Previous Page Next Page 
జీవన వలయం పేజి 2

 
    "మమ్మీ, ఇంకెంతదూరం ఉంది మామయ్య ఊరు?" అడిగింది విసుగ్గా అయిదేళ్ళ సుధ.
    "వచ్చేశాం, తల్లీ. ఇంకొంచెంసేపు ఉంటే మామయ్య ఊరు వస్తుంది. ఎంచక్కా కార్లో వెళ్ళి పోదాం" అంటూ ఒళ్ళోకి తీసుకొంది లత. దూరంగా కనిపిస్తున్న పొలాలు, రైలు పట్టాల దగ్గరగా ఉన్న కొలను, వాటిలో వికసించిన ఎర్రనీ, తెల్లనీ కలువలను చూపిస్తూ సుధ విసుగును మరపింప చూస్తూంది లత.
    రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. లత కెదురుగా కూర్చున్న పండుముత్తైదువ దిగింది. వెంటనే మరొక అమ్మాయి ఎక్కి ఆ స్థలంలో కూర్చుంది. కూర్చున్న అమ్మాయి వైపు సుధ కన్నార్పకుండా చూస్తూంది.
    "దా పాపా" అంటూ చేతులు జాపింది ఆ అమ్మాయి. అప్రయత్నంగానే లత ఆమె వంక చూసింది. పొడుగాటి రెండు జడలు వేసుకొన్న ఆ అమ్మాయి నాజూగ్గా ఉంది. అందంకంటే ఆ అమ్మాయి అలంకరణ విషయంలో చూపిన శ్రద్దకే అందంగా కనిపిస్తూంది అనుకొంది లత.
    "వెళ్ళమ్మా" అంటూ సుధను పంపింది. ఆ అమ్మాయి ఎంతో ఆప్యాయంగా సుధను ముద్దు పెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని సుధ కబుర్లు వింటూంది.    
    "ఏ ఊరు వెళుతున్నారు?"    
    "మద్రాసు. మీరు?" అడిగింది లత.
    "నెల్లూరు. మీవారికి అక్కడ ఉద్యోగమా?"
    "కాదమ్మా. మా అన్నగారింటికి వెళుతున్నాము."
    "నేను మా అక్కదగ్గరకు వెళుతున్నాను. అక్క బాత్ రూమ్ లో పడితే చెయ్యి విరిగిందట. సహాయంగా ఉండటానికి ఎవరూ లేరు. బావ నన్ను రమ్మని వ్రాశారు. తమ్ముడి స్కూలు పోతుందని వాడిని ఉంచి నే నొక్కతెనూ వెళుతున్నాను" అంటూ గబగబా చెప్పింది, లత ఏమీ అడగకుండానే పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండినట్లు లేని ఈ అమ్మాయి ఒంటరిగా అక్కకు సహాయపడటానికి వెళుతూందంటే లత మనస్సెందుకో ఆనందంతో ఊగులాడింది.
    "ఏమమ్మా, నీవు వెళుతున్నావే? పెద్దవాళ్ళు ఎవరూ లేరా?" అంది అనుమానంగా.
    "లేరండీ. నాన్న చిన్నతనంలోనే పోయారు. రెండేళ్ళ క్రిందట అక్క పెళ్ళి చేసి అమ్మ కూడా మాకు దూర మయింది. అప్పుడు నేను పి. యు. సి చదువుతున్నాను. అమ్మ పోవటంతో చదువు ఆపి ఉద్యోగంలో చేరాను. తమ్ముడు ఎస్. ఎస్. ఎల్. సి. చదువుతున్నాడు. వాడి కోసమే నేను ఏం చేసినా?" అంది. జాలిగా చూసింది లత. ఆ అమ్మాయి కళ్ళలో గూడు కట్టుకున్న దీనత్వం కన్నీళ్ళలో బయటకు రాబోతుండగా కనురెప్పలార్చి వాటిని ఆపుకొంది.
    "అక్కా, నీ పేరేమిటి?" అంటూ గడ్డం పట్టి ఊపుతూ అడిగింది సుధ.    
    "గిరిజ!"
    రైలు మళ్ళీ ఒక్క కుదుపుతో ఆగింది. దూరంగా మూలకు కూర్చుని కునికిపాట్లు పడుతున్న బామ్మగారు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి తల బయటకు పెట్టి చూసింది. వెంటనే హడావిడిగా సంచీ పట్టుకొని దిగింది. ఆ పక్కనే కూర్చున్నావిడ ఏడుస్తున్న పిల్లవాని మీద కసురుకుంటూంది. మళ్ళీ రైలు కదిలింది. సుధ గిరిజ ఒడిలో తల పెట్టుకొని పండుకొని గిరిజ ఇచ్చిన ఏపిల్ తింటూంది. లత అన్నయ్య గురించి ఆలోచిస్తూంది. అన్నయ్య పెళ్ళైన తరవాత వాళ్ళను చూడటం ఇదే మూడేళ్ళ తర్వాత పుట్టి నింటికి వెళుతూన్న తనను అన్నయ్య ఎంతో ఆహ్వానిస్తాడు. తను అక్కడ నాలుగు ఎక్కువ ఉండదని తెలిస్తే ఎంత గొడవ పెడతాడో!
    రవి లేచాడు ఒళ్ళు విరుచుకుంటూ. వాడిని బాత్ రూం కు తీసుకెళ్ళి, ముఖం అదీ కడిగి తీసుకువచ్చింది లత.
    "వచ్చేదే మద్రాసు" అంటూంది ఒకామె. స్టేషన్ రాగానే లత గుమ్మంలో నిలబడి కళ్ళు పెద్దవి చేసుకుంటూ చూసింది. ఎవరూ స్టేషన్ కి వచ్చిన జాడ లేదు. తాను ఒంటరిగా వస్తూంటే రిసీవ్ చేసుకోవటానికి ఎవరూ రాలేదేమిటి? అనుకుంటూ దిగి, పిల్ల లను దింపి, సామాను కూలీతో పట్టించుకొని బయటకు వచ్చింది. అక్కడ పార్కు చేసిన కార్లలో అన్నయ్య కారు నంబరు చూస్తూ వెళ్ళింది. అది ఉంది. డ్రైవరు ఫ్రంట్ సీట్లో సుఖ నిద్రలో ఉన్నాడు.
    ఇంటికి చేరేటప్పటికి రెండు కావస్తూంది.
    "అన్నయ్య కాంపు వెళ్ళారు. అందువల్ల స్టేషనుకి ఎవరూ రాలేదు. ఇక్కడ ఫ్యూన్స్ కొత్త. ఏ నీ కెవరూ తెలియదు కదా అని పంపలేదు" అంది వదిన. 'అవును అన్నయ్య ఉంటే రాకుండా ఉంటాడా?' అనుకొంది లత.
    "ఎప్పుడొస్తారు?"
    "సాయంత్రానికి వస్తారు లేకపోతే రేపు తప్పక వస్తానన్నారు."
    "బాత్ రూమ్ ఎక్కడ? వేన్నీళ్ళు ఉన్నాయా, వదినా?"
    "ఆఁ ఇదిగో, సీతమ్మా, వేన్నీళ్ళు తోడిపెట్టు" అంటూ కేకేసింది వదిన గీత.
    లత, పిల్లలు స్నానాలు చేసి బట్టలు మార్చి వచ్చే టప్పటికి గీత ఏదో చదువుకొంటూ కూర్చుంది. లతకు ఆకలి మండిపోతూంది. పిల్లలూ గొడవ చేస్తున్నారు. డైనింగ్ రూమ్ లోకి వెళితే అక్కడ బల్ల ఖాళీగానే ఉంది. 'వదిన అసలు మాకు వంట చేయించలేదా?' అని అనుమాన మొచ్చింది లతకు. తను ఉత్తరం వ్రాసిందిగదా? ఎందుకు చేయించదు? మరి భోజనం వడ్డించకుండా చదువుకుంటూందేం? తినికూర్చున్న అమ్మ మగని ఆకలి ఎరుగదట.' వంటింట్లోకి వెళ్ళగానే "వడ్డించమన్నారా, అమ్మా?" అంటూ నాయర్ అడిగాడు.

                                 *    *    *

    సాయంత్రం అయిదు కావస్తూంది. నీరెండ కిటికీలోనుండి గదిలోకి పడుతూ అదొక రకమైన ఆనందం కలిగిస్తూంది. బడలిక తీర్చుకుందామని నడుం వాల్చిన లతకు అలాగే నిద్ర పట్టేసింది. ఇప్పుడే మెలుకువ వచ్చి బయటకు చూస్తూ పడుకొంది.
    "నేనూ రానా, ఆంటీ?" సుధ అడుగుతూంది.
    "ఎక్కడికి?"
    "నువ్వెక్కడికో వెళుతున్నావుగా! అక్కడికే."
    "ఓరి! బలే కనిపెట్టావే! సరే, అమ్మ నడుగు, పంపిస్తే తీసుకువెళతాను" అంటూంది గీత.
    "మమ్మీ..." అరుచుకొంటూ వస్తున్న సుధకు ఎదురువచ్చింది లత.
    "మమ్మీ, ఆంటీతో నేనూ వెళతా, మమ్మీ."
    "నేను క్లబ్బుకి వెళుతున్నాను. ఈ రోజు డిస్ట్రిక్ట్ ఇంజనీరు భార్యకు ఫేర్ వెల్ పార్టీ ఇస్తున్నాం. సుధను తీసికెళ్ళవా?" అడిగింది గీత,
    "వద్దులే? వదిన ఈ రోజు ప్రయాణంచేసి బడలికగా ఉంది. ఒక వేళ ఆలస్యమయితే నిన్ను విసిగిస్తుందేమో?" అని "సుధా, ఆంటీ వచ్చేటప్పటికి చీకటి అయిపోతుందమ్మా. రేపు మనమంతా కలిసి వెళదాం. ఏమమ్మా?" అంటూ బ్రతిమిలాడి దగ్గరకు తీసుకొంది. అయిష్టంగానే 'సరే' నన్నట్లు తల ఊపింది సుధ.
    "అవున్లే. క్లబ్బులూ పాడూ ఏనాడైనా అలవాటుంటే గదా" అంది గీత.
    ఆశ్చర్యంగా కళ్ళు పైకెత్తిన లత వాటిలో ఏ భావం కనపడనీయకూడదనే భావంతో తలను పేపర్లో దూర్చింది. మళ్ళీ చూసేటప్పటికి గీత, "నే వెళ్ళుతున్నాను. మీరంతా నా కోసం కనిపెట్టుకోకుండా భోజనం చెయ్యండి" అని చెప్పి, హైహీల్స్ టకటక లాడించుకుంటూ వెళ్ళిపోయింది. అంతవరకు ఆపుకొన్న నిట్టూర్పును ఒక్కసారి బయటకు వదిలింది లత. నడినెత్తి మీద సిగ, చెవులకు పెద్ద లోలకులు, స్లీవ్ లెస్ జాకెట్టు, సన్నని టెరిలిన్ చీరె- నీటితో గీత అందం లోపించినట్లే కనిపించింది లతకు అందమైన మెరుపుతీగ లాంటి గీత నిరాడంబరంగా ఉన్నప్పుడే అజంతా శిల్పాలు గుర్తు వస్తాయి లతకు. ఆమెకు ఎన్నాళ్ళు ఆలోచించినా అర్ధం కాని విషయాల్లో ఫాషన్ పేరిట స్త్రీలు తమ అందాన్ని ఎందుకు నాశనం చేసుకొంటున్నారా అన్నది ఒకటి.
    "మమ్మీ....టీ కావాలి" అంది గోముగా సుధ.
    "నువ్వింకా తాగలేదా?...నాయర్...ఓ నాయర్!"    
    కేకవిని నాయర్ పరుగెత్తుకొచ్చాడు.
    "టీ తయారవ్వలేదా?"
    "అయిందమ్మా అమ్మగారి కిచ్చి ప్లాస్కులో పోసు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. రోజూ అలాగే చేస్తాగా!" అన్నాడు వాడికి అర్ధం కానట్లు.
    "సరేలే" అంటూ లేచి రెండు కప్పులలో టీ తెచ్చి ఒకటి సుధకిచ్చి ఒకటి తను తీసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS