కృష్ణయ్య గారు నవ్వుతూనే కొంచం విసుగ్గా "కళ సంగతి దేవుడెరుగు. ముందు మురికిపేరు కుంది" అన్నారు. అందరూ నవ్వారు. మీర సిగ్గు, ఆ సమాధానాలతో ఇబ్బందిగా చిరునవ్వు నవ్వి కిటికీ వేపు తిరిగింది.
మీర రైలు ప్రయాణం చేసి ఎరుగదు. ఇప్పుడు హాయిగా ప్రయాణపు ఆనందాన్ని అనుభవిస్తోంది. పరిగెత్తుతున్న చెట్లు, తేలుతున్న మబ్బులు, ఎగిరే పక్షులు- వీటిని చూస్తూ తన్మయం చెందింది. అలాగే కళ్ళు మూసుకుని జోగుతోంది. కళ్ళు తెరచేసరికి, రైలు మద్దూరు సమీపించింది. నర సింహయ్యగారు సంచి తీసుకొని క్రిందికి దిగారు. ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి రెండు నారింజపళ్ళు, బిళ్ళల పొట్లం మీరకిస్తూ "తీసుకో పాపా"
అన్నారు.
మీర తీసుకోకుండా పెదనాన్నవేపు చూసింది.
"చూశారా కృష్ణయ్యగారూ, చిన్న తనంలో ఎంత స్వాభిమానమో?" అన్నారు, నరసింహయ్య గారు.
"తీసుకో తల్లీ, ఫరవాలేదు" అని కృష్ణయ్య గారు చెప్పాక, మీర పళ్ళు బిళ్ళలు తీసుకుంది.
రైలు పదకొండున్నరకు మైసూరు చేరుకుంది.
జటకా రామరాజపురంలోని అగ్రహారపు ఇళ్ళల్లో ఒక దాని ముందు ఆగింది. పరిచయంలేని ఇంటిని చూసి భయపడింది, మీరా. ఇంటిముందున్న విశాలమైన ఆవరణలో రెండు కొబ్బరి చెట్లు ఒక పారిజాతపు చెట్టు, రెండు నందివర్ధనపు చెట్లు తప్ప మరేమీ లేవు. మిగతా భాగమంతా ములుం, రాళ్ళు, రప్పలతో నిండి ఉంది.
ఇంటి ముందు బండి ఆగిన శబ్దం వినపడగానే అప్పుడే భోజనం ముగించి చాప మీద నడుం వాల్చబోతున్న కమలమ్మగారు, కిటికీ వద్దకు వచ్చి చూశారు. ముందు కృష్ణయ్యగారు బండిలోంచి దిగారు. తరువాత వెండి పాంజేబులు వేసుకున్న రెండు చిన్న పాదాలు కనబడ్డాయి. వాటిని చూడ గానే కమలమ్మగారి కనుబొమలు ముడిపడ్డాయి. కృష్ణయ్య మీరను ఎత్తుకొని దింపారు. బండివాడు సామాన్లు తెచ్చి ఇంటిలో పెట్టి వెళ్ళి పోయాడు.
మీర్ ఏమీ తోచక తలుపు దగ్గరే నుంచుంది. కృష్ణయ్యగారు లోపలికి వెడుతూ వెనక్కి తిరిగిచూశారు. మీర తలుపు దగ్గరే ఆగిపోవటం చూసి మృదువుగా.
"లోపలికి రా తల్లీ, అన్నం తిందువుగానీ" అన్నారు.
మీరకు తన ఇల్లూ, తల్లీ, తండ్రి గుర్తుకు వచ్చారు కాబోలు కళ్ళు నలుపుకుంటూ ఏడవ సాగింది. కృష్ణయ్యగారు, భార్య మొహంలోని అసమాధానపు ఛాయలను, చూసినా చూడనట్టే.
"కమలా, మీర ఏడుస్తోంది, కాస్త చూడు" అన్నారు.
కమలమ్మ గారికి మీర ఆగమనం ఏమాత్రమూ ఇష్టంలేదు. అఠారా కచేరీలో హెడ్ గుమాస్తాగా పని చేస్తున్న కృష్ణయ్యగారికి ఉన్న ఆస్త్ల్లల్లా ఆ ఒక్క ఇల్లే. నలుగురు కొడుకులకూ తగిన చదువులు చెప్పించటమే, ప్రయాసగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో మనిషిని భరించ వలసి రావటం ఆమెకు కష్టమనిపించింది. కానీ భర్త మాటను తీసివేయలేక, మీరా దగ్గరగా వచ్చి, కొంగుతో మీర కన్నీరు తుడిచి, తల నిమురుతూ.
"ఏడవకమ్మా, ఆకలేస్తోందా? అన్నం తిందూగానిరా" అన్నారు.
కమలమ్మగారు ఇద్దరికీ కంచాలు పెట్టి అన్నం వడ్డించారు. మీరు, అప్పుడప్పుడూ వెక్కుతూ, నెమ్మదిగా అన్నం తినసాగింది. కమలమ్మగారు, రెండు మూడుసార్లు, అర్ధ గర్భితంగా, భర్తవేపు చూసినా, మీరా ఎదుట ఏమీ మాట్లాడటం ఇష్టం లేక, కృష్ణయ్యగారు, మౌనంగానే, భోజనం కానిచ్చారు. భోజనం కాగానే, పక్కవేసి మీరను పడుకోబెట్టారు.
"నే నిక్కడి కెందుకొచ్చాను? ఇక ఇక్కడే ఉండాలా?" అని ఆలోచించసాగింది. మీర ఆలోచనలకు ఒక రూపం ఏర్పడక మునుపే, నిద్రాదేవి ఆ పసిదానిని, తన ఒడిలోనికి తీసుకుంది.
కృష్ణయ్యగారు విశ్రాంతిగా కూర్చొని, తాంబూల సేవనకు ఉపక్రమించగానే, కమలమ్మగారు అక్కడే వచ్చి కూర్చొన్నారు.
"అది కాదండి, మనముండే పరిస్థితుల్లో ఇంకోమనిషిని భరించగలమా అని? ఈలా చేశారేమిటి? అన్నారావిడ. స్వయానా తమ్ముడి కూతురు తల్లీ తండ్రి లేని అనాధ. మీర పరిస్థితి ఆయన హృదయాన్ని ద్రవింప చేసింది. ఆ దుఃఖంలో కటువుగా,
"అయితే అమ్మాయిని అడవిలో పారేసి రావాలని నీ ఉద్దేశమా?" అన్నారు.
"అలా అన్నానా నేను? ఇంకేధైనా ఏర్పాటు చేయొచ్చుగా."
"ఇదిగో కమలా, ఒక్క మాట చెబుతాను. వింటావా? అక్కడి విషయాలన్నీ నీకూ తెలుసు. మీర తల్లి చనిపోయినపుడే, వాళ్ళ పుట్టింటి వాళ్ళెవారూ రాలేదు కదా. తను కన్నబిడ్డ పోయినపుడే రానివాళ్ళు, ఇప్పుడు వస్తారంటావా? ఎంత కాదన్నా మీర నా తమ్ముడి కూతురు. చూడవలసిన బాధ్యత నాదే! నీ చెల్లెలి బిడ్డే ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేసే దానివో ఒక్కమారు ఆలోచించు. మనకు కారు, రేడియోలు పెట్టుకునే స్తోమత లేకపోయినా, రెండు పూటల భోజనానికి కొదువ లేహ్డు. నలుగురు కొడుకుల మధ్య మీరా ఓ కూతురనుకో. ఇంత కన్నా ఇంకేమి చెప్పలేను."
"ఇప్పుడలాగే అంటారు. ఆడపిల్లల బాధ్యత అంత సులువుగా తేలిపోదు. మంచి సంబంధం చూసి పెళ్ళిచేయొద్దూ?"
"నిజమే. ఆ విషయం నాకూ తెలీక పోలేదు కానిఇప్పటి నుండి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకో నక్కరలేదు. ఆ తలగడ ఇలా పడేయ్ కాస్త పడుకుంటాను."
ఇక అంతటితో ఆ ప్రసంగం పూర్తయింది.
మీర నిద్రలేచేసరికి, మధ్యాహ్నం నాలుగు గంటలయింది. పక్క మీద లేచి కూర్చొని, కలవరంతో చుట్టూ చూసింది. తనెక్కడుందో తెలుసు కోవటానికి, కాస్సేపు పట్టింది. లేచి, లోపలికి వెళ్ళే ధైర్యం లేక, అలాగే కూర్చుంది. కమలమ్మ గారిపై మీరకు ప్రేమలాటిదేమీ కలుగలేదు. ఆమె ఎర్రటి ఛాయ, భారీ విగ్రహం, మొహానికి పెద్ద అనిపించే చెవులు, చిన్నవైనా, తీక్షణమైన కళ్ళు, కొద్దిగా ఎత్తుగా ఉన్న పళ్ళు, లావనిపించే పెదవులు, దూరానికి అందంగానే కనిపించిన, దగ్గరగా చూస్తే, విచిత్రంగా అనిపించి, మీరకు ఆమె పట్ల ఓ రకమయిన భయాన్ని కలిగించాయి.
గడియారంలో నాలుగుముప్పావు అవుతుండగా, ఓ కుర్రాడు, చేతిలో సంచి పట్టుకొని "అమ్మా" అంటూ లోపలికి వచ్చాడు. మీరను చూడగానే చటుక్కున ఆగిపోయి, ఎవరా అని మీరవేపే కాస్సేపు చూసి, గుర్తుకొచ్చినట్టు.
"నువ్వు మీరవుకదూ?" అన్నాడు.
మీర బదులు పలకలేదు. అతనెవరో గుర్తుకు రాలేదు మీరకు. శ్రీపాదం ఎక్కువ మాట్లాడకుండా లోపలికి పోయాడు. కమలమ్మగారు కాఫీ వేడి చేస్తున్నారు. శ్రీపాధం కమలమ్మగారి ఆఖరి కొడుకవటం వల్ల కాస్త గారాబం ఎక్కువ. తల్లి దగ్గర కూర్చొని.
