర్చోలేక అనుకుంటాను" అంది చివరికి.
"అదృష్టవంతులు మీరు కనీసం నా దృష్టిలో నా మాట చూడండి.... యూనివర్శిటీ వొదిలిన మూడు నెలల్లో ఉద్యోగం చూసుకోకపోతే..."
ఒక విధంగా ఆ నాడు శశిరేఖ. గోపాలం, తమ తమ జీవితాలని, పరస్పరం దాపరికం లేకుండా చెప్పుకున్నారు. ఆ సాయంత్రం ఆమె అతన్ని సాగనంపేక ఒక మంచి స్నేహితుడు దొరికిన సంతృప్తి పొందింది....అమ్మ అతన్ని పొగడ్డం విని ఆమె ఎంతో ఆనందం అనుభవించింది.
ఆ తరువాత వాళ్ళిద్దరూ ప్రతీరోజూ కలుసుకునేవారు. క్రమంగా ఆ స్నేహం బలపడి పోయింది. ఎవరి హద్దుల్లో వారు ఉన్నా, అంత రాంతరాలలో ఈ జీవితం భవిష్యత్తు ఇద్దరికీ తెలిసిపోయింది, మాటల్లేకుండానే వాళ్ళ మనస్సులు మాటలిచ్చాయి.
ఆ స్నేహం గాఢం అవుతూనే వొచ్చింది-ఇప్పటిదాకా.
అతనెందుకు రాలేదూ?
అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది, ఈ వారంనించీ ఆమె గోపాలం మాట ఎత్తనేలేదు. కాని ఈ రోజు శశిరేఖ ముఖం చూసి, ఆపుకోలేక, "ఎందుకమ్మా అలాగ బాధ పడతావు? అతనే వొస్తాడు.....ఉద్యోగం బాధలో తిరుగుతున్నాడు. అలాగ మరిచిపోయే మనిషికాదు" అంది.
అదే ఆన....అనుకుంది శశిరేఖ.
* * *
3
నాలుగు దాటి ఉంటుంది. మగత నిద్రలో లలిత పిలుపు విని బద్ధకంగా లేచాడు గోపాలం.
"నీకు ఉత్తరం వొచ్చింది...లే."
లేచి ముఖం కడుక్కుని ఉత్తరం చూసుకున్నాడు గోపాలం.
చదివి అలాగే కిందవి పడేయడం చూసి. "వాళ్ళూ కాదన్నారా గోపాలం?" అంది లలిత.
"ఆఁ....ఇంటర్వ్యూకి వొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఉద్యోగం ఇవ్వలేనందుకు విచారం తెలియజేస్తూ...."
"పోనీలే గోపాలం! నీ ప్రయత్నంలో నువ్వున్నావు....దానికి బాధపడడం దేనికి? ఏ. జీ, ఆఫీసువాళ్ళ రిజల్స్టు ఎప్పుడు తెలుస్తాయి?"
"పై వారం వొదినా...... ఈ రోజులు చూస్తూంటే అదీ దొరికేలాగ కనిపించదు."
కొంచెంసేపు మాట్లాడలేదు ఎవరూ. లలిత లోపలికివెళ్ళి కాఫీ తెచ్చియిస్తూ, "మీ అన్నయ్య నీ వాలకం చూసి మరీ బాధ పడుతున్నారు....చదువుకున్న వాడివి ఉద్యోగం దొరక్కపోదు. కొంచెం ధైర్యంగా ఉండు" అంది నయంగా.
అతను కాఫీ తాగుతూ అవును... అన్నయ్య బాధపడడం నీకు యిష్టం వుండదు. అందుకని ఇలాగ అంటావు....అనుకున్నాడు.
మరుక్షణం కొంచెం సిగ్గుపడి "అలాగే వొదినా....నీకు మరీ శ్రమ యిచ్చినా ఏదో రోజున నీబాకి తీర్చుకుంటానని ఆశ" అన్నాడు గోపాలం.
"అలాగ మాట్లాడకు గోపాలం....నువ్వంత పరాయివాడివి కాదు. అలాగ ఎందుకనుకోవాలి? మనకీ తినేందుకు ఉంది. ధనవంతులం కాకపోయినా. బీదవాళ్ళమూ కాదు....ఇది మాత్రం నీ ఇల్లుకాదూ?... నిజానికి నేనే పరాయిని.... అంది లలిత కిందికి చూస్తూ.
"సారీ.... వొదినా. ఆ మాటలన్నీ మరిచి పోదాము. బాబు ఇంకా రాలేదేం?"
"ఇవాళ ఏదో పిల్లల సినిమాకి వాళ్ళక్లాసంతా వెళ్ళేరు. ఆరుకి వొస్తాడు. రాత్రి పది గంటలకి మీ అన్నయ్యా వొస్తారు..."
కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది లలిత.
ఉత్తరం వేపుచూస్తూ ఆలోచనల్లో మరో అరగంట గడిపేశాడు గోపాలం. లలిత తనని పరాయిగా ఎన్నడూ చూడలేదు. కాని, ఎన్నాళ్ళని ఆమెకి శ్రమ ఇవ్వగలడు? అన్నయ్య తనని మరీ ఆదరిస్తాడు.....ఆమె తనతో ఎక్కువ చనువు తీసుకోదు- కాని, తనని ఏనాడూ ఆమె దూరంగానూ ఉంచలేదు.
స్నానం చేసి వీధిలోకి వెళ్ళడానికి సిద్ధం అయాడు గోపాలం - లలిత లోపల్నుంచి వొచ్చి శశిని చూసిరా గోపాలం..." అంది,
"అలాగే వొదినా" అన్నాడు గోపాలం యాంత్రికంగా.
"నీ నిరుద్యోగం ఏం అపచారం కాదు ఇన్నాళ్ళనించి శశి నీ మీద ప్రాణం పెట్టుకుంది, నీ బాధ నాకూ తెలుసును కాని, ఇవాళ వెళ్ళు" అంది లలిత.
"సరే" అన్నాడు గోపాలం.
పరీక్షగా అతని ముఖంలో చూసి, "ఆ రెండు పుస్తకాలూ శశికి ఇచ్చి ఏవైనా మంచిని ఉంటే తే" అంది లలిత.
అతను బయలుదేరేలోపున రెండు పదిరూపాయిల నోట్లు తెచ్చిఇస్తూ, "డబ్బు ఉంచుకో జేబులో" అంది లలిత.
చాలా సిగ్గనిపించిందతనికి.
"నా దగ్గర ఉందిలే..."
"కాదయ్యా-ఉంచుకో ఏదైనా అవసరం ఉంటుంది.
"వొద్దు వొదినా...."
ఆమె రెండు నోట్లూ మడతపెట్టి అతని జేబులో పెట్టి, "రోజులన్నీ ఒక్కలాగ ఉండవు గోపాలం- ఎలాగ ఉన్నా అనవసరంగా బాధ పడక్కరలేదు" అంది.
అతను రోడ్డు మీదకి వొచ్చి నడవసాగాడు. ముందర లైబ్రరీకి వెడదామని అనుకున్నాడు. మరుక్షణం బలంగా వొదిన మాటలు జ్ఞాపకం వొచ్చి శశి ఇంటివేపు బయలుదేరాడు.
అతను వెళ్ళేసరికి ఇంటితలుపు వేసి ఉంది.
అనిశ్చయంగా మెట్లమీద నిలబడి ఇటూ అటూ చూశాడు గోపాలం. ఏదో నేరం చెయ్యబోతూన్నట్టు అనిపించింది అతనికి విచిత్రంగా
నెమ్మదిగా తలుపు తట్టేడు.
సుమారు ఒక నిమిషం తరవాత శశిరేఖ తలుపుతీసి, తెల్లబోయి, 'నువ్వా గోపాల్!..." అంది.
గొంతుకసర్దుకొని. "ఆఁ" అన్నాడు.
వాళ్ళిద్దరూ రెండు మూడు నిముషాలు అలాగే నిలబడిపోయారు. ఆ సందర్భం ఏదో హాస్యం లాగ ఉంది.
చివరికి ఆమె తేరుకొని, "రా.....నిన్ను చూసి అంతకాలం అయింది.... రావనుకున్నాను" అంటూ శశిరేఖ లోపలికి దారి తీసింది.
ఆమె వెనకాలే అతను లోపలికి నడిచాడు లోపల తనకి అలవాటైన కుర్చీలో కూర్చుంటూ "సారీ శశీ! అనుకుంటూనే రాలేకపోయాను. చాలాకాలం ఐపోయింది' అన్నాడు గోపాలం నేరస్థుడి CONFESSION లాగ.
"ఆ సంగతి జ్ఞాపకం చేశారా, ఎవరైనా?"
"ఆఁ... వొదిన రోజూ అంటూనే ఉంది"
విచిత్రంగా ఆమె అతని ముఖంలోకి చూసింది. తానన్న దానిలో ఏమిటి పొరపాటో అతనికి తెలియలేదు.
"పేపర్లు బాగా రాశావా?"
"ఆఁ- చాలాబాగా.... అని చెప్పారు ప్రొఫెసర్...."
ఆమెలేచి లోపలికి వెళ్ళింది. చుట్టూచూశాడు గోపాలం; అవేపరిసరాలు. కిటికీ అవతల అదే మాలతి పందిర. టేబిల్ మీద అవే పుస్తకాలు, ఈ సారి అన్నీ మూసిఉన్నాయి అంతే.
పది నిమిషాల తరవాత కాఫీ పట్టుకుని వొచ్చింది శశిరేఖ. బట్టలు మార్చుకుని.
"చెప్పు- గోపాల్! ఇక్కడికి రావడానికి మీ వొదిన జ్ఞాపకం చెయ్యవలసిన పరిస్థితి వొచ్చిందన్నమాట!......ఏం?" అంది అతను మాట్లాడకపోవడం చూసి, శశిరేఖ.
అతను కాఫీతాగడం ముగించి సాలోచనగా ఆమెవైపు చూశాడు.
శశిరేఖ పెద్ద సౌందర్యవతికాదు; కాని, జీవన రాగంతో నిండిన ఆమె కళ్ళల్లో ఎంతో ఆనందం ఉంది-అతని దృష్టిలో ఆమె ఫాలభాగం మీద పడుతోన్న కురులు ఏవో విచిత్రమైన అల్లరి చేస్తాయి- అతని మనసులో, తన కోసం, తన భవిష్యత్తుని లెక్కచెయ్యకుండా, ఆమె తన జీవితం అర్పణం చేసుకోడానికి సంసిద్దురాలిగా ఉందని అతనికి తెలుసును. ఆ అర్పణకి ప్రతిఫలం సంపూర్ణంగా తన జీవితం ఆమెకి అర్పణం చెయ్యడం అనీ. అంతకి ఏమీ తగ్గ డానికి వీలులేదనీ అతనికి తెలుసును. ఆమె తన ప్రాణం. తాను ఆమె జీవితం, ఆ మాట ఆమె చర్యలలో, చూపులలో కనిపించదు....ఆమె హృదయం ఎంతో లోతుగా ఉండడం వల్ల.
నిట్టూర్చాడు గోపాలం.
"నీకు తెలుసు శశీ....ఈమధ్య మనస్సు మరీ పాడైపోయింది. ఎక్కడ ఉన్నా ఉండలేకపోతున్నాను. ఏమీ భరించలేకపోతున్నాను. ఏమిటో, ఇక్కడికీ రాలేదు- ఆబాధలోనే" అన్నాడు?
శశిరేఖ ముఖంలో కొంచెం కోపం కనిపించింది.

