Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 30


    మర్నాటి పోస్టులో ఆవిడ జవాబు కార్డుమీదనే వచ్చింది. మగవాళ్ళు పురుగులు నువ్వు నన్ను చూడనక్కర్లేదు అని కుదురైన ఇంగ్లీషు అక్షరాలలో ముక్తసరిగా అందులో వుంది. క్రింద సంతకం లేదు. ఆటోగ్రాఫ్ పుస్తకంలో జాగ్రత్త పరుస్తాననేమో కానీ ఆ ఇంగ్లీషు వుత్తరం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా వుంది.
    నేను పురుగును కాను మనిషంత మనిషిని ఈ దేవత ఎవరినైనా పురుగులా తీసిపారెయ్యొచ్చును. కాని నేను మాత్రం అందరిలాంటి వాడ్ని కాను. నాలో వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వంలో నేను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి. ఈమె నన్ను గుర్తించాలి.
    లేనిపోని లాంఛనాలకు పోవడమెందుకని నేనే చొరవ తీసుకొని ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళాను. అప్పుడావిడ ఇంట్లో లేదు. ఆమె భర్తగారు నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఎంతో మర్యాద చేశారు. అయినా ఆయన్ని చూసిన తర్వాత, సుమారు అరగంట ఆయనతో గడిపిన తర్వాత మగవాళ్ళందరినీ ఆవిడ పురుగులని ఎందుకనుకుంటుందో నా కర్ధమయింది. ఈ లోకంలో మోసానికి తప్ప న్యాయానికి తావులేదు. అయినా ఏదో మాయోపాయంతో ఈవిడని కలుసుకోవడమనేది నా స్వభావానికి విరుద్ధం. ఎలాగయినా ఆవిడ దృష్టిలోకి నేను రావాలి.
    ఒక రాత్రంతా కూర్చుని ఒక పెద్ద వుత్తరం వ్రాశాను. గాలిదారాల దేవతా వస్త్రాలగారూ, మీ పెరెంత అస్వాభావికమైనదో మీ నవలలంత అధ్వాన్నమైనవి. మీ నవలల్లో ఉత్త సెంటిమెంటల్ నాన్ సెన్స్ తప్ప మరేమీలేదు. ఆ తర్వాత 20, 30 వాక్యాలలో ఆమె రచనల్ని దుయ్యబట్టాను. నేనో వింత మహిళామణినని మీ గురించి మీరనుకుంటారు. ఇది నిరాధారమైన దురభిప్రాయం స్త్రీ పురుష సంబంధాలను మీరు చిత్రించే తీరు పురుష జాతికే కాక స్త్రీజాతికి కూడా అవమానకరం. నిస్సందేహంగా మీలో వున్న రచనా సామర్ధ్యాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ తర్వాత 20వ శతాబ్దపు నాగరికత మీద నాకున్న అభిప్రాయాలను విపులంగా వివరించాను.
    ఇక కాస్త వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శిస్తున్నందుకు నన్ను క్షమించండి. మీరు మగవాళ్ళలా కనబడాలన్న తాపత్రయంతో జీన్సు ధరించినా, దొరచుట్టలు సేవించినా ప్రకృతి సిద్దంగా మీలో వున్న స్త్రీత్వాన్ని ఎన్నటికీ రద్దు చేసుకోలేరు. ఒక విధంగా ఇది ఇతరుల్ని బుద్ధిపూర్వకంగా మోసం చెయ్యటమే ననిపిస్తుంది.    
    ఆఖర్న ఆవిడంటే అందరూ ఎందుకసహ్యించుకుంటారో రాశాను. మీరు ఈ సరికే ఇద్దరు భర్తలను మార్చినట్లు, మీ స్వీయ చరిత్రలో సగర్వంగా రాసుకున్నారు. మీరు మెచ్చుకునే అమెరికా నాగరికతలో మీ రికార్డ్ ను అతిక్రమించిన మహిళారత్నాలు ఎందరో వున్నారు. వారైనా తమ పాత భర్తలకు విడాకులిచ్చిన తర్వాతనే కొత్త భర్తను పెళ్ళి చేసుకుంటూవుంటారు. ఈ మాత్రం నీతికూడా మీకు లేకపోయింది. ఇద్దరు భర్తలు బ్రతికుండగా, మూడో ఆయన్ని శాస్త్రోక్తంగా పరిణయం చేసుకున్నారు.
    తర్వాత నేను స్థాపించ దలచుకున్న తోకచుక్క గ్రంథమాలను గురించి వ్రాశాను ఇది దేవతగారిని అపరిమితంగా ఆకర్షించి వుండాలి. నా గ్రంథాలయానికి ఆవిడే ధన సహాయం చేశారు. అలా ప్రారంభమయింది మా ప్రేమకథ.
    పొగడ్తలకు కొంతమంది ఏమాత్రమూ పొంగిపోరు. సాధారణంగా తప్పులు చూపిస్తుంటే కొంత మందిలో కాకపోయినా కొంతమందిలోనైనా పరివర్తన వస్తుంది. అటువంటి పరివర్తనే ఆమెలో వచ్చింది. తన కారులో ఆవిడ నన్ను ఎన్నోసార్లు వాహ్యాళికి తీసుకెళ్ళింది. గంటల తరబడి మేం ఎన్నో విషయాలమీద చర్చించుకొనే వాళ్ళం మా మనస్సులు విడదియ్య రానంతగా పెనవేసుకుపోయాయి. శారీరక సంబంధమా - వివాహానంతరమే ప్ర్రారంభమయింది. ఈ వివాహానికి ముందు తన భర్త నుండి ఆమె విడాకులు తీసుకోవాలని నేను పట్టుబట్టాను. అందుకు ససేమిరా ఆవిడ ఒప్పుకోలేదు. అయితే మన పెళ్ళి అసంభవమని నిష్క్రర్షగా చెప్పేశాను. ఓ షరతుమీదైతే ఒప్పుకుంటాను నీ కిష్టమేనా?
    ఏవిటా షరతు?మన పెళ్ళి అయిన తర్వాత నా యింటిపేరు నువ్వు ధరించాలి. అందుకు నేను అంగీకరించాను. ఆ విధంగా నేను గాలిదారాల కనకాంబరమయ్యాను. 10 సం||లు ఆనందమయంగా సాగిన మా ప్రేమకథవిషాదాంతంగా ముగిసిందని చెప్పడానికి చింతిస్తున్నాను. ఈ    10సం||రాల్లో ఇద్దరం కలిసి ఎన్నో లక్ష లార్జించాం. ఎన్నో లక్షలు ఖర్చు చేశాం.
    మా ప్రేమకు  ఫలితంగా ఇద్దరు బిడ్డలు. ఒక కూతురు, ఒక కొడుకూ పుట్టారు. వాళ్ళు సలక్షన్మగా చదువుకున్నారు. అన్నీ వదిలిపెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. చనిపోయిందనుకుంటారేమో....లేదు. అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తతో కాపరం చెయ్యడానికి. ఈ సంగతి చెప్తూ తనని శాశ్వతంగా మరచిపొమ్మని రాసింది. ఆ ఉత్తరం పైకి కనబడేటట్లుగా ఒక పుస్తకంలో పెట్టింది. ఆ పుస్తకం నిండా ఉన్నదంతా అప్పుడప్పుడు ఆమె రాసిన కవిత్వం ఎవ్వరికీ బోధపడదన్న ఆమె కవిత్వం నాకు బాగా అర్ధం అయ్యింది. మా గ్రంథమాలలో అంతిమ కుసుమంగా ఆవిడ కవితా సంపుటిని అచ్చువేయించాను. దాని పేరు గాలిదారాల దేవతా వస్త్రాలు.
    
                               ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS