ఆ మాటకి బ్రహ్మానంద పడిపోయారు ఆయన "మా సుజాత అదృష్టం మీలాంటి యజమానులు దొరకడం....మీరు తల్చుకొంటే సుజాతకేం లోటు! మీ దయ, దాన్ని ఓ ఇంటిదాన్ని మీచేతుల మీదుగానే చెయ్యాలి" అన్నారాయన నమస్కారంచేసి వెళ్ళడానికి శెలవు తీసుకొంటూ.
"అలాగే....అలాగే, తప్పకుండా చూస్తాను. మీరు తొందరపడి యేదో ఒక సంబంధం చూసేయకండి" అంది కల్యాణి ఆయన్ను వీధి గుమ్మంవరకు సాగనమ్పుతూ.
"మీ నాన్నగారు నీకు పెళ్ళి చేస్తానంటున్నారు సుజాతా. అమ్మో నీవు పెళ్ళిచేసుకొని వెళ్ళిపోతే నా కెలాగ?" అంది నవ్వుతూ కల్యాణి. లోపల పనిచేసుకొంటున్న సుజాత దగ్గిరకి వెళ్ళి.
"తండ్రి, కల్యాణిల సంభాషణ వంటింట్లోంచి వింటూనే వుంది సుజాత. నిజం చెప్పాలంటే తండ్రి తీసుకొచ్చే యే గుమస్తానో కట్టుకొని అవస్థలు పడుతూ చేసే కాపురం కంటే యిలా పెళ్ళి లేక పోయినా హాయిగా బ్రతికే బ్రతుకు ఆమెకు చాలు! చూస్తూ చూస్తూ యే రెండువందల జీతగాడినో పెళ్ళాడలేదు అలా అని తండ్రి అన్నట్టు తమ తాహతుకి అంతకటే మంచి సంబంధం ఎలాగూ రాదు. అంచేత పెళ్ళి చేసుకోకూడదనే మనసులో నిర్ణయించుకొంది సుజాత. తన కీ ఉద్యోగం హాయిగావుంది. కల్యాణి లేదని యెప్పుడూ పొమ్మనదు! ఇంతకంటే తనకేం కావాలి! ఆ మాటలే పైకి అనేసింది.
కల్యాణి నవ్వింది. "నేనే మగవాడి నయివుంటే నీలాంటి పిల్లని రెండుచేతులూ పెనవేసి బంధించేదాన్ని. నిన్నే పెళ్ళాడేదాన్ని" అని కాలునప నవ్వి "పిచ్చిపిల్లా, ఎన్నాళ్ళు పెళ్ళి లేకుండా వుంటావు? జీవితాంతం నాదగ్గర పనిచేస్తూ ఇలాగే వుంటావేమిటి? నీకు నీ సంసారం, ఇల్లు, పిల్లలు కావాలనిపించలేదూ! ఇవాళ కాకపోయినా రేపయినా అనిపిస్తుంది."
"ఊహు....నాకేం అనిపించదు...... ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా పిల్లలు అనుకుంటున్నాను. ఇంకేం కావాలి నాకు."
"అవునవును, బలే దానివే. అలా అంటావు గానీ, రేప్పొద్దున ఎవరినో ప్రేమించావంటే ఈ మాటలన్నీ గాలిలో కలిసిపోతాయి." కళ్యాణి వేళాకోళం చేసింది. సుజాత అదోలా నవ్వింది.
"నన్ను.......నన్ను హ్కోసి ప్రేమించే వారెవరు? ఆ అదృష్టం నాలాంటి మధ్యతరగతి అమ్మాయికి వుండదు లెండి.....అదంతా డబ్బుండే అమ్మాయిలకే గాని, నాలాంటి అమ్మాయిలకి లేదు...." అంది సుజాత.
"నీకెందుకు, అలా చూస్తూండు .... నీకు మంచి పెళ్ళికొడుకుని కుదురుస్తాగా.....అయితే ఒక షరతు. పెళ్ళి అయినా నీ విక్కడనుంచి వెళ్ళిపోకుండా వుండేందుకు వప్పుకోవాలి ఆ మొగుడు. అంటే ఇల్లరికం వుండాలి. నీవు నా పెంపుడు కూతురివిగా....అంచేత ఇల్లరికపు టల్లుడి కోసం వెతుకుతాను." అంది హాస్యంగా కళ్యాణి. సుజాత ఆ మాటలకి సిగ్గుపడి తల దించుకుంది.
"అబద్దంకాదు, మీనాన్నగారు నీపెళ్ళిమాట ఎత్తిన దగ్గిరనుంచి ఇదే ఆలోచిస్తున్నాను. చూస్తాను. సీరియస్ గా పెళ్ళికొడుకులని వెతుకు తాను ఇంక!" అనుకుంటూ మేడమీదికి వెళ్ళింది కళ్యాణి.
18
ఆనంద్ రాసిన కవితలు, రచనలు తీరుబాటు దొరికినపుడల్లా తీసి చదవడం ఆరంభించింది సుజాత! ఒక్కొక్కటి చదువుతూంటే ఆనంద్ ప్రతిభ ఆశ్చర్యం కలిగించింది సుజాతకి. అతని కవి హృదయాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోయింది సుజాత. "సౌందర్యాన్వేషి" అన్న పేరుకి తగ్గట్టు అతని కవితలో ప్రతిపదంలో సౌందర్యంకోసం అన్వేషణ, సృష్టిలో ప్రతి కదలికలో అందాన్ని ఆరాధించి ఆస్వాదించాలనే తాపత్రయం అందాన్ని ఆరాధించాలనే భావుకత....ఆ కవి కంటికి ఎటు చూసినా, ఏం చూసినా ప్రతిదానిలో, ప్రతి కదలికలో సౌందర్యమే కన్పించేది గాబోలు! అతని కవితల్లో, రచనల్లో కల్యాణి ప్రతిరూపం ప్రతిపదంలోకన్పించింది సుజాతకి. అతని ప్రేమైక హృదయానికి, అందాన్ని ఆరాధించే అతని ఆరాధనకి ఆలంబన కల్యాణీ అన్నసంగతి వాళ్ళిద్దరిని తెల్సిన ఎవరన్నా గుర్తించగలరు. ఇంతటి ప్రేమను అందించే హృదయం కల వ్యక్తిని ఎవరు ప్రేమించకుండా వుండగలరు-అనుకుంది సుజాత! మరింతగా ఒకరినొకరు ప్రేమించుకున్న ఆ ఇద్దరూ పెళ్ళెందుకు చేసుకోలేదు. స్వయాన బావ, అందగాడు ఉద్యోగం హోదా అన్నీ వుండి తననంతగా ప్రేమించిన ఆనంద్ ని కాక రంగారావుని ఆమె ఎందుకు వివాహమాడినట్లు!! ఈ పెళ్ళి ఆమె కిష్టంలేకుండా జరిగిందా? జరిగితే ఎందుకలా జరిగింది?
అచ్చయిన ప్రతీ పుస్తకం కళ్యాణికే అంకితం, ఆ అంకితంలోనూ కవిత్వం, నూతనత్వం తొణికిసలాడుతూంది. "నా చీకటి జీవితంలో వెలుగురేఖ కళ్యాణికి" "ఆనందపు శిఖరాలమీద ఓలలాడించే నాహృదయేశ్వరికీ" "మధుర స్వప్నాలని అందించే నారాణికి" "నాజీవన వీణని శృతిచేసి పలికించే ప్రాణప్రియ కళ్యాణికి" "నా హృదయపు పూదోటలో వికసించిన ఏకైక కుసుమానికి"-ఎన్ని రకాల భావాలు! చదువుతూంటే సుజాతకి ఉత్తేజంతోపాటు ఈర్ష్యకూడా కలిగింది. ఇంతలా ప్రేమించడం అన్నది ఎంత అదృష్టం! సర్వం తఃనే అయినట్టు ఓ పురుషుడు భావించడం కంటే స్త్రీ కోరుకునేది ఏముంది! కళ్యాణి ఓవిధంగా ఎంత అదృష్టవంతురాలు! మరో విధంగా ఆమె అంత దురదృష్టవంతులూ వుండరేమో! ఇంత ప్రేమని స్వంతం చేసుకోలేకపోవడం దురదృష్టం కాక మరేమిటి?
పుస్తకాలు తిరగేస్తూ ఆలోచిస్తున్న సుజాత బయట కాలింగ్ బెల్ మ్రోతకి ఆలోచనలనించి తేరుకుని ఏకాగ్రత చెదిరినందుకు విసుక్కుంటూ లేచింది! ఇంకెవరు ఎవరో పేషంట్లే అయివుంటారు! మిట్టమధ్యాహ్నం ఒక గంటయినా ఆమెని హాయిగా పడుకోనీయరు!
తలుపు తెరిచి చూస్తే యెండలో చెమట ఆడుతూ నిల్చున్న ఓ యువకుడు కనిపించాడు. సుజాత తలుపు తెరిచి యేం కావాలన్నట్టు చూసింది.
