"నా అభిప్రాయం ముందే చెప్పాను కదక్కా! నాకు ఇష్టంలేదు."
"గోపాల్ అంటే ఇష్టంలేదా?"
"బావ అంటే ఇష్టమే కాని మళ్ళీ చిన్న జీతగాణ్ణి చేసుకుని జీవితాంతం బాధపడటం ఇష్టం లేదు."
"కాని గోపాల్ మంచివాడు, నిన్ను బాగా చూసు కుంటాడు."
"డబ్బున్నంతలో ఇంకో వ్యక్తి నన్ను బాగా చూసు కోడని ఎక్కడ ఉంది? డబ్బు లేనివాళ్ళంతా మంచి వాళ్ళు, ఉన్నవాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు" అంది భగవతి.
చెల్లెలి వాదానికి జవాబు చెప్పలేకపోయింది చారుమతి. మంచో, చెడ్డో తన అభిప్రాయాలని పైకి చెప్పడానికి వెనకతీయదు భగవతి.
తరవాత అక్కచెల్లెళ్ళిద్దరూ ఏం మాట్లాడుకో లేదు. మౌనంగా వెళ్ళి దైవదర్శనం చేసుకుని తిరిగి వచ్చారు.
మరునాడు చారుమతి మాలతిని పిలిచి అడిగింది, పెళ్ళిని గురించి ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని.
"గోపాల్ నిన్ను పెళ్ళిచేసుకోడానికి ఇష్టం చూపు తున్నాడు. శారదత్తయ్య నిన్ను కోడలిగా చేసుకుంటానంది. నీ అభిప్రాయం ఏమిటి?"
అక్క ఇలా సూటిగా, హఠాత్తుగా తన పెళ్ళి విషయం చెప్పేసరికి మాలతి సిగ్గుపడింది; తికమక పడింది.
"నా ఇష్టానికేం, అక్కా! భగవతికి అతనంటే చాలా ఇష్టం. కూడా కూడా తిరుగుతుంది. భగవతికి అతనితో పెళ్ళిచేస్తే బాగుంటుందేమో!" అంది మాలతి.
"కాని భగవతి గోపాల్ ని చేసుకోడానికి ఇష్టపడదు."
"నువ్వు అడిగావా?" అంది మాలతి ఆశ్చర్యపోతూ.
"ఆఁ, అడిగాను."
"అయితే అతన్ని చేసుకోడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒక్కటే సవరణ. నీ పెళ్ళి తరవాతే నా పెళ్ళి" అంది మాలతి.
"నా పెళ్ళిదాకా ఆగడ మెందుకు? నాకోసం ఆగే వంటే నీకు పెళ్ళికాకుండానే ముసలిదానివైపోయే భయం ఉంది. ఎవరికి కుదిరితే వాళ్ళు పెళ్ళి చేసేసు కోవడమే మంచిది" అంది చారుమతి, మాలతి భుజం మీద ప్రేమగా చెయ్యి వేసి.
"అయితే నేను పెళ్ళే చేసుకోను" అంది మాలతి బింకంగా.
"అలా అంటే ఎలా, మాలతీ" అంది చారుమతి నవ్వుతూ.
"అది అంతే! ముందు అక్క పెళ్ళి, తరవాత చెల్లెలు పెళ్ళి" అంది మాలతి.
మాలతి నిశ్చయం తెలుసుకున్న భానుమతి చాలా సంతోషించింది.
' తరవాత మాలతిని గోపాల్ పెళ్ళిచేసుకోవడానికి ఇష్టపడటం, శారదమ్మ అంగీకారం చూపడం అన్నీ చారుమతి తల్లితో చెప్పింది. కూతురికి ఇంత సుళువుగా పెళ్ళి సంబంధం కుదిరినందుకు, గోపాల్ వంటి సద్గుణ వంతుడు అల్లుడవుతున్నందుకు సంతోషంతో పొంగిపోయింది శాంతమ్మ.
27
"పద్మా" అంటూ ఏడాది పిల్లవాణ్ణి చంకనెత్తుకుని ప్రవేశించిన శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయింది పద్మ.
"ఏమి టలా చూస్తున్నావు కొత్త దానిలా? నేనే, శ్రీదేవిని" అంటూ దగ్గిరికి వచ్చి, "ఇదిగోరా మీ అత్త" అంటూ పిల్లవాడిని పద్మ చేతికి అందించింది శ్రీదేవి. బొద్దుగా ముద్దు వస్తూ ఉన్నాడు బాబు. వాడు పద్మని చూడగానే మధురంగా నవ్వాడు. పద్మ ప్రేమగా దగ్గిరికి తీసుకుని రెండుబుగ్గల మీద ముద్దులు పెట్టుకుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన వరలక్ష్మి ఇన్నాళ్ళకి కూతురి పెదవుల మీద నవ్వు చూసి, ఒక్కసారి నిట్టూర్చింది.
"ఎప్పుడు వచ్చావమ్మా, శ్రీదేవీ? నిలుచునే ఉన్నావు, కూర్చో" అంటూ కుర్చీ చూపింది ఆవిడ.
"ఎక్కడండీ, పద్మ నన్ను మరిచిపోయినట్టుంది. లోపలికి రమ్మనలేదు, కూర్చోమనలేదు" అంది సన్నగా నవ్వుతూ, కుర్చీమీద కూర్చుంటూ శ్రీదేవి.
"అదేమిటోనమ్మా, ఇలా స్తబ్దుగా తయారయింది. జడ వేసుకోడానికి, చీర మార్చుకోడానికి కూడా నేను పోరవలిసివస్తూంది" అంది వరలక్ష్మి బాధపడుతూ.
శ్రీదేవి కూడా ఆ మాటలు విని బాధపడింది.
"ఎప్పుడు వచ్చావు? మీవారు వచ్చారా?" అంది వరలక్ష్మి ప్రసంగం మారుస్తూ.
"ఈ రోజు ఉదయమే వచ్చాను. సంక్రాంతి పండగ ఇంకా పది రోజులు ఉంది కదా! మావారికి ఇన్నాళ్ళు సెలవు దొరకదు.పండగ ముందురోజు వస్తారు."
పద్మ పిల్లవాణ్ణి ఆడిస్తూ, ఒక పక్కనుంచి వీళ్ళ మాటలు వింటూ కూర్చుంది.
"పిన్నిగారూ, రాత్రికి వంట చేసేశారా?" అంది శ్రీదేవి.
"లేదమ్మా. ఇప్పుడే మొదలుపెడదాం అనుకుంటున్నాను."
"అయితే గుప్పెడు బియ్యం ఎక్కువ పొయ్యండి. నేను ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతాను. బాబుకి పాలు సీసాలో తెచ్చాను. అవి వాడికి పట్టేస్తాను."
"బాబుకి పాలు నువ్వు ఇంటిదగ్గిర నించి తెచ్చుకోవాలిటమ్మా! ఆమాత్రం మా ఇంట్లో తీసుకోకూడదా?" అంది నొచ్చుకుంటూ వరలక్ష్మి.

"మీ ఇంట్లో తీసుకోడానికి నాకేం అభ్యంతరం లేదు. తీరా రాత్రి ఇక్కడ పాలు దొరుకుతాయో లేదో అని తెచ్చాను. మీరు వేరే భావించకండి" అంది శ్రీదేవి సర్దిచెపుతూ.
వరలక్ష్మి వంటింట్లోకి వెళుతూంటే, బయట నించి నారాయణరావుగారు వచ్చారు, శ్రీదేవి లేచి నమస్కరించింది. శ్రీదేవిని పలకరించి, పద్మ చేతిలో ఉన్న బాబుని తీసుకున్నారు నారాయణరావుగారు. వాడు కొత్తమనిషిని చూస్తే నవ్వుతాడు. వాడి చిలిపి నవ్వులు చూసి అందరూ తెగ సంబరపడతారు. బాబుని ఎత్తుకుని పైకి గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూ, "మీ బాబు బాగున్నాడమ్మా. ఏం పేరు?" అన్నారు సంతోషంగా నారాయణరావుగారు.
"బాబు పేరు అమర్ మావాడు బాగున్నాడని మీరొక్కరు మెచ్చుకున్నారండీ. అందరూ 'నల్లవాడు, నల్లవాడు' అంటారు" అంది శ్రీదేవి.
"శరీరం రంగులో ఏముందమ్మా! మనసుకి ఉంది రంగు. ఎర్రగా ఉన్నాడు అబ్బాయని మోసపోయి మా పద్మని ఇస్తే మా అల్లుడు ఏం చేశాడు? బంగారం లాంటి పిల్లని కర్కోటకుల చేతుల్లో పడేశాం. ఎలా అయిపోయిందో చూశావా?" ఆయన కళ్ళల్లో కోపం, వెంటనే దుఃఖం తొణికిసలాడాయి.
తండ్రి, కూతురు పిల్లవాడితో ఆడుకుంటూ ఉంటే శ్రీదేవి వంటింట్లోకి వెళ్ళింది, "పిన్నిగారూ, కూర ఇవ్వండి నేను తరుగుతాను" అంటూ.
"ఇంతోటి వంటకి నువ్వు సాయంకూడా ఎందుకమ్మా! వాకిట్లో పద్మ, నువ్వు కబుర్లు చెప్పుకోండి" అంది వరలక్ష్మి, బియ్యం గిన్నెలో పోసి కడుగుతూ.
"పద్మ బాబుతో ఆడుకుంటూంది. నేను మీ దగ్గిర కూర్చుందామని వచ్చాను" అంది శ్రీదేవి, పీట వాల్చుకుని కూర్చుంటూ.
శ్రీదేవి తనతో మాట్లాడాలని వచ్చిందని గ్రహించింది వరలక్ష్మి. గిన్నెలో నీళ్ళు పోసి, బంగాళాదుంపలు, కత్తిపీట ఇచ్చింది శ్రీదేవికి. బంగాళాదుంపలు చెక్కు తీసి, నీళ్ళలో కడిగి చిన్న చిన్న ముక్కలు తరుగుతూ కూర్చుంది శ్రీదేవి.
"పద్మ సంగతి ఏమిటి, పిన్నిగారూ? అంత ఆరోగ్య మైన మనిషి అలా పుల్లలా ఎలా అయిపోయింది? దేనికి బెంగ?" అంది శ్రీదేవి.
"బెంగకాక ఏముందమ్మా, కాపరం అలా అయ్యాక? దాన్ని తల్చుకుని వాళ్ళ నాన్నగారు, నేనుకూడా కుంగి పోతున్నాం" అంటూ వరలక్ష్మి ఒకటొకటిగా కూతురి కాపరాన్ని గురించిన సంగతులన్ని చెప్పింది.
"బలవంతపెట్టి, బ్రతిమాలగా ఈ సంగతులన్నీ చెప్పిందమ్మా. ఈ రెండేళ్ళూ ఒక్క ముక్క రాయలేదు మాకు. అన్ని తనే కడుపులో పెట్టుకుని కుమిలిపోయింది. ఎంత బాధపడిందో ఏమో అది మద్రాసు పేరు చెపితే వణికిపోతుంది. ఇంక అక్కడికి వెళ్ళనంటూంది." వరలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చెంగుతో తుడుచుకుంటూ కూర్చుంది ఆమె.
