ఆ ఆకారాల్లో ఒకటి బోడబోడమంటూ అరవటం లో ఏదో అరచింది. కళ్యాణి , కాంతారావు లకు ఆ భాష అర్ధం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కళ్యాణి లేచి భర్త దగ్గరగా వచ్చి అతని చెయ్యి పట్టుకుని నిలబడింది. ఆ విలన్లు తన భర్తను ఏం చేస్తారో నన్న భయంతో.
వీళ్ళ నుండి ఎలాటి సమాధానం రాకపోయేసరికి రెండవ ఆకారం మొదటి ఆకారంతో "తెలుంగు' అంటూ యింకా యేమిటో మాట్లాడింది. దానిని బట్టి వాళ్ళు తాము తెలుగు వాళ్ళమని గ్రహించేరని తెలుసుకుని కాస్త సంతోచించేరు కళ్యాణి, కాంతారావు.
ఇంతలోకే రెండవ ఆకారం చేతులు రెండూ నడుం మీద పెట్టుకుని రెండడుగులు ముందుకు వేసి హుంకరిస్తున్నట్లుగా 'మీరు తెలుగు వాళ్ళా?' అని అరవ యాసలో అడిగేడు.
ఔనన్నట్లుగా తలూపేడు కాంతారావు.
'ఈ సమయంలో మీరిక్కడెందుకున్నారు?' అంటూ మరో రెండడుగులు ముందుకు వేసేసరికి , కళ్యాణి గజగజ వణికిపోతూ భర్త చేతిని గట్టిగా పట్టుకుని 'అగు దగ్గరకు రాకు!" అంటూ గట్టిగా అరిచి వెంటనే స్పృహ తప్పి క్రింద పడిపోయింది.
కాంతారావుకి ఆ పరిస్థితులకు ముచ్చెమటలు పోసినాయ్. ఐనా ఎలాగో ధైర్యం తెచ్చుకుని కళ్యాణి పక్కనే కూర్చుని 'ఇంతకీ మీరెవరు? ఇలా వచ్చి మమ్మల్ని బెదిరించటం లో మీ ఉద్దేశ్యమేమిటి? పోలీసులకు చెప్పి మీ అంతు తేలుస్తాను.' అన్నాడు.
'అదే మాట మేమూ అంటున్నాం. పద పోలీస్ స్టేషను కు. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు తీసుకొచ్చేవిక్కడకు?' అన్నది ఆ రెండవ ఆకారం.
'ఆ అమ్మాయేవరేమిటి? నా భార్య' అన్నాడు.
దాంతో పెద్ద పెట్టున నవ్వేడు ఆ విలన్ . 'హహహ భార్యట భార్య! ఆమె నీ భార్య అయితే యిలా రాత్రి పూట దొంగచాటుగా పారిపోవలసిన అవసరమేముంది?' అన్నాడు.
అప్పటికి కాంతారావు పరిస్థితి కొంత వరకు అర్ధమయింది. తాము భార్యా భర్తలం కాక గూళ్ళ నుండి పారిపోయిన ప్రేమ పక్షులుగా భావించి వీళ్ళు తమని బ్లాక్ మైల్ చేసి డబ్బు గుంజుదామనుకుంటున్నారని తెలుసుకుని కొంత తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
'చూడు బాబూ! మేము మీరనుకుంటున్నట్టుగా పారిపోయిన వచ్చిన బాపతు వాళ్ళం కాము. మేమిద్దరం భార్యాభర్తలం.మాకు యిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఊరు చూట్టాని కని వచ్చి ఆ ఎదురుగా కనబడుతున్న హోటల్లో మకాం వేసేం. పిల్లలిద్దర్నీ నిద్రపుచ్చి ఏదో కాస్త వెన్నెట్లో కులాసాగా కాలక్షేపం చెయ్యటానికి వచ్చెం అంతే! అనవసరంగా మీరు శ్రమపడి వచ్చి మమ్మల్ని శ్రమ పెట్టేరు.ఇటు చూడండి. న భార్య స్ప్రహ తప్పి పడిపోయింది. ఇప్పటి కైనా దయచేసి వెళ్ళండి.' అంటూ కాసిని నీళ్ళు తెచ్చి కళ్యాణి ముఖం మీద చల్లెడు కాంతారావు.
ఆ రెండవ వాడు మొదటి వాడితో అరవం లో ఏదో చెప్పసరికి వాడు కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడు. కళ్యాణి , కళ్ళు తెరచి వాళ్ళిద్దర్నీ చూసి మళ్ళీ భయంతో వణికి పోతూ భర్త ననుకొని కూర్చుంది.
కాంతారావు ఆమెను భయపడవద్దని వారించేడు. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు కారని చెప్పి ఆమె భయాన్ని పోగొట్టేడు. ఆ దృశ్యం చూసి వాళ్ళే మనుకున్నారో, మాట్లాడకుండా వెళ్ళిపోయేరు.
కాంతారావు , కళ్యాణి కూడా హోటలు వైపుకు నడిచేరు. దారిలో కాంతారావు కళ్యాణి కి వాళ్ళను గురించి వివరంగా చెప్పేడు. 'సాధారణంగా నగరాల్లో ప్రేమ పక్షులిలా సమయం కాని సమయంలో, చోటు కాని చోటులో ప్రణయ కలాపాలు సాగించటం వల్ల అలాటి వాళ్ళను బెదిరించి, ఐదో పదో వసూలు చేస్తారు యిలాటి వాళ్ళు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రమాదకరం కాని మనుషులే! వీళ్ళు బెదిరించి డబ్బులు వస్తూలు చేసే రకం. ప్రాణాలయితే తియ్యరు.' అని.
'వాళ్ళు కనుక ఏ దొంగలో నీచులో అయినట్లయితే మన గతి యేమయ్యేది? మన పిల్లలు ఏమయ్యేవాళ్ళు? ఇవ్వాళ మనం లేచిన రోజు మంచిది. మన పిల్లల అదృష్జ్తం బాగుండబట్టి సరిపోయింది. ఇంకా నయం వాడు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు. మిమ్మల్ని తన్ని తగలెయ్యలేదు. ఒకరకంగా చచ్చి బ్రతికాం మనం' అన్నది కళ్యాణి.
వాళ్ళు హోటలు కు వెళ్ళేసరికి కుర్రవాడు స్టూలు మీదనే కూర్చొని గాడంగా నిద్రపోతున్నాడు. కాంతారావు అతని భుజం తట్టేసరికి ఉలికిపడి, లేచి నిల్చున్నాడు.
'వచ్చేరా సార్? ఇంతాలస్యమయిందే? మీరెంత కూ రాకపోయేసరికి యిప్పుడే కునుకు తీసెను. పిల్లలు మంచిగా నిద్రపోయేరు . లేవనే లేవదు.' అని చెప్పి జేబులో రూపాయ నోటు ఉన్నదో లేదో ఒకసారి తడిమి చూసుకుని వెళ్ళిపోయేడు.
గది తలుపు గడియ పెట్టి మంచం మీద వాలగానే కళ్యాణి భర్తను బల్లిలా అంటిపెట్టుకుని నిద్రపోయింది భయంతో.
తెల్లవారిన తరువాత మొట్టమొదటగా కళ్యాణి కి రాత్రి జరిగిన సంఘటనే గుర్తు కొచ్చింది. ఇంకా గాడంగా నిద్రపోతున్న పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకుని 'అబ్బ! ఎంత గండం గడచింది!' అన్నది భర్తతో.
కాంతారావు కూడా మనసులో అదే మాట అనుకున్నాడు కాని పైకి అనటానికి మగతనం అడ్డు రావటం వల్ల మౌనంగా కూర్చున్నాడు.
'అసలు మనం భార్యాభర్తలం కాదని వాళ్ళకెందుకనుమానం వేసిందో! నా మెళ్ళో నల్లపూసలు కూడా కనపడలేదేమిటి వాళ్లకు!' అని తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది కళ్యాణి.
'పెళ్ళయి యిద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఏ భార్యాభర్తలు వెన్నెల్లో ప్రణయ కలాపాలు సాగించరు. అది లోకం రివాజు. మనం అందుకు వ్యతిరేకంగా కనపడటం తో వాళ్ళకు విడ్డూరంగా కనపడి ఉండవచ్చు.' అన్నాడు.
'అంటే పెళ్ళయిన తరువాత, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండదేమిటి?'
'ఒకవేళ ఉన్నా కాని, ఎవరూ మరీ యింత వెర్రిగా మనలా ప్రవర్తించరులా ఉంది.'
'దీని కంతటి కి కారణం మీరే! ఎంత ప్రేముంటే మాత్రం పిల్లలు పుట్టిన తరువాతైనా దంపతులు కొంత పెద్ద మనిషి తరహాను అలవర్చు కోవాలి. పిల్లల్ని వదిలి 'టింగు రంగా' మంటూ బయటకు వెళ్ళినందుకు మనకి మంచి శిక్షే లభించింది. ఇకనైనా బుద్ది తెచ్చుకోండి. ఇలాటి పిచ్చి పిచ్చి ఆలోచన లెప్పుడూ చెయ్యకండి. మన పిల్లల అదృష్టం కొద్దీ బ్రతికి బయట పడ్డాం.' అంది.
ఇంతలో పిల్లలు లేచేసరికి భార్యా భర్తలిద్దరూ కూడా పక్కల మీద నుండి లేచేరు.
అ ఉదయమే హోటలు ఖాళీ చేసి మద్రాసు వెళ్ళి, అక్కడ నుండి బస్సులో సాయంత్రాని కల్లా బెంగుళూరు చేరుకున్నారు. అప్పటికి కళ్యాణి మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది ప్రయాణం వల్ల. పిల్లలు కూడా వడిలి పోయి ఉన్నారు. కాంతారావు పర్సు కూడా ఖాళీ కాబోతోంది. అందువల్ల త్వరలోనే తమ యాత్ర ముగించేయ సంకల్పించుకున్నారు.
'టూరిస్టు బస్సులో కూర్చుని ఒక్క రోజల్లా ఊరంతా చూసి రావచ్చు. మద్రాసు లో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారట అంది కళ్యాణి. దాంతో కాంతారావు ఆ రాత్రికే టూరిస్టు బస్సుల ఆఫీసుకు వెళ్ళి మర్నాటి ప్రయాణం కోసం సీట్లు రిజర్వు చేయించు కుని వచ్చేడు.
అతను వచ్చేసరికి కళ్యాణి కూడా అలసిపోయి, పిల్లలతో పాటు తానూ కూడా నిద్రపోయింది.
భర్త రాగానే తలుపు తీసి మళ్ళీ వెంటనే పక్క మీద వాలి నిద్రపోయింది.
కాంతారావు బట్టలు మార్చుకుంటూ నలిగిన మల్లె చెండులా నిద్ర మత్తులో ఒక విలక్షణమైన అందాన్ని ఒలికిస్తూ ఆదమరచి నిద్రపోతున్న కళ్యాణి వంక రెప్ప వాల్చకుండా చూసేడు.
తరువాత లైటు తీసేసి అతను కూడా మంచం మీద పడుకున్నాడు. క్రితం రాత్రి మహాబలిపురం లో జరిగిన భయంకర సంఘటన వల్ల, తెల్లవారగానే పగలల్లా ప్రయాణంలో ఉండటం వల్ల అతను కళ్యాణి కి దగ్గరగా ఉండటానికే అవకాశమే కుదరలేదు. అందువల్ల తన పక్కనే మల్లె చెండులా ముడుచుకుని పడుకున్న భార్యను మరింతగా నలిపి ఆమెను తన ఎదలో దాచుకుని గాడంగా నిద్రపోయాడు కాంతారావు.
* * * *
టూరిస్టు బస్సు ఏడున్నర కే బస్టాపు లో బయలు దేరుతుంది. అందువల్ల కళ్యాణి , కాంతారావు ఉదయం ఆరుగంటలకి, బలవంతాన నిద్ర మత్తు నుండి బిగాకౌగిలి వెచ్చదనం నుండి, తేరుకుని లేవవలసి వచ్చింది.
లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి, డ్రెస్సింగ్ టేబులు ముందు కూర్చున్న కళ్యాణి అద్దం లోని తన ప్రతిబింబాన్ని చూసుకుంటూనే అదిరి పడ్డది. 'ఈ కమిలిన బుగ్గలతో, పగిలిన పెదవులతో బయటకు వెళ్ళటం ఎలా? అసలు రోజు రోజుకీ మీకు మతి పోతోంది.' అన్నది డ్రెస్ చేసుకుంటున్న భర్త ప్రతి బింబాన్ని అద్దంలో చూస్తూ కోపంగా.
కాంతారావు వెనక్కి తిరిగి అద్దంలోని కళ్యాణి కళ్ళతో కళ్ళు కలిపి కొంటెగా నవ్వేడు.
"పోవోయ్ , అ మాత్రానికే సిగ్గుపడితే ఎలా? మగవాడి నై ఉండి ఆమాత్రం రసికత్వం చూపకపోతే ఎలా చెప్పు?" అన్నాడు 'టై' సవరించుకుంటూ.
'రసికత్వమా పాడా, మోటుతనం అది' అంది కళ్యాణి బుగ్గలను వేళ్ళతో రాసుకుంటూ.
'రసికత్వమంటేనే మోటుతనం అని అర్ధం పిల్లా! రసికత లో ఎప్పుడూ నాజూకుతనం ఉండదు తెలిసిందా?' అంటూ బూట్లు తొడుక్కుని తాళ్ళతో బిగిస్తుంటే కళ్యాణి అద్దంలో నుండే భర్త వంక కొరకొర చూసి, చిరునవ్వును ఆపుకుంటూ పెదవులను బిగించేసుకుంది. బుగ్గలకు మెల్లగా క్రీము రాసి, మర్దన చేసుకుంటుంటే వెనుకగా వచ్చి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని, కాంతారావు 'మరే...చందమామకు మచ్చలా, మా కళ్యాణి ముఖానికి యీ మచ్చలు కూడా మరింత అందాన్నిస్తాయిలే . బస్సులోని మిగతా ఆడవాళ్ళు 'ఏమిటమ్మా ఆ మచ్చ?' అని అడిగితె? "ఏం మీకు మొగుళ్ళు లేరా? మీకు మాత్రం పెళ్ళి కాలేదా?' అని తీక్షణంగా అడిగేసేయ్ . సరేనా?' అన్నాడు.
కళ్యాణి కి వో పక్క భర్త మాటలకు నవ్వొస్తున్న మరోవంక కోపంగా కూడా ఉంది. అందువల్ల పక్కనే ఉన్న దువ్వేనను తీసుకుని అతని నెత్తి మీద చిన్నగా కొట్టి 'అవతలకు పొండి. నన్నసలు ముట్టుకోవద్దు. నాతొ మాట్లాడవద్దు.' అన్నది బింకంగా.
ఇంతలో పిల్లలు కూడా లేచేసరికి వాళ్ళను తయారు చేసి తను కూడా ముస్తాబయింది కళ్యాణి. కంచి లో కొన్న ఎర్రటి పట్టుచీర కట్టుకుని, నుదుట ఎర్రని కుంకుమ పెట్టుకుని, పెదవులకు ఎర్రని లిప్ స్టిక్కు రాసుకుని, కొప్పులో ఎర్ర గులాబీ పువ్వు పెట్టుకుని రూము నుండి బయటకు వచ్చిన కళ్యాణి ప్రాతః కాలపు లేయెండలో మెరిసి పోతుంటే కాంతారావు కు ఆమెను చూట్టానికి రెండు కళ్ళు చాలవని పించింది. 'బయటకు వచ్చినప్పుడు ఊరికే కళ్ళతో చూసి ఆనందించాలే తప్ప రుచుల కోసం ఎగబడటానికి వీల్లేదు.' అని మద్రాసు బీచ్ లో కళ్యాణి స్పష్టంగా చెప్పి ఉండటం వల్ల కాంతారావు తన కోరిక లన్నిటినీ తన కళ్ళలోనే కురిపిస్తూ ఆమె వంక చూసేడు. కళ్యాణి అతనిని కళ్ళతోనే వెక్కిరించి వెనుదిరిగింది. ఉదయం బెంగుళూరు లో చలిగా ఉండటం వల్ల పిల్లలిద్దరికీ స్వెట్టర్లు వేసింది కళ్యాణి. అందరూ సరీగ్గా ఏడున్నరయ్యేసరికి బస్టాపు కు వెళ్ళి అప్పటికే సిద్దంగా నిల్చున్న బస్సు లోకి వెళ్ళి తమ సీట్ల లో కూర్చున్నారు.
