"ఏవండీ శ్రీశ్రీగారూ! మీరేమంటారు?" అని శ్రీశ్రీగారిని అడిగారు పిళ్ళైగారు.
"సరోజ చెప్పిందిగా! అదేమాట నేను చెప్పాలా?" అన్నారు.
"మర్నాడు ఆర్టిస్ట్ లతో మాట్లాడాలనుకున్నాం కదా? ఇక టైం వేస్ట్ చెయ్యొద్దు. టి.జి. కమల కూడా భానుమతి గారితో ఒక కాల్ షీట్ కి రావాలి సార్! క్లయిమాక్స్ లో ఇద్దరూ కలుస్తారు. ముందు ఆమెతో మాట్లాడి ఫిక్స్ చేయండి. నేనీలోగా ఆమెతో వచ్చే కాంబినేషన్ లూప్స్ లిస్ట్ తయారు చేస్తాన"ని నే నా పనికి కూర్చున్నాను.
శ్రీశ్రీగారు ఆ పద్దతి అంతా చెప్పారు.
"సాధ్యమైనంతవరకూ ఓవర్ లేప వుండే లూప్స్ తప్పితే మిగతా లూప్స్ లో వచ్చే ఆర్టిస్టులందర్నీ భానుమతిగారి వర్క్ లో ఎవాయిడ్ చేసేద్దాం సరోజా! ఆమె వర్క్ త్వరగా అయిపోతుంది" అని అన్నారు.
ఆ విధంగా మొదటి పిక్చర్ అంతా నేర్చుకోడానికే ఉపయోగించాను. నేర్చుకున్నాను.
భానుమతిగారి పోర్షన్ కూడా పెద్ద పెద్ద అక్షరాల్తో ఒక పుస్తకంలో ఫేర్ చేసి వుంచేశాను. శ్రీశ్రీగారు అన్నీ ఓసారి చెక్ చేసి "వెరీగుడ్" అన్నారు.
* * *
మర్నాడు ఇరవైమందివరకూ ఆర్టిస్టులు ఆఫీసుకి వచ్చారు. మా రూమ్ లోనే ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి, మాట్లాడ్డానికి ఏర్పాటు చేశారు.
నేను శ్రీశ్రీగారు, ప్రొడ్యూసర్లిద్దరూ కూర్చున్నాం.
అందరూ శ్రీశ్రీగారికి నమస్కారం చేస్తూంటే, "నా అసిస్టెంట్" అని నన్ను అందరికీ పరిచయం చేస్తున్నారు ఆయన.
అందరితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేశాం. అగ్రిమెంట్లు అయ్యాక అడ్వాన్సులు కూడా ముట్టచెప్పారు.
అందరినీ ఆరుగంటలకి ప్రొజక్షన్ కి రమ్మని, రావలసిన చోటు కూడా చెప్పేశాం.
అందులో ఆడవాళ్ళు ఆరుగురిలో ఒక అమ్మాయి (ఇక్కడ పేరు అనవసరం) నన్నొక మాదిరిగా చూసింది.
ఆ చూపులో ఈర్ష్య కొట్టొచ్చినట్టు కనిపించింది.
"వస్తానండీ శ్రీశ్రీగారూ! నన్ను మరిచిపోకుండా పిలిచింది. ఈ పిక్చర్లో వేషం ఇప్పించినందుకు థాంక్సండి. ఇకమీద పిక్చర్లకి కూడా దయచేసి నన్ను మరచిపోకండి" అంటూ నమస్కారంతోపాటూ వారిని క్రీగంట చూస్తూ విసురుగా వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి ప్రవర్తన నాకు అర్ధంకాలేదు సరికదా, చాలా విచిత్రంగా అనిపించింది.
"ఎవరండీ ఆవిడ" అన్నాను.
"ఆర్టిస్ట్" అన్నారు.
"అది తెలుస్తూనే వుంది. నేనడిగింది అది కాదు"
"మరేది?"
"ఆమె మీ పాత చుట్టమా?"
ఆయనేమీ జవాబు చెప్పలేదు.
నేను అసిస్టెంట్ గా వారి దగ్గర పనికి ప్రవేశించకముందే శ్రీశ్రీగారు 'ఆహుతి' అనే హిందీ పిక్చర్ తెలుగులోకి డబ్ చేశారని, తర్వాత 'మనోహర్' కూడా రాశారని విన్నాను. 'బహుశా అందులో మాట్లాడిన వాళ్ళయి వుంటారేమోలే! అయినా మనకెందుకు?' అని మనసుకి నచ్చచెప్పాలని ప్రయత్నించాను. అయినప్పటికీ నా మనసంగీకరించలేదు. ఎంతోమంది వచ్చారు. ఎవరిమట్టుకి వాళ్ళు, నన్ను పరిచయం చెయ్యగానే ఎంతో గౌరవించారు. అందులో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా! మరి ఈవిడకి మాత్రం ఎందుకంత బాధ?
సరే - చూస్తాంగా! తినబోతూ రుచులెందుకడగడం? వీళ్ళ జాతకాలు తేల్చడం ఎంతసేపు?
డబ్బింగ్ లో అందరి రంగులూ బైటపడతాయనుకుని వూరుకున్నాను.
అదీగాక శ్రీశ్రీగారికి ఎంతమందినో పరిచయం వుంటుంది. అందులో ఆడవాళ్ళతో కూడా బాగా పరిచయం వున్న సంగతి తెలిసిందేగా! ఆ మాత్రం దానికెందుకింత బాధో నాకే అర్ధంకాలేదు.
వారి విషయంలో ఏం జరిగినా బాధపడాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా నా కంతుపట్టలేదు.
బహుశా ఆడవాళ్ళ నిజమే అంతేలే అనుకున్న నవ్వుకున్నాను.
ఇటువంటి విషయాలు కూడా ఎదురవుతాయి కాబోలు! అన్నిటినీ భరించే శక్తి చాలా అవసరమనిపించింది.
అప్పటికి వూరుకోకుండా శ్రీశ్రీగారిని ఆర్టిస్టుల విషయాల్లో, డబ్బింగ్ విషయాల్లో పెట్టి కదిపాను.
అమ్మో! ఆయనెక్కడ!
సముద్రం లోతయినా తెలుసుకోవచ్చుగాని, ఆడదాని మనస్సు అర్ధం కాదని గ్రంథాలయితే రాస్తారు కానీ, నిజానికి మగవాళ్ళ లోతే కనుక్కోవడం కష్టమనిపించింది.
"నీకెందుకీ గొడవలన్నీ? నీ పని నువ్వు చూసుకో" అన్నారు.
అక్కడితో 'ఆ విషయం నిజంగానే మనకి అనవసరం'ని వదిలేశాను.
"ఫోను వచ్చింది. శంకర్ సింగ్ గారు లైనులో వున్నార"ని చెప్పారు.
"నువ్వు వెళ్ళి మాట్లాడ"న్నారు.
నేను వెళ్ళి, "మేం ఫలానా చోట, ఫలానా ఆఫీసులో వున్నాం. వెంటనే వస్తే మాట్లాడుకోవచ్చు" - అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసి అదేమాట శ్రీశ్రీగారితో చెప్పాను.
"ఫరవాలేదు తెలివితేటలున్నాయే?" అని మెచ్చుకున్నారు.
నాకెందుకో, నా పట్ల ఆ అమ్మాయి రియేక్షన్ చూసింది మొదలు, శ్రీశ్రీగారిపట్ల మనసులోనే ఓ విధమైన చిరాకేర్పడింది. ముభావంగా వుంటూ పనివరకూ చాలా కరెక్టుగా చేసుకుపోతున్నాను.
శంకర్ సింగ్ గారు వచ్చారు. కాఫీలు తెప్పించుకున్నాం.
"డబ్బింగ్ పెడదామనుకుంటున్నానండీ" అన్నారు.
"ఎప్పుడు సార్?" అన్నాను.
"మీ ఇష్టమే" - అన్నారాయన.
శ్రీశ్రీగారు నా ముఖం చూశారు. నేనేమీ మాట్లాడలేదు. "ఏమిటంటావు సరోజా?" అనడిగారు.
"నన్ను అడుగుతారేమిటి? మీ ఇష్టమే"
"అడుగుతున్నారుగా, చెప్పండమ్మా!" - అన్నారు శంకర్ సింగ్ గారు.
"ఎందుకులెండి సార్! వారినే చెప్పనివ్వండి. ఎంతైనా నేను అసిస్టెంట్ నేగా" అని , దొరికిన అవకాశాన్ని జారవిడవకుండా ఉపయోగించుకున్నాను.
శ్రీశ్రీగారికి చెప్పాలా! దేవాంతకులు!
"అసిస్టెంట్ వి కనకే నిన్నదగడం నాకేం వుంది? నే నో చోట కూర్చుంటాను. డబ్బింగ్ వర్కంతా చేసి, కష్టపడాల్సిందానివి నువ్వు" - అని తీవ్రంగా నా ఆ ముఖంలోకి చూశారు.
'ఈయన పసిగట్టేశారు. మనం తగ్గడం మంచిది' - అనుకుని.
"మరేంలేదు సార్! ఈ వారంలో భానుమతిగారు కాల్ షీట్లు ఇచ్చారు. క్లాష్ కాకుండా చూసుకోవాలి. అందుకే ఆలోచిస్తున్నాం" - అన్నాను.
"పోనీ నైట్ కాల్ షీట్లు వేస్తే సరిపోతుందికదా" అన్నారు శంకర్ సింగ్ గారు.
"శ్రీశ్రీగారిని అడగండి" అన్నాను.
"నాకేం తెలీదు. తన ఇష్టమే" - అన్నారాయన.
ఆయన గడుసుతనానికి నవ్వుకున్నాను. "తప్పకుండా వర్క్ చేద్దాం సార్? ఇప్పుడేగా చెప్పారు. ఈ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి భానుమతిగారి డేట్స్, టైమింగ్స్ చూసుకొని మన పిక్చర్ కూడా పూర్తి చేసేద్దాం" - అన్నాను.
"గుడ్ అయిడియా" - అన్నారు శ్రీశ్రీగారు.
అంటే, మౌనంగా వుంటూ నేను ఏం మాట్లాడతానో విని ఎలా మాట్లాడాలో ట్రయినింగ్ ఇవ్వడమా? - అనుకున్నాను.
శంకర్ సింగ్ గారు వెళ్ళిపోయారు.
భానుమతి గారి టైంమింగ్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుని 'గంధర్వ కన్య' కాల్ షీట్లు కూడా ఫిక్స్ చేసుకున్నాం.
శంకర్ సింగ్ గారు రెండు కాల్ షీట్లు రాత్రి తొమ్మిది నుండి పొద్దున ఆరు గంటల వరకు వేశారు.
ఇక్కడ భానుమతిగారితో 'సాహసవీరుడు' మొదటి డబ్బింగ్ కాల్ షీట్ అది.
పది గంటలకల్లా వచ్చారామె.
ఏడు గంటల నుండి ఒంటిగంట దాకా కాల్ షీట్ వేశాం. మూడు గంటల టైం వేస్ట్ అయిపోయిందని ప్రొడ్యూసర్లు మనసులో అనుకుంటున్నారు. పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు.
* * *
