అలా అరవడంలో అతనికి నొప్పి తెలిసొచ్చింది. పొత్తికడుపు దగ్గర!
"అమ్మా....!" అని బాధగా మూలిగి చేత్తో అక్కడ తడుముకున్నాడు.
అతని చేతికి బ్యాండేజ్ తగిలింది. లీలగా అప్పారావ్ కి అన్ని విషయాలూ గుర్తుకు రాసాగాయ్.
రాంబాబు, చిన్నారావ్ ల సెక్యూరిటీని పరిశీలించడానికి నర్సింగ్ హోంకి రావడం, కారిడార్లో డాక్టర్ శ్రీనివాస్ కి డ్యాష్ ఇవ్వడం. శ్రీనివాస్ తనకి ఆపరేషన్ చేస్తానని అనడం, తను పెనుగులాడడం, డాక్టర్ శ్రీనివాస్ తన ముక్కుకి క్లోరోఫాం లో ముంచి, కర్చీఫ్ ని అదిమిపట్టడం, అన్ని గుర్తుకు వచ్చాయ్.
"ఏంటి? కొంపదీసి నాకు ఆపరేషన్ గానీ చేసేశారా?" కంగారుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
నలుగురు కానిస్టేబుల్సూ అవునన్నట్టు తలలు ఊగించారు.
"ఏ ఆపరేషన్?" భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్.
ఆ ప్రశ్న వినగానే మళ్ళీ ఆ సెన్సిటివ్ కానిస్టేబుల్ దభేల్ మని ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మీద పడి రోదించాడు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బాధగా మూలిగాడు.
"ఏంట్రా బాబూ నువ్వు? అసలే ఆపరేషన్ నొప్పితో నేను బాధపడ్తుంటే, నువ్వు ధనేల్ మని నాస మీద పడిపోతున్నావ్. లే...." విసుక్కుంటూ అన్నాడు.
కానిస్టేబుల్ లేచి కళ్ళు తుడ్చుకున్నాడు.
"ఇప్పటికయినా చెప్పేడుస్తావా నాకసలు ఏం ఆపరేషనైందో?"
ఇంతలో దూరంగా డాక్టర్ శ్రీనివాస్ రావడం ఓ కానిస్టేబుల్ కంటబడింది.
"అడిగోండి సార్....! మీకు ఆపరేషన్ చేసిన డాక్టరుగారే వస్తున్నారు. మీరు ఆయన్ని అడిగి తెల్సుకుంటేనే మంచిది. మా నోటితో మేం చెప్పలేం సార్" అన్నాడా కానిస్టేబుల్.
డాక్టర్ శ్రీనివాస్ అప్పారావ్ బెడ్ ని సమీపించాడు.
"హౌ ఆర్ యూ ఫీలింగ్ నవ్ అప్పారావ్?" చిరునవ్వుతో డాక్టర్ శ్రీనివాస్.
"నేనిలా ఫీలవుతున్నానో ఆ సంగతులన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు నాకే ఆపరేషన్ చేశావో చెప్పూ" గట్టిగా అరిచి, మళ్ళీ కుట్ల దగ్గర నెప్పెట్టి బాధగా "హమ్మా" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"చెప్తానుగానీ, మరి నువ్వేమీ ఫీలవకూడదు!" సిగ్గుపడుతూ డాక్టర్ శ్రీనివాస్.
"ఫీలవను! త్వరగా చెప్పు!" పళ్ళు కొరుకుతూ అన్నాడు అప్పారావ్.
"పొరబాట్లు జరగడం మానవ సహజం కదా_మీరు కూడా ఒక్కొక్కప్పుడు నిర్దోషిని దోషి అనుకుని అరెస్టు చేస్తుంటారు. అవునా?" కులాసాగా అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.
"నాకు ఏం ఆపరేషన్ చేశారో చెప్పకుండా ఈ సోదేంటిరా నాయనో...." జుట్టు పీక్కుంటూ బాధపడ్డాడు అప్పారావ్.
"ఓక్కే....ఓక్కే....చెప్తాను!" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
రెండు క్షణాలాగి గొంతు సవరించుకొని అప్పారావ్ కి చెప్పాడు తను ఏం ఆపరేషన్ చేశాడో.
అది విన్న అప్పారావ్ కొన్ని క్షణాల పాటు కొయ్యబారిపోయి తర్వాత ఘొల్లుమని ఏడ్చాడు.
* * * *
"అయితే నా కిడ్నీ నిజంగానే తీసేశారా?" వెక్కి వెక్కి ఏడుస్తూ డాక్టర్ శ్రీనివాస్ ని అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"తీసేశాను. రిపోర్ట్స్ ప్రకారం ఆ కిడ్నీ పూర్తిగా చెడిపోయింది" చెప్పాడు శ్రీనివాస్.
"కానీ ఆ మనిషిని నేను కాదుకదయ్యా...." ఘొల్లుమన్నాడు అప్పారావ్.
"నిజమే ఇన్స్ పెక్టర్! ఆ విషయం మాకు తర్వాత తెల్సింది! మీరు బ్లూ షర్ట్ వేస్కుని వుండడంతో ఆ పొరబాటు జరిగింది" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
"ఓ పని చెయ్యవయ్యా! బ్లూ షర్ట్ వేస్కున్న అందరి కిడ్నీలూ తీసి పారెయ్" కోపంగా అని, "ఓరి దేవుడోయ్" అంటూ ఘొల్లుమన్నాడు అప్పారావ్.
అతని బాధ చూసి కానిస్టేబుల్స్ అంతా కన్నీళ్లు కార్చారు.
"మీరేం బాధ పడకండి ఇన్స్ పెక్టర్! మనిషి ఒక కిడ్నీతో హాయిగా బ్రతకొచ్చు!" ధైర్యం చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.
"నిజమే! ఒక కన్నుతో కూడా బ్రతకొచ్చు....పీకేవయ్యా! ఇప్పుడే నా కంటి గుడ్డు కూడా పీకెయ్...." నెత్తి కొట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. "ఒక కిడ్నీ పోగొట్టుకుని ఒంటి కిడ్నీ గాడిలా బతకాలన్న మాట నేను!" బాధగా అన్నాడు.
"మీరిలా అంటారనే నేనో పనిచేశాను ఇన్స్ పెక్టర్!" గర్వంగా అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
"ఏంటది?" అడిగాడు ఇన్స్ పెక్టర్.
"మీరు ఒంటి కిడ్నీ గాడు కాదు....మా అందర్లా రెండు కిడ్నీ గాళ్ళే! మీకిప్పుడు రెండు కిడ్నీలున్నాయ్!"
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అతనివంక ఆశ్చర్యంగా చూశాడు.
"ఒక కిడ్నీని కత్తిరించి పారేశావ్ గా....మరి రెండు కిడ్నీలు ఎలా వుంటాయ్! కొంపదీసి నేను మూడు కిడ్నీలతో పుట్టలేదు కదా?"
"కాదుగా?" చిలిపిగా నవ్వుతూ అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
"మరి నాకు రెండు కిడ్నీలు ఎలా వున్నాయ్ త్వరగా చెప్పూ...." జుట్టు పీక్కుంటూ అన్నాడు డాక్టర్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"టుంగోనేషియా దేశంలో...." ఏదో చెప్పబోయాడు డాక్టర్ శ్రీనివాస్.
"అలాంటి దేశం వుందా?" అనుమానంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
