"ఈ టెలిగ్రామేమిటో చూడు, సుధీ!' అంది లలితమ్మ వణుకుతున్న చేత్తో టెలిగ్రాం సుధీర చేతిలో పెట్టుతూ.
సుధీర ఆత్రంగా టెలిగ్రాం చదివి "రేపు అన్నయ్య వస్తున్నాట్టమ్మా!' అంది నవ్వుతూ.
"అంతేనా?' అంది లలితమ్మ ఏదో భారం తొలగిపోయినట్లు.
"అవును"
శేఖరం, లలితమ్మ దగ్గరా, సుధీర దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
అకస్మాత్తుగా సుందరం ఎందుకు వస్తున్నాడో అర్ధం కాక ఆలోచిస్తూ కూర్చుండి పోయింది సుధీర.
18
గేటు ముందు కారు ఆగటం , సుదీరా , భానుమూర్తి వరండాలోకి రావడం ఒక్కసారి జరిగాయి. డ్రైవర్ గేటు తెరిచి కారు లోపలికి రానిచ్చాడు. కారు పూలమొక్కల్ని దాటుకుని వరండా మెట్ల దగ్గర ఆగింది.
డ్రైవర్ తలుపు తీసి పక్కన నిల్చున్నాడు. సుందరం కార్లో నుండి దిగి తలెత్తి చూశాడు.
"అన్నయ్యా!"
"ఓ! సుధీ! బాగున్నావా?" అన్నాడు సుందరం చిన్నగా నవ్వి.
లలితమ్మ అప్పుడే లోపలి నుండి వరండా లోకి వచ్చి "వచ్చావా సుందరం! ఇంకా అక్కడే నిల్చున్నావెం? లోపలకు రా!" అంది.
భానుమూర్తి సుందరం వేపు చూస్తున్నాడు.
తెల్లని సూటు, నల్లని గాగుల్సూ సుందరాన్ని క్రొత్తగా, ప్రత్యేకంగా ఆకర్షణీయంగా చూపుతున్నాయి. ఇంతకు ముందు సుందరంలో లేని మార్పేదో ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అదేమిటో ఇదమిత్ద మని తేల్చుకోలేక పోతున్నాడు భానుమూర్తి.
'అలాగే నిల్చున్నావేం? రా అన్నయ్యా!" అంది వరండా మెట్లు దిగి సుందరం దగ్గరికి వస్తూ సుధీర.
"సుధీ!"
"ఏం?"
"ఏదీ? నీ చెయ్యిలా ఇవ్వు!" అన్నాడు కొద్దిగా చలిస్తున్న కంఠంతో.
వరండాలో నిల్చున్న భానుమూర్తి, లలితమ్మ సుధీరాలకు సుందరం నోట్లో నుండి వచ్చిన ఆ ఒక్క మాటా వజ్రాఘాతంగా అయింది. వివర్ణమైన ముఖాలతో చిత్రాకృతులమాడ్కి నిల్చుండి పోయారు కొన్ని క్షణాలు.
లలితమ్మ తేరుకుని కొడుకు దగ్గరకు పరుగెత్తి "సుందరం! ఏమిటి బాబూ, యిది!" అంది మెల్లగా రోదిస్తూ.
"ఏం లేదమ్మా! నువ్వేం గాబారా పడకు, ముందు లోపలకు పోదాం పద" అన్నాడు సుందరం స్వరంలో ఏలాంటి మార్పు రానివ్వకుండా.
"రా అన్నయ్యా!' అంటూ తన చేతిలోకి సుందరం చేతిని తీసుకుంది సుధీర.
అందరూ హాల్లోకి వెళ్ళారు.
"సుందరం! ఏమిటి, బాబు , యిది? నీ కళ్ళ కేమైంది?" పైట చెరుగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది లలితమ్మ.
సుందరం జవాబు చెప్పక అదోరకంగా నవ్వి ఊరుకున్నాడు.
"సుందరం!" విచలిత కంఠంతో పిలిచాడు భానుమూర్తి.
"ఎవరు? భానూ!"
"నేనే!"
"నువ్విక్కడున్నావా?"
"ఊ...."
"మీనాక్షి బావుందా?"
"మీనాక్షి కేం? బాగానే ఉంది! ముందు నీ సంగతి చెప్పు" అన్నాడు భానుమూర్తి బాధగా.
"నా విషయమా? ఏవుంది? మీకు తెలిసిందేగా? సుధీ, నేను ప్రంటుకు వెళ్తున్నట్లు చెప్పలేదా?"
"అమ్మకు తెలీదు." కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది సుధీర.
"పోన్లే! మంచిపనే చేశావు. అయితే ఏమాత్రమూ ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమ్మ సిద్దంగా లేకపోవడమే విచారకరం."
"భానూ, అసలేం జరిగింది? నువ్వన్నా చెప్పరాదూ?" జీరగొంతుతో అంది లలితమ్మ.
"ఏవుందత్తయ్యా! సుందరం యుద్దానికి వెళ్తున్నట్లు ఉత్తరం వ్రాశాడు. సుధీ ఆ విషయం నీకు చెప్పలేదు."
"ఎందుకు చెప్పలేదు?' సుధీర వేపు తిరిగి కోపంగా అడిగింది లలితమ్మ.
"చెప్పినంత మాత్రాన ఒరిగే లాభమూ, చెప్పానంత మాత్రాన కలిగే నష్టమూ ఏముంది? సుధీ మంచిపనే చేసింది. ఈ రోజువరకూ నువ్వు హాయిగా వున్నావమ్మా!" అన్నాడు సుందరం. ఎంత ప్రయత్నం చేసినా కంఠం లో మార్పు రానే వచ్చింది.
"యుద్దానికి పంపను నువ్వే కనిపించావా? దేశంలో యింకెవరూ లేరూ?" అంది ఏడుస్తూ లలితమ్మ.
లలితమ్మ అంతగా చదువుకోక పోయినా విషయం వివరించి చెప్తే అవగతం చేసుకోగల శక్తి ఉంది. ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకుంది. యుద్ధం అనివార్యమని ఆమెకూ గట్టి నమ్మకమే కలిగింది. కాని ఈరోజు యుద్దంలో కష్టమూ, నష్టమూ రెండు తనకే కలిగాయి. ముఖ్యంగా విచారంలో వివేకాన్ని కోల్పోవడం సహజం. అందులో మాతృ హృదయం . పైగా -- తన సర్వస్వాన్ని తన సంతానం కోసం ధారబోయగల త్యాగమూర్తి. కానీ-- తన సంతానాన్ని మటుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేని స్వార్ధపరురాలు. స్వార్ధమూ, త్యాగమూ యీ రెండిటి సమ్మేళనమే మాతృ హృదయం.
'అలా అనకమ్మా! ప్రతి తల్లీ నీలాగే బాధపడుతుంది. అప్పుడు దేశం ఏం కావాలి? దేశంకోసం ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నారు? సుధీ, ఈ విషయాలేవీ అమ్మకు చెప్పలేదా?" అన్నాడు నవ్వుతూ. హృదయంలో కలిగిన పులకింత గొంతులో ఉయ్యాల లూగింది. ముఖంలో అనిర్వచనీయమైన తేజస్సు అనడం తొణికిసలాడుతున్నాయి.
భానుమూర్తి ఆశ్చర్యంతో సుందరం వేపు చూస్తున్నాడు. ముందట సుందరానికి ఈ సుందరానికి అసలు పోలికలున్నాయా? ఎంతగా మారిపియాడు! ఆనాడు సుందరం లోనూ ప్రవహిస్తున్న అహంకారమూ, అజ్ఞానమూ ఏమైపోయాయి? ఇత స్వార్ధ త్యాగమూ, దేశ భక్తీ సుందరములో ఎలా కలిగాయి? ఇంత మార్పు జీవితంలో సంభవమా? కళ్ళతో చూస్తూ కూడా సంభవమా కాదా అని తర్కించుకోవడం అసమంజసం.
"కళ్ళేలా పోయాయి, సుందరం! ఏదీ నన్ను చూడనీ" అంది లలితమ్మ ధారగా కారుతున్న కన్నీటిని పైట చెరుగుతో ఒత్తుకుంటూ.
లలితమ్మ గొంతులో జీరా, మాటల్లో తడబాటూ సుందరం గ్రహించక పోలేదు. "నువ్వేడుస్తూన్నావు కదమ్మా! ప్చ్! అది నాకే మాత్రం ఇష్టం లేదు" అన్నాడు అయిష్టంగా ముఖం ప్రక్కకు త్రిప్పుకుని.
లలితమ్మ ఏం మాట్లాడకుండా పైట చెరుగులో ముఖం దాచుకుని మెల్లగా రోదించసాగింది.
"అత్తయ్య ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్దంగా లేదు, సుందరం!" అన్నాడు భానుమూర్తి అనునయంగా.
"అవును. ఆ మాత్రం అర్ధం కాకపోలేదు. కానీ యిది కన్నీరు పెట్టుకోవలసిన సమయం కాదు. అయినా నేను బ్రతికే వున్నాను కదా?"
"అలా మాట్లాడకన్నయ్యా!" అంది సుధీర నిస్తబ్ధతలో నుండి తేరుకుని.
"అవును. నువ్వు బ్రతికే వున్నావు, సుందరం! భగవంతుడు నామీద అంతగా దయ చూపాడు. అందుకు సంతోషిస్తున్నాను." అంది లలితమ్మ దోసిట్లో నుండి తలెత్తి.
సుందరం అదోరకంగా నవ్వాడు.
లలితమ్మ ఇక అక్కడ కూర్చోలేక గదిలోకి వెళ్ళిపోయింది.
"కానీ.... నువ్వు చాలా మారిపోయావు సుందరం!" అన్నాడు భానుమూర్తి సోఫాలో వెనక్కు వాలి.
"మారానా?" సుందరం పెద్దగా నవ్వి అన్నాడు.
"బాగా!"
"అవును యుద్ధం మార్చింది!"
"యుద్ధం మార్చిండా?' సుదీర కాస్త ఆశ్చర్యంగానే ప్రశ్నించింది.
"అవును, సుధీ! మనిషిలో వున్న మంచి గుణాలన్నీ యుద్దమప్పుడే బయటపడతాయి. విపరీతంగా పేరుకు పోయిన మానవ హృదయాల్లోని స్వార్ధాన్ని, యుద్దమే క్షాళనం చేస్తుంది." అన్నాడు సుధీర వేపు తిరిగి.
నల్లని గాగుల్సు లో నుండి సుందరం కళ్ళను చూడ ప్రయత్నిస్తున్నాడు భానుమూర్తి.
"ఏదో ఆలోచనలో పద్దట్లున్నావే , భానూ?"
"నువ్వు చెప్పిన మాట యెంత వరకూ నిజమా అని?"
"నూటికి నూరు పాళ్ళు!"
"కాదు. శాంతి దేవత చల్లని చూపును దూరం చేసే యుద్ధం నాకిష్టం లేదు. మానవునికి మనసున్నంత వరకూ మంచితనం ఉండనే ఉంటుంది. యుద్ధం వల్లనే మంచి గుణాలు బయట పడతాయని ఏ రోజూ అనుకోకు."
"నీకు తెలియనిదేముంది? చీనావాళ్ళు మనదేశంలో అడుగు పెట్టక పూర్వం దేశంలో ఎన్ని కలతలున్నాయి! ఈరోజవన్నీ ఏమయ్యాయి? ప్రతి చిన్న విషయానికీ గిల్లికజ్జాలు పెట్టుకునే వాళ్ళు ఈరోజు ఒకటై చేతులు కలిపారంటే అది యుద్ద ప్రభావం కాదంటావా?"
"కావచ్చు. అది దేశ సమస్య. చావు సమీపంలో వున్నప్పుడు ఎంత త్యాగం చేసేందుకైనా మానవుడు సిద్దంగా ఉంటాడు."
"ఇన్నీ కలతలూ, మనస్పర్ధలూ వున్నా ఒకటై చీనా వాణ్ణి ఎదిరించే సరికి ఆశ్చర్యంతో మూర్చపోయి వెనక్కు వెళ్ళాడు!"
"ఇంతకూ నీ విషయం చెప్పావు కాదు."
సుందరం ఓ క్షణం మౌనంగా ఉండి జేబులో నుండి సిగార్ కేసు తీసి అగ్గిపెట్టె కోసం జేబులన్నీ వెతక సాగాడు.
సుధీర లోపలికి వెళ్ళి అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చింది.
"ఎన్ని మంచి లక్షణాలు అలవడినా ఈ దురలవాటును మటుకు వదులుకోలేకున్నాను." అన్నాడు సుందరం గాడంగా విశ్వసించి.
దానికేవ్వరూ జవాబు చెప్పలేదు.
"నీకేం అభ్యంతరం లేదు కదూ?" అగ్గిపుల్ల గీస్తూ అడిగాడు.
"లేదన్నయ్యా!"
సుందరం సిగరెట్టు వెలిగించి పొగ వదులుతూ కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"చెప్పన్నయ్యా!"
"చైనా వాళ్ళ మోసం, కుట్ర, దౌర్జన్యం, దుర్మార్గం - యివన్నీ మీరు పేపర్లో చదివే ఉంటారు." అన్నాడు సిగార్ పొగ దట్టంగా వదిలి.
"ఊ...."
"నేను ప్రంటు కెళ్ళినట్లు తెలుసుగా?"
"అంతవరకూ తెలుసు."
