'అది కూడా మళ్లీ విడమర్చి చెప్పాలా నీకూ. వాళన్న మురళీ మన ఫ్రేస్ట్ నళినీ ఇలా మనతో పాటు వుంటూన్నట్టె వుండి ఇట్టే పెళ్ళి చేసేసుకున్నారే అలాగే --
'ఆ! అందుకే నిన్ను మళ్లీ నే ప్రశ్నిస్తా- వాళ్ళిద్దరూ అంటే ఇద్దరి మనసులూ, ఇద్దరి అభిప్రాయాలూ, కలిశాయి గనక అలా చేసుకున్నారు, అంది బాగుంది. అయితే వీళ్ళ సంగతలా కాదు. అందుకే ఇదంతా సుళువు గా అనేసేందుకు వీల్లేదు.' అంది ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఖండిస్తూ రోహిణి.
'అంటే ఇందులో నీ అభిప్రాయం ?'
'అభిప్రాయానికేం వుందీ. వీళ్ళిద్దరి తత్వాలకి చాలా తేడా వుంది గనక ఇద్దరూ మారగలిగి ఇద్దరికీ మధ్యస్తంగా వుండే ప్రత్యెక భావాల్ను అలవరచు కుంటేనే తప్ప వీలుకాదేమో. అలా అవగల్గెందుకు కొంత టైం పడుతుంది కదా?' అనుకుంటున్నా అంతే 'ఎంతో సులువుగా చెప్పేశావ్ గద?' అనుకుంది రాధ 'ఏమో బాబూ! నాకిటువంటి విషయాల్తో నిమిత్తం లేకుండా , ఏనాడో మేన మావని చేసేసుకున్నాను? అతను 'స్టేట్స్ ' నుంచీ తిరిగొచ్చి, మేం సొంత కాపరమంటూ వెలగ నేట్టినప్పుడే తప్ప మా ఇద్దరి మధ్యా పొత్తే కుదురుతుందో, పోరే ప్రారంభమవుతుందో నాకు తెలియదు మరి' అంది అతి సహజంగా శ్యామల.
ఇంతలో అక్కడా, అక్కడా వున్న వారంతా మళ్లీ ఆ మర్రి చెట్టు కిందికి చేరడంతో, వాళ్లూ లేచి వచ్చేశారు. తన బెస్కేట్ లోంచి కొన్ని కారపటుకుల్ని తీసి, భారతి అందరికీ యివ్వడం చూసి మిగతా ఒకరిద్దరూ వారి వద్ద నున్న చిరుతిండ్ల ని పంచి పెట్టారు. అది చూసి తన వద్ద నున్నవీ వినియోగం చేయించే నిమిత్తం రఘు చెట్టు దిగోస్తే , 'చూశారర్రా, 'తిండీ' అనేసరికే చెట్టు మీది కోతి కూడా దోగోచ్చేసింది' అంటూ, చొక్కా చాట్నేదో దాచుకుంటూ తను చెట్టెక్కి పోయాడు పద్మనాభం....తన బాస్కెట్ లోంచి మిక్చ్ చర్, కారపు జీడిపప్పూ , వగయిరాల్నీ రాధ చేతి కిచ్చి అందరికీ యిచ్చే య్యమన్నాడు రఘు.
'అలాగే ఆ పచ్చి వేరు సేనక్కాయలూ పైకి రానీ, నాకవంటే ప్రాణం.' అంది రోహిణి , జీడిపప్పు ని కరకర్లాడిస్తూ.
'అయితే ఆ కాసిన్నీ తరవాత నువ్వే తిను. అంతేగాని, అందరికీ పంచాలంటే -- ఏం చాల్తాయనీ...' అంది రాధ.
'అన్నట్టు, నేనూ తెచ్చానే, కొన్ని కాయలూ! అవీ యివీ కలిపేస్తే సరీ!' అంటూ వాటి కోసరం వెదక నారంభించాడు రఘు.
'ఏవిట్రా వెతుకుతున్నావ్' కొంటేతనంగా పై నుంచే అడిగాడు పద్మనాభం.
'పచ్చి వేరు సనగాల్రా!' వెతుకుతూనే అన్నాడు రఘు.
'అయ్యో, ఇంత మూటైతే తెచ్చారు కదురా. నేనూ చూశానూ' అన్నాడు ఆశ్చర్య పోతూనట్టు పద్మనాభం.
'మరే, మేమూ చూశాం. మళ్లీ ఆ మాటే మర్చి పోయాం గానీ లేకపోతె ఇంత సేపుండెమా అసలు?' రాజు అన్నాడు.
'ఏమో బాబూ. నాకు వాట్ల వాసనంటే కూడా గిట్టదసలు. అయినా, నేనూ వెతికి చూస్తానుండండి' అంటూ అతనూ చెట్టు మీది నుండే కిందికి గెంతబోతుంటే అతని కన్నా ముందు అందరి నెత్తి నీ ఏవో రాలడం చూసి అంతా ఉలిక్కిపడి 'అదేవి టా' అని పరీక్షించారు. అన్నీ పచ్చి వేరుసేనక్కాయల తొక్కలే.
'ఏవర్రా . చక్కగా అందరూ వాట్ల నోల్చుకు తినేసి నాకెక్కడివ్వబడుతుందోనని పైగా ఈ ఉపాయం పన్నారా?' అన్నాడు ఏమీ ఎరగనట్టు చేతులు దులుపుకుంటూ పద్మనాభం.
'హారి బకాసురుడా. అంత మూటా పొట్టన బెట్టు కున్నావుట్రా ? అంత బుద్దిగా చెట్లెక్కి కూర్చుంటే అదేమో అనుకున్నాను' అన్నాడు రామబ్రహ్మం.
'సరి , ఆ వున్న గింజలే , తలో రెండూ పంచండి ఏం చేస్తాం .' అన్నాడు రామ్మోహాన్.
'మరి నేరాకపొతే కాలక్షేపమే అవదు మొర్రో....అంటూ నన్ను బతిమాలాడి తీసుకొచ్చినప్పుడు ఈపాటి నైవేద్యాలన్నా నాకు పెట్టకపోతే ఎలగర్రా మరీ' అన్నాడు తన సంచీ ని సర్దుకుంటూ పద్మనాభం.
'అందుకేరా నాయనా అందరం నోరు మూసుకుంట.'
'అదేవిటర్రా, ఇంత చప్పగా వూర్కున్నారు మీరంతానూ?'
'వూర్కొక ఏం చేస్తావనుకున్నావ్? మరీ?'
'ఏం చేస్తారనుకున్నానా. అంతా కలిసి నన్ను కాళ్ళూ చేతులూ విరిచేస్తారనుకున్నా! హే! ఎందుకు పని కోస్తారర్రా మీరూ?' అంటూ ఒలిచిన వేరు సేనగ్గింజల మూట శ్యామల్చేతికిచ్చాడతను.
'ఊర్కే ఇవన్నీ తింటుంటే అందులో మజా ఏం వుందిరా. చక్కగా చల్లని సంగీతంఎవరన్నా పాడుతుంటే?' అన్నాడు ఆడపిల్లలున్న వేపు చూస్తూ రామ బ్రహ్మం.
'మా రఘు ఈ కచ్చేరీ లకి ప్రారంభోత్సవం జరిపిస్తాడు.' అని రాజింకా అంటుండగానే, 'ఆప్పుడు శ్రీ రఘునాధ రావు గారు ఒక దేశీయ గీతాన్ని పాడి మనకు వినిపిస్తారు.' అంటూ వో పుస్తకం చుట్టి నోటి వద్ద పెట్టుకుని బొంగురుగా అరిచాడు పద్మనాభం.
ఒకరిద్దరు స్నేహిరుల ప్రోద్భలం మీద గురజాడ అప్పారావు గారి దేశ భక్తీ గేయాన్ని చల్లగా, హాయిగా , పాడి వినిపించాడు,ఏమంతగా మురిపించు కోకుండా రఘు. ఆ తరువాత ఒచ్చీ రానీ పాటలని మొండి ధైర్యముతో ఒకరిద్దరు పాడితే, శాస్త్రీయ సంగీతం ఎవరన్నా మధ్య మధ్య పాడుతుంటే బాగుటుందర్రా' అని సలహా యిచ్చారు అందులో ఒకరిద్దరు. అయితే ఆ జట్టులో ఆ రాగ తాళం యుక్తమైన సంగీతం ఎవ్వరికీ రాదన్నారు. 'ఇటువంటప్పుడు మన సుధ పాడుటే ఎంత బాగుణ్ణు! రమ్మంటే! తన మాట సుధ ఎప్పుడూ కాదనదు గాని తనే కొన్ని కారణాల వల్ల సుధని పిలవలేదు. ఆ తరవాత రోహిణి హాయిగా నాలుగయిదు ప్రకృతి వర్ణన మీది పాటలు పాడితే , భారతి వో శ్లోకం ఇంపు గా చదివింది. రాధని కూడా పాడమని అందరూ ఎంతో బలవంతం చేశారు గాని, తనకేవీ రాదని స్పష్టంగా చెప్పేసింది రాధ. ఆ తరవాత చెట్ల వెంటా, పుట్టల వెంటా కాస్సేపు హాయిగా అందరూ కలిసి తిరిగి దాదాపు నాలుగ్గంటల ప్రాంతాల్లో మళ్ళీ తిరుగు ముఖం పట్టారు విశాఖ వేపుకి.
12
చీకటి పడేదాకా ప్రకృతి శోభ ని చూసి ఆనందిస్తూ గడిపేసి రాత్రయ్యే సరికి మళ్లీ గచ్చ పోదల్లాగా, వారి వారి పరిసరాల వారితో వారు మాటలు ప్రారంభించారు. రాజకీయాలా, సాంఘిక వ్యవస్తలా, జాతి మత బేధాలా సాంప్రదాయాల వల్లా కల్గే లాభ నష్టాలా, ఒకటేమిటి? విశాలాంధ్ర ఒక్కటే కాకుండా యావత్ర్పంపంచపు పోకడలన్నింట్ల మీదా చర్చలూ, వాదనలూ. ఆ మాట పట్టింపుల మీద పందేలూ, ఒకటి వెంట ఒకటి వరసగా దొర్లుకు పోతున్నా యీ సంభాషణల్లో కండక్టరు మాత్రం నోరు వెళ్ళ బెట్టుకుని ఆ బస్సులోని మొత్తం మంది కాలక్షేపాల్నీ పరవశమై పోతూ వింటున్నాడు. 'ఈ గొడవంతా ఎక్కడో?' అన్నట్టుగా దారి చూసి బండీ నడుపుకు పోతున్నాడు డ్రైవరు.
ఎంత సేపని వాళ్ళు మాత్రం గొడవ చెయ్యగలరూ తొమ్మిది గంటల ప్రాంతాల్లో 'బొర్రా ' అనే ఒక ఊర్లో బస్సాపి అక్కడ దొరికిన చిరుతిండ్లూ పండ్లూ కాయలూ కొనుక్కుని కడుపుల్నింపుకుని మళ్లీ బస్సులో పడ్డారంతా. ఆ తరవాత కస్సేపా మాటా ఈ మాటా , చెప్పుకుంటూ ఒక రోక్కరే కూర్చున్న చోట్ల నే సర్దుకుని మెల్లిగా కునక నారంభించారు.
అందరూ నిశ్శబ్దంగా కూర్చుని సందడి అణిగి పోవడం తో తనకేమీ కాలక్షేపం కాక పుట్టెడు అపస్వరాల్తో ఏవేవో సినిమా పాటల్ని పాడడం ప్రారంభించాడు కండక్టరు.
మొత్తానికి డ్రైవరు ఎంత స్పీడుగా పోనిచ్చినా, బస్సు కాలేజీ ఆవరణ లో ప్రవేశించే సరికి రాత్రి పదిగంటలు దాటింది. అప్పటికి సిటీ బస్సులు ఆగిపోయినందున కార్లున్న వారంతా మిగతా వారని కూడా వాళ్ల కార్లలో ఎక్కించుకుని ఎవరిళ్ళ ప్రాంతాల్లో వార్ని దింపేసి ఇళ్ళు చేరుకున్నారు.
రఘు ఇంటికొచ్చే సరికి జానకి తో పాటు సుధ కూడా మేలుకునే వుంది. కారు రావడం చూడగానే వాకిట్లో కి వచ్చింది.
'అబ్బ ఎందుకు నువ్విక్కడిక్కడికి ఎదుర్రావడం? నాకు భోజనం అదీ ఏమీ వద్దు ఈ పూటకి.' అని విసుగ్గా అంటూ పై కెళ్ళి పోయాడు రఘు.
తను వెళ్ళేసరికి ఎక్కడి సామాన్ల క్కడ సరిచేసి పడున్న తన గది అద్దం లా సర్ధబడి వుంది. బల్ల మీద పెట్టున్న ప్లాస్కు లోని పాలు వంచుకు తాగి ఇందంతా సుధ సర్దుబాటే , అయ్యుంటుం]దను కుంటూ వో కుర్చీ లో కూలబడ్డాడు రఘు.
ఈ సుధ కెందుకో నేనంటే ఇంత తాపత్రయం. పాపం నాకోసరం ఇన్ని ఏర్పాట్లూ చేసి ఇంతవరకూ మేలు క్కూర్చుంటే వచ్చీ రాగానే కసిరి పారేశాను. ఏం నోచ్చుకుందో ఏవో? ఇంతలో మధ్యాన్నప్పటి సంఘటన్లన్నీ మబ్బుల్లా మనసంతా వ్యాపించి అతని తల్లో మరో ఆలోచనని చొరనివ్వ కుండా చెయ్యడం తో పుస్తకం మూసేసి, లైట్ ఆఫ్ చేసేసి వెళ్లి పక్క మీద పడుక్కుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు , నిద్ర కోసరం ప్రయత్నిస్తూ.
తను రాదని వెనకాతల కూర్చో పెట్టుకుని స్కూటర్లో అలా ఇలా తిరిగి చివర కోక మంచి పూల తోటలో ప్రవేశించాడు.అక్కడ నుండీ బోటు షైరు, చల్లని గాలితో పాటు నీటి తుంపర్లూ పన్నీరు జల్లులా మీద బడుతుంటే రాధ తన భుజం మీద తలవాల్చి చల్లగా సున్నితంగా చక్కని గీతాన్ని అలాపిస్తుంది. తనందులో తన్మయుడై పోతున్నాడు. అన్ని రంగుల పువ్వుల్తోనూ, తనూ వొ పువ్వులా కలిసి దాంకుండిపోతూ , తను వెదుక్కుంతుంటే , కిలకిలా సెలయేటి ధ్వని లా నవ్వుకుంటూ, తన వెనకాల్నుంచీ వచ్చి చెయ్యి పట్టుకుంటుంది రాధ ఇలా అటపాటల్తో తనని రాధ పులకరింప చేస్తుంటే ఆ అనుభవం లోని హాయిగా మత్తుగా ఆమె ఒడిలో వాలిపోతూ, ' ఆహా, చక్కని సుందరాంగి తోడి వైవాహిక జీవితం లో ఇంత హాయి వుందా' అనుకుంటూ తన్మయుడై పోతున్నాడు తను.
