తనని మేనేజర్ ప్రభాత్ సందిగ్ధంగా "మిస్..." అని పిలిచినప్పుడు తను వెంటనే "మిస్ ప్రనూష" అని చెప్పిన విషయం పదేపదే గుర్తిస్తోంది.
తను అలా చెప్పి పొరపాటు చేసిందా?
పెళ్ళయిన తను....అలా చెప్పడంలో తపన స్వార్ధం ఉందా? వుండి వుండొచ్చు. తన మనసులో బలంగా తనకింకా పెళ్ళి కాలేదని, జరిగింది పెళ్ళే కాదన్న.....ఫీలింగ్ వుండడంవల్ల అలా చెప్పి వుండొచ్చు.
తనలో తనే బాధపడుతోంది.
తను చెప్పింది "రైట్ అని తన అంతరాత్మవని సంతృప్తి పర్చడానికి ప్రయత్నిస్తోంది.
చాలామంది చాలా సమయాల్లో చేసే పనే యిది. ఒక తప్పు జరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే, అది రైటా? రాంగా? అన్న మీమాంస బయల్దేరినప్పుడు, తనకు 'కన్వీనియంట్ గా వుండడానికి తనని తాను సంతృప్తి పర్చుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు.
తను "మిస్" అని చెప్పడాన్ని కూడా ప్రనూష మంగళసూత్రాల్ని ప్రశ్నించింది.
చిన్న గిల్టీ ఫీలింగ్ లాంటిది కలిగింది.
ఇది కట్టిన వ్యక్తి ఈ ఇంట్లోనే వున్నాడు. ఆమె లో అంతర్యుద్దం....మళ్ళీ వెంటనే అనుకుంది.
"తనూ శ్రీచరణ్ ఎలాగూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం....తనింకా కన్యే... అలాంటప్పుడు తను "మిస్" అని చెప్పడం కూడా తప్పుకాదు. ఆ విధంగా ప్రనూష ఓ "సమర్ధింపు" అనే ముసుగు వేసుకుంది. ఆ ముసుగు తొలగిన క్షణం ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో...?
బద్దకంగా నిద్రలేచింది శశికళ.
ఇంకా నిద్రపోవాలన్న కోరిక బలంగా వున్నా టైం ఎనిమిది దాటడంవల్ల...నిద్ర లేవక తప్పింది కాదు.
వంటగదిలోనుంచి తమ్ముడు, చెల్లెలు పోట్లాడుకుంటోన్న శబ్దాలు వినిపిస్తూనే వున్నాయి.
శశికళకు ఓ తమ్ముడు, చెల్లెలు. చెల్లెలు ఇంటర్ సీనియర్ చదువుతోంది. తమ్ముడు జూనియర్.
ఎప్పుడూ పోట్లాడుకోవడం జీవిత ధ్యేయంగా వుంటారు. తల్లి సగటు మధ్యతరగతి మనిషి....
కూతురు తెచ్చే సంపాదనే ఆ కుటుంబానికి జీవనాదారం అని తెలుసు. శశికళ తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేవాడు. గుండెపోటుతో ఆయన చనిపోయాక, ఆ బరువు శశికళ మీద పడింది.
శశికళది ఊహల్లో జీవితాన్ని వెళ్ళదీయాలనుకునే మనస్తత్వం, ఎప్పుడూ రిచ్ గా వుండాలని ఆలోచిస్తూ కోరికలను ఆకాశంలో విహరింపచేస్తుంది.
ఆమె గదిలో న్యూయార్క్ పోస్టర్ ఒకటి వుంది. ఆఫీస్ క్యాబిన్లో పెట్టే ఆ పోస్టర్ను తను తీసుకొచ్చింది.
అది ఆమె వీక్ నెస్.
ఏదో ఒకటి రోజూ ఆఫీసు నుంచి పట్టుకు రాకుండా వుండదు. ఏదీ దొరక్కపోతే గుండుసూది అయినా సరే. ఆమె గదిలో తాను తెచ్చిన వస్తువులను 'డిస్ప్లే చేస్తోంది. అది ఓ ఫోబియా లాంటిదని గుర్తించదు.
ఏమైనా అంటే, పేపర్లలో పడ్డ గ్యాసిప్స్ గుర్తుచేసుకొని తనని తాను సమర్ధించుకుంటుంది.
ఓ ఆలిండియా లేడీ సూపర్ స్టార్ ఫైస్టార్ హోటళ్ళలోని స్పూన్లు, ఫోర్కులూ తస్కరించేదని తనో ఇంగ్లీష్ మేగజైన్లో చదివానని. పెద్దవాళ్ళకే అలాంటి అలవాట్లు వుంటాయని సమర్ధించుకొని సంతృప్తి పడింది.
శశీ....వేడ్నీళ్ళు బాత్రూంలో పెట్టాను" వంటింట్లో నుంచే కేకేసింది తల్లి.
'అబ్బబ్బ....పెట్టావులే మహా...హాయిగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనో పుట్టి వుంటే... గీజర్ ఆన్ చేసుకొని, బాత్ టబ్ లో జలకాలాడుతూ..." ఆమె మనసు ఊహల్లోకి వెళ్ళిపోయింది.
అప్పటికప్పుడే తను "టబ్" లో స్నానం చేస్తున్నట్టు కలకనేస్తోంది. తన కోరికలను ఇమీడియట్ ఎఫెక్టుతో కలలు కనడంలో ఆమె స్పెషలిస్టు.
బాధగా లేచి, బాత్రూంవైపు నడిచింది.
డొక్కు ప్లాస్టిక్ బకెట్ లో వేడి నీళ్ళు... అదీ సగానికి పైగా. మగ్గు శిథిలావస్థలో వుంది.
మగ్గు కొత్తది కొనొచ్చుగా...బాత్రూంలోనుంచే అరిచింది శశికళ.
"డబ్బు లెక్కడివే..." తల్లి సమాధానం.
ప్రతీదానికి డబ్బు అంటావు..." గొణిగింది మళ్ళీ బాత్రూంలో నుంచే, వంటింట్లో వున్న తల్లి ఏదో గొణిగింది.
"ఒరే తమ్ముడూ నాకు అక్కని చూస్తోంటే "అంతులేని కథలో జయప్రద గుర్తొస్తోంది రా...ఏమి కాంబినేషన్...హిట్లరు కు సిస్టరే..." అంది శశికళ చెల్లెలు ప్రీతి తమ్ముడు రాజాతో.
"అవునా...అయితే కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...అంటూ ఓ పాట పాడనా?" అడిగాడు రాజా.
హమ్మో నీ వీపు చీరేస్తుంది" అంది భయంగా ప్రీతి. ఈలోగా స్నానం చేసి నైటీతో వంటింట్లో వచ్చి తమ్ముడు, చెల్లెలు వైపు చూసి..."
"ఏం చేస్తున్నార్రా?" అని అడిగింది.
"అబ్బే... ఏం లేదక్కా...రాత్రి నువ్వూ, బావగారు స్టేట్స్ కు వెళ్తున్నట్టు కలొచ్చింది..."
అక్కయ్య వీక్నెస్ తెలిసి అన్నాడు రాజు.
"నిజమా..." అంది సంతోషంగా శశికళ.
"నిజమక్కా....ఒట్టు....అసలుఫ్లయిట్ గాలిలో ఎగిరే వరకూ కల కనాల్సింది....ప్చ్... పొద్దున్నే పాలప్యాకెట్ తీసుకురమ్మని అమ్మలేపింది" అన్నాడు చాలా అమాయకంగా మొహంపెట్టి.
"అమ్మొకటి...అయిందానికి, కానిదానికి ఇలాగే చేస్తుంది. ఇంతకీ బావగారెలా వున్నార్రా..." అడిగింది శశికళ...
"సఫారీ సూట్ లో అదిరిపోయారక్కా..." అన్నాడు రాజా వెంటనే.
"ఏం కాదు జీన్స్ లో..." అంది ప్రీతి.
"అదేంటి నువ్వెప్పుడు చూసావు..." చెల్లెల్ని అడిగింది శశికళ.
'నాకూ అలాంటి కలే...వచ్చింది. కానీ బావగారు జీన్స్ లో కనిపించారు."
ఏం కాదు సఫారీ సూట్ లోనే." కాదు....జీన్స్ లోనే..."
"పోన్లెండి....మీరెందుకురా గొడవపడతారు....ఓ బావ అలా, మరో బావ ఇలా అనుకోండి...' అంటూ గదిలోకి వెళ్ళింది బట్టలు మార్చుకోవడానికి.
"ఒక అక్క ఇద్దరు బావలా..." రాజు నోరు వెళ్ళబెట్టాడు.
ఒక ..." రాధ... ఇద్దరు కృష్ణులు..." లా టైటిల్ బావుందిరా' అంది ప్రీతి.
వాళ్ళిద్దరూ అలా అక్కయ్య వీక్నెస్ తెలిసి కాకాపట్టడానికి కారణం వాళ్ళిద్దరూ సినిమాకు వెళ్ళాలనుకుంటున్నారు ఆ రోజు.
* * *
