Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 30

    "ఉంది....ఆ దేశంలోని  సైంటిస్టులు  కుక్కలమీద  చాలాచాలా  సంవత్సరాలు  రీసెర్చి  చేసి ఒక విషయం  తేల్చారు. అదేంటంటే  కుక్క కిడ్నీలూ  అచ్చం  మనిషి  కిడ్నీలలానే  పనిచేస్తాయనీ....మనిషికి  కుక్క కిడ్నీ మ్యాచ్  అవుతుందనీ...."

    ఇన్స్ పెక్టర్  అప్పారావ్  డాక్టర్  శ్రీనివాస్  వంక భయం భయంగా  చూశాడు.

    "అంటే....ఏంటి  మీరంటున్నది?" అడిగాడు.

    "మీరూహించింది  సెంట్  పర్సెంట్  కరెక్ట్....మీ నుండి తీసిపారేసిన  కిడ్నీ స్థానంలో కుక్క కిడ్నీని అమర్చా!" గర్వంగా చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.

    ఇన్స్ పెక్టర్  అప్పారావ్  ఘొల్లుమంటూ  వెనక్కి  విరుచుకుపడి పోయాడు.



                               *    *    *    *


    వేరే వార్డులో వున్న రాంబాబు, చిన్నారావ్ లకి  ఇన్స్ పెక్టర్  అప్పారావ్ కిడ్నీ ఆపరేషన్ గురించి  తెల్సి పగలబడి నవ్వారు.

    "వాడికి మంచి శాస్తి  అయ్యింది....లేకపోతే  మనమీద ఎటాక్ జరిగిందని  అన్ని పేపర్లలో వచ్చింది. పోలీస్ కమీషనరే  మనల్ని పలకరించడానికి  వచ్చాడు....ఏం....వీడికేం  దొబ్బుడాయని మనల్ని పలకరించడానికి  రాలేదు. వీడి లెవల్  అంత  గొప్పదా?" అన్నాడు.

    "ఏడ్చాడు....ఒంటి కిడ్నీగాడు!" అన్నాడు రాంబాబు.

    ఓ క్షణం ఆగి "మనం సర్దాగా  వాడిని  ఏడిపిద్దామా?" అని చిన్నారావ్ ని  అడిగాడు.

    "ఎలా?" అడిగాడు చిన్నారావ్.

    "పరామర్శించే  నెపంతో వెళ్ళి ఏడిపిద్దాం....పద....వాడుండే  వార్డ్ కి  వెళదాం" అన్నాడు బెడ్ మీంచి క్రిందికి  దిగుతూ.


                                 *    *    *    *


    ఇన్స్ పెక్టర్  అప్పారావ్ కి  పరిస్థితి మొత్తం గందరగోళంగా  వుంది. వార్డ్ లో  తన బెడ్ మీద  పడుకుని తీవ్రంగా  ఆలోచించసాగాడు.

    పొరబాట్న  తన కిడ్ని  ఒకటి  తీసేశారు....ఓక్కే....కానీ దాని బదులుగా కుక్క కిడ్నీ ఎందుకు పెట్టారసలు? నా కిడ్నీకి  సబ్స్ టిట్యూట్ గా నాకేదో ఒకటి చెయ్యండి. అతనేమైనా  గోలపెట్టాడా? లేదే....మరి ఆ డాక్టర్ గాడు ఎందుకిలా చేశాడు? వాడిదివరకేమైనా  పశువుల  డాక్టరా?!

    "హే భగవాన్!" అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "హే  భగవాన్!!" అంటూ అతనికి నాలుగు గొంతులు వినిపించాయి.

    "ఏంటీ....నేనింత చిన్నగా హే భగవాన్ అని అంటే ఈ వార్డ్ లో అంత పెద్దగా ప్రతిధ్వనించాలా?" మనసులోని మాటని ఆశ్చర్యంతో పైకే అనేశాడు  ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "అది ప్రతిధ్వని  కాదు సార్! హే భగవాన్  అని మేం  నలుగురం  కోరస్ గా  అన్నాం" మంచం  చుట్టూ వున్న  నలుగురు కానిస్టేబుల్స్ లో  ఒకడు అన్నాడు.

    "ఏం....ఎందుకలా  అన్నారు? మీకేం పోయేకాలం  వచ్చిందని?! చికాకుపడుతూ  అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "మాకేం రాలేదు సార్....మీకే  వచ్చాయ్."

    "ఏంటి వచ్చాయ్?" అనుమానంగా చూస్తూ అన్నాడు.

    "కుక్క లక్షణాలు సార్....మీరు సీలింగ్ వైపు చూస్తూ, ఏదో ఆలోచిస్తూ నాలుక కుక్కలా  బయటపెట్టి హాప్-హస్ -హస్....అంటున్నారు సార్!"

    "ఆ...." బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "అయినా మీరు నా చుట్టూ ఇంకా ఎందుకు నిలబడ్డారు? పొండి....రాంబాబు, చిన్నారావ్ లకి సెక్యూరిటీ వుండండి" కోపంగా అన్నాడు.

    "సెక్యూరిటీ వాళ్ళకంటే మీకే ఎక్కువ అవసరం సార్" అన్నాడు ఓ కానిస్టేబుల్.

    "నాకా....ఎందుకు? గజదొంగ మంగులు వల్ల నాకు డేంజర్ వుందని మీరు భావిస్తున్నారా?" అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "కాద్సార్....డాక్టర్ శ్రీనివాస్ వల్లే మీకు డేంజర్ అని భావిస్తున్నాం సార్! మేం ఇక్కడ లేకపోతే మీ రెండో కిడ్నీ కూడా పీకేసి, ఈసారి దాని ప్లేస్ లో పంది కిడ్నీ పెడ్తాడేమోనని మాకు భయంగా వుంది సార్" అన్నాడు ఇంకో కానిస్టేబుల్.

    "అప్పుడు మీరు పందిలా బురదలో పొర్లుతుంటే మేం చూళ్ళెం సార్" అన్నాడు ఇంకో కానిస్టేబుల్.

    "ఈసారి ఆ డాక్టర్ నాయాలు అలాంటి పిచ్చి వేషాలేస్తే నేను వాడిని రివాల్వర్ తో షూట్ చేస్తా! అయినా మీరు నా చుట్టూ చేరి మీ దరిద్రపు కబుర్లతో నా బుర్ర పాడుచేయాలా? వెళ్ళండి....లేకపోతే మిమ్మల్ని షూట్ చెయ్యాల్సి వస్తుంది" అంటూ గట్టిగా అరిచి "హబ్బా!" అని బాధగా పొట్టక్రింద కుట్ల దగ్గర చేతులు పెట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    కానిస్టేబుల్స్ నలుగురూ అక్కడినుండి నిష్క్రమించారు.

    వాళ్ళు అలా వెళ్ళగానే అక్కడికి రాంబాబు, చిన్నారావ్ లు వచ్చారు. వాళ్ళని చూడగానే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ పైప్రాణాలు పైనే పోయాయ్. ఇప్పుడు వాళ్ళతో ఏం ఇబ్బందిపడాలో అని లోలోపల భయపడ్డాడు.

    "గుడ్ ఈవినింగ్ సార్!" అన్నారు ఇద్దరూ కోరస్ గా.

    "గుడ్ ఈవినింగ్!" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నవ్వడానికి ప్రయత్నిస్తూ.

    "ఏంటి సార్ ఇలా హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యారు?!" అమాయకంగా అడిగాడు రాంబాబు.

    "ఏం లేదు....ఈ చిటికెన వేలు గోరు నెప్పెడ్తుందని ఆస్పత్రికొస్తే వీళ్ళు ఏకంగా సీరియస్ కేసు....అడ్మిట్ అయిపోండి అంటూ కంగారుపెట్టేశారు. ఇప్పుడు ఈ గోరు ఎక్స్ రే తీశారు, స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్టూ, యూరిన్ టెస్టూ కూడా చేశారు, ఇంకాస్సేపయ్యాక ఇ.సి.జి.కూడా తీస్తారట. ఇంకా రిపోర్ట్స్ రాలేదు....ఏంటోనయ్యా....ఈ ప్రయివేట్ నర్సింగ్ హోంలన్నీ ప్రతీదానికీ ఇంత హంగామా చేసి మనతో బోల్డంత ఖర్చు పెట్టిస్తారు....అ....హహహ...." బలవంతంగా నవ్వుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ ఆప్పారావ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS