స్నేహితులిద్దరూ చేతులు చేతులు పట్టుకుని తాలుకాఫీసుకేసి నడిచారు. దారిలో నాగేశ్వర్రావు చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. యుద్దంలో "మనం" గెలవటంలో సుందరానికి ఆనందిచవలసిన అవసరం ఉందని మొదట తెలియనప్పటికీ, నాగేశ్వరావు ఉస్తాహం అంటువ్యాధిలుగా సంక్రమించింది.
"ఇక జర్మనీవాళ్ళు ఎప్పటికీ యుద్ధంచెయ్యరు. వాళ్ళ పొగరణిగిపోయిందిలే. ఇంగ్లీషువాళ్ళుంటే ఏమిటనుకున్నారో. నిజంగా ఇంగిలీషువాళ్ళని ఎవరూ జయించలేరు. తెలుసా?" అంటూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు నాగేశ్వర్రావు.
వీళ్ళు వెళ్ళుతుండగానే ఊరేగింపు ఎదురువచ్చింది. బాండు వాయిస్తున్నారు. "సార్టు" బండిలో జార్జి చక్రవర్తినీ, మేరిరాణినీ రంగుపఠాలు ఊరేగించారు. పోలీసులూ, పోలీసు ఉద్యోగస్తులూ, తహసిల్డారూ, డిప్టీకలెక్టరూ ఊళ్ళో, ఒకరిద్దరు గొప్పవాళ్ళూ ఊరేగారు.
సుందరం ఆనందానికిప్పుడు మేరలేదు. ఆ ఆనందంలో బడికి శలవన్నది ఎక్కువయిన పాత్ర వహించింది.
"నువ్వు అన్నంతిని మా ఇంటికి రారాదుట్రా? ఇవాళ మా అన్నయ్యా, బావా, వాళ్ళ స్నేహితులూ చాలా మంది వస్తారు, సరదాగా తిరుగుదాం" అన్నాడు నాగేశ్వరరావు.
సుందరం సరేనన్నాడు. ఈ ఇద్దరికీ ఈరోజున ఈవిధంగా ప్రారంభమైన స్నేహం సుందరం జీవితంలో అతి ప్రధాన స్నేహాలలో ఒకటిగా పరిణమించింది.
* * * *
నాగేశ్వర్రావు అన్న శ్రీరామూర్తి అప్పటికే ఫోర్త్ ఫారం చదువుతున్నాడు. నాగేశ్వర్రావు అక్కమొగుడు అత్తవారింటనే ఉండి, పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇవాళ నాగేశ్వర్రావింటికి శ్రీరామ్మూర్తి స్నేహితులూ, సహాధ్యాయులూ నలుగురైదుగురు వచ్చారు. వాళ్ళంతా చాలా కలుపుకోలుగా ఉంటూ ఇంటోవాళ్ళల్లేనే ప్రవర్తించేవాళ్ళు. నాగేశ్వరరావుకూడా వాళ్ళను "ఏంరా?" అని పిలిచేవాడు. సాధారణంగా పెద్దఫారాలు చదివే పిల్లలు చిన్నక్లాసువాళ్ళను లోకువుగా చూసేవాళ్ళు, కాని శ్రీరామ్మూర్తి స్నేహితులు సుందరాన్ని అట్లా చూడలేదు.
రోజల్లా చాలా సరదాగా గడిచిపోయింది. చాలసేపు చీట్లపేక ఆడారు_ దొంగాట. సుందరానికి దొంగాట చాతకాదు. అందుచేత నాగేశ్వర్రావు ఆడే ఆటచూస్తూ కూచున్నాడు.
ఇంతలో ఎక్కడినుంచో గ్రామఫోను వచ్చింది, పువ్వుతో సహా. గ్రామఫోనూ, కుక్క గ్రామఫోను వింటున్న బొమ్మగల ప్లేట్లూ సుందరం ఈసారి దగ్గర్నుంచి చూశాడు. వాడు గ్రామ ఫోను కీ ఇచ్చాడు కూడానూ. ప్లేట్లలో వనజాక్షి ప్లేట్లూ, రైలుబండి తమాషా, కోయంబత్తూరు తాయిప్లేట్లూ, నవ్వే ప్లేట్లూ, కొన్ని తురక ప్లేట్లూ కూడా ఉన్నాయి. వనజాక్షి ప్లేట్లలో "ఓరోరి బండివాడా" "శివదీక్షాపరురాలనురా" "వదినెలందరు వచ్చిరి" ఉన్నాయి. పాటంతాపాడి "మైనేమీజ్ వనజాక్షి " అనేది వనజాక్షి. ఆ మాటకోసం ఎన్నిసార్లో ఆప్లేట్లు పెట్టారు. రైలుబండి తమాషా ఎన్నిసార్లు పెట్టారో సుందరానికి లెక్కకూడా లేకుండా పోయింది. చూస్తుండగానే ఆ పాటంతా సుందరానికి వచ్చేసింది. నువ్వుప్లేటు తమాషాగానే ఉందిగాని, వాడేమంటున్నాడో తెలీదు. తాళంప్రకారం నవ్వటం సుందరానికి చాలా అసహ్యంగా కనబడింది.
సుందరం మధ్యాహ్నం ఇంటికొచ్చి అన్నంతిని మళ్ళీ రెండుగంటలకు నాగేశ్వర్రావింటికి వెళ్ళాడు. అక్కడ నాగేశ్వర్రావు తల్లి అందరికీ ఫలహారాలు పెట్టింది. ఆ ఫలహారం తిన్న తరువాత అందరూ కలిసి రైలుకట్టదగ్గిర డొంకలో బిళ్ళంగోడు ఆడటానికి బయలుదేరారు.
ఆ ఆట చూస్తుంటే సుందరానికి ఆశ్చర్యంవేసింది. ఆ ఆటలో సుందరానికిగాని, నాగేశ్వర్రావుకుగాని స్థానంలేదు. అందరూ పెద్దవాళ్ళే. నాగేశ్వర్రావు బావ కొడితే బిళ్ళ కంటికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపొయ్యేది. ఎదురు ఆడేవాళ్ళేం తక్కువతిన్నవాళ్ళుకారు. పిట్టల్లే ఎగిరే బిళ్ళను ఒడిసిపట్టుకునే వాళ్ళు. అంతదూరంనుంచీ బిళ్ళను. విసిరి గుంటమీద పడేటట్లు వెయ్యటానికి ప్రయత్నించేవారు గెలుచుకున్న ఎల్లలు కొలవటం లేదు. గెలిచినవాడు. ఇన్ని ఎల్లలని చెప్పటమూ, వాడు ఎక్కువ చెప్పాడని తోచినప్పుడు రెండోపక్షంవాళ్ళు కొలవటమూనూ...
ఈ బిళ్ళంగోడు ఎంతసేపు చూసినా సుందరానికి విసుగెత్తలేదు. అందుచేత వాడికి సాయంకాలం అయిపోవటంకూడా గుర్తులేదు. తీరా ఆట చాలించేసరికి సూర్యా స్తమానం కావస్తున్నది. ఆ తరువాత అందరూ కలసి రైలుకట్టవెంబడే నడిచి కాలవ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలుచేశారు. ఇల్లు చేరేసరికి చీకటి పడిదీపాలు పెట్టి చాలాసేపయింది.
రోజల్లా సరదాగానే గడిచినా, ఇంటో ఎక్కువసేపు గడపనందుకూ, స్కూలు మొహం చూడనందుకూ సుందరం కిందపడి, ఏదో చెయ్యగూడనిపని చేసి, తనకు అధికారం లేని ఆనందం అనుభవించినవాడల్లే బాధపడ్డాడు.
* * * *
స్నేహితులు ఒకరినొకరు పొడిఅక్షరాలతో పిలుచుకునేవాళ్ళు. సుందరం కె.ఎస్. నాగేశ్వర్రావు పి.ఎస్.ఆర్.ఇట్లాగే ఇతర విధ్యార్డులూనూ. ఈ దశలో వీళ్ళు తమ అన్యోన్య సంబంధాలతో ఒక సమగ్ర ప్రపంచం సృష్టించుకునేవారు. ఈ ప్రపంచంలో ప్రేమలూ, అసూయలూ, అలకలూ, పరామర్శలూ, త్యాగాలూ. సవాసాలూ, సమస్యలూ, పరిష్కారాలూ, స్వార్దమూ, నేరాలూ, శిక్షలూ అన్నీ ఉండేవి. అయితే బాహ్యప్రపంచంలో లాగ పెద్దఎత్తున దౌర్జన్యమూ, దోపిడీ, కుట్రా ఉండేవికావు.
సుందరానికీ, నాగేశ్వరరావుకూ స్నేహం ఎప్పుడు, ఎట్లా ఏర్పడిందీ ఎవరూ ఎరగరు. అది క్రమంగా బలం పొందింది. మనసులో ఉన్న మాటలను అవతలివాడికి దాచకుండా చెప్పు కోవటమూ, ఒకరి ప్రభావానికి ఒకరు గురి కావటానికి ఒప్పుకోవటమూ స్నేహం. ఇటువంటి స్నేహం ఎంతదూరమన్నాపోతుంది.
