Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 28

    ఒకసారి... మూడుముళ్ళు వేయించుకోవడానికి ప్రేగుముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు.... నువ్వేసిన మూడముళ్ళను కాపాడుకోవడానికి...ప్రేగుముళ్ళను దాచుకుంటున్నాను. ఆ ముడులను నువ్వు చూస్తే.....మన మమతల పొదరిల్లు కూలిపోతుంది.

    ఈ రహస్యం బయట పడొద్దనే, మన పూల పందిరి మోడు కాకూడదనే నేను దేవుళ్ళ దగ్గరకు వస్తున్నాను కాని, మాటల్తో మధ్యపెట్టి డాక్టర్ల దగ్గరికి రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి....అని అనలేదామె మనసులోనే ప్రార్ధించింది.

    ఆమెలో పేరుకుపోతున్న వేదనను పారద్రోలడానికి అతడు ప్రేమగా మరేవో చెప్పాడు. కొద్దిసేపు నవ్వించాడు. ఆ తర్వాత కవ్వింపులోకి దిగుతూ, ఆమె శరీరం పులకరించేంతగా స్పృసిస్తున్నాడు. ఎక్కడెక్కడో. కొద్ది నిమిషాల తర్వాత నిర్లిప్త ఏ ఆచ్చాదనా లేని పాలరాతి శిల్పమే అయింది ఆ గుడ్డి వెలుతురులో ముద్దాడని చోటులేదు.

    ఆమె అల్లరి, అల్లరిగా, ముంగిసను కసిగా చుట్టేసిన నాగుపాములా మెలికలు తిరిగి అల్లుకుపోయింది.


   
                             *    *    *    *


    శవంలా నిద్రపోతూంది బంజారాహిల్స్.

    అక్కడక్కడి నల్లటి బండలు కూచున్న జడల పిశాచాల్లా వున్నాయి.

    విండో దగ్గర కూచుని తీవ్రంగా ఆలోచిస్తున్న భార్గవకు___

    పిట్టగోడ నానుకుని పెరిగిన అశోక వృక్షాల్లో ఏదో కదలినట్లయింది. గుండె దిట్టవుచేసుకుని తీక్షణంగా చూశాడు. ఒక అశోక చెట్టు ఆకుల్లోపల ఏదో అలజడి. గాలికి రెపరెపలాడుతున్నట్లు కాదు....

    ఎవరో పట్టి కుదుపుతున్నట్టే. సరిగ్గా గమనిస్తే ఆకులు చిందర వందరగా కదులుతున్నాయి. బయట వచ్చీరాని వెన్నెల.

    భార్గావకు ఎవరో గుండె పిండినట్లయింది. టేబిల్ మీది ఫోటో ప్రేములో నవ్వుతూ అతని భార్య, ఆ నవ్వినప్పుడు అతనికి పిరికితనాన్ని చాలెంజ్ చేసినట్లుగా కనపడింది. బెడ్ మీద బాబీ కూడా లేడు. నిఖిల్ వాళ్ళింట్లో పడుకుని వుంటాడు.

    మళ్ళీ బయటివైపు చూశాడు. ఆకుల్లో అలజడి ఎక్కువే అయింది. గుండె చిక్కబట్టుకుని, కళ్ళు చిట్లించి చూశాడు.

    బయటి గేటుదగ్గర అలికిడయిన చప్పుడు.

    తెల్లచీర....కాదు కాదు....ఆకారం కూడా. మొహం కన్పించని ఆకారం....

    మోకాళ్ళవరకూ విరబోసుకున్న జుట్టుతోనేమో....తెల్లచీర సగం కప్పినట్టు....

    నేమ్మధయిన అడుగులు...తనింటివైపే....వయ్యారంగా...

    భార్గావకు అరవాలన్పించింది. శరీరం అంతా చమటలు కక్కుతుంటే కాళ్ళలోని సత్తువంతా చచ్చిపోయి, పీలపడిపోయినట్లు...

    నిగ్రహించుకుని మళ్ళీ చూశాడు.

    అశోక చెట్టుపై అలికిడియై....ఆకులు గలగలలాడాయి నిమిషం పాటు.

    ధైర్యం కొనితెచ్చిపెట్టుకుని, అడుగులో అడుగువేసి వెళ్ళి గబుక్కున బయటి లైట్ వేశాడు.

    బయట ఆవరణలో పరచుకున్న వెలుగు....

    అతనికేదీ కన్పించలేదు. భ్రమా...?

    బయటి వెలుతురు పిట్టగోడనానుకున్న అశోక వృక్షాల్ని తాకటం లేదు. అక్కడంతా చీకటిగా, గుబురుగా వుంది. అటు చూశాడు భార్గవ.

    ఆకుల అలికిడి మరింతై....ఒక నిప్పురవ్వ అందులోంచి చీకట్లోకి ఎగిరొచ్చి మాయమైంది. షాక్ తిన్నట్టుగా చూశాడు. కనుబొమ్మలు ముడేసి చూస్తున్నాడు. మరింకేం జరుగుతుందన్నట్టుగా...

    చీకటి కంటే భయంకరమైన నిశ్శబ్దం....

    ఒక సుడిగాలి తెమ్మెర ఒళ్ళంతా జలదరించేటట్టు వేగంగా తాకిపోయింది.

    మనిషిలో భయం ప్రవేశిస్తే, పిరికితనం విశ్వరూపం దాల్చి రకరకాలుగా వేదిస్తుంది. దాన్ని పెంచి పోషిస్తే చివరికి మృత్యువును కూడా ఆహ్వానించడానికి సిద్దపడుతుంది. పిరికితనాన్ని గుండెల్లోంచి పెరికివేసినా, విత్తులేని చెట్టులాగే మరో బలహీనమైన క్షణాన....క్షణంలో ఊడల మర్రిలా ఎదిగిపోతుంది. దాన్ని అలాగే పెంచుకున్న వానికి ఆవగింజకూ, ఆటంబాంబుకూ తేడా తెలియదు,

    భార్గవ చూస్తుండగానే ఆకుల గలగల మరింత పెరిగి, మరో నిప్పురవ్వ గాల్లోకి ఎగిరిపోయింది. హతాశుడయ్యాడు.

    ఎన్నో క్రైం దృశ్యాల్ని వర్ణించిన రచయితై వుండీ...ఎన్నో భయంకర దృశ్యాల్ని పాఠకుల ఒళ్ళు జలదరింప జేసినట్లు వర్ణించిన రచయితై వుండీ....అతడు భయపడ్డాడంటే, ఆమాత్రం అలజడియే అందుక్కారణం కాకపోవచ్చు.

    గత కొద్ది రోజులుగా అతనిలో పేర్చబడిన అబ్నాక్షియస్ కాల్స్ ఫీలింగ్ కావచ్చు. అన్ని భయాలు ఒక్కసారిగా చుట్టుముడితే మాత్రం....పిరికితనం స్థానే మొండి ధైర్యం వస్తుంది. భార్గవ టార్చ్ తీసికొని వచ్చాడు. అంతలో అంతా సద్దుమణిగినట్టుంది. ఇంటిచుట్టూ టార్చ్ వేసి చూశాడు. ఏదీ కన్పించలేదు. అశోక వృక్షాలు మళ్ళీ మౌనంగా...నిశ్చలంగా నిల్చున్నాయి.

    షాకింగ్ హెలూసినేషన్!!!

    అతనిలోని పిరికితనం చేసిన చేష్టలవి. భయంతో వున్నప్పుడు మనసులో మనకు తెలీకుండానే వస్తున్న వూహలకు...పిరికితనం అదే రూపమై వస్తుంది. అతనికి కన్పించిన తెల్లచీర అలాంటిదే.

    __అశోక వృక్షాల్లో తల దాచుకున్న మిణుగురు పురుగుల మీద దాడిచేసిన బల్లులకు కదిలిన ఆకులు....పారిపోతున్న మిణుగురు పురుగులు గాల్లోకి ఎగిరిపోయిన నిప్పురవ్వల్లా కన్పించాయి అతనికి.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS