Previous Page Next Page 
మమత పేజి 28

 

    'ఈ హిందీ ముక్కలు ఒక్కటీ నా కర్ధంకావు . పాటలూ, గంతులూ బాగుంటాయని చిలుము వదిలించుకోవడం గానీ అంది పావని హల్లో అడుగు పెడుతూ.
    'నా కసలే తకక్కెక్క వే తల్లీ' అంది భారతి.
    'మాష్టారూ! మళ్ళీ పాఠం చెప్పాలి మీరివాళ ఇద్దరికీ. పాపం ఎప్పుడో భారతి కూడా మీ శిష్యురాలు కావలసింది . సీతమ్మవారిని రావణాసురుడేత్తుకు పోయినట్లు -- ఆ భీమారావు గారు కొన్నాళ్ళు తాళి వుంటే-'
    స్వామికి అటు భారతీ -- యిటు పావనీ కూర్చున్నారు.
    'మొదట్లోనే యిలవ్వేమిటండి దిక్కుమాలిన గోల!' అంది పావని.
    'ఎత్తి కుదేస్తున్నాడే బాబూ ఆ హీరోయిన్ని. ఎలా భారిస్తున్నదో గాని -- ' అంటూ మరింత ఆసక్తిగా ముందుకు వంగింది భారతి.
    స్వామి వళ్ళు జలదరించింది . చెయ్యి కంటే కంటే ఎక్కువ నలుగుతుంది మనస్సు.
    'ముప్పై వేలో- మూడు లక్షలో యిస్తార్ట. అందులో ఏదో వంతిమ్మను. ఇంతకూ పది రెట్లు ఎత్తి కుదేసినా ఎవరు భరించరు.'
    'ఛీ పాడుపో.'
    'మొహబ్బత్ అంటే ఏమిటండి?'
    'లవ్వే చిట్టి తల్లి. ఆ భూతాలద్దాల కళ్ళజోడు ప్రేమలేఖల్లో వాక్యానికి మూడు సార్లు కనిపించేది మాట గుర్తు లేదూ?'
    'ఎందుకండి ' అలా ముళ్ళు గుచ్చుకుంటాయని కూడా లేకుండా ఆ కొండల మీదా గుట్టల మీదా అలా కుప్పిగంతులేసింది- అంతట్లో ఏమయింది అలా యేడుస్తుంది. తేలు కుట్టినట్లా హీరోయిన్ను.'
    'యింటి పట్టు పట్టకుండా అలా రౌడీ వెధవల్తో తిరిగే గుట్టలంట - కాళ్ళు విరకొడతానన్నాడెమో వాళ్ళ నాన్న- విలనుండాలిగా మరి'
    'అంతేనండీ?'
    'సినిమా కధ కంటే మీ కలే బాగుంది కానీండి వింటా' కళ్ళు మూసుకు కూర్చున్నాడు స్వామి.

                                     13
    శ్రీదేవిని చూడాలనిపించింది. సినిమా అయిపోయింతర్వాత -- సీతమ్మ గారి యింటికి వెళ్ళారు ముగ్గురు. అదొక చిన్న పెంకుటిల్లు. ఒకటే గది. నులక మంచం గాక , కూర్చుంటానికి మరేం కనిపించలేదు.
    'అత్తగారింట్లో అడుగు పెట్టటం యిదే మొదటిసారి కామల్సు తల్లీ నీకు' అంటూ జారిపోతున్న పమిటను సర్ది వంటి చుట్టూ కప్పి ' అత్తగారి దగ్గర వినయంబు నటియింపుము' అంది జబ్బ గిల్లుతూ.
    సంబరపడి పోయింది సీతమ్మ గారు. మంచం వేసింది కూర్చుంటానికి. 'రాత్రి కలొచ్చిందిరా స్వాములూ నీమీద. ప్రొద్దుట నుంచి ఆ వేప చెట్టు మీద కూర్చొని ఆ వెర్రి కాకి అరుస్తున్నది అరుస్తున్నట్లే వుంది. అనుకుంటూనే వున్నా వస్తావని. కాని కోడలు పిల్లను గూడా వెంటబెట్టుకోస్తావనుకోలేదు!' ఉదయం నుంచి అరుస్తున్న కాకి మీద వల్లమాలిన అపేక్ష ముంచుకొచ్చింది సీతమ్మ గారికి. భోజనం చేయకుండా కదలడానికి వీల్లేదని పట్టు పట్టింది. భారతి వెంట వుండటంతో భయపడ్డాడు కాని 'ఫర్వాలేదు లెండి యింటికి పోయి మాత్రం నేను ఎవరి కోసం ఎదురు చూడాలి గనుక.' అంటూ సీతమ్మగారి మాటకు భారతి సాయం చెప్పడంతో మారుమాట చెప్పలేక పోయాడు స్వామి.
    'నిమిషాల మీద చేస్తా వంట ' అంటూ గది ప్రక్కన వసారాలోకి పరిగెత్తింది సీతమ్మ గారు. మరుక్షణం వసారా లోంచి కేక పెట్టింది కొడుకును.
    శ్రీదేవి యిక్కడే వుంది తెలుసురా?'
    శ్రీదేవిని గురించి నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్లు ఎన్నో సంగతులు చెప్పింది జాలిపడుతూ. 'దాని బ్రతుకిలా బ్రద్దమయింది' అంటూ కళ్ళు తుడుచుకుంది. మనచేతుల్లో ఏముందిరా? అంతా ఆ పరమేశ్వరుని లీలా విలాసం. అంతా సలక్షణంగా జరిగితే మీ యిద్దరూ మనింట్లో కళకళ లాడుతూ తిరగవలసింది . కానీలే. అబ్బాయికి మాత్రం అదంటే ప్రాణం. యాభయ్యో అరవయ్యో తెచ్చుకుంటున్నాడు.'
    ఇంతకు తెగిస్తుందని శ్రీదేవి - ఎన్నడూ కలగనలేదు స్వామి. టూరింగు సినిమాలో రిప్రజెంటేటివుగా పని చేస్తున్న ఒకతనితో లేచి వచ్చిందట.
    'అంత పిరికి మనిషి అంత దైర్యం ఎలా వచ్చిందమ్మా?'
    'సరే! చచ్చే పరిస్థితి వస్తే బ్రతుకును గురించి ప్రపంచం గురించీ ఎవరు భయపడతార్రా. కుందనపు బొమ్మలాంటి పిల్లను-- పది లక్షలున్నాయని ఆ ముసలి - పీనుక్కి యివ్వడమెందుకు? వాడు హరి అనగానే - మలేలే సంబంధాలంటూ బయలు దేరడం- అది తలదువ్వుకున్నా - మంచి చీర కట్టుకున్నా - లేచిపోతావుటే - అంటూ రాచి రంపాన పెట్టటం - ఖర్మ కాక ఎమిటంటావ్? ప్రాణం విసిగి - చేజేతులా ప్రాణం తీసుకోలేక చివరకు - అంతపనీ చేసింది. బంగారు తల్లి , వెతికి చూచినా దానిలో తప్పుందిరా లోకులు కాకులు గానీ.'
    ముందు గదిలో మంచం మీద భారతీ -- పావనీ -- కబుర్ల లో మునిగిపోయారు. తల్లి దగ్గర అడ్రసు సుమారుగా కనుక్కుని 'వంట అయేలోగా శ్రీదేవిని చూసి వస్తా నమ్మా.' అంటూ బయలుదేరాడు స్వామి.
    'ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికండో య్ బయలుదేరారు మాష్టారూ?'

 

                                    
    'ఇంకా పది కాలేదు. అరగంటలో వస్తా.'
    'కారులో వెళ్ళండి.'
    'అవసరం లేదు. దగ్గరేగా.'
    'జమీందారు గారి సత్రం వెనక సందులో దీప స్తంభం ఎదుట గల పెంకుటిల్లు.
    ఇల్లు వెతికి పట్టుకుంటానికి ఎక్కువసేపు పట్టలేదు స్వామికి.
    అప్పుడే సిగ్గుపడుతున్న యౌవన మాధుర్యాన్ని వోణిలతో కప్పుకుంటానికి ప్రయత్నిస్తున్న శ్రీదేవి రూపం మాత్రమే గుర్తు- తనకు చాలా సంవత్సరాల క్రితం చూసిన రూపం అసలు చూసి గుర్తుపట్టగలనా? అనుకున్నాడు . రోజురోజుకూ క్షణక్షణానికి మారుతూ, సన్నటి సెలయేరు నిండి పరవళ్ళు త్రొక్కే మహా స్రవంతిగా మారినట్లు- స్త్రీ జీవితంలో కూడా అటువంటి దశ గడుస్తుంది ఒకసారి. ఆ దశలో అడుగుపెడుతున్న -- నిజానికి పెట్టబోతున్న శ్రీదేవి మాత్రమే తనకు గుర్తు.
    ఆవీధి దీపపు వెలుతురులో యింటి దగ్గరకు నడుస్తున్నప్పుడు స్వామి శరీరం కంపించింది. అది భయం కాదు. ఇంత రాత్రి సమయంలో ఆ యింట్లో కాలుపెడుతున్న తనకు, చాలాకాలం తర్వాత ఆమెను చూస్తున్నాననే ఆనందోద్వేగం కాదు. అన్ని కష్టాలనూ కన్నీటిని అంత లేత వయసులోనే అమె అనుభవించిందన్న బాధ కాదు. ఏ ఒక్కటీ కాదు. అన్నీ, అన్నీ నిర్వచనానికి అందక- మనిషి అనుభవించే ఒక చిత్రమైన అనుభూతి. ఆ కొద్ది వ్యవధి లో మెదడు గుహల్లో కోట్ల సంఖ్య లో దాగిన చిన్ననాటి అనుభవాలూ జ్ఞాపకాలు కరిగిపోయిన కలల మాదిరి, కరిగిపోయిన అలల మాదిరి, అరినా అనంత మిగిలిన కాంతితో అస్పష్టంగా కదులుతున్న మెరుపుతునకల మాదిరి -
    ఒక్క మాటలో -
    ఆరిపోయిన అత్తరుగుడ్డను యింకా వదలని పరిమళం మాదిరి-
    శైశవమాధుర్యం కదిలించి అతని గుండెల్లో నిండి-
    శ్రీదేవి తలుపు తీసింది.

                                 *    *    *    *
    'గుర్తుపట్టవనుకున్నాను శ్రీదేవి'
    'అలా యెలా అనుకున్నావు బావయ్యా! చచ్చి దయ్యాన్నయితే మాత్రం నిన్ను మరిచిపోతానా? మరీ దొరబాబులా వేషం వేసుకొస్తే , ఒక క్షణం కన్ను చెదిరిందంతే. ఎంత మారిపోయావు బావయ్యా?'- నవ్వింది శ్రీదేవి. ఆ బుగ్గ మీద సొట్ట కన్నీటికి చేరిగేది కాదు చెరగలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS