"చాలా బావుందిరా" అంది ఆయన భార్య చీరని చేతుల్లోకి తీసుకుంటూ. కుర్రవాడు నవ్వి తల దించుకున్నాడు. మళ్ళీ ఆవిడే అంది- "ఒరేయ్! నీ పనితనం చూస్తూంటే ఎప్పటికయినా నువ్వు గొప్పవాడివి అవుతావని అనిపిస్తుందిరా."
వింటూన్న మాస్టారు ఆ కుర్రవాడివైపు సానుభూతితో చూశాడు. కాపిటలిస్టుల కబంధహస్తాలు నారాయణపేట కార్మికుల హస్తనైపుణ్యాన్ని కబళించినంత కాలమూ గొప్పవాడు అయ్యే ప్రసక్తి లేదని అతడికి తెలుసు. "నేను పదోక్లాసు పాసవటానికి మాస్టారు కారణమమ్మా ఇంతకన్నా పెద్దది యిచ్చుకోలేను."
"అంత మాటనకురా. నువ్వింకా చదవాలి. ఎంత కష్టపాడయినాసరే! శలవుల్లో ఇక్కడికేరా రోజూ ఓ గంట చదువు చెపుతాను."
"శలవుల్లో పట్నం వెళ్దామనుకుంటున్నాం మాస్టారూ. ఈ పల్లెల్లో ఎంత అమ్మినా ఏముంది! నాలుగు చీరలు పట్నంలో అమ్మగలిగితేచాలు."
"పట్నంలో ఈ చీరలు ఎవరు కొంటార్రా?"
"దిగితేగానీ లోతు తెలీదుగా మాస్టారూ."
మాస్టారు ఆ కుర్రవాడివైపు చిత్రంగా చూసేడు. ఆయన చూపుల కందని లోతేదో ఆ కుర్రాడి మొహంలో కనపడింది.
"ఒకవైపు చదువుకుంటూ మీ మావకి ఇంత సాయం చేస్తున్నావంటే నిన్ను కన్నవాళ్ళెవరో గానీ చాలా అదృష్టవంతుల్రా."
"ఒక్క చదువేకాదు వీడు బాగా పాడతాడు కూడా. ఒరేయ్ అమ్మగారు వింటారు ఒక పాత పాడరా."
రెండోసారి అడిగించుకోకుండానే ఆ కుర్రవాడు తలదించుకుని నెమ్మదిగా పాడటం ప్రారంభించాడు. ఆ హిందీ పాత అర్ధం గమ్మత్తుగా వుంది.
"వెన్నెల్లో కూర్చుని భావాన్ని నేస్తే-
పాట చీర తయారైంది.
జరీ పల్లవికి చరణం అంచు - రంగు పొగమంచు.
పై పైకి రాకు సూర్యుడా! పొద్దంటే మాకు చేదురా!
కంటిచూపు చీర కట్టాలి ఒంటిని
కంచిపట్టు చీర జారాలి నేలని.
వేళ్ళు నేసే నేతకి - కుచ్చిళ్ళు పాడే పల్లవి.
తుఫాను రేగే ముందర - ముస్తాబులేల దండగ."
మాస్టారుగారి భార్యకి అర్ధంకాలేదు. పాటలోనూ, గొంతులోనూ వున్నా మాధుర్యాన్ని ఆస్వాదించింది. అంతే మాస్టారు మాత్రం ఈ అద్భుతమైన భావానికి విస్మయం చెందారు.
"ఎవర్రాశార్రా ఈ పాటని?"
ఈ కుర్రవాడు మరింత సిగ్గుతో తల వంచుకుని "నేనే మాస్టారూ" అన్నాడు. ఆయన కన్నార్పకుండా అతడివైపు చూశాడు. యవ్వనం క్రమక్రమంగా తొంగి చూడటానికి ప్రయత్నిస్తూన్న మొహంలో అమాయకత్వం పారిపోకుండా వుండటానికి ఆఖరి యుద్ధం చేస్తూంది. బుగ్గమీద చిన్న మొటిమ ఉద్భవించిన మొదటి సైనికుడిలా వుంది.
'ఇతడి పూర్వీకులెవరో గొప్ప కవులో గాయకులో అయివుంటారు. లేకపోతే అంత భావాన్ని ఇంత చిన్న పదాల్లో ఇరికించే నేర్పు ఇంత చిన్న వయసులో ఈ కుర్రవాడికి రాదు' అనుకున్నారాయన. ఆయనకి తెలీదు-
చీర నేసేవాడికి ఆడవాళ్ళ హృదయం అద్దంలా చదివే నేర్పుండాలనీ - ఏ రంగుమీద ఏ అద్దకం అందం యిస్తుందో తెలుసుకోవాలంటే యే పువ్వు ఏ భావానికి అర్ధమో చెప్పగలిగే భావుకత్వం వుండాలనీ, అది కుర్రవాడిలో ఒక పిసరు ఎక్కువేవుందనీ - అందుకే ఆ కుర్రవాడికి -
చీర నేసే కళతోపాటు, ఏ చీర ఎవరికీ నప్పుతుందో చెప్పగల అద్భుతమైన వరాన్ని కూడా దేవుడు ప్రసాదించాడని.
..........
రేడియో పాట పూర్తయింది. ఆ కుర్రవాడు తెప్పరిల్లి అక్కన్నుంచి కదిలాడు. అయితే ఈసారి అతడు చీరలు చీరలని అరవలేదు. అందువల్ల ఏమీ లాభం లేదని తెలిసిపోయింది.
ఒక పెద్ద భవంతి - ముందు తోట ఉన్నాయి. గేటు తెరిచే వుంది. గేటు దగ్గిర ఎవరూలేరు. నేరుగా లోపలి ప్రవేశించాడు.
దారి కిరువైపులా చెట్లు గాలికి వూగుతున్నాయి. పూలు అందంగా కదులుతున్నాయి. ఆ ఇల్లు ఎమ్మెల్యేగారిది. కానీ మిట్ట మధ్యాహ్నం అవటం వల్ల బయట నిర్మానుష్యంగా వుంది.
* * *
ఎమ్మెల్యేగారి భార్య విసుగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తూంది. ఇంకొక నలభై ఏళ్ళావిడ ఆవిడనే చూస్తూంది. ఆవిడో డాక్టరుగారి భార్య. ఆవిడ చాలా ఇబ్బందిలో ఉన్నట్టు కనపడుతూంది. దానికి కారణం కూడా వుంది. ఆ సాయంత్రం 'మిస్ విజయవాడ' ఎన్నిక జరుగుతూంది. దానికి ఆమె ముగ్గురు జడ్జీల్లో ఒకరు.
అంతవరకూ బాగానే వుంది.
వచ్చిన చిక్కల్లా, ఎమ్మెల్యేగారి కూతురు ఆ పోటీల్లో పాల్గొనటంతోనే వచ్చింది.
ఎమ్మెల్యేగారి భార్య తన కూతురు ఎలాగైనా ఈసంవత్సరం 'మిస్ విజయవాడ'గా ఎన్నికవ్వాలని పట్టుబట్టి కూర్చుంది. డాక్టర్ గారి భార్యకి ఆ విషయం కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పింది.
తనొక్కతే జడ్జీ అయితే అసలు పోటీ అని కూడా చూడకుండా ఆమె బహుమతి ఇచ్చేదేగానీ, ఆమెతోగానీ, ఆమెతోపాటు మరిద్దరు న్యాయనిర్ణేతలున్నారు. అందులో ఒకామె మరీ స్ట్రిక్టు.
"నేను నూటికి నూరు మార్కులిచ్చినా, మిగతా ఇద్దరివీ కలిపి మొత్తం ఎవరికెక్కువ వొస్తే వారికిస్తారు బహుమతి" అంది డాక్టర్ గారి భార్య.
"......మిగతా ఇద్దరూ కనీసం యాభై వేస్తేగానీ ఫస్టు ప్రైజ్ రాదు."
అప్పుడు ప్రారంభమయింది ఇంట్లో రిహార్సిల్.
రకరకాలుగా కూతురి బొట్టుమార్చి, కట్టుమార్చి, హెయిర్ స్టయిల్ మార్చి, మరింత మేకప్ చేసి తీసుకొచ్చి చూపిస్తోంది కానీ డాక్టర్ గారి భార్యకి అది నచ్చటం లేదు. ఎలా మార్చి తీసుకొచ్చినా, "ఇలా అయితే వాళ్ళు యాభై వెయ్యరు" అంటోంది. గంటనుంచీ ఇదే తతంగం జరుగుతుంది.
ఎమ్మెల్యేగారి కూతురు అంద వికారేమీ కాదు. కానీ మిస్ విజయవాడగా ఎన్నికవ్వాలంటే అదేమీ సులభమైన విజయంకాదు. పాపం ఆ అమ్మాయి కూడా ఓపిగ్గా రకరకాలుగా స్టయిల్స్ మారుస్తూ గంటనుంచీ తిప్పలు పడుతోంది. సరిగ్గా అప్పుడు వినిపించింది బయట్నుంచీ 'అమ్మా' అన్న కేక.
* * *
ఎమ్మెల్యేగారి భార్య బయటకొచ్చి మెట్లమీద నిలబడి వున్న కుర్రవాడిని చూసి, "ఎవరూ" అంది.
"ఎండ మండిపోతోందమ్మా కాస్త మంచి నీరిప్పిస్తారా" అని అడిగాడు. ఆవిడ ఏమనుకుంటుందోగాని, లోపలికి తిరిగి, "ఒరేయ్ రాముడూ ఈ అబ్బాయికి నీళ్ళు కాస్త తెచ్చివ్వు" అంది.
ఆవిడ లోపలికి వెళ్ళిపోబోతూంటే "మంచి చీరలున్నాయి.....చూస్తారా అమ్మా" అని అడిగాడు.
"అవునమ్మా స్వంతంగా నేసినవి....."
నేత చీరలనగానే ఆవిడలో ఇంటరెస్ట్ పోయినట్టు స్పష్టంగా కనిపించింది. "ఇప్పుడు ఖాళీ లేదు. వెళ్ళు" అంది, ఇంతలో లోపల్నుంచి ఆవిడ కూతురొచ్చింది.
కృత్రిమ వేషధారణలో వున్న ఆ అమ్మాయిని చూడగానే ఆ కుర్రవాడు అదోలా ఫీలయ్యాడు. ఆమె మేకప్ చాలా అసహజంగా కనిపించింది. ఆ అమ్మాయి వయసు అతడికన్నా అయిదారు సంవత్సారాలు ఎక్కువ వుంటుంది. కాని మేకప్ వల్లా, హెయిర్ స్టయిల్ వల్లా మరో మూడు నాలుగు సంవత్సరాలు ఎక్కువ వయసున్నదాన్లా కనిపిస్తూంది.
తన కూతుర్ని చూడగానే ఆ చీరలమ్ముకునేవాడి మొహంలో కనపడిన ఆశ్చర్యాన్ని ఆవిడ మరోలా అర్ధం చేసుకుని-
"ఈ రోజు 'మిస్ విజయవాడ' పోటీ వుంది. అంటే అందాల పోటీ అన్నమాట" అంది కాస్త గర్వంగా.
అప్పుడతడు మరింత పరీక్షగా ఆ అమ్మాయివైపు చూశాడు.
నేతని చూడగానే గుణం కనిపెట్టగలిగే కళ్ళు అతనివి! అంచు క్రింద కాళ్ళనిబట్టి పై శరీరచ్చాయని అంచనా వేయగలిగే నేర్పున్న కళ్ళు!! ఆ అమ్మాయి సహజమైన అందాన్ని ఎక్కడో ఏదో లోటు పాడుచేస్తూంది- అని గ్రహించటానికి అతడికి అరక్షణం కన్నా తక్కువ పట్టింది.
ఈ లోపులో ఆ అమ్మాయి విసుగ్గా, "మమ్మీ! ఇక నేనీ వేషాలు మార్చలేను. ఎన్నిసార్లు మార్చినా ఆంటీకి నచ్చటంలేదు. నాకు ప్రైజ్ రాకపోయినా ఫర్లేదు" అంది.
"అదేమిటమ్మా పద నేను అడుగుతాను" అందావిడ లోపలికి కూతురితో సహా వెళ్తూ.
ఆ కుర్రావాడు వెనుకనుంచి "అమ్మగారూ" అన్నాడు.
"ఇప్పుడు మాకు చీరలేమీ అక్కర్లేదయ్యా".
"చీరల గురించి కాదమ్మా."
