Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 3


    
    హస్పిటల్ చాలా సందడిగా వుంది.
    ప్రక్కనే ఏదో అలికిడయినట్లయి తలత్రిప్పి చూశాడు. ఇందాకటి సిస్టర్.
    "డాక్టర్! ఇక్కడే నిలబడివున్నారేం?" అని పలకరించింది.
    ఆ సిస్టర్ పేరు ప్రత్యూష. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చిందులాడుతూ వుంటుంది.
    "రూమ్ లో యేమి తోచటం లేదు"
    క్రికెట్ మేచ్ వస్తోన్నట్లుందిగా. మీకు క్రికెట్ అంటే యిష్టమని చెప్పారు"
    "ఇష్టమే. కని మనవాళ్ళు ఓడిపోతూంటే భరించలేను. టి.వి. ఆఫ్ చేసి వొచ్చేశాను"
    "మీరు గెలుపునే గాని ఓటమిని భరించలేరా డాక్టర్?"
    మహేష్ నవ్వాడు. "ఓడిపోవటం ఎవరికిష్టముంటుంది?"
    "డాక్టర్ భార్గవ ఇంకా రౌండ్స్ కి రాలేదు. ఇవేళ బ్రెయిన్ యిన్ జరీ కేసు వుంది. ఎమర్జన్సీ. డాక్టర్! ఓ గమ్మత్ చెప్పనా? ఆ బ్రెయిన్ యిన్ జరీ జరిగింది ఓ సినిమా నటుడికి. ఇక్కడ షూటింగ్ పూర్తిచేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు టీమంతా. ఆ సినిమా నటుడికి విమానమంటే భయం అందుకని ప్లేన్ లొ పోకుండా కారులో ప్రయాణం చేస్తోంటే కారుకి ఏక్సి డెంట్ జరిగి తలకి బలమైన గాయం తగిలింది" అన్నది ప్రత్యూష.
    "పాపం" అన్నాడు మహేష్ సానుభూతిగా.
    "పేషంట్ కోమాలోవున్నాడు. ఆపరేషనయాక రికవరయితే చాలా అదృష్టవంతుడే"
    "డాక్టర్ భార్గవ చాలా ఎఫిషియంట్"
    "సౌత్ యిండియాతో అంతటి న్యూరోసర్జన్ లేరు. కాని....న్యూర లాజికల్ కేసుల్లో ఎంత ఎఫిషియన్సీ వున్నా చాలా సందర్భాలలో చెయ్యగలిగిందేమీ వుండదు" అంది ప్రత్యూష సాలోచనగా!
    మహేష్ ఉలిక్కిపడి ఆమెవంక చూశాడు.
    ఆమె తన తప్పు గ్రహించినట్లు "సారీ! నా ఉద్దేశం.....కొన్ని సందర్భాలలో...."
    మహేష్ నవ్వి "నేనేం బాధపడలేదు" అన్నాడు.
    కొంచెం ఆగి ప్రత్యూష "డాక్టర్ భార్గవ రౌండ్స్ కొచ్చేసరికి చాలా పొద్దుపోతుందేమో" అంది.
    "అవనివ్వండి."
    "మీకేమన్నా కావాలా?"
    "ఇప్పుడేమీ అక్కర్లేదు."
    "ప్రొద్దుట బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నారా?"
    "తీసుకున్నాను."
    "మళ్ళీ వస్తాను" అని ప్రత్యూష ప్రక్కనున్న రూమ్స్ వైపు వెళ్ళిపోయింది.
    మహేష్ కొంచం సేపక్కడే నిలబడ్డాడు. జీవితంలో మునుపెన్నడూ అంత ఖాళీగా, విశ్రాంతిగా లేడు. విద్యార్ధి దశలోనూ లేడు. డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టాకా లేదు. ఏ పనీ చెయ్యకుండా నిరర్ధకంగా కూర్చోవడమంటే అతనికి తెగని చిరాకు. అతని మనసో, శరీరమో ఎప్పుడూ అలా కదుల్తూనే వుండేది. ఏదో ఒకపని చేస్తూనే వుండేది.
    అలాంటిదిప్పుడు....
    ఏమీలేదు....బహుశా ఏమీకాదు. ఏమీ కాదు తననితానే ఊరడించుకుంటున్నాడు. ధైర్యం చెప్పుకుంటున్నాడు.
    ఏమీతోచక గదిలోకి వెడదామని వెనక్కి తిరిగాడు.
    తన గదికి అయిదారు నంబర్ల తర్వాత వున్న ఓ గది తలుపు తెరుచుకుంది. లోపల్నుంచి పాతికేళ్ళ వయసున్న స్త్రీ ఎనిమిది తొమ్మిది నెలలున్న బంతిలాంటి పాపనెత్తుకుని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటి కొచ్చింది. తలుపు పూర్తిగా మూతపడకముందే తిరిగి లోపల్నుంచి ఎవరో పిలిచినట్లయింది. పాపతోసహా మళ్ళీ లోపలకు పోబోయింది. అంతవరకూ లోపల వున్నందువల్ల పాపకు చాలా విసుగనిపించి వుంటుంది. తల్లి తనని తిరిగి లోపలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యటం గమనించి చేతుల్లోంచి గింజుకుంటూ క్రిందకు జారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. "అబ్బ! అయితే యిక్కడేవుండు. ఇప్పుడే వొస్తాను" అంటూ పాపను నేలమీద దిగవిడిచి ఆమె లోపలకు వెళ్ళిపోయింది. తలుపు మూసుకుంది.
    మహేష్ అందంగా, బొద్దుగావున్న పాపవంక ఆసక్తిగా చూస్తున్నాడు.
    ఒక్కక్షణం పాప కుదురుగా కూర్చుని అటూ యిటూచూసి నేలమీద ప్రాకసాగింది.
    మహేష్ చేతులు జాచి 'రా' అన్నట్టు పిలిచాడు.
    పాప మహేష్ వైపు చూసి చిరునవ్వు ఒలకబోసి అటుకేసి ప్రాకుతోంది.
    మొజాయిక్ చెయ్యబడి నున్నగా, తళ తళా మెరిసిపోతోన్న నేలమీద పాప బొమ్మలా ముందుకు ప్రాకుతోంది. మధ్య మధ్య వెనక్కి జారిపోతూ.
    ఇంతలో ర్యాంప్ మీదనుంచి చిన్న ట్రాలీని యిద్దరు వర్కర్ తోసుకుంటూ వచ్చి పాపముందుగా ట్రాలీతో సహా వెళ్ళిపోయారు దూరంగావున్న ఏదో గదిలోకి.
    పాపదృష్టి ట్రాలీవైపునుంచి ర్యాంప్ మీదకు మళ్ళింది. తనని ర్యాంప్ ఆకర్షించినట్లుంది మహేష్ ని మరిచిపోయి అటుకేసి తిరిగి ప్రాకసాగింది.
    ఆ సమయానికి వరండాలో పాప, మహేష్ తప్ప ఎవరూ లేరు.
    "అరె" అనుకున్నాడు మహేష్ కంగారుగా "పాపా!" అని పిలిచాడు.
    పాప వినిపించుకోలేదు. ర్యాంప్ వైపు వెళ్ళిపోతోంది.
    "య్యో" అనుకుంటూ మహేష్ వేగంగా ముందుకు కదలబోయాడు.
    ఆ ఒక్కక్షణం....
    ఒక్కక్షణంలొ ఏదో జరిగింది.
    మెరుపు వేగంతో ముందుకు కదలబోయిన మహేష్-నిల్చున్నవాడు నిల్చున్నట్లు అలా ఆగిపోయివున్నాడు.
    కాళ్ళు కదిలిద్దామని విశ్వప్రయత్నం చేశాడు. శరీరంలోని నరాలన్నీ చించుకుని కదిలించటానికి శాయశక్తులా ప్రయత్నించాడు.
    ఆ శక్తంతా ఏమయిపోయింది?
    శరీరంలోని ఏ భాగమూ-కాలూ, చెయ్యీ అణుమాత్రమైనా కదలటం లేదు.
    ఆఖరికి కనురెప్పలు కూడా కదలటంలేదు. మూతపడటానికి నిరాకరిస్తూ తెరిచినవి తెరిచినట్లు వుండిపోయాయి.
    పాప ర్యాంప్ మొదట్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది.
    అతని మనసు మాత్రం పనిచేస్తోంది. "పాప దొర్లిపోతుంది- పాప దొర్లిపోతుంది".
    అంతరాత్మ ఘోషిస్తోంది.
    శరీరంమాత్రం చలనం లేకుండా- శిలావిగ్రహంలా అలా నిలబడి పోయింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS