Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 28


    సాంబయ్య కళ్ళలో ఆనందభాష్పాలు తిరిగాయి! తనూ, తన తండ్రీ ఆ వూళ్ళో, ఆ భూస్వాముల మధ్య పొందిన గాయాలూ, మచ్చలూ ఆ కన్నీళ్ళలో కరిగిపోయినై.
    పెళ్ళి మండపానికి ఆనుకొని సాంబయ్యకు కుడిపక్కగా కూర్చున్న బలరామయ్య కళ్ళు చెమ్మగిల్లినై. పైపంచతో కళ్ళు తుడుచుకొన్నాడు. కూతురు బరువు తీర్చుకొన్న బలరామయ్య కార్చిన కన్నీరు ఆనందంతో కాదు. తరతరాలుగా వస్తున్న అంతస్తునుంచి జారి కిందకు పడ్డాడు. అందులోనూ మురికిగుంటలో బోర్లాపడ్డాడు. ఒకనాడు కట్టుబట్టల్తో పొట్ట చేత్తోపట్టుకొని తన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డ వెంకయ్య మనవడు ఆ ఇంటికి అల్లుడైనాడు. తనతండ్రి కాళ్ళు పట్టినవాడు-తన గొడ్లసావిట్లో కాపురమున్నవాడు-వాడి మనవడి కాళ్ళు తను కడిగి కన్యాదానం చేశాడు!
    కుమిలి కుమిలి బాధపడిపోతూ బలరామయ్య పంచె ముఖానికి అడ్డం పెట్టుకొని కన్నీళ్ళు  తుడుచుకున్నాడు. అది కళ్ళారాచూసిన సాంబయ్య సర్వస్వతంత్రుడైన మృగరాజు అడవిలో వేటాడేముందు కొండరాతిమీద నిలబడి పరిసరాల్ని పరికించినట్లు - పెళ్ళిపందిరి కలియచూశాడు. మీసాలు దువ్వుకుంటూ, చేతికర్ర వూపుతూ భజంత్రీలు!" అన్నాడు.
    దోసిలితో తలంబ్రాలు వెంకటపతి నెత్తిన పోయబోతూ, పెళ్ళికొడుకు ముఖంలోకి ఓరగా చూసిన పెళ్ళికూతురికి, తను చిన్నప్పుడు మాయలుబజారు సినిమాలో చూసిన ఘటోత్కచుడి ముఖం కన్పించింది. వరూధిని చేతులు బిగిసిపోయినై. దోసిలి విడలేదు. వెంకటపతి తలమీద తలంబ్రాలు పడలేదు. వెంకటపతికి పెళ్ళికూతురు వాన రాబోయేముందు, ఆకాశంలో మెరిసిన మెరుపులా కన్పించింది. వాన వెలిశాక నిర్మలమైన ఆకాశంలో ఇంద్రధనుస్సును చూసి, ఓ రోజు పొలాన పొందిన అనుభూతిని పొందాడు వెంకటపతి - పసుపుబట్టలతో వున్న వరూథిన్ని చూసి.
    పెళ్ళికూతురి చేతులు పట్టుకొని పెళ్ళికొడుకు నెత్తిన తలంబ్రాలు పోయిస్తున్న దాసి వరూధిని చేతులు గట్టిగా విడదీసింది. వరూధిని దోసిలిలో నుంచి తలంబ్రాలు వెంకటపతి నెత్తిన పడ్డాయి. దోసిళ్ళకొద్దీ తలంబ్రాలు వరూధిని నెత్తిన ఎగిరెగిరి పోశాడు వెంకటపతి. చివర్లో వరూధిని తాంబాళం ఎత్తి వెంకటపతి నెత్తిన గుమ్మరించింది.
    "మేమే గెలిచాం!" అన్నారు ఆడపిల్లవారు.
    బిందెలో వేసిన ఉంగరం వరూధిని కనురెప్పపాటులో తీసింది. వెంకటపతి ఇంకా బిందె అడుగున చెయ్యి ఆడించటం చూసిన బలరామయ్య పెత్తండ్రికొడుకు "ఏమిటోయ్ అల్లుడూ! ఇంకా బిందెతో కుస్తీలు పడుతున్నావ్? మా అమ్మాయి ఎప్పుడో తీసింది ఉంగరం" అన్నాడు.
    జనం గొల్లున నవ్వారు. అందరితోపాటు వెంకటపతికూడా ఆనందంగా నవ్వాడు. అతని నవ్వు చూసిన వరూధిని పెదవి నొక్కిపెట్టి కిసుక్కున నవ్వింది.
    సాంబయ్య కనకయ్యను పెళ్ళికి ముందే హెచ్చరించాడు కట్నం తాలూకు డబ్బును.
    "ఏమిటా తొందర? పెద్దమనష్యుల్తో వ్యవహారం!" అన్నాడు కనకయ్య.
    భోజనాలయ్యాక కనకయ్య సాంబయ్యను వెతికి పట్టుకొన్నాడు.
    "ఇంద! అణాపైసలతో అనుకొన్న కాడికి ముట్టజెప్పారు బలరామయ్యగారు"
     అంటూ కనకయ్య తన లెదర్ బ్యాగ్ సాంబయ్యచేతికి అందించాడు.
    సాంబయ్య ఆనందంతో లావుగావున్న సంచిని రెండుచేతుల్తో నిమిరి చూసుకొన్నాడు.
    "భద్రం! పెళ్ళి హడావిడిలో ఎక్కడ పెడ్తావో ఏమో?" హెచ్చరించాడు కనకయ్య.
    "ఆ మాటా నిజమే పద, ఇంట్లో పెట్టివద్దాం!" సాంబయ్య కనకయ్యను వెంట తీసుకొని వెళ్ళాడు.
    "సంచికి తొందర్లేదు. తర్వాత ఇద్దువుగాని. ముందా సంచి ఇనప్పెట్టెలో పెట్టి బయల్దేరు. రాత్రికి వూరేగింపు ఏర్పాట్లు చూడాలి. బయలుదేరండి" అని తొందర చేశాడు కనకయ్య.
    "ఊరేగింపుకు భోగం మేళం తెప్పిస్తున్నారా లేదా?" అడిగాడు సాంబయ్య.
    "ఇంకా యేం తెప్పిస్తాడయ్యా బలరామయ్య! ఇప్పటికే నిండా మునిగిపోతేను?" అన్నాడు కనకయ్య.
    "అయితే నే తెప్పిస్తా! వూరేగింపుకు పూలపల్లకి, మేజువాణి ఉండాలి. వందలైట్లు  ఉండాలి. బ్యాండూ, సన్నాయీ అన్నీ వుండాలి" అంటూ సాంబయ్య లెదర్ బ్యాగ్ ను ఇనప్పెట్టెలోపెట్టి, మూసి తాళం వేసి గదిలోనుంచి బయటకి వచ్చాడు. అప్పటికప్పుడు మనుషుల్ని బస్తీకి పంపి చెమ్కీవాళ్ళనూ, భోగంవాళ్ళనూ పిలిపించాడు.
    వూరేగింపు ముందు వంకెకర్ర పట్టుకొని సాంబయ్య బయలుదేరాడు. వూరంతా కదలి వచ్చింది. ఊరేగింపు మేళతాళాలతో, పెట్రమాక్స్ లైట్ల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. వెంకటపతి పక్కన వరూథిన్ని చూసి 'కాకి ముక్కుకు దొండపండు!' అన్నారు.
    వూరేగింపు తెల్లవారుఝాముదాకా నడిచింది. తెల్లవారగట్ల అప్పగింతలు జరిగాయి. సాంబయ్య కొడుకూ, కోడల్నీ ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటికే తెల్లవారిపోయింది. పెళ్ళివారు కాఫీ ఉప్మాలు సేవించి కునుకులు తీశారు. మళ్ళీ మెలుకువ వచ్చేసరికి సాంబయ్య ఇంటిముందున్న విశాలమైన పందిట్లో భోజనాలు ఏర్పాటు చేయించాడు. చుట్టుపట్ల పదివూళ్ళ దాకా భోజనాలకు పిలిపించాడు. ఆరుబంతులు లేచాయి. విస్తళ్ళలో వేసిన లడ్లూ, అరిశెల సైజును గురించి చెప్పుకోనివాళ్ళులేరు. దీంతో పోలిస్తే బలరామయ్య పెట్టిన పప్పన్నం ఒక లెక్కలోనిదికాదు. ఏది చేసినా సాంబయ్యే చెయ్యాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలదాకా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. లేచేవాళ్ళు లేస్తూనే వున్నారు. సాయంకాలం నాలుగు గంటలకు పాతక జనానికి అన్నం పెట్టించాడు. పాటకజనానికి కూడా లడ్లూ అరిశెలూ పెట్టినవాళ్ళు ఆ ప్రాంతంలోనే లేరు. సాంబయ్య కీర్తి నలువైపులా వ్యాపించింది. సాంబయ్య చేతికి ఎముకలేదన్నారు పెద్దలు. షావుకారు సాంబయ్య కొడుకు పెళ్ళి గురించి ప్రతి పందిట్లోనూ మూడేళ్ళదాకా చెప్పుకొన్నారు. షావుకారు సాంబయ్య వీధిలో నడిస్తే మనుషులు వదిగి నిలబడుతున్నారు. అంతవరకు 'సాంబయ్యా అని పిలిచినవాళ్ళే "సాంబయ్యగారూ!" అని పిలుస్తున్నారు.
    సాంబయ్యగారి కోడలు మామగారింట్లోవున్న మూడురోజులూ మునగదీసుకొని పడుకొంది. వెంకటపతి ఆకలిగొన్న  పులిలా ఇంట్లో తిరిగాడు. సాంబయ్య ఆచూకీ తియ్యగా రవణమ్మ చెప్పింది. "అమ్మాయి కడగా ఉందిలే!" అని.
    మూడు నిద్రలు అయాక బలరామయ్య కూతుర్నీ అల్లుడ్నీ ఇంటికి తీసుకొచ్చాడు. సాంబయ్య పందిళ్ళు వూడదీయించాడు. ఎవరికివ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేశాడు. రెండోరోజున మధ్యాహ్నానికి ఒడ్డునపడ్డాడు. పదిరోజులుగా దాదాపు నిద్రాహారాలు లేకుండా తిరిగిన సాంబయ్య తిని మంచానికి అడ్డంపడ్డాడు. కునుకుపట్టింది. సంధ్యవేళ జీతగాడు వచ్చి లేపెదాకా సాంబయ్యకు మెలుకువ రాలేదు. బద్దకంగా వళ్ళు విరుచుకొని లేచి కూర్చున్నాడు. ఇల్లంతా కలయజూచాడు. బోసిగావుంది. వెంకటపతి ఇంట్లోలేడు. వెంకటపతి భూమ్మీదపడ్డ దగ్గర్నుంచీ ఒక్కరోజు కూడా తనను విడిచిలేడు. మూడు నిద్దర్లయాక వెంకటపతి భార్యతో ఇంటికి వస్తాడు. షావుకారు  వీరభద్రయ్య గారి మనుమరాలు తన ఇంటికోడలు. ఆ పిల్ల ఈ ఇంట్లో తిరుగుతుంది. తను ఎదురైతే గబుక్కున చాటుకుపోతుంది. కూతుర్ని పండగలకూ, పబ్బాలకూ పంపమని బలరామయ్య వచ్చి తనను ప్రాధేయపడతాడు.
    "దొరగారూ! పెళ్ళి హడావుడి తగ్గాక తుమ్మకర్ర కొట్టమన్నారు గందా? రేపు కొట్టించమంటారా?" అన్నాడు జీతగాడు. సాంబయ్య ఊహాచిత్రం చెరిగింది. తల ఎగరేసి నవ్వుకొన్నాడు.
    "ఆఁ- ఎంతమందిని పెడ్తావ్?"
    "ఏడుగురన్నా లేకపోతే పనవదు!"
    "ఏడ్చావ్! ఏడుగురెందుకురా? ముగ్గుర్ని చెట్లు కొట్టమను. ఇద్దరు కంపగొడితే సరిపోతుంది! పనికురదలా వుందో కూలిడబ్బులివ్వను. రేపే పూర్తి కావాలి!" అన్నాడు సాంబయ్య.
    జీతగాడు బుర్రగీరుకున్నాడు. సాంబయ్య సాంబయ్యే! వాడు పదేళ్ళగా చూసిన సాంబయ్యే మళ్ళీ కళ్ళముందుకు వచ్చాడు. గత పదిరోజులుగా తను చూసిన సాంబయ్యకాదు!
    "నీళ్ళ కాగు బయటపెట్టరా!" జీతగాడితో అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS