Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 29

 

    ఇంతలో తోలికోడి కూత తో పాటు పెరట్లో లో ఆవు దూడలూ అరవడం తో రఘు నిద్రకి భంగం కల్గింది. కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుని నాలుగు వేపులా పరకాయించిన రఘు , అయ్యో, ఇందంతా కల్లేనా....అనుకుని నిస్పృహ పొందాడు ఇంకా ఆ కైపు తగ్గనందున ఏం ఈ కల నిజం ఎందుకు కాకూడదు? తను 'సై' అంటే సరి క్షణం లో. ఈ స్వప్న స్వర్గమల్లా ప్రత్యక్ష స్వర్గం అయిపోతుంది తనకి. అంతా తన అంగీకారం మీదనేగా అధారపడుంది. అయితే, తను అలా అంగీకరించోచ్చా? అది న్యాయమైన పనేనా? నలుగురూ తన నిర్ణయాన్ని హర్షిస్తారా? ఆ తప్పకుండా అంతా 'నీకు తగ్గ భార్య నెంచు కున్నావ్' అంటూ తనని ప్రశంసిస్తారు కూడా అయితే.... అయితే, అప్పుడు తన సుధ సంగతి? అదలా వుంచి ఈ బలహీనత కి తన మనస్సాక్షి సమ్మతిస్తుందా? ఇన్నాళ్లూ కట్టుకున్న తన కంచు కోటని ఈ విధంగా అధఃపాతనం చేసేందుకేనా! వీల్లేదు. ఈ రాదే కాదు వెయ్యి మంది ఇటువంటి రాధలోచ్చినా ఇంతకీ వెయ్యి రెట్లు సుఖాన్ని నా కివ్వనున్నా, నా లక్ష్యాన్ని వోటమి చేసే వాట్లకు నేనెప్పుడూ లొంగను . ఛీ! అసలీ ప్రయాణాని కెందుకొప్పు కొన్నాన్నేను' అనుకుంటూ ఎంతసేపో మనో పోరాటం లో అలా మంచం మీదనే కూర్చుండి పోయాడు రఘు.

                                 
    ఇంతలో మెడ మెట్ల మీద టక్కుటక్కు మంటూ చప్పుడవడంతో అతని ఆలోచనల కంతరాయం కలిగి, కిటికీ లోంచి తొంగి చూశాడు. తన బట్టల్ని నలక్కుండా జాగ్రత్త గా చేతి మీదికి వేసుకుని కర్ర సాయంలో మెట్లెక్కి వొస్తుంది సుధ సుధని చూడ్డం అంటేనే అపరాధం చేసిన వాళ్ళగ ఏదో బెదురు పట్టుకుంది రఘు కి.
    'నువ్వింత శ్రమ పడుతూ ఈ మెట్లన్నీ ఎక్కి రావడం దేనికి సుధా, నే కిందికొచ్చి నప్పుడు తెచ్చు కునుండే వాణ్ణి గా' అన్నాడు, ఆయాసపడుతూ లోపలి కొచ్చిన సుధను చూసి రఘు. ఎలాగో అన్నాడే గాని, ఎప్పటి మోస్తరు గా... నిండు తనం లేదు ఆ మాటల్లో.
    'ఏం బావా? ఒంట్లో బాగుండ లేదా?' అతనితో మార్పుని పసిగట్టేసిన సుధ అదోలా చూస్తూ అడిగింది.
    'అబ్బే, అలా ఏమీ లేదే?' రాత్రంతా నిద్రపట్టలేదు. అంతే....'
    'అబద్దాలు , నిన్ను చూస్తె అలాగేం లేదు. పైగా నువ్వు పై కొచ్చిన వెంటనే లైటు తీసెయ్యడం నే గుర్తించ లేదనుకున్నావా?' సుధ నవ్వుతూ అమాయకంగానే ఈ మాటలన్నా... 'నీ వంచన మాటలన్నీ నా దగ్గరా?' అన్నట్టే అనిపించింది రఘు కి.
    'ఏం? ;లైటాపేసినంత మాత్రాన నిద్ర పోయానన్నదేం ఉందీ.'
    'ఏవిటి బావా? నిద్ర పోయినప్పుడు తప్పితే మిగతా ఎప్పుడూ నువ్వు ఒక్క క్షణ మన్నా వృధా చెయ్యవన్నది నేనెరగనూ' నవ్వింది సుధ. పిచ్చేత్తేటంత బాధ రేగుతుంది రఘు తలలో. ' ఈ అమాయకురాల్నా తను దగా చెయ్యాలను కోవడం? తను కాదంటే రాధను చేసుకునేందుకు కావలసినంత మంది ముందు కోస్తారు . ఐతే, అయితే ఈ సుధ కి తను తప్పితే మరో ఆశ్రయం?'
    'సూటు ఇస్త్రీ బాగుందా బావా?....' ఎప్పుడూ వెంటనే పొగడే బావ ఇవాళ ఇంత కష్టపడి ఎంతో బాగా మలచి తెచ్చిన బట్టల్ని మెచ్చుకోక పోవడం సుధ కదోలా అనిపించింది.
    'చాలా బాగున్నాయి సుధా. అయినా వీట్ల కేం తొందర ని ఇంత శ్రమ పడ్డావ్ పాపం'- హు నేనన్నా నా పనులన్నా ఎందుకో ఈసుధ కింత తాపత్రయం.
    'అదేవిటి బావా? ఇవాళేవరో గొప్ప డాక్టర్ని మీటవ్వాలన్నావ్ గా.'
    'వో? చూశావా? నే మర్చేపోయానూ.'
    'అదే నేనూ చూస్తున్నా. అదీగాక ఆ శాంతక్కయ్య గారి చుట్టాల పిల్లలు ఎప్పుడూ నా గదిలోనే సవరిస్తూ వుంటారు. తీరా నాలిపెశారంటే పని మొదటి కోస్తుందేమోనని మరో భయం.'
    'వాళ్ళని నీ గదిలోకి రావద్దని గట్టిగా చెప్పేయలేవూ.'
    'వచ్చినా ఫరవాలేదు బావా. నే రాసుకుంటూన్నప్పుడు ఏ పెన్నో, కుట్టు కుంటూన్నప్పుడు ఏ కత్తెరో పట్టుకు పోయి 'కుంటీ మమ్మల్ని పట్టుకో' అంటూ పరుగులెత్తుతారు బావా' తలోంచేసుకుంది సుధ.
    'అన్నయ్య తోనో, వేణు తోనో చెప్పి తన్నించక పోయావ్?' ఎర్రబడ్డ మొహం తో అన్నాడు రఘు.
    'పెద్ద బావ ఊర్లో లేడుగా? వేణు బావతో చెపితే, ఏం రాద్దాంతం చేస్తాడో నని భయం బావా?'
    'సరి ఇక నే చూసుకుంటాగా' ఎప్పుడూ ఏ సంగతైనా తనతో చెప్పుకుంటే గాని సుధ మనసు సమాధాన పడదని రఘు కి తెలుసు.
    'క్షమించు సుధ . పాపం నువ్వు నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటే, నిన్న రాగానే నిన్ను కసురుకున్నాను.' అన్నాడు నొచ్చుకుంటూ రఘు.
    'అయితేనేం బావా. రోజంతా ప్రయాణం చేసిన వాడివి. ఆపాటి చిరాకు పుట్టదూ , మరీ.' అంది ఏంతో సహజంగా.
    ఇంతలో రఘు బ్రష్షు తీసుకుని లేవడం తో సుధా మెల్లగా మెట్లు దిగి వెళ్లిపోయింది    మొత్తానికి రఘు ఎంత సర్దుకుంటూ ప్రవర్తిస్తున్నా, అతనిలో అతనికే అర్ధం గాని లోపమేదో సుదకి స్పురిస్తూనే వుంది. తనతో రాధ కూడా బొంబాయి రాబోతున్నదని తెలియడం తోనే రఘు కెక్కడ లేని చిరాకు కల్గింది. రాధని ఒద్దనేందుకూ లేక, రాధతో కలిసి పని చేసేందుకూ ఇష్టం లేక సందిగ్దావస్త లో పడ్డాడు రఘు.
    అందులోనూ అసలే హరించి పోతున్న తన మనో నిబ్బరం మళ్ళీ రాధతో ఈ ప్రయాణం లో తప్పకుండా దెబ్బతిని తీరుతుందన్న భయం రఘుకి బాగా పట్టుకుంది. అందువల్ల అనువైన అవకాశాలిచ్చి ఆ తరవాత మనసుని లొంగదీసు కోలేక బాధ పడ్డం కన్నా, అటువంటి సందర్భాలేర్పడకుండానే చూసుకోవడం ఎంతో క్షేమ దాయకమని అతని నమ్మకం అందువల్ల ఈ ప్రయాణాని కొప్పు కోవడమా? మానుకోవడమా అని రెండు రోజుల పాటు రాత్రింబవళ్ళు ఇదే ఆలోచనతో సతమతమైన రఘు , సరి తన నిబ్బరానికి కర్యదీక్ష కీ ఇది ఆఖరు పరీక్ష ఇదే అన్నింట్ల కన్నా కఠిన పరీక్ష కూడా.' అనుకున్నాడు రఘు. ఈ నిశ్చయానికొచ్చాకనే స్థిమితంగా ఆ ప్రయాణానికి సమంతించ గల్గాడు రఘు.
    ఇక ఈ నిశ్చయానికొచ్చేక అతనిలో అతనికే ఒక స్థిరమైన నమ్మకం కల్గిపోవడం వల్ల తన ప్రయాణ సన్నాహాల్లో మునుగుతూ మిగతా పై పై సాంప్రదాయక పాటింపు లని అశ్రద్ధ చేశాడు రఘు.
    అయితే రఘు ఎందులోనూ ఎక్కువ పట్టించు కోకుండా ఇలా వుండడం ఇంట్లో వాళ్ళందరి కీ ఇప్పుడే ఈ రఘు ఇలా మారిపోయాడెం? ఎవరి మాటెలా వున్నా రఘు కూడా ఇలా అందరి లాగే ప్రవర్తిస్తున్నాడని ఎప్పుడూ అనుకోలేదే?' అనిపిస్తుంది. ఇక సుధకా. తనకి సంబంధించిన ఏ చిన్న సంఘటనా జరిగినా ఈ ముఖ్యమైన ప్రయాణాన్ని గురించి తనతోఎమీ చెప్పక పోవడం సరిగదా తను అడిగి తెల్సు కుందుక్కూడా అవకాశం ఇవ్వక పోవడం సుధకీ అదోలా వుంటున్నా 'పాపం బావకి పని తొందర' అని తృప్తి పడి సరిపెట్టు కుంది సుధ.
    'వెళ్ళొస్తా సుధా. బొంబాయి నుంచీ నీకేం తెమ్మంటావ్.' సుధ వద్ద కొచ్చి నవ్వుతూ అడిగాడు రఘు.
    'ఏమిటి బావా, నేనేవన్నా చిన్న పిల్లనా' కలకలా నవ్వింది సుధ.
    'మరి అన్నయ్య గారి బాబింకా అడగలేడు. ఇక వున్న వాళ్ళందర్లో కి నువ్వేగా చిన్న దానివీ, ఊ చెప్పు.'
    'ఏవిటీ బావా నా కాలు బాగు చేసేందుకేగా నువ్విన్ని యాతనలూ పడడం ఇంతకన్నా నాకేం కావాలి బావా?' కృతజ్ఞతతో సుధ కళ్ళు చెమ్మగిల్లాయి.'
    'అయ్యో పిచ్చి సుధా, నీ కోసరం నేను నిజంగానే అలా చెయ్యగల్గుతానన్న నమ్మకం నాకు పూర్తిగా కుదరడం లేదెందువల్లో అయినా నీ అమాయకత్వమే నా మనో నిబ్బరానికి శ్రీరామ రక్ష నిలవగల్గాలి' అనుకున్నాడు. రఘు కళ్ళు కూడా కొంచెం చెమ్మగిల్లాయి.
    'అన్నట్టు నీకు ఇక మీద ఇవ్వాల్సిన ఇన్ జేక్ష న్లూ , మందులూ అన్నీ నళిని తో చెప్పాను. బహుశా రెండు మూడు మార్లు నెత్తురు కూడా 'టెస్ట్ చేసి ఆ రిజల్టు వెల్లూరు పంపాల్సుంటుంది . అవన్నీ నళినీ మురళీ చూసుకుంటారు గానీ నువ్వు మాత్రం మందులు శ్రద్దగా తీసుకుంటూ వుండెం.' అంటూ సుధని హెచ్చరించి, పార్వతమ్మ గారి హెచ్చరింపు మీద వోసారి లలితా రాజేశ్వరి గుడి కెళ్లి మనసారా ఆ దేవిని ప్రార్ధించు కున్నాక, ఇంటి కొచ్చి భోజనం వగైరా లన్నీ ముగించుకుని ప్రయాణమయ్యాడు. మొదట ప్లేన్లో అనుకున్నా, రైల్లో నే ఏర్పాటు కావడం వల్ల సుధతో సహా అందరూ రఘు కి వీడ్కొలివ్వడానికి స్టేషన్ కి వెళ్లారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS