Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 29


                             గాలి దారాల దేవతా వస్త్రాలు
    
    20వ శతాబ్దానికి 78 ఏళ్ళు వచ్చేశాయి. అయినా
    ఆంద్రదేశం మాత్రం ఇప్పటికీ గత శతాబ్దపు అలవాట్లనుంచి
    ఆచారాల్నించి ఆలోచనల నుంచి తప్పించుకుని బయట
    పడలేదు.
    ఇతర దేశాలు వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెంది
    గ్రహాంతర్యానాలు చేస్తుంటే, మనం గ్రహచారాన్ని నిందించు
    కుంటూ కర్మసిద్దాంతాన్ని ఆరాధిస్తున్నాం. అంతా వాడి
    దయ మనచేతిలో ఏమీలేదు. అంతా విధివిలాసం. లలాట
    లిఖితం అనే నిరాశా వాదానికి అంకితమై పోయాం.
    
    ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశాన్ని 20వ శతాబ్దంలోకి ఈడ్చుకు రావడానికి గడిచిన పది సంవత్సరాలనుంచి తీవ్రప్రయత్నం చేస్తున్నవాడ్ని కాబట్టి.
    అప్పట్లో నా వయస్సు పాతిక సంవత్సరాలు ఏదో చెయ్యాలనే ఉబలాటం! ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తోచక పోవడం.
    ఏది చెయ్యడానికైనా డబ్బు ముఖ్యమన్న సంగతి అప్పటికి నాకు తెలీదు. క్రియాసిద్ధి స్వత్యే భవతి అని గట్టిగా నమ్మేవాడ్ని ఆ రోజుల్లోనే మా నాన్న మరణించాడు. నేను నిస్సహాయుడిగా ఒంటరిగా మిగిలిపోయాను. మా నాన్న బ్రతికున్నప్పుడు మమ్మల్ని పీడిస్తున్నట్లు నేను తెలుసుకోలేకపోయిన దరిద్రం ఇప్పుడు విశ్వరూపం ధరించింది. నా కాలేజీ చదువు డిగ్రీ సముపార్జనతో ముగిసే దాకా మా నాన్న చాలా సతమత మవుతుండేవాడని నాకు తెలుసు.
    ఒకనెల మరీ కష్టమై పోయినప్పుడు నేను చదువుకు స్వస్తి చెప్పి ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తానని మా నాన్నతో అనడం నాకు బాగా జ్ఞాపకం. తన బొందిలో జీవుడుండగా నా చదువు ఆగిపోనివ్వనన్నాడు మా నాన్న అలాగే సాధించుకుని వచ్చాడు.
    ఆయన మరణంతో నా జీవితంలో వొక అధ్యాయం ముగిసింది. మతాలన్నా కులాలన్నా కాలేజి రోజుల్లోనే నాలో అసహ్యభావం ఏర్పడింది. గోరాగారివి, యం.యన్. రాయ్ వి, త్రిపురనేని రామస్వామిచౌదరి గారివి రచనలు ఆవురావురుమని చదువుతూ వుండేవాడిని. నేను తీసుకున్న సైన్సు డిగ్రీకూడా నాలో పరిశీలనాశక్తిని పెంపొందించింది. ప్రశ్నించే శక్తికి దోహదమిచ్సింది. కాని నాకు తిండి పెట్టే శక్తి మాత్రం కష్టపడి సంపాదించిన ఆ డిగ్రీకి లేకపోయింది. విద్యాధిక నిరుద్యోగి పటాలంలో నేనూ వొక పాదచారినైనాను. ఏదో వొక ఉద్యోగం చెయ్యక తప్పని పరిస్థితి కాబట్టి వొక ఆచ్చాఫీసులో ఫ్రూఫ్ రీడర్ ఉద్యోగానికి కుదురుకున్నాను, నివసించడానికి చోటేదీ లేనందున ఆ ఆచ్చాఫీసులోనే ఓ మూల పడివుండే వాడ్ని.
    వొకపూట తిండి వుంటే, రెండో పూట తిండి లేకుండా వుంటూ కాలం గడిపేవాణ్ని ఆ ప్రెస్ ఆఫీసులో ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు అచ్చవుతూ వుండేవి. వాటిలో అన్ని తప్పులు దిద్దేసరికి నా తలప్రాణం తోకకు వచ్చేది. ఎందరెందరు దేవుళ్ళు, వొక్కొక్కరికి ఎన్నెన్నేసి పేర్లు ఎంత కష్టపడి దిద్దినా ఏవో అచ్చుతప్పులు మిగిలిపోయేవి. విచిత్రం ఏమిటంటే ఆ తప్పుల తడకలతోనే వ్రతాలు చేయించే వాళ్ళు నిత్యపారాయణం చేసేవాళ్ళు దేవతార్చనలు చేయించేవాళ్ళు, దేశమంతటా కోకొల్లలుగా నిండి ఎవరికీ వారు వచ్చి జన్మలో తమ స్వంత సౌఖ్యానికి రాచబాటలు పడిపోయినట్లు సంతృప్తిగా సంతోషించడం.
    ఆ రోజుల్లో నేను 20వ శతాబ్దం గురించి, యంత్ర నాగరికత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడ్ని నిజంగా నేను 20వ శతాబ్దంలో వున్నానా లేక ఇంకా పాత రాతి యుగంలోనే వుండిపోయానా అనిపించేది. మనవ విజ్ఞానం ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ ఉంటే నేను గాలి దారాలతో దేవతా వస్త్రాలు అల్లుతున్నానెమో ననిపించేది. ఏమిటి ఒకవేళ అదికూడా సాధ్యం కాకూడదా అనిపించేది.
    ఇది 1978. నేను చెపుతున్నది పది సం. క్రితం మాట. అప్పటి స్వప్నం ఇప్పుడు వాస్తవం కాబోతున్నదేమోనని నా అనుమానం. ఈ పదేళ్ళలో ఎంతమార్పు వచ్చింది. వొక మన దేశంలోనే కాదు. మొత్తం ప్రపంచంలోనే. ప్రపంచం సంతతి అలా వుండనిద్దాం. మన దేశం విషయం ఆలోచిస్తే విదేశీయ బహుళ జాతీయ సహకార, సహాయాలతో మన దేశం బడా బడా పెట్టుబడిదారుల నిజంగానే గాలిదారాలతో దేవతా వస్త్రాలు టన్నుల కొద్ది ఉత్పత్తి చేసేటట్టుగా వుంది. అయితే ఇందువల్ల మన దేశంలో వొంటినిండా కప్పుకోడానికి చింకి పాతకూడా కరువయిన కోటానుకోట్ల అభాగ్య జనులకు వస్త్ర సమస్య తీరుతుందా గాలి మనదేశానిది అయితే వస్త్రాలు విదేశాలకు పోతాయేమో? ఈ దేశంలో తయారైన వస్తువులు ఈ దేశ ప్రజలకే ఎప్పుడు దక్కుతాయో? ఫర్వాలేదు. 20వ శతాబ్దం ఇంకా పూర్తికాలేదు. కావడానికి ఇంకా ఇరువయి రెండేళ్ళు కావాలి. ఎప్పుడూ నేను ఆశావాదినే.25 వ ఏట పరమ దరిద్రపు స్థితిలో వున్నప్పుడూ ఆశావాదినే. ఇప్పుడు ముఫ్ఫయ్యయిదో ఏట ఆశావాదినే. ఇది నాలో సరికొత్త పాతకథ. ఎంచేతనంటే, ఇదివరకే చెప్పవలసింది ఇప్పుడు చెప్తున్నాను.
    ఇది ప్రేమ కథ! ఇది చాలా మంది కథని నా వుద్దేశం. కాని దీని మంచి చెడ్డలు నిర్ణయించే అధికారం నాకు లేదు. నేనెప్పుడూ మంచినే ఆరాధిస్తాను కాబట్టి నేను చేసినా అది మంచిదే ననుకుంటాను. ప్రేమించడం మంచిపని కాదని ఎవరూ అనరు కదా! ఆ పనినే చేశాను. అది మంచిదని నేననుకుంటాను.
    అయితే నేను ప్రేమించిన వ్యక్తి ఇంకొకరి భార్య కాబట్టి బహుశా ఈ సమాజంలో నేను చాలా చెడ్డపని చేశాననుకోవచ్చు. "వాడా! ఆ కనకాంబరంగాడా ఫలానా వ్యక్తి లేచిపోయాడు." ఆ తర్వాత తిట్లు శాపనార్ధాలు నా ప్రేమ కథకి సంబంధించిన పూర్తి వివరాలు సమాజానికి తెలియవు కాబట్టి తెలుసుకోవలసిన అవసరం లేదు. కాబట్టి సమాజం దృష్టికి నేను చేసిన పని చెడ్డపనిగానే కనిపిస్తుంది. పైగా నన్ను ప్రేమించిన అమ్మాయి వయస్సులో నా కన్నా 4 ఏళ్ళు పెద్ద కనీసం ఈ విషయంలోనన్నా నేను షేక్ స్పియరు కన్నా గొప్పవాడినని నాలో నేనే మురిసిపోతూ వుంటాను.
    ఆవిడ మా ఆవిడని గొప్పలు చెప్పడం కాదుగానీ, వాస్తవంగానే ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె గొప్పతనం వల్లనే నా బీదతనం పటాపంచలైపోయింది. ఈ కారణంగా కూడా సమాజం నన్ను ఆమె డబ్బుకాశపడిన దుర్మార్గుడిగా పరిగణించవచ్చు. నా పేరు కనకాంబరమని నేను చెప్పకుండానే బయటపడింది. మా యింటి పేరు సరే తర్వాత చెప్తాను. ముందుగా ఆవిడ పూర్తిపేరు చెప్పాలి. చెపితే అందరకూ ఆశ్చర్యం కలగవచ్చునేమో కాని అనౌచిత్యం మాత్రం అందులో ఏమీలేదు. ఆవిడ పేరు దేవతావస్త్రాలు. ఇంటిపేరు గాలిదారాలవారు: వెరసి ఆవిడ పూర్తిపేరు గాలిదారాల దేవతావస్త్రాలు.
    ఇటువంటి పేరున్న మనుషులు కూడా వుంటారా అంటే నేనే మొదట నమ్మలేదు తర్వాత మనిషిని చూశాక నమ్మక తప్పడం లేదు. ఆవిడ్ని నేనెప్పుడూ పూర్తిపేరు పెట్టి పిలిచింది లేదు. దేవతా! అనే పిలుస్తాను. పేరుమీద నమ్మకం లేని నాకు మనుష్యుల్లోనే దేవత లుంటారని దృఢ విశ్వాసం.
    ఆచ్చాఫీసులో ఫ్రూఫ్ రీడర్ గా ఉద్యోగం చేస్తున్న తొలివారంలోనే నాకా పనంటే మొగంమొత్తి పోయింది. ఇంకే వుద్యోగం చెయ్యకూడదనీ, స్వతంత్రంగా జీవించాలనే అనుకున్నాను. కాని చేతిలో చిల్లిగవ్వ అయినా లేని నాకు ఇది ఎలా సాధ్యం? చూద్దాం మనసుంటే మార్గమే దొరక్కపోతుందా? నా కన్నా ముందుగానే 20వ శతాబ్దంలో ప్రవేశించిన వ్యక్తిగా దేవతను నేను ఎరుగుదును. కాని అప్పటికింకా నా కావిడతో ముఖ పరిచయమైనా లేదు.
    ఆవిడ గురించి నేను ఎన్నో విశేషాలు వింటూ ఉండేవాడ్ని పత్రికల్లో ఆవిడ ఫోటో తరచు చూస్తుండేవాడ్ని ఏఫోటోలోను ఆవిడ 30సం||ల వయస్సు కలిగినదిగా కన్పించేదికాదు. ఆవిడ గురించి ఎవ్వరూ మంచిగా చెప్పుకునేవారు కాదు. అందరి దృష్టిలో ఆమె ఒక రాక్షసి. ఆవిడ బహిరంగంగా నవలలు. రహస్యంగా కవితలు రాస్తూ వుంటుంది. ఈ రెండో విషయం నాకామెతో పరిచయమైన చాలా కాలానికిగాని తెలియదు.
    అయినా మొదటిసారిగా నేనామెను ఒక సాహితీ సభలో తన ఉపన్యాసం ముగించుకుని బయటకు వస్తుండగా కలుసుకొని "నమస్కారమండీ కవయిత్రిగారూ" అని పలకరించాను. ఆవిడ ముఖం చిట్లించుకొంటూ నావేపు చురచుర చూస్తూ 'నేను కవయిత్రిని కాను, రచయిత్రిని" అన్నారు. "అదేమిటి అలా అంటున్నారు." "అది అంతే. అందరికీ అర్ధమయ్యేది వచనం ఎవ్వరికీ బోధపడనిది కవిత్వం." "అది కాదండి, ఇవాళ మీ ఉపన్యాసం ఆసాంతం కవితా మయంగా ఉంది." "అంటే నీకది బొత్తిగా బోధపడలేదన్న మాట" అంటూ ఆవిడ విసురుగా తన కారువేపుకు వెళ్ళిపోయింది.
    నేను ఆవిడ వెళ్ళినవైపే చూస్తున్నాను ఒకసారి ఇటు తిరిగి చూస్తుందేమోనన్న అడియాశతో తన కారు తానే నడుపుకుంటూ వెళ్ళి పోయిందావిడ. నన్నో పసివాడ్నిగా పరిగణించి  ఆమె మాట్లాడిన తీసును బట్టి నాకన్నా ఆమె చాలా పెద్దని గ్రహించాను. ఒక్క వయస్సులోనే కాదు అనేక విషయాల్లో.
    తర్వాత ఆవిడకొక కార్డు వ్రాశాను దేవతగారూ అని సంబోధిస్తూ కవిత్వానికి వారిచ్చిన నిర్వచనం చాలా బాగుందని వారి నవల్లంటే నాకెంతో ఇష్టమని, ఒకసారి వారిని దర్శించే భాగ్యం కలుగచెయ్యమని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS