"రండి, అక్కడిదాకా బండిలో వెడదాం" అంది.
"ఒద్దు, ఉదయపుగాలి వంటికి మంచిది. నడచే వెడతాను".
"మధ్యాహ్నం తొందరగా వచ్చేయండి, నా స్నేహితులను పరిచయం చేస్తాను."
"అమ్మ బాబోయ్! మీ కాలేజీ అమ్మాయిల తోనే!"
"ఏం, కాలేజీ అమ్మాయిలంటే పులి, సింహాలనుకుంటున్నారా?"
"లేదుగాని, భోజనానికి నాకోసం కాచుకోకండి"
శాము మాటలతో ఆమెకు ఉత్శాహ భంగమే అయినా, స్నేహితుల రాకను తలచుకొని, తేరుకుని, మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది.
రైలు కిటికీల్లో స్న్హితుల మొహాలు కనబడగానే ఉత్సాహంతో చెయ్యూపింది. రాజూ, చంపా, నర్మదా హలో" అన్నారు గట్టిగా.
రైలు ఆగగానే నర్మద కిందికి దూకింది.
"నింగా, వాళ్ళ సామాన్లు దించేసేయ్"
"మూడు చిన్న పెట్టెలున్నాయంతే."
నింగడు పెట్టెలు దించాడు. ఆ అమ్మాయిలు కట్టుకున్న పులి చారల చీరల్నీ, నెమలిపించంలా విప్పుకున్న శిరోజాలంకారాలనూ చూసి తెల్లబోతున్నాడతను.
"మీరా పెళ్ళయితే వొళ్ళొస్తుందంటారు గాని, నువ్వేమిటే అలా చిక్కిపోయావు?" రాజు అడిగింది.
కాకపోతే నీలా ఊరిపొమ్మన్నావా? గుర్తుపట్టలేకపోయాను తెలుసా? రోజు రోజుకు బెలూనే అయిపోతున్నావు తల్లీ." అంటూ రాజును హాస్యం చేసింది మీర. చంప కిలకిలా నవ్వుతూ.
"మీరా మొన్ననో తమాషా జరిగిందే. రాజూ ఫోటో తీయించుకోవడానికో స్టూడియోకు వెళ్ళింది. ఆ ఫోటోగ్రాఫర్ రాజును చూసి అమ్మా మీకు ఒక్కమారు ఫోటోతియ్యలెం. కావాలంటే ఇన్ స్టాల్ మెంట్ సిస్టమ్ లో తీస్తాం' అన్నాడట. కదే నర్మదా?" అంది.
నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ బండి దగ్గరకొచ్చారు. వీళ్ళ రంగురంగుల చీరలను చూసి గిత్తలు బెదరిపోయాయి. పులిచారల చీర కట్టుకున్న చంపా వెనక్కి ఒక్క గంతేసి.
"ఎందుకే మీరా ఇలా బెదిరిపోతున్నాయ్ ఈ గిత్తలు?" అనడిగింది.
"నువ్విటు రావే చిట్టితల్లీ. నీ చీర చూసి పులి వచ్చిందనే అనుకుంటున్నాయివి."
"ఆఁ ఇక ఎక్కండి. రాజూ నువ్వు ఎక్కమ్మా ముందు. నువ్వు ఎక్కాకకూడా బండి సురక్షితంగా ఉంటే, ఉన్నా దాన్లో మాక్కూడా చోటుంటే ఎక్కుతాం మేం." అంది చంప.
రాజు మొహం ఎర్రబడింది. "మీరా ఇలాగే ఎక్కడం?" అనడిగింది.
"ఒక్క మారు గంతు వేసి కూర్చో." అని సలహా ఇచ్చింది మీర.
"అవేం మాటలు మీరా? నువ్వు మరీని. రాజు గంతు వేయగలదా పాపం. ఓ బల్ల తెప్పించుపోనీ."
"నింగా. స్టేషన్ మాస్టర్ నడిగి బల్ల పట్టకురారా."
నింగడు తెచ్చిన బల్ల సహాయంతో నలుగురూ బండి ఎక్కారు. నింగడు ముందువై పెక్కి నెమ్మదిగా బండి తోలసాగాడు.
ఇదే మా ఊరి రోల్స్ రాయ్స్."
"కుసుమ పాసయిందా?"
"మూడిట్లోనూ చెక్కేసింది. అయినా సెప్టెంబర్ ఉన్నంతవరాకూ భయం లేదనుకో."
"ఇప్పుడు కూడా మీరు ముగ్గురు కలిసే వెడుతున్నారు కదూ?"
"ఆఁ. నర్మద మమ్మల్ని వదిలించుకుని మెడికల్ కాలేజీకి పోదామనుకుంది. కాని సీటు రాలేదు. మీరా నువ్వు ప్రయత్నించి ఉంటే తప్పక సీటొ'చ్చేదేనే!"
అంత సంతోష సమయంలో కూడా ఆమాట వినగానే ఆమె మనసు చిన్నబోయింది.
"నాకా పుణ్యం లేదులేవే." అంది. ఆమె కంఠం రుద్ధమయింది. కళ్ళు చెమర్చాయి.
"మీరా, మన కన్నడం టీచర్ కు బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ అయింది."
"రాధ ఉత్తరం రాసిందా?"
"ఆఁ. అప్పుడే కిశోర్ కు తమ్ముడు పుట్టబోతున్నాడట."
బండి ఇంటిముందు ఆగింది. మీరా, నర్మదా, చంపా బండి దిగారు.
"రాజూ, నెమ్మదిగా దిగమ్మా నా చిట్టితల్లీ. భూమాతకు నొప్పి కలిగించకు." అంటూ రాజును హెచ్చరించింది చంప.
"ఓహ్! ఎలాంటి ప్రకృతి సౌందర్యం! కవి హృదయాన్ని పరవశింపచేసే పరిసరాలు. యు ఆర్ ఏ లక్కీ గర్ల్ మీరా!" అంది చంప.
మీరకేం చెప్పాలో తోచలేదు. జీవంలేని నవ్వు నవ్వి వూరుకుంది.
"రండర్రా, కాఫీ టిఫిన్ తీసుకుందురుగాని."
"ఉండు తల్లీ కాస్త చీరలు మార్చుకానీ," అందరూ మొహాలు కడుక్కుని, తెల్ల వాయిల్ చీరలు కట్టుకున్నారు.
ఇడ్లీ, వెన్న, కాఫీ పట్టించి ముగ్గురూ డ్రాయింగ్ రూముపైకి దాడి చేశారు,
"మీరా ఈ సోఫా సెట్టు చాలా బావుందేవ్? కాని ఈ పల్లెటూళ్ళో దాన్ని మెచ్చుకునేవాళ్ళు కూడా ఉండరనుకుంటానే."
మీర చిన్నగా నవ్వి "నే నొకత్తిని మెచ్చుకుంటే చాల్లే!" అంది.
"ఈ వూళ్ళో రేడియో, సినిమా .....
"ఇక్కడ కరెంటే లేదు. కనక ఆ వూసెత్తడానికే వీల్లేదు."
"మీరా చంప వేసుకున్న ముడి ఎలా ఉందే? నీకు నచ్చిందా?"
"చాలా బావుంది. నాక్కూడా నేర్పవే."
రెండు గంటలదాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు నలుగురూ.
శాము ఇంకా ఇంటికి రాలా.
"భోజనానికి లేవండి."
"మాకేం ఆకలిగా లేదులే. మీ శ్రీవారినీ రానీ."
ఏం చెప్పటానికి తోచక మీర మౌనం వహించింది. మూడు గంటలకు శాము ఇంటికి వచ్చాడు. మీర తన స్నేహితులను అతడికి పరిచయం చేసింది. శాము మౌనంగా చేతులు జోడించి బయటికి వెళ్ళిపోయాడు. మీర అప్రతిభురాలయింది. పరిచయం చేసిన వెంటనే అతడలా వెళ్ళిపోతాడని ఊహించలేదు, మీర.
"ఆయనింకా స్నానం చేయలేదు" అంది స్నేహితుల ప్రశ్నార్ధక దృష్టికి జవాబుగా. శాము స్నానంచేసి ఏదో పని ఉందంటూ అవధానిగారింటికి వెళ్ళిపోయాడు. మీర తన అసంతృప్తి నంతా లోపలే మింగుకుని స్నేహితులను భోజనానికి లేవదీసింది. భోజనాలయ్యాక మళ్ళీ కబుర్లలో పడ్డారు.
సాయంత్రం అయిదుగంటలయింది.
"లేవండర్రా కాస్త తలలు దువ్వుకుని అలా షికారెళ్ళొద్దాం."
"మీరా, నేను - వేసుకున్న రకం ముడి నీకు వెయ్యనా?"
"అలాగే వేద్దువుగాని, ఒసేవ్ రాజూ లే, లే" అంటూ నిద్రపోతున్న రాజును లేపింది మీర.
పప్పన్నం తిని మధ్యాహ్నాలు ఇలా నిద్రపోతే వళ్ళు రాక ఏమవుతుందేమిటి?" చంప వ్యాఖ్యానించింది.
రాజు మెదలకుండా నిద్రపోతోంది. చంప లేపి కాసిన్ని నీళ్ళు తెచ్చి రాజు చెవిలో పోసింది. రాజు బెదిరి లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది. అందరూ తలలు దువ్వుకునే ప్రయత్నంలో ఉండటాన్ని చూసి,
"ఓ అప్పుడే మీరంతా సిద్ధమవుతున్నారన్న మాట!" అంది.
చంప మీర జుత్తును నున్నగా దువ్వి, జుట్టు లోకి రింగు దూర్చి చక్కగా ముడివేసింది. మీర జుత్తు తక్కువే అయినా వెడల్పుగా ఉన్న ముడి 'ఎంత జుత్తు' అనిపించేలా ఉంది. నీలి డిసెంబరు పూల మాల ముడికి అందంగా అలంకరించి వెనక ఓ అద్దం పెట్టిముడి అందాన్ని మీరకు చూపింది చంప."
"నీకు గండపెండేరం తొడిగించాలి" అంటూ చంపను మెచ్చుకుంది మీర.
వాళ్ళందరి ముస్తాబూ పూర్తయ్యేసరికి ఆరయింది. ఇంటినుండి బయల్దేరారు. సీతాకోక చిలుకల్లా అలంకరించుకుని వెడుతున్న వీరిని ఇరుగూ పొరుగూ అందరూ వింతగా చూడసాగారు. మీర తన స్నేహితులను మొదట దేవాలయానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ పూజ చేయించి తీర్ధ ప్రసాదాలను పుచ్సుకుని బయల్దేరారు.
సూర్యుడి బంగారు కిరణాలు చెరువులోని నీటి మీద పడి మెరుస్తున్నాయి. బంగారు రేకులా మెరుస్తోంది నీరు. చెరువు దగ్గర గానుగచెట్టుకు కట్టిన ఉయ్యాలలో చిన్న పిల్లలు వూగుతున్నారు. హాయిగా ఉన్న ఆ వాతావరణంలో ఉయ్యాలలో వూగాలనిపించింది చంపకు.
"మీరా, మనం గూడా వూగుదామా?"
మీర ఉయ్యాలా దగ్గరకు వెళ్ళింది. చిన్న కుర్రాళ్ళు చెదరి తమ ఆట నిలిపారు. చింపిరి గుడ్డలు వేసుకున్న బలంగా ఉన్న ఓ కుర్రాడిని చూసి,
"వేణూ, మేము కాస్సేపు వూగుతామోయ్" అంది.
"ఓ అలాగే" అన్నాడు వేణు.
మీర తన చేతిలో ఉన్న అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలను ఆ కుర్రాడి చేతిలో పెట్టింది. మిగతా కుర్రాళ్ళంతా అతడి చుట్టూ మూగారు.
చంపా, నర్మదా ఉయ్యాలమీద కూర్చున్నారు. మీర కొంగు దోపుతూ "చంపా గట్టిగా పట్టుకో. నేను వేగంగానే వూపుతాను అంది. చంపా, నర్మదా వాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. మీర నెమ్మదిగా వూపటానికి మొదలెట్టి, రానురాను వేగం హెచ్చించి జోరుగా వూపటానికి మొదలెట్టింది. ఉయ్యాల ఓసారి అటువైపు కొమ్మ లకూ, మరోసారి ఇటువైపు కొమ్మలకూ తగిలి వూగసాగింది. చంప కొమ్మల్లోంచి ఆకులు తెంపి నవ్వుతూ మీర తలమీదికి విసురుతోంది. నర్మద ఆ వేగానికి భయపడి రెండు చేతుల్తోనూ తాళ్ళను గట్టిగా పట్టుకుంది.
"ఇక చాలా?" ముందుకు వచ్చి అడిగింది మీర.
"ఉహుఁ. చాలదు" అంది చంప.
"నాకు భయమేస్తోంది తల్లి. నేను వూగలేనిక." అంటూ దిగివచ్చింది నర్మద.
మీర చంప పక్కలో కూర్చుంది.
"నువ్వో రాజూ?" అనడిగింది చంప.
"నేన్రాను తల్లీ. నాకు భయం."
"నీకా భయం, ఈ కానుగచెట్టుకా?"
నర్మద నవ్వి "రాజు వద్దులెద్దూ. తరువాత చెట్ట్టు వేళ్ళతో సమేతంగా పడిపోతుందంతే" అంటూ ఉయ్యాల వూపసాగింది.
సూర్యుడు నెమ్మదిగా పశ్చిమాద్రిని చేరుకుంటున్నాడు. ఉయ్యాలలో వూగుతున్నవారి మనస్సు ఉల్లాసంతో గంతులేస్తోంది. చెరువులో నీళ్ళు నింపుకుంటున్న రైతు స్త్రీలు ఇంటికి వెళ్ళాలన్న విషయమే మరిచి వీరి ఆటలనే వింతగా చూస్తూ నిల్చున్నారు. చీకటిపడుతూ ఉండటాన్ని గమనించి మీర,
"నర్మదా ఇక ఆపవే. చీకటిపడిం దపుడే" అంది.
చంప మొహంలోని చెమట తుడుచుకుంటూ "నా ప్రింటెడ్ జార్జ్ ట్ చీర నలిగిపోయింది. ఇక్కడికి వచ్చేందుకు ముందే ఐరన్ చేశాను" అంది.
తలమీద రెండు, నడుం మీద రెండు బిందెలు పెట్టుకున్న నలుగురు ఆడవాళ్ళు వారి కెదురుగా వచ్చారు. తిమ్మమ్మ మీరను గుర్తించి "ఒసే మాదీ, ఆ నీలం కోక కట్టుకుంది మీరమ్మ కధే" అంది.
మీర దగ్గరకు రాగానే,
"ఏంటమ్మగోరూ, మీకూ ఉయ్యాలమీదికి మనసు పోయిందా?" అంది.
"ఊఁ. అనిపించదా మరి, వీళ్ళంతా మైసూరులో నాతోబాటు చదువుకున్నవారు" అంది. తిమ్మమ్మ అందర్నీ తీక్షణంగా చూసి,
"ఈల్లందరికీ పెళ్ళి అయిందా?" అనడిగింది.
తెల్లబోయింది మీర. చంప మొహం ఎర్రబడింది.
"లేదు."
నర్మద నవ్వి "పెళ్ళి సేసుకుంటే ఏం సుఖముంది చెప్పు? సంసారంలో సుఖముందని అనుభవమున్న నీలాంటి ముసలిది చెపితే మే మందరం తప్పకుండా పెళ్ళి చేసుకుంటాం." అంది.
తిమ్మమ్మ ఓ క్షణం మౌనం వహించింది. తరువాత, "అమ్మా, మేం పల్లెటూరోళ్ళం. మాకేం తెలుస్తాది. వండుకున్న కూడు ఎలా ఉన్నా, ఆకలి తీర్చుకోవటానికి తినక తప్పదు గదా? అలాగే సంసారంలో సుఖమున్నా, లేకపోయినా వొయిసొచ్చాక పెళ్ళి సేసుకోవాలి. అదే నాను సెప్పుతున్నది" అంది.
"తిమ్మమ్మా నీకు ఆడపిల్లలున్నారా?"
"లేకేం తల్లీ, ఇంటినిండా ఆడపిల్లలే."
"నా యీడు కూతురుందా?"
"ఉంది తల్లీ."
"ఆ పిల్లకూ పెళ్ళి చేశావా? ఎంతమంది పిల్లలు?"
"ఇద్దరు పిల్లలుండారు తల్లీ."
"సరే అయితే ఇప్పుడు నన్నూ, నీ కూతుర్నీ పోల్చి చూడు. మాలో ఎవరూ ఎక్కువ సంతోషంగా, హాయిగా ఉన్నారో, చెప్పు మరి?"
తిమ్మమ్మ తన కూతురు మాదమ్మను, నర్మదనూ పోల్చి చూసింది. మాదమ్మకు అపుడే సంసారంలో విసుగు పుట్టింది. పెద్దపిల్లకు ఇంకా సంవత్సరం నిండకమునుపే మళ్ళీ కడుపొచ్సింది. రెండో పిల్లకు పది నెల్లు నిండాయో లేదో అప్పుడే మళ్ళీ నెల తప్పింది. తల్లితో ఎన్నో మార్లు "నావల్లగాదీ కాపురం" అంటూ వాపోయేది. నర్మద మొహంలోని పసితనం, కాంతి, చైతన్యం మాదమ్మ మొహంలో లేనేలేదు. అప్పుడే ముసలితనం ఆమెలోని చైతన్యాన్నంతా హరింపచేసింది. పిల్లల్ని కనటంతోబాటు ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ పాడవుతుంది. ఎప్పుడూ ఏడ్చే పెద్ద పిల్లాడు, వడిలో మూలిగే రెండవ పిల్ల, కడుపులో కదిలే మూడవ బిడ్డ. నీటితో జర్జరితమయింది మాదమ్మ.
