పరమపదించిన వాళ్ళ నాన్న నరసింహకీర్తిగారికి పట్టమహిషతో బాటు వందకి పైగా భార్యలున్నారు. చచ్చిపోతున్న వాళ్ళు కాక వయసు చెల్లిన వాళ్ళు కాక ఇంకా తగు మాత్రం తన అంతఃపురంలోనే ఉన్నారు. ఇన్నాళ్ళూ వాళ్ళందరినీ తాను మాతృభావంతోనే చూసుకుంటూ వచ్చాడు. రాజ్యానికి వచ్చిన కొత్తల్లోనే వారసత్వ ప్రశ్న రాజుగార్నెదుర్కొంది. అప్పటికే వారి నపుంసకత్వం జగత్ప్రసిద్దం. పెద్దరాజుగారు పోయాక అంతఃపురం దినవారాలన్నీ సక్రమంగా జరిగిపోయాక మన రాజుగారు లోని మాజీమహారాణుల్లో ఏ ఒక్కరైనా గర్భం ధరించి ఉంటారేమో అని పరమ రహస్యంగా ఆరాలు తీయించారు. ఒక నలభయ్యేళ్ళ రాణిగారు గర్భవతి అని తెలిసింది. కాని ఏ వ్రతలోపం వల్లనో, ఏ గ్రహచారం వల్లనో ఆవిడగారికి ఆరో నెల్లోనే గర్భస్రావమయి పోయింది. రాజవైద్యులు పిండాన్ని పిడతలో పెట్టి ప్రాణప్రతిష్ట చెయ్యడానికి ఎన్నెన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.
అడ్డగోడ నిర్మాణం ప్రారంభించి ఐదేళ్ళు దాటిపోయాయి. బ్రహ్మాండంగా దేశం ఈ చివరినించి ఆ చివరికీ అడ్డగోడ లేచింది రతి నిషేధం విజయవంతమవుతున్నందుకు సంతోషించాలో రాజవంశం నిర్మూలమవుతున్నందుకు దుఃఖించాలో తెలియడం లేదు రాజుగారికి.
అలాంటి సమయంలోనే అవతార పురుషుల ఆవిర్భావం జరుగుతుంది ఇప్పుడు అదే జరిగింది.
పడమటి కొండల్లో ఒక గుహలో కొంతమంది మొగాళ్ళకి ఒక యోగి పుంగవుడు కనపడ్డాడు. తన పేరు నిధువనానందస్వామి అనీ, నూరేళ్ళనించీ ఆ గుహలోనే సమాధిగా వున్నాననీ చెప్పారు. వారం రోజుల్లో ఆయన మహాత్యం గురించి బోలెడు కథలు వ్యాపించాయి అవి రాజుగారి చెవిని కూడా పడ్డాయి.
రాజుగారు ఒక గెల అరటి పళ్ళూ ఒక కుండెడు పాలూ తీసుకువెళ్ళి యోగీశ్వరుణ్ణి తమ గృహం పావనం చెయ్యమని కాళ్ళావేళ్ళా పడ్డారు. పాలు తాగి, పరమానందభరితుడైన నిధువనానందస్వామి రాజుగారితో అంతఃపురానికి వెళ్లారు. అక్కడ ఒక మండలంపాటు సకల పరిచర్యలూ స్వీకరించి నలభై ఒకటో రోజు రాత్రి అంతర్ధానమయి పోయారు.
ఈ సంఘటనల వరుసలో తరువాతిది కీ.శే నారసింహ కీర్తిగారి వితంతువులందరిలో అందమైన రాణిగారు గర్భం ధరించడం వచ్చిన మొదటి రోజే అచిరకాలంలో నీకో తమ్ముడు పుట్టబోతున్నడని హామీ యిచ్చారు. యోగిపుంగవులు రాజుగారికి. అలాగే పది నెలలు తిరిగేసరికి తమ్ముడు పుట్టనే పుట్టాడు.
అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే తూర్పు భాగంలో ఉన్న చాలా మంది గర్భం ధరించారు. ఒక్కొక్క నెల గడుస్తూ ఉంటె పిల్లల్ని కూడా కనేస్తున్నారు. పురుష సంపర్కం లేకుండా రాణిగారికి కొడుకు పుట్టినట్టే తతిమ్మా వాళ్ళకి కూడా పిల్లలు పుట్టడానికి నీదువనానందస్వామివారి చలవే కారణం అని రాజుగారు విశ్వసించారు. దీనితో తన సమస్యా జనాభా సమస్యా రెండూ తీరిపోయినందుకు సంతోషించారు.
రెండేళ్ళు గడిచాక అంతఃపురంలో యోగిపుంగవులు మళ్ళీ సాక్షాత్కరించారు. రాజుగారు స్వామివారికి కృతజ్ఞతతో సాష్టాంగ దండప్రణామం చేశారు. యోగేశ్వరులిచ్చిన విభూతి స్వీకరించారు. యోగీశ్వరులు రాజుగారు తెప్పించిన విప్పసారా పసందు చేస్తున్నారు.
అప్పుడు వేగుల వాళ్ళు కుయ్యో మొర్రో అంటూ, దేశం మీదికి పెద్ద తురకల దండు వచ్చి పడిందని మొత్తుకున్నారు.
రాజుగారూ, యోగీశ్వరుడూ ఇద్దరూ అంతర్ధానమయిపోయారు.
తురకల దండును ఢిల్లీనుంచి తీసుకొచ్చిన వాడు ఆస్థానకవి కాంస్య వృషభ క్రియాశక్తి ఎలా ఢిల్లీ వెళ్ళాడో ఎలా పారశీక భాష నేర్చుకున్నాడో ఎలా కోటలో పాగా వేశాడో ఏమో ఎడతెగని అతని కృషి ఫలితంగా తురక సేనలు రాజుగారి ముఖ్యపట్టణంలో ప్రవేశించాయి.
తురక సేనాని పెద్దమనిషి తనకు స్వాగతం యిచ్చిన తెల్లజెండాలను అర్ధం చేసుకున్నాడు. సైన్యాలన్నిటినీ నలుగురు దండనాయకుల అధికారం కింద ఢిల్లీకి పంపించేశాడు.
తర్వాత నాలుగైదు రోజులకి ప్రజల్లో భీతావహం తగ్గిందని తేల్చుకున్నాక ఆరుబైటకు పెద్ద దర్భారు చేశాడు.
"మిమ్ముల్నందరినీ తురక మతంలో చేర్చే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
"మీ త్రివిక్రమ కీర్తిగారి చిన్న తమ్ముడికి పట్టాభిషేకం చేసి అతను పెద్దవాడయ్యేదాకా నేను పరిపాలిస్తాను. మొట్ట మొదట రతి నిషేధాన్ని రద్దు చేస్తున్నాను. (చప్పట్లు) వివాహ వ్యవస్థను పునరుద్దరిస్తున్నాను. (అక్కడక్కడ చప్పట్లు) అయితే ఒక్క షరతు ఈ విషయంలో మీ హిందూ న్యాయశాస్త్ర ప్రకారం కాక, మా మహమ్మదీయ షరియత్ ప్రకారం ఒక పురుషుడు అయిదుగురు భార్యల దాకా వివాహం చేసుకోవచ్చు (పెద్ద పెట్టున చప్పట్లు)
"ఔను తప్పేముంది? భారతంలో ఒక స్త్రీకి అయిదుగురు భర్తలయితే ఇప్పుడు ఒక పురుషుడికి అయిదుగురు భార్యలు బాగానే ఉంది" అనుకున్నారందరూ.
ఇదంతా సేనాని పారశీక భాషలో ఉపన్యసిస్తే ఆస్థాన కవి తెలుగులోకి తర్జుమా చేశాడు.
సేనానికి ఒకే ఒక్క విషయం అంతు పట్టలేదు. రాణిగారికే కాక వేలాది స్త్రీలకు కూడా స్వామివారే గర్భదానం చేశారా అని.....ఏమో! హిందువుల్లో మాత్రం ఎందుకు మహానుభావులుండకూడదు-అనుకున్నాడాయన.
అడ్డగోడ కింద ఇటునుంచి ఆడవాళ్ళూ అటునుంచి మగవాళ్ళూ తవ్విన సొరంగాలు చాలా వున్నాయన్న రహస్యం ఎవరో బయట పెట్టిన తర్వాత సాహెబ్ గారికి సందేశ నివృత్తి అయింది. అయినా ఆడవాళ్ళు గాని, మొగవాళ్ళు గాని తామే ఆ పని చేసినట్లు ఒప్పుకోలేదు. అదంతా పందికొక్కుల పనే అయ్యుంటుందన్నారు.
బాలరాజుకి మొహబ్బత్ ఖాన్ అని పేరు పెట్టి మహమ్మదీయ సేనాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేశారు.
---౦౦౦---
