నర్సమ్మగారు చెమటలు కక్కుతూ, వగరుస్తూ వచ్చింది. "పదమ్మా, సంధ్యా! ఆ వెధవని పీటలమీద కూర్చోబెట్టి వచ్చేసరికి నా తాతలు నా కళ్ళముందు కనిపించినట్టుగా అయ్యారు. మళ్ళీ లేచిపోతాడో ఏమో! ఆ మంత్రాలూ, తంతూ అవన్నీ లేకుండా ఏకంగా ఆ మంగళ సూత్రధారణ జరిపించమని శాస్త్రిగారికి చెప్పి వచ్చాను."
అరుణ్ రంగంలోకి దిగాడు, కాలర్ సవరించుకొని, "ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదండీ! బంగారంలాంటి పిల్లను ఆ మృగానికి కట్టడానికి మీ మనస్సెలా ఒప్పుతుంది?"
నర్సమ్మగారు నివ్వెరపోతూ అడిగింది, "ఏమిటీ? ఈ పెళ్ళి జరుగడానికి వీల్లేదా? ఈ మాట చెప్పడానికి నువ్వెవడివి?" గయ్ న లేచింది.
"ఆ వెర్రి వెంగళాయికి పెళ్ళెందుకు? భార్యని ఏం చేసుకోవాలో కూడా తెలియని వాడికి! ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మీకేం అధికారం ఉంది?"
"భార్యని ఏం చేసుకోవాలో తెలీదని ఎట్లంటావు? వాడికి మగతనం లేదనేగా నువ్వనడం? వాడిని ఏ డాక్టరు దగ్గరికి తీసుకు రమ్మంటావో చెప్పు! తీసుకు వస్తాను! తల్లిని, వాడి సంగతి నాకు తెలియదా?"
"ఆ మృగానికి పెళ్ళి అంత కావాలనుకొంటే అతడికి సరిపోయినదాన్నిచూసుకోవాలి! ఆ వెర్రి వెంగళయ్యకి ఏ వెర్రి వెంగళమ్మనో చూసి చేస్తే సరిపోతుంది"
"మృగం మృగం అంటావు! నా కొడుకుని మృగమని అనడానికి నువ్వెవరివి? అప్పటి నుండి చూస్తున్నాను! ఏమిటి నీ అధికారం నా ఇంటికి వచ్చి? ముందు బయటికి నడు!" నర్సమ్మగారు అపరకాళిలా లేచింది.
"సంధ్యా! మేం వెడుతున్నాం! వస్తావో, నీ జీవితం ఇక్కడ సమాధి చేసుకొంటావో త్వరగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా! మేం కారులో కూర్చొని ఉంటాం! పదమ్మా!" బయటికి నడిచాడు అరుణ్.
జానకమ్మ కొడుకుతో వచ్చి కారులో కూర్చుంది.
ఇటు పెళ్ళి పీటల మీదికి పిలుస్తున్న నర్సమ్మత్త. అటు, "నీ జీవితం సమాధి చేసుకోవద్దు! మాతో వచ్చెయ్యి!" అంటున్న అరుణ్. ఎటు వెళ్ళాలి? ఆలోచించుకోడానికి ఎక్కువ సమయం లేదు! తల్లీ తండ్రిపోయి అనాధ అయిన ఆ స్థితిలో నర్సమ్మత్త చేరదీయకపోతే తనేమైపోయేది? బజారున పూసిన పువ్వులా అందరి సొత్తూ అయ్యేది! అందరి చేతుల్లో పడి నలిగిపోయేది! నర్సమ్మత్త భద్రకాళిలా లేచి మగపురుగుని కూడా ఇంటివైపు చూడనిచ్చేది కాదు. ఆవిడ నీడలో తన జీవితం నిశ్చింతగా గడిచిపోయింది ఇన్ని రోజులు. ఇక ముందు రోజులు. ఇక ముందు రోజులు కూడా ఆవిడ నీడనే గడిపేయాలనుకొంది! ఏ సంబంధంలేని తనను ఆవిడ సంరక్షిస్తున్నందుకు, ప్రతిఫలంగా ఆమె కోరింది, తన కొడుకుని పెళ్ళాడి వంశోద్దారకుడిని ఇమ్మని! దీనికోసం ఆమె పెద్దగా బలవంతపెట్టలేదు! 'ఆలోచించుకో!' అంది. 'వాడు వెర్రివాడని ఒకటేగాని పోరు పొటుకు లేని సంసారమౌతుంది! నర్సమ్మగారు పైకి తేలదుగాని వాళ్ళ పూర్వీకులు సంపాదించింది బంగారు కడ్డీలు ఓ పెట్టెకు ఉన్నాయి! అవన్నీ నీకే అవుతాయి కదా? ఇంతకంటే నీకు మంచి సంబంధం రావాలంటే నీకు వెదికి చేయడానికి నీకు పెద్దదిక్కు ఎవరున్నారు చెప్పు?" అని ఊళ్ళో వాళ్ళు సలహా ఇచ్చారు.
తను ఆలోచించినా మంచి దారి కనిపించలేదు! సింహంతో పెళ్ళికి ఒప్పుకుంది. ఇప్పుడు పట్నం నుండి అరుణ్ హఠాత్తుగా ఊడిపడి తనతో వచ్చేయమనగానే గుడిసెమీద దెబ్బేసిపోయినట్టుగా వెళ్ళిపోవడమేనా? ఎంత విశ్వాసహీనత? ఎంత తొందరగా ఆశకు లొంగిపోయింది! ఎంత తప్పు చేయబోయింది. నిజంగా తనిప్పుడు వెళ్ళిపోతే నర్సమ్మత్తకు చేసిన ద్రోహం శాపంగా మారి తనని తరుమదూ?
సంధ్య ఒక నిర్ణయానికి వచ్చింది. ముత్తయిదువ పట్టుకొన్న పూర్ణకలశాన్ని చేతిలోకి తీసుకొని పందిట్లోకి నడిచింది.
నర్సమ్మగారు తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది.
చూస్తున్న బంధువులకి, ప్రేక్షకులకి మాత్రం కొంచెం నిరుత్సాహం అనిపించింది. ఆ పిల్ల పీటలమీది పెళ్ళికాదని ఆ పట్నంబాబుతో వెళ్ళిపోతే ఈ సంఘటన గురించి ఎన్నాళ్లో కధలుగా చెప్పుకోవచ్చు.
శ్యామలకైతే గొంతువరకూ వచ్చింది కోపం! సంధ్య తీసుకొన్న నిర్ణయం సరైనదికాదని వాదించాలని ఎంత ఆవేశంగా ఉన్నా, తలిదండ్రులుండడం వల్ల సాహసించలేకపోయిది పీటలమీది పెళ్ళి చెడగొడితే తండ్రి తనని నరికి పాతరవేస్తాడు. ఆయన అంత కోపిష్టీ, ఛాందసుడూ.
