Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 28

    "బాగుంది సార్! నర్సింగ్ హోం  వెనకాల కూడా మరో యిద్దరు కాపలా వున్నారు. ప్రతి పది నిముషాలకి మేం నర్సింగ్ హోమ్  కారిడార్లో  తిరుగుతూ చెక్ చేస్తున్నాం  కూడా" ఇద్దర్లో ఒక కానిస్టేబుల్  చెప్పాడు.

    "వెరీగుడ్! కేర్ ఫుల్ గా వుండండి. రాంబాబు వాళ్ళకి ఏ చిన్నచెడు  జరిగినా కమీషనర్  ఊర్కోరు...."

    "అలాగే సార్!" అన్నారు  కానిస్టేబుల్స్.

    ఇన్స్ పెక్టర్ అప్పారావు  డిప్పల్లో  నర్సింగ్ హోంలో  ఠీవిగా  అడుగుపెట్టాడు.


                                *    *    *    *


    అది డాక్టర్ సింగినాధం  రూమ్. అతని ఎదురుగా  డాక్టర్ శ్రీనివాస్.

    "పేషంట్  ఆపరేషన్ అంటే చాలా భయపడ్తున్నాడు. ఆపరేషన్ చెయ్యకపోతే  నువ్వు చస్తావయ్యా  అన్నా వినడే. నాకు మరో సీరియస్ కేస్ వచ్చింది. కాన్సర్! చాలా అడ్వాన్   కండిషన్! నేను ఆ ఆపరేషన్ అటెండ్ అవుతాను. నువ్వు  ఈ కేస్ అటెండ్  అవ్వు...." శ్రీనివాస్ తో అన్నాడు డాక్టర్ సింగినాధం.

    "పేషంట్ వివరాలు?" అడిగాడు డాక్టర్  శ్రీనివాస్.

    "పేరు అప్పల్రాజు....బెడ్ నెంబర్  పదకొండు....బ్లూ షర్ట్ వేస్కుని వుంటాడు. ఆపరేషన్ థియేటర్ ని సిద్ధం చేశాం. వెంటనే ఆపరేషన్ చేసెయ్. గోలచేసినా  వినొద్దు. అసలే వాడికి ప్రానంమీది కొచ్చింది. ఇదిగో కేస్ ఫైలు....!" అని టేబుల్ మీది ఫైలు తీసి  డాక్టర్  శ్రీనివాస్ కిచ్చాడు  సింగినాధం.

    శ్రీనివాస్ ఫైలు  ఓసారి  తిరగేసి  బయటికి  నడిచాడు. వార్డ్ లో పదకొండో  నెంబర్  బెడ్  దగ్గరికెళ్ళాడు. బెడ్ ఖాళీగా వుంది.

    'ఎక్కడ  దాక్కున్నాడో  ఏంటో....? వెతికి  పట్టుకుని  ఆపరేషన్ చెయ్యనూ!' అనుకున్నాడు.

    వార్డ్ లోంచి  బయటికొచ్చి  కారిడార్ లో  నడవసాగాడు  డాక్టర్  శ్రీనివాస్.

    పరధ్యానంగా  నడుస్తున్న  శ్రీనివాస్ ని  ఎవరో  డ్యాష్  కొట్టారు. తలిత్తి చూస్తే ఎదురుగా  బ్లూ షర్ట్ లో ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "ఓహ్....బ్లూ  షర్ట్! వీడే అయివుంటాడు" అనుకున్నాడు  డాక్టర్ శ్రీనివాస్.

    "ఐయామ్ సారీ...." అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "ఓ....ఇట్స్ ప్లజర్....పద  ఆపరేషన్ థియేటర్ కి!" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

    "ఆపరేషన్ థియేటర్ కా_! ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "క్యారమ్స్  ఆడ్డానికి!"

    "క్యారమ్స్ ఆడ్డం  నాకు సరిగారాదు. అయినా నాతో మీరు క్యారమ్స్ ఆడ్డం ఏమిటీ?" మరింత ఆశ్చర్యపోతూ అడిగాడు  ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "అయినా  ఆపరేషన్  థియేటర్లో  క్యారమ్స్  ఆడ్డం  ఏంటయ్యా బాబూ! ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తారు?" అడిగాడు శ్రీనివాస్.

    "ఆపరేషన్  చేస్తారు!" చెప్పాడు  అప్పారావ్.

    "మరి అది చేద్దామనే  రమ్మంటున్నా!"

    "ఆపరేషనా? నాకా?"

    "నీకే....నీ గురుంచి  సింగినాధం గారు అంతా చెప్పారు!"

    "సింగినాధమా? వాడెవడు?" కళ్ళు పెద్దవిచేసి  చూస్తూ  అడిగాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "అబ్బ! పెద్ద చిలిపి...." అప్పారావ్  బుగ్గమీద  చిదిమాడు డాక్టర్ శ్రీనివాస్. "ఆపరేషన్ గురించి నువ్వేం భయపడనక్కర్లేదు. నీ ప్రాణానికి  నా కత్తి అడ్డు."

    "మీరు నన్ను ఎదురుగా పొరబాటు  పడ్తున్నారో  నేను అప్పారావ్ ని" అయోమయంగా చూస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "నిజమే! అప్పలరాజు  అంటే మరీ మోటుగా  వుందని  అప్పారావ్ అని చెప్పుకుంటున్నావు. నేను ఒప్పుకుంటాగానీ పద_" అని జబ్బపట్టుకునిలాగాడు  డాక్టర్  శ్రీనివాస్.

    ఇన్స్ పెక్టర్  అప్పారావ్  పెనుగులాడాడు. ఇక లాభంలేదని  డాక్టర్ శ్రీనివాస్  ముందుగానే  క్లోరో ఫామ్ తో  తడిపి జేబులో  వుంచుకున్న  కర్చీఫ్ ని  తీసి అప్పారావు  ముక్కుకి  అదిమిపెట్టి  వుంచాడు. అప్పారావ్  స్పృహ తప్పాడు.


                                           12


    ఇన్స్ పెక్టర్  అప్పారావ్ మెల్లిగా కళ్ళు  తెరిచాడు. అతని మొహం మీద నాలుగు మొహాలు ఆత్రంగా  అతని మొహంలోకి  ఎదురుచూస్తున్నాయి. కాస్త మసకగా  కనిపించడంతో ఇన్స్ పెక్టర్  అప్పారావ్  రెప్పలు టపా టపా అల్లాడించి  చూశాడు. ఈసారి  ఆ మొహాలు  కాస్త క్లియర్ గా  కనిపించాయి.

    వాళ్ళు డిప్పల్లో  నర్సింగ్  హోంలో  సెక్యూరిటీకి  నియమింపబడ్డ  కానిస్టేబుల్స్, వాళ్ళ చూపుల్లో అత్యంత  జాలి కనిపించింది అప్పారావ్ కి.

    "ఏంటి? నాకేమైంది?? నేనెక్కడ వున్నాను???" నీర్సంగా  అడిగాడు  అప్పారావ్.

    "మీరు డిప్పల్లో  నర్సింగ్  హోంలో  వున్నారు సార్!" మొదటి కానిస్టేబుల్  చెప్పాడు.

    ఇన్స్ పెక్టర్  అప్పారావ్  తల ప్రక్కకి  తిప్పి చూశాడు. అది నర్సింగ్ హోం  జనరల్ వార్డ్. ఆ వార్డ్ లో తమ ఒక మంచంమీద  పడుకుని వున్నాడు.

    "నాకేమైంది?" మళ్ళీ  కానిస్టేబుల్స్ ని  అడిగాడు  అప్పారావ్.

    నలుగురు  కానిస్టేబుల్స్ గుడ్లు నీరు  కక్కుతున్నారు తప్ప ఏ సమాధానం  చెప్పలేదు. వాళ్ళని చూస్తే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి  భయమేసింది.

    కొన్ని క్షణాలు గడిచాక  వాళ్ళలో  కాస్త సెన్సిటివ్  అయిన  కానిస్టేబుల్  అప్పారావుమీద  పడి ఘొల్లుమని  ఏడ్చాడు.

    "అసలు  నాకేమైందంటే  నేను చచ్చిపోయినట్టు  ఏడుస్తారేం? నన్ను సస్పెన్స్ తో  చంపక త్వరగా చెప్పి  తగలడండి" అంటూ ఓపిక  తెచ్చుకుని  అరిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS