"ఇంతకీ నీ ఎన్నికల గుర్తేంటీ?"
"ఇంకేముంటుంది?... కోతిగుర్తు!" సిగ్గుపడ్తూ చెప్పాడు వీరాంజనేయులు.
"బాగుందిరా... చాలా బాగుంది..."మరికొన్ని ఆనందభాష్పాలు జలజలా రాల్చాడు రాఘవరావు.
వీరాంజనేయులు తల వొంచుకుని మళ్లీ నేలమీద కాలి బొటనవేలుతో రాశాడు.
"ఇంకా చెప్పాల్సిందేమైనా వుందా?" కొడుకు కాలివంక చూస్తూ అడిగాడు రాఘవరావు.
"ఎందుకులేదూ?... అసలైన విషయం వుంది.ఎన్నికలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా?... నాకు డబ్బులు ఇవ్వండి"
రాఘవరావు జేబులోంచి పర్సుతీసి రెండొందలు ఇచ్చాడు.
"రెండొందలా?... వోట్ ఫర్ వీరాంజనేయులు... కోతి గుర్తుకే మీ ఓటు అంటూ పాంప్లెట్లు వేయించి కాలేజీలో అందరికీ పంచొద్దూ... ఆ పాంప్లెట్లకి వంద సరిపోతుందనుకో... మిగతా వంద నీ దగ్గర వుంచు.నీ కోసం ప్రచారం చేసేవాళ్లకి టీలూ కాఫీలూ పొయ్యడానికి సరిపోతుంది..."
అది వింటూనే వీరాంజనేయులు కిందపడి పొర్లి పొర్లి నవ్వాడు.
"కిందపడి లే వెధవా... బట్టలూ మాసిపోతాయ్... అసలే ఈ మధ్య చాకలి ఖర్చు పెరిగిపోతుంది." కోపంగా అరిచాడు రాఘవరావు.
వీరాంజనేయులు కిందపడి లేచి బట్టలు దులుపుకుని నవ్వాపుకుంటూ అన్నాడు."లేకపోతే ఏంటినాన్నా?... అవన్నీ మీ కాలంరోజులు.ఇప్పుడు రెండొందలు ఒక్క బ్యానర్ కే సరిపోదు...!"
కాలేజీ ఎన్నికలు చాలా ఖర్చుతో కూడిన పని అనీ,పాంప్లెట్స్ కి, పోస్టర్లకి, బ్యానర్లకీ వేలకొద్దీ ఖర్చు అవుతుందనీ, పాతకాలంలో లా ప్రచారం చేసేవాళ్ళకి టీ, కాఫీలు తాగిస్తానంటే ఒప్పుకోరనీ... వాళ్లకి మందు కొట్టించాలనీ చెప్పాడు వీరాంజనేయులు.
"అమ్మో... అయితే నువ్వు ఎన్నికల్లోంచి డ్రాపయిపో..."గుండెలు బాదుకుంటూ అన్నాడు రాఘవరావు.
"అందరికీ ఎన్నికల్లో నిలబడ్తున్నానని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గతే ఫలానా వారి అబ్బాయ్ డబ్బులకి మొహం చూస్కుని ఎన్నికల్లో నిలబడ్లేదు అని అందరూ అంటారు.అప్పుడు మీ పరువేపోతుంది - నాకేం?"
మీ పరువు ముఖ్యంగానీ డబ్బు ముఖ్యమా అంటూ మంగతాయారు కూడా చీవాట్లు పెట్టింది.
రాఘవరావు ఏడుస్తూ పదివేలు కొడుకు చేతిలో పెట్టాడు.
వారం రోజులు పోయేసరికి వీరాంజనేయులు డబ్బుకోసం మళ్లీ తండ్రి దగ్గరకొచ్చాడు.ఈసారి తండ్రి దగ్గర పదిహేనువేలు గుంజాడు.అలా రెండు రోజులకీ మూడు రోజులకీ ప్రచారానికి డబ్బులు అయిపోసాగాయ్ అని తండ్రిని డబ్బు అడగసాగాడు.
రాఘవరావు ఒక ఎకరం పొలం అమ్మాల్ని వచ్చింది ఈ కాలేజీ ఎలక్షన్లకోసం.
ఒకరోజు వీరాంజనేయులు కత్తిపోట్లతో రక్తం కార్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
"ఏమిట్రా ఇది?..."కంగారుపడ్తూ అడిగాడు రాఘవరావు.
వీరాంజనేయులు తేలిగ్గా నవ్వేశాడు.
"అంత కంగారుపడ్తావేంటి నాన్నా... కాలేజి ఎలక్షన్లంటే ఇది మామూలే... నేనింకా నయం... ఇంకో క్యాండిడేట్ ని కత్తుల్తో పొడిచి చంపేశారు"
"ఎవరు?"ఆశ్చర్యంగా అడిగాడు రాఘవరావు.
"ఆలిండియా కుళ్లు పార్టీవాళ్లు..."
"అది రాజకీయ పార్టీ కదా?మీ కాలేజీ ఎలక్షన్లతో వాళ్లకేం సంబంధం?"
"సంబంధం ఎందుకుండదూ?... చచ్చిన ఆ అభ్యర్ధి ఎగస్ పార్టీ వాళ్లని ఆలిండియా కుళ్లుపార్టీ సపోర్టు చేస్తుంది.అందుకే వాడ్ని పొడిచి చంపేశారు.
"నిన్ను ఏ రాజకీయ పార్టీ అయినా సపోర్టు చేస్తుందా?"
"ఎందుకు చెయ్యదు... అఖిలాంధ్ర చచ్చుపార్టీ నన్ను సపోర్టు చేస్తుంది..." చెప్పాడు వీరాంజనేయులు.
రాఘవరావు నోరు తెరుచుకుని కొడుకు చెప్పింది వింటున్నాడు.
ఒకరోజు వీరాంజనేయులు ఇంటికి నాటుబాంబులు తెచ్చాడు.
"ఇవెందుకురా?"కంగారుగా అడిగాడు రాఘవరావు.
"ఎన్నికలు రేపేగా? వీటి అవసరం వుంటుంది... అయినా ఇండియా చాలా వెనకబడిపోయిందిలే నాన్నా.. అదే విదేశాల్లో అయితే కాలేజీ ఎలక్షన్లంటే మిషన్ గన్లూ, మర ఫిరంగులూ తెస్తారంట!!" భారంగా నిట్టూరుస్తూ అన్నాడు వీరాంజనేయులు.
ఆ మర్నాడు ఎలక్షన్లు జరిగాయ్. వీరాంజనేయులు సెక్రట్రీగా ఎన్నికయ్యాడు.కాలేజీ ఎలక్షన్ల సందర్భంగా ఆరుగురు విద్యార్ధులు, ఒక లెక్చరరు మరణించారు.పలువురు గాయపడ్డారు.
నాకు ప్రచారం చేసిన దాదాపు వందమందికి నేను గెలిచిన సందర్భంగా పార్టీ ఇవ్వాలి!... డబ్బులు ఇవ్వునాన్నా..."అంటూ తండ్రిని అడిగాడు వీరాంజనేయులు.
"స్వీటుకి రెండు రూపాయలు, దోసెకి రెండు, కాఫీకి రెండు మొత్తం మనిషికి ఆరు రూపాయల చొప్పున వందమందికి ఆరొందలు!" లెక్కకడ్తున్నాడు రాఘవరావు.
"మీ కాలంలోలా కాదు పార్టీ అంటే స్వీటు హాటు ఇవ్వడానికి. అందర్నీ బార్ కం రెస్టారెంట్ కి తీస్కెళ్లాలి. మనిషికివంద చొప్పున వందమందికి పదివేలు అవుతుంది... పార్టీ ఇవ్వకపోతే బాంబులతో మనింటి మీదికి దాడిచేస్తారు"అన్నాడు వీరాంజనేయులు.
రాఘవరావు గుండెలు బాదుకుంటూ ఘొల్లుమన్నాడు.
* * *
