Previous Page Next Page 
వసంతం పేజి 28

 

    "చెప్పు శేఖర్ ఇంకా ఏమిటి నామీద
    రిపోర్ట్?"
    చాలాసేపు మాట్లాడలేదు శేఖర్.
    తరవాత నెమ్మదిగా, చాలా ఉన్నాయి - కనీసం, అలాగ విన్నాను..."
    "చెప్పు-"
    "ఆ ఉద్దేశంతోనే వొచ్చాను గోపాల్!- కాని.... నీతో అవన్నీ చెప్పడం సరీగా ఉంటుందనిపించదు"
    "శేఖర్! ఇది మరీ క్రూరంగా ఉంది! నువ్వు ఏమీ చెప్పకుండా ఉండిపోతే సరిపోను: లేదా పూర్తిగా చెప్పినా సరీగా ఉంటుంది. ఫర్ గాడ్స్ సేక్ - చెప్పు!"
    ఉద్రేకంగా అన్నాడు గోపాలం. అతని ఓరిమి హద్దుల దగ్గరికి వొచ్చేసింది.
    నిట్టూర్చాడు శేఖర్. "వసంతకి తెలిస్తే నాకళ్ళు ఊడపీకుతుంది...."
    ఏమవాలి? ఆమెవెనక శేఖర్ తో రహస్యాలు వినాలా ? లేక, ఈ అజ్ఞానంలోనే ఉండిపోయి, టార్చర్ అవలా?
    చెప్పు..."
    "ఆల్ రైట్ - నేను చెప్పేదంతా నమ్ముతున్నాననుకోకు. నాకు నువ్వు తెలుసును....వసంతనీ తెలుసును."
    అవును- ఆమె నీ చెల్లెలు; తల్లిలేని ఒక్క పిల్ల.
    నేను ఆమెని బాధిస్తూన్న పరాయివాణ్ని : అనుకున్నాడు గోపాలం.
    "ముఖ్యంగా- ఆమెని నెగ్లెక్టు చేశావని అంటుంది వసంత..."
    "ఎలాగ?"
    "ఆమెనిగురించే నువ్వు ఆలోచించవుట- ఆమె మీద నీకు కూడని అపోహలుట....చివరికి."
    "కాని-"
    "ఆమె ఆ మధ్య డాక్టరు దగ్గరికి చాలాసార్లు వెళ్ళినా, సంగతేమిటని నువ్వు అడగలేదట-"
    "సారీ - ఒకలా అది నిజమే. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది వసంత?"
    "ప్రెగ్నెన్సీ అనుకుంది-"
    "మరి?"
    "కాదు - కనీసం, కాలేదు........."
    "మరి?"
    "అదే చిలవలూ పలవలూ..."
    "పూర్తిగా చెప్పు శేఖర్ - ఇంకా ఏదో ఉంది నువ్వు డీపెన్సీకి చూడకు. కనీసం నేనేం చేశానో నాకు తెలియని...."
    "నీ సపరేట్ బేంక్ అకౌంటూ. నీ తిరగడం- ఆల్ రైట్. ఆమె అనుకుంటున్నది నీకు సెలా చాలా దగ్గరి ఫ్రెండ్ అని -"
    షాక్ లాగ తగిలాయి మాటలు.
    "అంటే - ఆమెకి - నాకూ-"
    "అవును - సారీ గోపాలం? నేనూ ఎన్నో సార్లు చెప్పేను. వసంత ఫూలిష్ గా..."
    ఎందుకలాగ అనుకుంది.
    "ఆమె ఉద్దేశంలో వందనిదర్శనాలు వున్నాయి ఏరోజు సాయంత్రం నువ్వు ఒంటరిగా వెళ్ళినా, స్టెల్లా కోసమే నంటుంది వసంత.....ఆమధ్య-"
    "చెప్పు."
    "నీ వెనకాల ఇన్వెస్టిగేటర్ ని పెడతానని అంది - నాన్నగారు దెబ్బలాడేరు..."
    "గాడ్!"
    సారీ -గోపాల్? నేను ఇదేమీ నమ్మడం లేదు.
    కాని -కనీసం నీకు తెలిస్తే..."
    "అవును శేఖర్ ! థాంక్స్!"
    వీలైనంత సరి దిద్దు గోపాల్! వసంత మరీ సెన్సిటివ్, ఇవన్నీ అపోహలని తెలుసును నాకు - కాని, నా ఉద్దేశం కన్న వసంతది ముఖ్యం....ప్రయత్నించు."
    "ఏం చెయ్యాలో నాకూ తెలీదు శేఖర్.!"
    "తెలుస్తుంది గోపాల్!- ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో ఆమె నిన్ను కావాలని పెళ్ళిచేసుకుంది పూర్వం జరిగినది నీకు తెలుసును ఆమె తెలిసో, తెలియకో చాలా ఇన్ సెక్యూరిటీ ఫీలవుతూందని జ్ఞాపకం ఉంచుకో, అదీ ఆమె స్వభావమూ కలిసి. ఈ పరిస్థితులన్నిటికీ దారి తీశాయి...."
    ప్రశ్నిస్తున్నట్టు శేఖర్ ముఖంలోకి చూశాడు గోపాల్,

                           
    "ఆల్ రైట్ - ఇవన్నీ అర్ధం చేసుకోలేక ఒక సైకియాట్రిస్ట్ ని అడిగేను - అతని అనాలిసిస్ అది..."
    బాగా చీకటిపడిపోయింది. లేచి టై సర్దుకుని వెళ్ళడానికి సిద్ధం ఐ పోయాడు శేఖర్.
    "వసంత - ఎక్కడికి వెళ్ళింది?"
    "ఆలీపూర్ వచ్చింది-నాన్నగారు రమ్మన్నారు. నేనిక్కడికి వొచ్చానని చెప్పకు-అడిగితే తప్ప-"
    "థాంక్స్ శేఖర్!"
    నీరసంగా లేచి నిలబడి, అతనితో కరచాలనం చేసి, కిందకి అతని కారు దాకా దిగబెట్టి మీదికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో నిలబడ్డాడు గోపాలం. చీకటిగా ఉంది-దీపాలు వేశాడు.
    వెలుతురులో కాంతి ఉన్నట్టు కనిపించి లేదతనికి. ఒక ప్రపంచం వొదిలి మరో ప్రపంచానికీ వచ్చినట్టుంది. ఒక్కసారి నీరసం అనిపించింది.
    బెడ్ రూములోకి వెళ్ళేడు.
    ఆ మంచాలు- ట్విన్స్ - చూసే సరికి అతనికి చాలా ఉద్రేకం వచ్చింది- తెల్లటి రెండు దుప్పట్లు వెక్కిరిస్తోన్నట్టు ఉన్నాయి.
    చిన్న టేబిల్ మీద మూడో నాలుగో పుస్తకాలు. అందులో రెండు తనవి - ఒకటి ఆమె మాగజిన్ - మరొకటి ఏదో ఇంగ్లీషు నవల.
    డ్రెస్సర్ మీద ఆమె డయరీ. ఒక్కసారి అతని చెయ్యి దానిమీదికి వెళ్ళింది. అద్దంలో తన స్వరూపం వికారంగా కనిపించింది. చివాలున చెయ్యి తీసేసి. రెండో బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు గోపాలం.
    
                                       29

    ఆ రాత్రి వసంత వచ్చేసరికి చాలా ఆలశ్యం ఐంది. బెల్ విని గోపాలం లేచివెళ్ళి తలుపు తీశాడు. 'హల్లో' అని, వసంత లోపలికి వెళ్ళిపోయింది.
    ఆ రాత్రి ఏ మూడు గంటలకో నిద్రపోయాడు గోపాలం-ఉదయం లేచేసరికి ఎనిమిదైపోయింది. అతను నిత్యకృత్యాలు తీర్చుకుని. పేపరు చదివి మళ్ళీ నిద్రపోయి పన్నెండుకు లేచేడు.
    తొందరగా బట్టలు వేసుకుని బయటికి వచ్చే సరికి వసంత డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంది. అతను వెళ్ళబోతోంటే చిరునవ్వుతో, "ఒక్కడివే వెడుతున్నావా?" అంది.
    "ఆఁ" అన్నాడు చిరునవ్వుతోనే గోపాలం.
    "నిన్నూ రమ్మన్నావు జ్ఞాపకం లేదా?"
    తేలిగ్గా అడిగింది వసంత.
    "ఉంది....కాని, నువ్వు రావని తెలుసును"
    "అడిగి చూడు!"
    ఒక నిమిషం నిలబడి ఆమెవైపు చూశాడు గోపాలం. ఏం అనాలో తెలియకా, ఏం అనకూడదో తెలియకా.
    చివరికి అతను చిరునవ్వు నవ్వగలిగాడు-అతనికి ఆశ్చర్యం వేసింది. మనస్సు తేలిక చూసుకుని,
    'వొద్దు వసంతా-వొస్తూన్న కెరటాలని అడ్డలేం- వెళ్ళిపోయిన రోజుల్ని మళ్ళ తేలేం- అది నేనూ నేర్చుకొనాలి వస్తాను." అని బయటికి నడిచాడు. కిందకి దిగి టాక్సీకోసం నిలబడి, తానన్న మాటలకి అర్ధం ఏమిటని ఆలోచించాడు.
    ఆ మాటలు నిజం అని అతనికి తెల్సును-కాని. ఎందుకని అన్నాడో అతనికే తెలియలేదు. వొస్తూన్న టాక్సీనిఆపి మరో పది నిముషాల్లో రామానంద్ ఇంటికి వెళ్ళేడు.
    రెండో ఫ్లోర్ లో రెండుఫ్లాట్లు ఉన్నాయి. క్షణమాత్రం ఫ్లాట్ నంబరు మరచిపోయాడు- ఆలోచనల్ని కూడగట్టుకుని, నాలుగోనెంబరు ఫ్లాటు బెల్ నొక్కేడు.
    రెండు నిముషాలు ఏమీ అవలేదు.
    "మళ్ళీ బెల్ నొక్కాడు. లోపల రింగ్ విని పిస్తోంది.
    మరో పది సెకండ్లలో రెండు తలుపులూ తెరుచుకుని, గుమ్మంలో నిలబడింది శశిరేఖ- ఆమె చిరునవ్వుతో అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతనూ అలాగే నిలబడిపోయాడు. ఆ క్షణశకలంలో అతనికి అనిపించింది- ఇది నా యిల్లు: ఈమె నాది: ఈరోజు నాది అని.
    "రండి" అంది శశిరేఖ.
    తెలివి తెచ్చుకుని ఆమె వెనకాల నడిచాడు. అతన్ని డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టి తలుపులు వేసి, శశిరేఖవొచ్చి ఎదురుగా కూర్చుంది.
    "రామానంద్ - ఏరీ?"
    "గంట ఐంది- డైమండ్ హార్బర్ కి వెళ్ళేరు-"
    "ఎందుకని?"
    "ఆయన కొలీగ్ ఎవరో పిక్నిక్ కి వెడుతూ ఏక్సిడెంట్ చేస్తే ఆ విషయం తెలిసి వెళ్ళేరు మిమ్మల్ని క్షమాపణ కోరుతూ..."
    "...నిన్ను "మీ" రంటూ ఇంత గౌరవించేంత దూరం ఐపోయానా, శశీ?" అన్నాడు ఆమెను మధ్యలో ఆపి.
    క్షణం ఆగి, "కాలేదా, గోపాలం?" అంది శశిరేఖ.
    "లేదు శశీ! - నువ్వలాగ అంటే తప్ప..."
    "అన్నా, అనకపోయినా, నిజం మనిద్దరికీ తెలుసును."
    "అవునులే - కాని, నన్ను గౌరవించకు- కనీసం ఆ ఒక్క సంతృప్తి ఉండిపోనీ!"
    కొంచెం ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూసి, "అదేం మాట గోపాలం?.... నీకేం? చక్కటి భార్య -మంచి ఉద్యోగం....నీకు తక్కువ ఏమిటి?" అంది శశిరేఖ.
    "నిజం చెప్పేదా శశీ?"
    "చెప్పాలని ఉంటే, చెప్పు-"
    తనని దూరంచెయ్యడానికి ఆమె వీలైన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఆమెకి దగ్గరిగా వెళ్ళడానికి తన చేతిలో ఉన్నవన్నీ చేస్తున్నాడు తాను... కాని, ఆమె ప్రతీప్రయత్నాన్నీ తాను గుడ్డివాడై. చూడకూడదు.
    "నాకు అన్నీ ఉన్నాయి శశీ.....సుఖశాంతులు తప్ప - నువ్వు తప్ప-"
    "అలాగ మాట్లాడకు గోపాలం- తప్పు అని నీకు తెలుసును" అంది శశిరేఖ.
    "ఉన్నమాట నీకైనా చెప్పనీ శశీ: - నాతత్వం నీకు తెలుసును- ప్రవహించిపోయిన నీళ్ళు మళ్ళీ రావని నాకూ తెలుసును- కాని, కనీసం ఉన్న నిజం, పూర్తిగా చెప్పనీ శశీ!"
    కొంచెం ఆలోచించింది శశిరేఖ.
    "చెప్పు గోపాలం....కాని మగతనాన్ని మళ్ళీ తవ్వడానికి ప్రయత్నించకు... ఎంత ప్రయత్నించినా, నేనూ మరచిపోలేకపోతున్నాను. కనీసం, ఆ రోజుల ప్రభావాన్ని నామీద లేకుండా చేసుకోలేకపోతున్నాను. ఆమాట ఎత్తకు....అప్పుడు జరిగిన దాని నంతనీ క్షమించు! ఒక్కసారి మరిచిపో..."
    "క్షమించాల్సిన దానివి నువ్వు. శశీ! నేను కాదు. పొరపాటుచేసినది నేను-"
    "కాదు గోపాలం... నేనేం పొరపాటు చెయ్యలేదు! కాని, నీకు అపచారం చేశాను..."
    "లేదు శశీ-"
    "అవును- నువ్వు మంచి స్నేహితుడివిగా కన్న అధికంగా -భర్తగా - నాకు తెలియకుండానే అంతరాంతరాల్లో నిన్ను నిరాకరించేను.... రామానంద్ మళ్ళీ నా జీవితంలోకి వొచ్చేముందే!"
    "శశీ!-"
    "నిన్ను -నన్ను బాధపెడుతూన్న ఈ హాలా హలాన్ని నువ్వూ పంచుకో. నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజులు..... ప్రతిరోజులోనూ గడిచిన ఆ గంటలు... ప్రతి అడుగూ నీనుంచి నేను దూరంగా వేసినది నాకు జ్ఞాపకం ఉంది! కాని ప్రతి అడుగూ నువ్వే దూరం ఔతున్నావని నన్ను నేను నమ్మించుకున్నాను, నువ్వూ అలాగే నమ్మాలనుకున్నాను."
    "అది నిజం కాదు శశీ!-"
    "చెప్పనీ- ప్రతి అక్షరం ఇది నిజం. నువ్వు నాకేమీ ద్రోహం చెయ్యలేదు కానీ, ఇన్నాళ్ళ మథనం తరవాత ఆ నిజాన్ని విషంలాగ మింగి. జీవించగలిగాను గోపాల్! అప్పటిమాట లన్నీ ఒక ఆలోచనని, ఒక కలని జస్టి ఫై చేసేందుకు..... రామానంద్ ఆ క్రిటికల్ టైమ్ లో వచ్చారు: క్రమంగా నిన్ను నిజం తెలియకుండా ఉంచి. నేనే వెళ్ళిపోయాను గోపాలం! నువ్వు బాధపడతావని తెలుసును కాని. నేను మారలేకపోయాను. నీ ఉత్తరం-"    
    "అవును.....అందిందా?"
    "అందింది. కాని, చాలా రోజులదాకా చదవనే లేదు నేను, నువ్వు వసంతని పెళ్ళి చేసుకుంటావంటే పెద్ద రిలీఫ్ ఫీలయాను. క్రమంగా ఇదంతా సముద్రమై అహర్నిశం నన్నుబాధ పెట్టింది.....అదె గోపాలం నిజం? విషం: ఇంక వీధి-"
    "నమ్మలేని నిజం. శశీ"
    "అన్నీ నిజాలాగే. గోపాలం! నా జీవితం నాది: నీ జీవితం నీది......కాని, నీ మనస్సులో దోషభావం అట్టేబెట్టి క్షణక్షణం నీ ఆలోచనల్ని కలుషితం చెయ్యడానికి నాకు హక్కులేదు. అందుకే, ఆయన వచ్చేలోగా చెప్పేను. శక్తి ఉంటే నన్ను క్షమించు-"    
    ఐదారు నిమిషాలు నిశ్శబ్దంగా సాగిపోయాయి.
    "ఒంటిగంట ఐపోయింది. ఆయన వచ్చే సూచన లేదు. పద. భోజనం చేద్దాం" అంది శశిరేఖ.
    "తొందరలేదు శశీ!- అతన్ని రానీ."
    "మూడు, నాలుగ్గంటలయితే గాని రారనుకుంటాను. ఈ పాటికి చేరి ఉంటారు....ఎదురు చూడవొద్దని మరీమరీ చెప్పి వెళ్ళేరు పద."
    అతన్ని కూర్చోపెట్టి ఆమె సామాన్లన్నీ తెచ్చింది.
    వొడ్డించి, "తిను- వీలైనంత. ఇంకా వంట బాగారాలేదు. నీ అదృష్టం బాగుంటే ఒక్కటైనా బాగుంటుంది."
    నవ్వి, "ఎప్పుడు నేర్చుకున్నావు వంట?" అన్నాడు గోపాలం.
    "ఇక్కడికి వొచ్చాక పుస్తకాలు చదివి తరవాత ఎవరో అరవలు మీద వాటా తీసుకున్నారు. వాళ్ళు కొంత నేర్పేరు"
    భోజనం చేసి వొచ్చి కూర్చున్నాడు. పక్క పొడి ఇస్తూ, నీకు సుఖశాంతులెందుకు లేవు గోపాలం? అందరూ నిన్ను గొప్ప అదృష్టవంతుడని అంటూంటే?" అంది శశిరేఖ.
    నవ్వి. "మాది మేడిపండు జీవితం శశీ!-" అన్నాడు గోపాలం.
    "ఆ అమ్మాయి- వసంత. ఎవరో అందంగా ఉంటుందని చెప్పేరు రామానంద్. కామినీ, కాంచనం.....ఒక్క చోట ఉండడం నువ్వు వరించి చేసుకోవడం-"
    "అంతా నిజమే శశీ - ఆ రోజుల్లో నువ్వు దూరం కావడమూ వసంతతో పరిచయం- ఏది కారణం ఐతేనేం, ఏది ఫలితం ఐతేనేం. జరిగినదంతా నీకూ తెలుసును"
    "మరి?
    "బట్ట లెలాగ చిరుగుతాయో తెలుసుగా! అలాగే ఎప్పుడో చిన్న కలత నాకు తెలియకుండానే ఆరంభం ఐంది..."
    "అది క్రమంగా పెద్ద వరస ఐంది. ఏం?"
    "అవును....ఆమె స్వేచ్చను అడ్డుపెట్టలేదు నేను. కానీ, అదీ ఉదాసీనత అనుకుంది వసంత క్రమంగా.....క్రమంగా......"
    కొన్ని ఘట్టాలు చెప్పేడు-నిన్న శేఖర్ తో జరిగిన సంభాషణా చెప్పాడు.
    "ఆమెకి పెద్ద అపోహ...."
    "అందుకా ఒక్కడివీ వచ్చావు?"
    "ఉన్నదే ఒక్కన్ని. ఆమె వస్తానందినుకో - కాని నిన్నటి తరవాత ఇంక తీసుకురావాలనిపించలేదు శశీ!"
    చాలాసేపు ఆలోచించి, "నామాట చెప్పావా!"    అంది శశిరేఖ.
    ఆమెకి తెలుసును, వెంకట్రామ్ అన్నీ ఎంక్వయిరీ చేశారు ఒకటి రెండుసార్లు -"
    "ఆగిపోయావేం?"
    "నువ్వు బాధపడతావని..."
    "నీ గాథ అంతా విన్నాక, నా బాధకాదు ముఖ్యం. చెప్పు"
    "నిన్ను మరిచిపోలేదనీ ఆమె ఆరోపించింది."
    "అది నిజమే నంటావుగా?"
    "అవును - నీతో, అది నిజం"
    "ఏం చేస్తావు గోపాలం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS