"డాక్టరుగారు.....డాక్టరుగారు......" అన్నాడతను.
"ఆవిడ నిద్రపోతున్నారు.....ఏం కావాలి మీకు......ఏదన్నా సీరియస్ కేసా? లేకపోతే సాయంత్రం నాలుగుగంటలన్నా ఆస్పత్రికి వెడతారు.....అక్కడ కలవండి" రోజూ వల్లించే మాటలు అప్పచెపుతూ అంది సుజాత.
"కేసుకాదు.....పేషంటు గురించికాదు. ఆమెతో చిన్న పనివుంది. హాస్పిటల్ లో అయితే ఆమెకి మాట్లాడడానికి తీరిక వుండదని యింటికి వచ్చాను...." అన్నాడతను వినయంగా.
సన్నంగా, పొడవుగా, పొడవుకి తగ్గ లావు లేకుండా బక్కపలచగా వున్నాడు. ఉండడానికి పాతిక సంవత్సరాలు దాటినా స్కూలు కుర్రాడి మొహంలో మాదిరి పసితనం, అమాయకత్వం కనిపించాయి సుజాతకి. తొడుక్కున్న బట్టలు సాధారణమయినవే అయినా నీట్ గా వున్నాయి. అతనివంకే చూస్తూ "ఆమె నిద్రపోతున్నారు.....తగినంత పని లేనిదే నిద్ర లేపితే విసుక్కుంటారు......మరో అరగంటపోయాక రండి, అప్పటికి నిద్రలేస్తారు" అంది. అతను కాసేపు ఆలోచించి "ఆమె లేచేవరకు ఇక్కడ కూర్చుంటే మీ కేమన్నా అభ్యంతరమా? మళ్ళీ యీ ఎండలో వెళ్ళిరావడం...." అంటూ సుజాత వంక చూశాడు.
కాస్తో కూస్తో చదువు, సంస్కారం కలిగినట్టే వున్న అతన్ని కాదు అని నిష్కర్షగా చెప్పలేకపోయింది సుజాత. ఒక్క నిమిషం ఆలోచించి "సరే.....కూర్చోండి, ఆవిడ లేచాక చెపుతాను" అంటూ అతన్ని ముందు వరండాలో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళబోయింది.
"ఎక్స్ క్యూజ్ మీ.....కొంచెం మంచినీళ్ళిస్తారా!" ఓ విధంగా మొహమాట పడుతూ అడిగాడు అతను. సుజాత అందించిన గ్లాసు అందుకుని గటగట త్రాగి మిగిలిన నీళ్ళతో మొహం కడుక్కొని రుమాలుతో మొహం తుడుచుకొన్నాడు. తిరిగి గ్లాసు అందిస్తూ, "మీరు.....మీరు డాక్టరుగారికి....డాక్టరుగారు మీ సిస్టరా.....!" అన్నాడు కుతూహలంగా చూస్తూ.
సుజాత అతనివంక ఒక్క క్షణం చూసి, "నే నిక్కడ హౌస్ కీపర్ గా వుంటున్నాడు....." అంది. అతను అర్ధంకానట్టు ఆశ్చర్యంగా చూశాడు.
కల్యాణి లేచి కాఫీ త్రాగుతూండగా సుజాత అతని గురించి చెప్పింది. "ఎవరు? ఏం కావాలంటాడు! అడగలేకపోయావా?"
"ఏమిటో మీతో పని వుందన్నాడు.....నేను తఃరిచి అడగలేదు" అంది సుజాత.
కల్యాణి క్రిందికి వచ్చి డ్రాయింగు రూం లో కూర్చుని అతన్ని పిలిచింది. అతను వచ్చి వినయంగా నమస్కరించాడు. కల్యాణి ప్రశ్నార్ధకంగా చూసింది.
"నేను.....నన్ను.....రామకృష్ణ అంటారు. మీ దగ్గిర యేదన్నా అసిస్టెంట్ పనికి పెట్టుకుంటారేమోనని...."
కల్యాణి ఆశ్చర్యంగా చూసింది. "అసిస్టెంటా.....!"
"నేను ఎమ్.బి.బి.యస్. ప్యాసయ్యాను. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాణు. ఏదీ దొరకలేదు. ప్రయివేటు ప్రాక్టీసు పెట్టుకో డానికి తగినంత ఆర్ధిక స్తోమతు లేదు. అంచేత యే డాక్టరన్నా అసిస్టెంటుగా పెట్టుకుంటారేమోనని.....మీ రీ వూళ్ళో చాలా బిజీ డాక్టరని విన్నాను. మీకు అసిస్టెంటు అవసరం వుంటుందేమోనని......ఇవిగో నా డిగ్రీలు, సర్టిఫికెట్లు" గుక్క తిప్పుకోకుండా, ఆరాటంగా వచ్చిన పని నాన్చకుండా చెప్పేశాడు.
అమాయకంగా, చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న అతను డాక్టరని వినగానే సుజాత ఆశ్చర్యపోయింది. కల్యాణి కూడా అతన్ని ఆపాదమస్తకం పరీక్షించింది. ఆశ్చర్యంగా, అప్రయత్నంగానే అతనందిస్తున్న కాగితాలు అందుకుని విప్పి చూసింది. ఆ కాగితాలన్నీ తిరగేసింది. చాలా బిలియంట్ స్టూడెంటని ఆ కాగితాల ద్వారా గ్రహించింది. "ఐనా......కానీ, నాకు అసిస్టెంట్ అవసరంలేదే......అందులో మగ డాక్టరు....నా పేషంట్స్ అందరూ ఆడవాళ్ళు. మీరు నాకేం ఉపయోగపడతారు" అంది కల్యాణి.
అతని మొహం వాడిపోయింది. వాడిపోయిన అతని మొహం చూస్తుంటే సుజాతకి జాలి కలిగింది. అసలు అతను డాక్టరు అనగానే సుజాతకి అతనిమీద సదభిప్రాయం కలిగింది. డాక్టరు చదివినా సింపుల్ గా, ఏ భేషజం లేకుండా వున్న అతన్ని చూస్తుంటే పాపం డబ్బున్నవాళ్ళు కాదు గాబోలు. ఏదో కష్టపడి డాక్టరు చదివినా ఉద్యోగం దొరకలేదు గాబోలు.....తను ఉద్యోగం కోసం పడిన అవస్థలు గుర్తువచ్చి అతనివంక సానుభూతిగా చూసింది సుజాత. కల్యాణి అతని కాగితాల వంక, అతనివంక చూస్తూ ఎంత బ్రిలియంట్ స్టూడెంటు అయితేమాత్రం యేం, గవర్నమెంటు ఉద్యోగాలు దొరకడం సుళువుగాదు, ప్రయివేటు ప్రాక్టీసు పెట్టుకోడానికి డబ్బు లేదంటున్నాడు పాపం' అనుకుంది.
అతను ప్రాధేయపూర్వకంగా కల్యాణి వంక చూస్తూ "మీ రన్న మాట నిజమే అనుకోండి, కాని మీరు చాలా బికీ డాక్టరు మీకు ఆపరేషన్స్ అసిస్ట్ చేయడనికి, రొటీను కేసులు, పిల్లల కేసులు అవి చూడడానికి ఉపయోగపడగలను. రాత్రిళ్ళు డెలివరీ కేసులు అవి నర్స్ సహాయంతో అటెండ్ అవగలను. ట్రైచేసి చూడండి. ప్లీజ్, ఉద్యోగం నాకు చాలా అవసరం. మాది చాలా బీద సంసారం. చాలా కష్టపడి మా నాన్నగారు డాక్టరు చెప్పించారు. కాని ఉద్యోగం లేదు. నా ఉద్యోగంమీద యెన్నో ఆశలు పెట్టుకొన్న నాన్నగారిని సంతృప్తి పరచడానికన్నా ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేయడానికి సిద్దపడుతున్నాను. ఏదో యింకో ఉద్యోగం దొరికేవరకు యీ హెల్ప్ మీరు చేస్తే మీ మేలు మరవలేను" అన్నాడు.
"అవును, ఆంటీ.....మీరీ మధ్య మరీ అలిసిపోతున్నారు. మీకు సహాయంగా పెట్టుకుంటే బాగుంటుంది" అప్రయత్నంగా అనేసింది సుజాత. అన్నాక, తనంతగా చొరవ తీసుకున్నందుకు నాలిక కొరుక్కుంది సుజాత. కల్యాణి సుజాత వంక చూసింది. సుజాత అతనివంక చాలా జాలిగా, దయగా చూస్తూంది. ఆమె కళ్ళల్లో మెరుపు, అతనిపట్ల ప్రశంస కనిపించింది. సుజాత ఇచ్చిన సూచనలో తనమీద, తన అలసటమీదకంటే ఆ వ్యక్తి దైన్యతపట్ల సుజాత దృష్టిపోయిందని కల్యాణి గ్రహించి నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమెకో ఆలోచన వచ్చింది. ఆమె పెదాలమీద చిన్న నవ్వు మెరిసింది. అతని వూరు, పేరు, కులం, కుటుంబం, మంచి, చెడూ అన్నీ వివరంగా అడిగింది. అతను అన్నింటికీ వినయంగా సమాధానాలు చెప్పాడు. అన్నీ విని సంతృప్తిగా తలాడించిందికల్యాణి. "కానీ.....కానీ......నేను ప్రైవేటు ప్రాక్టీషనర్ ని. ఇస్తే రెండొందలు, రెండొందల యేభై యీయగలను. అంతకంటే ఈయలేను గదా, అంత తక్కువకి మీరు పని చెయ్యగలరా?" సందేహిస్తూ అడిగింది కల్యాణి.
