Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 2

 

    ప్రిన్సిపాల్ కి , తన తండ్రికి చాలా స్నేహం. ఆ చనువు ఆధారంగా ధైర్యంగా రిపోర్టు చేసింది. ప్రిన్సిపాల్ రూము నుంచి బయటకు వస్తుండగానే శ్రీధర్ ఎదురు పడ్డాడు. ఫస్టు పీరియడ్ ఇంగ్లీషు క్లాసు. పీరియడ్ జరుగుతుండగానే శ్రీధర్ కి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి పిలుపొచ్చింది. ఆరోజు శ్రీధర్ కనపడలేదు. మర్నాడు కాలేజీ గేటు దగ్గరే ఎదురుపడ్డాడు శ్రీధర్.
    "శారద ఇచ్చిన నోట్సు నా కివ్వలేదెం? ఇవ్వండి, దయచేసి! కటువుగా అడిగాడు.
    "నోట్సా! నాకేం తెలుసు! శారద నాకు నోట్సు ఇవ్వలేదు. అని తను వెళ్ళబోయింది.
    గేటు నుంచి కాలేజీ కి చాలా దూరం కాలిబాట ఉంది. ఆ బాటకి రెండు వైపులా గార్డెను పెంచారు. పెద్ద పెద్ద చెట్లతో కాలేజీ భవనం బయటకు కనపడదు. ఎవ్వరూ వెనక గాని, ముందు గాని కాలేజీ లో కి రావటం లేదు. శ్రీధర్ అటూ ఇటూ చూసి తనను చెయ్యి పట్టుకుని గార్డెను ;లోకి లాక్కెళ్ళాడు.
    "చెప్పు నోట్సు ఏం చేశావు?" గర్జించాడు.
    "నాకు తెలియదు ! మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ప్రిన్సిపాల్ కు రిపోర్టు చేస్తాను"
    "నిన్న చేశావుగా! నీ అందం చూసి నేను నీకు కవిత్వం వ్రాసి పంపానా? నువ్వే అందగత్తెవని భ్రమపడకు! మర్యాదగా నా నోట్సు ఇచ్చేయి!"
    "ఛీ! నాకు తెలియదంటుంటే " విసురుగా అంది తను.
    మరుక్షణం లోనే తన చెంప చెళ్ళుమంది. బిత్తర పోయిన తను తలెత్తి చూసేసరికి మళ్ళీ కొట్టబోయిన శ్రీధర్ చెయ్యి వెనక్కి తీసుకుని "ప్రిన్సిపాల్ గారు నన్ను పరీక్ష కు రావద్దన్నారు. నన్ను అనరాని మాటలు అన్నారు-- నిన్నేం చేశానని ఇంత కధ అల్లావు- జాగ్రత్త! జ్ఞాపకం ఉంచుకో నా జీవితం నాశనం చేసిన నిన్ను....నిన్నేం చేస్తానో చూడు! అంటూ వెళ్ళిపోయాడు.
    చాలా సేపటి వరకూ తనలాగే నిలబడిపోయింది. ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేద్దామనుకుంది. మనసు కోపంతో భగభగలాడసాగింది. ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు ? డిస్ మిస్ చేస్తాడు-- అంత కంటే ఏం చేస్తాడు. అది కాదు -- ఇంకేదైనా చెయ్యాలి... వెంటనే తిరిగి ఇంటి కొచ్చేసింది తను.
    తలుపు టకటకా శబ్దం కావటంతో ఉలిక్కిపడి లేచింది ఇందిర.
    "ఇందూ! ఇవ్వాళ కాలేజీ కి రాలేదేం?" నీరజ ఆదుర్దాగా అడిగింది.
    "ఏమిటో తలనొప్పిగా ఉంటె!" అంది ఇందిర లోపలికి దారి తీస్తూ.
    "ఇందూ! ఒక విషయం ! శ్రీధర్ నీకు ఉత్తరం రాశాడా? అందరూ అనుకుంటున్నారు " నీరజ అడగలేక అడిగింది.
    "ఆ! ఉత్త బ్రూట్ ! నాతొ వ్యవహారం కొరివితో తల గోక్కున్నట్టే అని తెలియదు కాబోలు"
    నీరజ ఆశ్చర్యంగా చూసింది.
    "ఏమిటో , అతనలాంటి వాడు కాదె! ఎందుకిలా చేశాడో"
    ఇంతలో ఇందిర తండ్రి మాధవరావు గారు రావటంతో ఇందిర లేచి వెళ్ళింది.
    "ఎమ్మా! కాలేజీకి వెళ్ళలేదా?"
    "లేదు డాడీ! ఒక వారం రోజులు లీవ్ పెడదామనుకుంటున్నాను " ఓ! నీరజ కూడా ఇక్కడే ఉందా! రండి -- కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం" అంటూ అయన డైనింగ్ హాలు లోకి నడిచారు.
    ఇందిర నీరజా ఇద్దరూ అయన వెనకాలే వెళ్ళారు.
    కాఫీ తాగుతుండగా అయన అన్నారు. "ఇందూ! ప్రిన్సిపాల్ గారు నాకు అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్పారు! ఇంటువంటి విషయాల కంతటి ప్రాముఖ్యం ఇవ్వకూడదమ్మా! ఏదో వయసు ప్రభావం పాపం! అతను పరీక్ష వ్రాయకపోతే ఏమవుతాడు? అందుకే నే చెప్పాను -- అతన్ని పిలిపించి గట్టిగా మందలించమని -- అంతకంటే వేరే ఏ శిక్షా వెయ్యవద్దని-- ఎమ్మా! నీరజా! నువ్వు చెప్పు! న్యాయం కాదూ నేను చేసిన పని!"
    "అవునండీ నిజమే! అతడు చాల మంచి వాడు" అంది నీరజ సంతోషంగా. "మంచి -- మంచి -- ఏమిటా మంచి --?" ఇందిర కోపంతో వణికి పోయింది. "అబ్బ! మా ఇందిర అంతా వాళ్ళమ్మ పోలికే! ముక్కు మీదే కోపం! ఆ! అన్నట్టూ అసలు విషయం మర్చిపోయాను. ఇందూ మనకి విశాఖ పట్నం ట్రాన్స ఫరయింది-- రేపు రాత్రికే వెళ్ళిపోవాలి " అని హడావుడిగా లేచి వెళ్ళిపోయారాయన.
    "అదేమిటే . పరీక్షలేలా!" ఆదుర్దాగా అంది.
    "పోనిద్దూ నేనెలాగూ ప్యాసవను! ఈ గొడవలో నుంచి హాయిగా దూరంగా వెళ్ళిపోతే మనశ్శాంతి గా నన్నా ఉంటుంది."
    "అదేమిటి ఇందూ! అయ్యో! వెళ్ళిపోతావా" దిగులుగా అంటున్న నీరజ ను చూడం గానే ఇందిర మనసు కూడా దిగులుతో నిండిపోయింది.
    కొంతసేపు కూర్చుని నీరజ వెళ్ళిపోయింది.
    "అన్నయ్యా !అదేమిటి? అట్లా ఉన్నావెం" మాసిపోయిన బట్టలతో రేగి పోయిన జుత్తుతో రాత్రి పది గంటలకు ఇల్లు చేరిన శ్రీధర్ ను అడిగింది భార్గవి ఆదుర్దాగా.
    "భార్గవీ! జీవితం తెల్లవారిపోయింది. నేను కట్టుకున్నవన్నీ గాలి మేడలై కూలిపోయినయి" రెండు చేతుల్లోనూ తలపట్టుకుని కూర్చున్న శ్రీధర్ ని తెల్లబోయి చూస్తూ నిలబడింది భార్గవి.
    ఆరాత్రి ఎంత బ్రతిమిలాడినా భోజనం చెయ్యలేదు శ్రీధర్! తెల్లవారి తొమ్మిదయినా శ్రీధర్ లేవలేదు. భార్గవి లేపగాలేపగా పది గంటల ప్రాంతంలో నిద్రలేచాడు.
    "అన్నయ్యా! కాలేజీ కి వెళ్ళవా?" కాఫీ ఇస్తూ అడిగింది భార్గవి.
    భార్గవి వంక కళ్ళెత్తి చూశాడు శ్రీధర్. పచ్చగా బంగారం లా వున్న భార్గవి లో ఇంకా పసితనం చాయలు పోలేదు. పాలు కారే బుగ్గలతో- విశాలమైన నేత్రాలతో అమాయకంగా పసిపిల్ల లా ఉంటుంది భార్గవి.
    "ఉహూ ? చెప్పకూడదు. చెప్తే విని తట్టుకోలేదు. అక్కయ్య కి తెలిస్తే రాద్దాంతం అవుతుంది -- ఏదో చెప్పాలి!....'    
    "మాట్లాడవేం! అన్నయ్యా!" అంది మళ్ళీ  భార్గవి.
    "ఎందుకెళ్ళనమ్మా! వెళ్తాను. అక్కయ్య టెలిగ్రాం ఇచ్చింది. నువ్వు కాకినాడ వెళ్ళాలి! పన్నెండు గంటల బస్సులో పంపిస్తాను? నిన్ను బస్సు ఎక్కించి తరువాత కాలేజీ కి వెళ్తాను" అన్నాడు శ్రీధర్.
    "ఇప్పుడా! కాకినాడ ఎందుకన్నయ్యా! నీకు ఇబ్బంది కదూ!"
    "ఫర్వాలేదమ్మా! మరి అక్కయ్య రమ్మంటే వెళ్ళక పొతే ఎలా?"
    అక్కయ్య రమ్మన్న కారణం తెలియక -- ఏవేవో ఊహించుకుంటూనే వంట పూర్తీ చేసింది . ఇద్దరూ భోజనాలకి కూర్చున్నారు. పదకొండున్నర ప్రాంతంలో చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు శ్రీధర్. బస్సు బయలుదేరి వెళ్ళిన తరువాత ఇంటి ముఖం పట్టాడు. కొంత దూరం వచ్చాక -- ఇంటికి వెళ్ళ బుద్ది కాలేదు. పైన ఎండ మాడుస్తుంటే లోపల మన భవిష్యత్తేమిటి అని గోల పెడ్తున్నది.
    "అవును. తన భవిష్యత్తేమిటి? ఏం చెయ్యాలి!ఉన్న ఆ నాలుగెకరాలు అమ్మేసి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళి ఇంజనీరు చదివితే ... అవును-- అట్లా చెయ్యటం తప్ప వేరే మార్గం లేదు. మరి భార్గవి పెళ్ళి! భార్గవి పెళ్ళి కేదిగింది. భార్గవి కి పెళ్ళి చెయ్యాలి! ఏం పెట్టి చేస్తాడు తను. ఉన్న ఊళ్ళో చదువుండగా కాదని తను ఇంత దూరం వచ్చాడు. వచ్చి తను సాధించగలిగిందేమిటి? తన జీవితం ఇలా అవుతుందని తను కలలో కూడా అనుకోలేదే ! ఇదంతా ఆ ఇందిర మూలంగా జరిగింది తెలిసి గాని తెలియక గాని తనేన్నాడు హాని చేసి ఎరగడు. కాని ఆ పిల్ల కెందుకో తన మీద పగ. మొత్తం మీద గొప్ప వాళ్ళ పలుకుబడి ముందు పేదరికం ఓడిపోయింది. తన నీతి నిజాయితీ కి రోజులు లేవు. తను అందరి దృష్టి లో అపరాధి గా నిలబడ్డాడు. ఇందిర...ఇందిర...కసిగా అనుకుంటున్న శ్రీధర్ కారు హారను వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆలోచనల్లో పడి తను చాలా దూరం వచ్చేశాడు. దాదాపుగా ఊరు దాటి పొలాల వైపు వచ్చేశాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. ఇటూ అటూ పచ్చని పొలాలు మామిడి తోటలు- అరె! చాలా దూరం వచ్చేశానని వెనక్కి ఊరి వైపు తిరిగాడు శ్రీధర్ . హారను వినబడ్డ కారుదగ్గరగా వచ్చింది. కనుబొమలు ముడిచి చూశాడు శ్రీధర్ -- ఆ కారులో ఇందిర -- ఇందిరే -- వెళ్తున్నది. క్షణం లో రోడ్డు కడ్డంగా వచ్చి కారుకి ఎదురు గుండా నిలబడ్డాడు శ్రీధర్. అసలే సన్నగా ఉన్న ఆ రోడ్డు లో అతన్ని తప్పించుకుని వెళ్ళటానికి ఇందిరకి అవకాశం లేకపోయింది. సడన్ బ్రేక్ వేసి కారాపింది.
    "క్షమించండి! మీతో కొంచెం మాట్లాడాలి" అంటూ ఇందిర సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపు తెరిచి ఇందిర పక్కనే కూర్చున్నాడు.
    "మిస్టర్! కాస్త "మానర్స్" అంటే ఏమిటో తెలుసుకోండి! ఏమిటీ దౌర్జన్యం " అంది కోపంగా ఇందిర.
    "ఇందులో "మానర్స్" ప్రసక్తి ఏముంది? మీ అమూల్యమైన కాలాన్ని ఈ దీనుడి కోసం కొంచెం వృధా చెయ్యండి అంటున్నాను."
    "మర్యాదగా కారు దిగండి. లేకపోతె  అరిచి గోల చెయ్యవలసి వస్తుంది." ముఖం లోకి రక్తం పొంగుకు వచ్చింది ఇందిరకు.
    "మీరు వచ్చి తీరాల్సిందే! ఎందుకు హైరానా పడతారు? ఈ పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్దాం రండి-- మీతో మాట్లాడాలి" ఇందిర నలువైపులా చూసింది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. దూరంగా పోలాలల్లో అక్కడో మనిషి అక్కడో మనిషి కనబడుతున్నాడు. తనకి బుద్ది లేదు. ఒంటరిగా ఎందుకు బయలుదేరాలి! ఊరికి వెళ్తున్న విషయం తన స్నేహితురాలు "వినోద్" తో చెప్పి పోదామని బయలుదేరింది. తన ఖర్మ కాకపొతే ఈ "వినోద్" వాళ్ళు ఊరి కింత దూరంగా ఉండాలా? అయినా ఈ శ్రీధర్ ఇక్కడ ఈ విధంగా ఎదురు పడతాడని తను అనుకున్నదా? ఏమిటి దారి? ఏం చెయ్యాలి?....ఆ....! నెమ్మదిగానే దిగినట్లే దిగి అతను దిగం గానే గబుక్కున కారులో కూర్చుని స్టార్టు చేసుకొని వెళ్ళిపోతే -- అవును--- అలాగే చెయ్యాలి..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS