Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 30


    అతను ఆ మాటకే సంతోషపడుతూ చిన్నపిల్లాడిలా తల ఊపుతూ "ఎట్ ప్రెజంట్ దటీజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకో ఉద్యోగం ఏదన్నా దొరికే వరకు వూరికే కూర్చోకుండా, ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేయాలనుకున్నాను. అంచేత ఆ మాత్రంతో ప్రస్తుతము సరిపెట్టుకొంటాను" అన్నాడు ఆత్రుతగా.
    కళ్యాణి కొంచెంసేపు ఆలోచించింది "మరి మీరు వుండడం ఎక్కడ? మీ వాళ్ళెవరైనా వున్నారా ఇక్కడ? భోజనం విషయం అదీ ఏం చేస్తారు?"
    "ఇక్కడ నాకెవరూ తెల్సినవాళ్ళులేరు. ఏదన్నా రూము తీసుకోవాలి. అంతవరకు మీ కభ్యంతరం లేకపోతే మీ నర్సింగ్ హోమ్ లోనే పడుకుంటుంటాను. భోజనం ఎక్కడో చేస్తూంటానులెండి."
    తనిచ్చే రెండొందలతో గది అద్దె, భోజనం అన్నీపోతే ఇంక అతనికి మిగిలేదేముంది! మరీ బొత్తిగా ఏ గుమస్తాకో ఇచ్చినట్టు అంతతక్కువ జీతం - ఓ డాక్టరుకి యీయడానికి కళ్యాణికే కనిపించింది. కాని.....తను ఎంత సంపాదిస్తున్నా తన తలకు మించినఖర్చులున్నాయి. మరో రెండొందలు ఇస్తే బాగానే వుంటుంది గానీ తను తూగలేదు. అంతకంటే పోనీ, ఇంట్లో కారు షెడ్ మీద రూము ఖాళీగానే వుంటుంది. ఆ రూములో వుండమంటే కనీసం రూము అద్దె ఇచ్చుకోనక్కరలేదు. అలాగే ఇంట్లోనే భోజనం పెడితే రెండొందలు ఇవ్వడం బాగుంటుంది. ఏ హోటల్లోనో భోజనం చెయ్యడంకంటే అతనికి రూమునిచ్చి ఇంట్లో వుంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పలుకుతాడు. కేసులుమీద ఎటెండ్ అవుతాడు. అసలు రంగారావు ఆస్పత్రికి రావడం మానేసిన దగ్గరనించి ఒక్కర్తీ అన్నీ చూసుకోలేక చాలా ఇబ్బంది పడ్తోంది తను. ఆపరేషన్స్ అసిస్ట్ చేయడానికి ఎవరినన్నా పై డాక్టరుని పిలుస్తూంది. రాత్రిళ్ళు ఆపరేషన్ కేసులు కాంప్లికేటెడ్ అయితే ఆడది తను అర్దరాత్రి, ఆపరాత్రీ నర్సింగ్ హోమ్ కు పరుగెత్తాల్సి వస్తూంది. నర్సులు వున్నా కాంప్లికేటెడ్ కేసులు వాళ్ళేంచూడగలరు? అలాంటప్పుడు అసిస్టెంట్ వుంటే ఆ గొడవంతా అతనికి అప్పచెప్పవచ్చు. ఇంటా బయటా పనులన్నీ తనే చూసుకోడం చాలా ఇబ్బందిగా వుంది. మందులు అవీ కావల్సినవి కొనుక్కోడం దగ్గిరనించి, కారు టాక్సు కట్టుకోడంవరకు ఏది చెయ్యాలన్నా తనే పరిగెట్టాల్సి వస్తూంది. ఈ పనులన్నీ చేత్శూ తనకి చేదోడు వాదోడుగా వుంటాడు. కుర్రాడు చూస్తే బుద్ధిమంతుడిలా, నెమ్మదైనవాడిలా వున్నాడు. నర్సులు ఇద్దరు, ఇతనూవుంటే చాలావరకు ఊపిరి పీల్చుకోడానికి అవుతుంది. కళ్యాణి బాగా ఆలోచించి అతన్ని కూర్చోమని సుజాతని లోపలికి పిల్చింది. తననుకొన్న సంగతి చెప్పింది కళ్యాణి. వెంటనే ఏ మాత్రం సందేహించకుండా తన సమ్మతి తెల్పింది సుజాత.....!"వుండనీయండి, అతని కోసం నే నేం ప్రత్యేకం చెయ్యాలి, మనతోపాటు వుంటాడు. మనం తిన్నది అతనూ తింటాడు. అతను మంచివాడిలావున్నాడు. వేరే వుండడం అంటే ఇబ్బంది అవుతుంది అతనికి. ఇక్కడే వుండమనండి" అంది. కల్యాణి సుజాత మొహంలోకి చూస్తూ తనకి తట్టిన ఆలోచన నెరవేరడానికి ఇది నాందిగా భావించి ఒక సమస్యకి పరిష్కారం దొరకబోతున్నట్టు సంతోషించింది. కళ్యాణి ఆలోచనలు అప్పుడే చాలాదూరం వెళ్ళిపోయాయి ఒక్కక్షణంలోనే.
    "సరే అతనితో చెప్తాను. అతనికేం కావాలో మరి నీవే చూస్తూండాలి!" అంది. కళ్యాణి ఎంతో ఉదారంగా గదిలో వుండమనడం, భోజనం యింట్లోనే చేయమనడంతో ఆమె ఆదరానికి రామకృష్ణ కృతజ్ఞతతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. కల్యాణికి అనేకవిధాల కృతజ్ఞతలు చెపుతూ పెట్టె బెడ్డింగ్ తెచ్చుకుంటానని వెళ్ళిపోయాడు.
    
                                            19
    
    రామకృష్ణ ఆ యింటికివచ్చి రెండు నెలలు దాటింది. రామకృష్ణ వచ్చాక కల్యాణికి చాలా సుఖంగా వుంది. ఇంచుమించు రోజంతా అతను నర్సింగ్ హోమ్ లోనే వుండి పేషంట్లందరిని చూసుకుంటూ వుండేవాడు. కళ్యాణి నర్సింగ్ హోమ్ కి వచ్చేసరికి సగం పని తగ్గించేవాడు. ఆ రోజు ఆపరేషన్స్ వుంటే ఆపరేషన్ థియేటరు రెడీచేసి ఆమెకి ఆపరేషన్ లో అసిస్ట్ చేయడం, మామూలు డెలివరీ కేసులు నర్స్ సహాయంతో ఎటెండ్ అవడం-ఒకటేమిటి, ఈపని ఆపని అనిలేకుండా కళ్యాణి చెప్పినవి. చెప్పనివీ అన్నీ మీదవేసుకుని చేసేవాడు. ఆఖరికి రెండు మూడు నెలలు గడిచేసరికి కల్యాణి కేవలం ఆపరేషన్స్ చేయడం, పేషంట్లని పరీక్షించడం మాత్రం చేసేది. కల్యాణి ఎగ్జామ్ చేసి నోట్స్ చెపుతుంటే రాసుకుని ట్రీట్ మెంట్ విషయం అంతా తనే చూసుకునేవాడు.
    ఇదివరకు ఇళ్ళకి వెళ్ళే టైము లేక కొన్ని కేసులు వదిలేసేది కళ్యాణి. టైములేక, ఒక్కర్తీ చూసుకోలేక కొన్ని ఆపరేషన్స్ టేకప్ చేసేది కాదు. రామకృష్ణ వచ్చాక సగం పనులు అతను చూడడంతో మరిన్ని ఆపరేషన్స్ చేయడానికి వీలయి ఆ రెండు నెలలలో రాబడి ఇంక బాగా పెరిగింది. అతని సమర్ధత, అతని నిజాయితీ, అతని కార్యదక్షత అన్నీ కల్యాణికి ఎంతో నచ్చాయి. రామకృష్ణని చూస్తుంటే తన స్వంత కొడుకు పెద్దయ్యాక తన దగ్గిర అప్రెంటీస్ గా చేస్తున్నట్టనిపించేది. అతని వినయవిధేయతలకు ముచ్చట వేసేది. అతనికి రోగుల తాలూకు రోగం, ట్రీట్ మెంటు తెలిసినా కల్యాణి చెప్పేవరకు నోరు విప్పేవాడు కాడు. కల్యాణి చెప్పింది విని 'ఎస్ మేడమ్' అనేవాడు. అతనికి అన్నీ తెలిసినా తనని సీనియర్ డాక్టరుగా గౌరవిస్తూ, తన దగ్గిర పనిచేస్తున్నందుకు చూపే భక్తిప్రపత్తులు కల్యాణికి చాలా నచ్చేవి. చాలా వృద్దిలోకి వస్తాడు. మంచి డాక్టరు అవుతాడు ఒక నాటికి. స్వంతంగా ప్రాక్టీసు పెట్టుకో గలిగే తాహతుంటే చాలా బాగా రాణిస్తాడు. డబ్బుండి ఏ విదేశాలో వెళ్ళి చదువుతే ఎంతో బ్రిలియంట్ డాక్టరుగా రాణించేవాడు అనుకునేది కల్యాణి. రెండు నెలల తర్వాత అతనివల్ల రాబడి పెరగడం చూసి అతని జీతం మూడువందలు చేసింది కళ్యాణి. రామకృష్ణ ఎంతో మొహమాటపడ్తూ వద్దనడం చూసి కల్యాణి బలవంత పెడుతూ చేతిలో పెట్టింది. "ఏమిటి రామకృష్ణా. ఇంత బిడియం. ఇంత మొహమాటం అయితే ఎలా బ్రతుకుతావు. కాస్త గడుసుతనం నేర్చుకోవాలి నువ్వు" అని మందలించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS