కస్సుమంటూ పూత్కారంచేస్తూ పడగవిప్పి లేచిన కోడెత్రాచు కాటు వేయకుండా వొదుల్తుందా?
ఆలోచనలు ఆసాంతం కాని తన్మయావస్థలో, అటు తన ఆరాధనామూర్తి ఆజ్ఞను జవదాటనూ లేక, ఇటు ప్రకృతి సహజంగా ప్రకోపించిన శత్రు నిర్మూలన ప్రవృత్తి అణచుకోనూలేక ఒక విచిత్ర మయిన సందిగ్దంలో పడి పోయినాడు అర్ధమానవుడు.
ఆ సంధిగ్దమయిన మనసికావస్థ అది. ఎర్రగా కాలిన పెనంమీద హటాత్తుగా నీరు చిలికించినట్లు అయింది. రివ్వున ఎగిరే విహంగాన్ని సుడిగాలి క్రిందికి లాగినట్లు అయింది. ఉవ్వెత్తునలేచిన కెరటం బండరాయిని గ్రుద్దుకుని చిందర వందర అయినట్టు చికాకు కలుగసాగింది.
సరిగ్గా ఒక నిర్ణయానికి వచ్చి ఒక స్థితిలో స్థిమితాన్ని పొందలేని అర్ధమానవుడు ఎంతో చికాకు పడిపోయినాడు. చిరు బురులాడుతూ రవంతసేపు ఆ సందిగ్ధంలో బొమ్మలా అలాగే ఉండిపోయినాడు.
పై కెత్తిన విరోధిని ఆమె ఆజ్ఞ ఉల్లంఘించి నేలను విసరలేక పోయినాడు. అలాగని తన ప్రకృతిని ఉల్లఘించి ఒదిలి వేయనూలేక పోయినాడు.
అటూ ఇటూ తేల్చుకోలేక, ఏమిచేయాలో నిర్ణయించుకోలేక చేతులపై ఉన్న విరోధిని ఆమెమీదికే విసిరేశాడు. అప్పటికి అతని ప్రకోపం కొంత చల్లారి ఉండటంతో ఆ పనిని అంత విరురుగా చేయక పోయినాడు.
11
ఒకవేళ అతడు తన పూర్తి శక్తీతో ఫిజోని కెప్టెన్ మాలతి మీదికి విసిరి ఉంటె ఆధాటికి ఇరువురూ ప్రమాదంలో పడిపోయి ఉండేవారు.
అలాగా దిగకపోవటంతో ప్రమాదం నించి ఇరువురూ బయటపడ్డారు. కాని మాలతి తూలిపోయింది. ఫిజో ఆమె ప్రక్కన పడిపోయినాడు.
అర్ధమనవుడు మాలతి పడిపోవటంతో రవంత కలవరపడ్డాడు. త్వరగా వచ్చి ఆమెకు చేయి అందించాడు.
అతని అసంపూర్ణ సందిగ్ధ మనసికావస్థలో కెప్టెన్ మాలతి మిత్రపక్షం! ఫిజో శత్రు పక్షం!
అటువంటి ఆలోచనలు అతని కెందుకు వచ్చాయో అతనికి తెలియదు కాని అదే అతని నిర్ణయం.
మాలతి ఫిజో ఒకరినొకరు చూచుకొని నిర్వీర్యుల యారు. అంత మొరటుగా ఆ ఇద్దరినీ కలిసిన అర్ధమానవుడికి జేజేలు పలికారు.
ఇరువురూ కలుసుకున్న ముహూర్తం అత్యంత శ్రేయోదాయక మైనదని వారు భావించారు. తిరిగి నాగరిక లోకం చూడగలుగుతామన్న ఆశలువారిలో చిగురించినాయి. జీవితం మీద ఆశలు చెలరేగినాయి.
ముందు ఆనందం వెల్లువలా అయింది. ఆ తరువాత కొన్ని రోజులుగా అనుభవించిన మానసికమైన క్షోభ యావత్తు దుఃఖంగా పెల్లుబికి వచ్చింది. వారి మనసులు కన్నీరై కరిగిపోయి చెంపలమీద చారికలు కట్టాయి.
చాల మొరటు పద్దతిలో తామిద్దరినీ కలిసిన అర్ధమానవుడుపై కృతజ్ఞతా భావంతో వారి అంతర్యాలు నిండాయి.
"ఫిజో! నువ్వా" అన్నది మాలతి ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో. "మేడ,మ్ నా ప్రయత్నమంతా వృధా అవుతుందనుకున్నాను. నేను కూడా ఈ ప్రాంతాలను వదిలి తిరిగి వెళ్ళలేను అనుకున్నాను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఇంతకు మించిన సుముహూర్తం నాజీవితంలో ఎన్నడూ ఎదురుకాలేదు" అన్నాడు ఫిజో ఆమె వంక పరిశీలనగా చూస్తూ.
నాగరిక లోకం తాలూకు చూపులు అవి. ఫిజో మంచి వాడే అయినా అతను పుట్టి పెరిగిన నాగరికత పవిత్రతకీ, ప్రాకృతికమైన సహజత్వానికి దూరం.
అందునించి అర్ధమానవుడి ఎదుట నిస్సంకోచంగా ఉండగలిగిన స్థితిలో ఆమె అతని ఎదుట ఉండలేక ముడుచుకుపోయింది. సిగ్గుపడింది.
అర్ధమానవుడు అస్తవ్యస్తమైన ఆసక్తితోచింపేయగా మిగిలిన పీలికలు మాత్రమే ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. కాని పూర్వ మానవుడు తనతోపాటుగా తిరుగుతూనే ఉన్నా, తనవంక చూస్తున్నా, విచిత్రమైన ఆసక్తితో తన శరీరాన్ని స్ప్రుశించి అర్ధంచేసుకోవాలని ప్రయత్నించినా ఆమెకు అదొక అద్భుతమైన అనుభవంగానే ఉండేది. కన్నబిడ్డ ఆకలితో శరీరాన్ని స్పృశించినప్పుడు ఎలాంటిఅనుభవం కలుగుతుందో అలాగే అన్పించేది.
అందునించి అప్పుడు సిగ్గు అన్న ప్రసక్తి రాలేదు.
అతడు అనాగరికుడు అయినా ఆంతర్యంలో పవిత్రుడు.
ఇతడు మైత్రిలో పవిత్రుడే అయినా నాగరికుడు. అందునించి ఆలోచనలతో కుంచించుకుపోయింది మాలతి. తనమీద వున్న స్వెట్టర్ ఒలిచి ఆమెకు అందించాడు ఫిజో. దాన్ని ధరించిన తరువాత లేచి నిలిచేందుకు ఆమె సంకోచమంతా తీరిపోయింది.
పడిన చోటునించి ఇరువురూ లేచారు.
నాగరికులయిన వారిరువురూ కలుసుకున్న ముహూర్తం సుముహూర్తమని వారు భావించారు. కాని ఆ సుముహూర్తంలో అర్ధమానవుని ఆంతర్యంలో ఒక ఆక్రందన ప్రారంభమైన సంగతి వారు గుర్తించలేదు.
నిజంగా అతని మనసు ఆక్రోశిస్తోంది.
మాలతితో తనకు సంప్రాప్తమైన మైత్రివల్ల ఒక దివ్యమైన హృదయానుభవం కలిగింది. అది తనకు శాశ్వతంగా మిగిలిపోతుందని అతడు భావించాడు. అమాయకంగా ఆమెను ఆరాధించాడు.
కాని తనవంటి ఆటవికుని సాహచర్యంతో ఆమె శాశ్వతంగా ఉండిపోలేదని అతడికి ముందుగా తెలియలేదు. జీవితం లోని రుచులూ, అభిరుచులూ అన్నింటినీ వదిలిపెట్టుకుని ఒక నాగరిక యువతి జనావాసాలకు దూరంగా ఆటవికమైన జీవితం గడపాలంటే అది అసాధ్యం.
ఇంతవరకూ ఆమె అనివార్యమైన స్థితిలో అతనిని బిడ్డలా భావించి ఆ మొరటు తనాన్ని భరించింది. తనకోసం ప్రాణాలకు తెగించిన మరొక నాగరికుడు తారసపడ్డాక ఆమె తిరిగి తన ప్రపంచానికి వెళ్ళిపోవాలని మాత్రమే ఆలోచిస్తుంది.
ఆ ప్రపంచంలో ప్రేమించే తండ్రీ ప్రియుడూ కూడా అభిరుచులను సాహసాలను పొగిడేవారు అంతా వున్నారు. నాగరికమైన అనుభవాలు ఆనందాలు ఎన్నో వున్నాయి.
